Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 18


    నవ్వు వచ్చింది అర్జున్ కు. "ఎటువంటి లాయరూ వీడి ముందు తీసికట్టే" అన్నాడు రహస్యంగా ధర్మారావు తో.
    ధర్మారావు అలా తేలికగా నవ్వలేక పోయాడు. సానుభూతి తో నిండిపోయింది మనస్సు. "చూడు బలరాం! నువ్వు  నేరం చేసినా , చేయకపోయినా చేశావనే రుజువైంది. నిన్ను ఇక్కడ బంధించి ఉంచమనే మాకు కోర్టు వారి అజ్ఞ. నిన్ను వదిలే హక్కు మాకు లేదు. మిమ్మల్ని కూర్చోబెట్టి తిండి పెట్టము. ఎవరికి వచ్చిన పని వారు చెయ్యాల్సిందే. నువ్వు పని చేయ్యనంటావు; నీచేత చేయించడానికి వీళ్ళు కొడతారు. నువ్వేం చేయగలవు? తిడతావు. వాళ్ళు ఇంకా తంతారు. కడకు నువ్వు లొంగి రావాల్సిందే కానీ,ఇక్కడి నుంచి తప్పించుకు పోలేవు. మమల్ని జయించలేవు. ఎందుకొచ్చిన రభస , చెప్పు? మనస్సు కుదుట పరుచుకో. ఒక్కొక్కప్పుడు చెయ్యని నేరాలే నెత్తిన మోపబడతాయి. దురదృష్టానికి ఎవ్వరూ ఏం చేయలేరు. కాస్త ఆలోచించుకుని శాంత పడు. అల్లరి చేయకు" అంటూ పోలీసుల వైపు తిరిగి "చూడండి! ఇవాళ కు అతడి నలా వదిలేయండి. ఏమీ బాధ పెట్టవద్దు. అతడే మెల్లగా దారిలోకి వస్తాడు. ' అని చెప్పి అర్జున్ తో   కలిసి వెనుతిరిగాడు.
    పదడుగులు వేశారో లేదో -- "వెధవ నీతులు చెబుతున్నాడు, వెధవ నీతులా అని! ఎవడి మట్టుకు వాడికి చక్కగా జీవితం సాగిపోతుంటే ఎదటి వాడికి నీతులు చెయ్యడాని కేం?" కొండరాళ్ళు పెలుతున్నట్లు వెనుక నుండి వినవస్తున్న బలరాం కంఠస్వరానికీ, వాగ్దోరణ కి హటాత్తుగా ఆగిపోయి వెనుదిరిగి చూచిన ధర్మారావు ఎడమ చేతి దండ లో గుచ్చుకుంది ఒక కత్తి వచ్చి.
    "అబ్బ!' అనుకుంటూ అది ఏమిటో చూచుకొనేటంతలోనే రక్తం ప్రవాహం లా కారిపోసాగింది.
    "ధర్మారావ్! నేను చెబుతూనే ఉన్నానయ్యా, బూడిద లో పోసిన పన్నీరు వ్యర్ధమని!" అంటూ ఆ కత్తి లాగి "డాక్టరు! డాక్టరు గారిని త్వరగా రమ్మను" అంటుండగానే ఒక కాన్ స్టేబుల్ జెయిలు డాక్టర్ కోసం పరుగెత్తాడు.
    ధర్మారావు తన సంగతి చూచుకోకుండా పెద్దగా గలాభా వినవస్తున్న దిశగా చూచాడు.
    ఖైదీ బలరాం ను అయిదారుగురు పోలీసులు లాఠీలతో చావగొట్టేస్తున్నారు. బండ తిట్లన్నీ తిట్టేస్తూ అరుస్తున్నాడు బలరాం.
    "ఆగండి, ఆగండి" అని అరుస్తూ ఒక్క అంగలో అక్కడికి చేరుకున్నాడు ధర్మారావు, తన చేతి సంగతి చూచుకోకుండానే. "అతడి నెవ్వరూ ఏమీ చేయకండి. దూరంగా వెళ్ళండి."
    ధర్మారావు ఆజ్ఞను అయిష్టంగానే అమలులో పెట్టారు పోలీసులు.
    "నేను తప్పు చెయ్యలేదుమొర్రో అంటుంటే నన్నెందుకు బాధ పెడతారు మరి?" కక్షగా అరిచాడు బలరాం.
    గంబీర మందహాసంతో అన్నాడు ధర్మారావు; "తీరిందా , నీ కక్ష?"
    "అంతే. నేనలాగే చేస్తాను. ఇక్కడున్న అందరినీ ఇలాగే ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను." మొండిగా అన్నాడు బలరాం.
    జెయిలు డాక్టరు వచ్చాడు. "ఉండండి, ధర్మారావు గారూ! కొంచెం కదలకండి. " అంటూ అప్పటికప్పుడు కట్టు కట్టి ఇంజక్షన్ చేసేశాడు.
    "అబ్బ! చాలా రక్తం పోయింది" అంటూ "అయినా మన ఆశ కాని కుక్క తోక వంపు తీర్చ గలమా, ధర్మారావు గారూ? నలుగురి దారినే నడిచి చేతులు కడుక్కుంటే పోలా? మీ కెందుకీ అనవసర శ్రమ?" అన్నాడు ఇంగ్లీషులో ఖైదీ ల కర్ధం కాకుండా.
    "పనులు అనుకున్నట్లు వెంటనే జరుగుతాయా? కొంత శ్రమ పడాలి మరి!' అంటూ బలరాం దెస తిరిగి అన్నాడు: "నన్ను ఇంతగా గాయపరిచావు. ఏమిటి, ఇందువల్ల నీకు కలిగిన లాభం?"
    సూపరింటెండెంట్ లిద్దరి నుండీ తన్నులను భావించిన బలరాం ఈ వ్యతిరేక వాతావరణం చూచి కొంత బిత్తర పోయాడు.
`    ధర్మారావు అన్నాడు: "ఒక్కగాయం కాదు. చూడు. ఎవ్వరూ ఆడ్డు రారు. నా ప్రాణమే తీసెయ్యి. అందువల్ల నీకు విడుదల లభిస్తుందంటావా?"
    అలాగే కొయ్యబారి చూస్తున్నాడు బలరాం.
    "ఈ తప్పు నేను చేయలేదంటే ఎవరూ నమ్మరు. నింద మీద పడ్డాక భరించ వలసిందే . శిక్ష అనుభవించ వలసిందే. ఎప్పుడో నిజం బయట పడక పోదు. ఓపిక పట్టాలి."
    "నేను తప్పు చేయలేదు. ఎవడో చేసిన నేరానికి ఇక్కడ నేనూ, అక్కడ నా పిల్లలూ ఎందుకిలా ఏడవాలి?"
    అతి శాంతంగా జవాబిచ్చాడు ధర్మారావు. అప్పుడే కట్టుకట్టిన తన చేతిని చూపుతూ. "మరి నేనే నేరం చేశానని నాకీ శిక్ష? నీపై ఎవరో నేరం మోపారు, మరెవరో ఈ శిక్ష విధించి ఇక్కడకు పంపారు. అంతేకాని, నేను నిన్నేమీ చేయలేదే? మరి నాకెందు కీ అపకారం చేశావు, నువ్వు?"
    సమాధానం దొరకక వెర్రిగా చూస్తూ నిల్చున్న బలరాం ను ఆర్ద్ర హృదయంతో ప్రేమ స్పర్శ ను వ్యక్తీకరిస్తూ వీపు తట్టాడు ధర్మారావు. "పిచ్చివాడా, ఆవేశం తగదు. అధికారులను ఎదిరించి, చట్టాన్ని నిందించకూడదు. మనకు ఇష్టమైనా, కష్ట మైనా తలిదండ్రులను తిడతామా, చెప్పు? అలాగే ఇదీని.
    "తల్లీ, తండ్రి బుద్ది పూర్వకంగా శిక్షించరయ్యా! వెనక మననూ, వారినీ అందరినీ మనకు తెలియకుండా నడిపించే శక్తి ఏదో ఉంటుంది. అందుకు బాధ పడడం కంటే సరి పెట్టుకోవడం మంచిది. రామదాసు ఏ నేరం చేసి పన్నెండేళ్ళు కారాగారవాసం చేశాడు? సింహాసనాదిషితుడై చక్రవర్తి కావలసిన శ్రీరాముడు ఎందుకు అడవుల పాలై పోయాడు? దేవకీ దేవిని సొంత అన్నగారే కారాగారం పాలు చేశాడే? మన గాంధీ మహాత్ముడి ని ఏం చేశాడని పిస్టలు తో పేల్చి అంతం చేశారు?"
    ధర్మారావు అలా నచ్చ చెబుతుండగానే  "బాబుగారూ!' అంటూ కళ్ళనీళ్ళ తో అతడి పాదాల పై పడిపోయాడు బలరాం. "మీరు దేవుళ్ళు. బాబూ. మీరు దేవుళ్ళు! నా సెయ్యి పడిపోను! నన్ను కొట్టండి. చంపండి, నరకండి!" ఏడుస్తూ అలా సాగిపోతూనే ఉన్నది అతడి ధోరణి.
    "లేలే." ప్రేమగా లేవనెత్తాడు ధర్మారావు. "బాధ్యత తెలిసి ప్రవర్తించు. ఏడ్చి ఏం ప్రయోజనం? నాశక్తి మేరకు మీకు మంచి ఏర్పాట్లు చేస్తాను. మీ ప్రవర్తన తిన్నగా ఉండాలి. మీ ప్రవర్తన సక్రమంగా ఉంటె మీ శిక్ష తగ్గుతుంది కూడా."
    "చిత్తం బాబూ, చిత్తం . ధర్మ ప్రభువులు . మీరు చెప్పినట్లు వింటాను. ,మరి నోరెత్తితే ఒట్టు." లెంపలు వాయించుకుంటూ పడిపడి దణ్ణాలు పెట్టాడు బలరాం."
    "సరే, చూస్తాగా?' అంటూ పోలీసుల దెస తిరిగి, "ఇదుగో, చూడండి. ఈ విషయం లో మరేమీ గొడవ చేయకండి. ఎక్కడి దక్కడ మరిచి పొండి" అంటూ "ఇదుగో , మీరు కూడా ఎవరూ నా మెత్తదనం అలుసుగా తీసుకోవద్దు. క్షమించేది లేదు. మీరు సక్రమంగా ఉండటం ప్రధానం. అ పైన మీకు కావలసిన ఏర్పాట్లు . అంతే. ఊ! ఊ! ఎవరి పనులు వారు చెయ్యండి. నిలబడి వింత చూడకండి." అంటూనే ముందుకు సాగాడు.
    "బాబుగారూ! ఎంతటి తప్పు చేసినా క్షమిస్తారు . దేవుడు మిమ్మల్ని సల్లగా సూడాలా." ఖైదీలందరూ చెయ్యెత్తి నమస్కరించారు.
    కళ్ళ నీళ్ళు జలజలా కారిపోతుంటే ఒత్తుకుంటూ చటుక్కున ముఖం చాటు చేశాడు గౌతమ్-- అర్జున్ , ధర్మారావు లకు.అది గమనించిన ధర్మారావు నడక ఆపి అతడి పక్క నిల్చున్నాడు.
    "బాబూ, ఒక్కమాట వింటారా?" కన్నీటి తెరలలో నుండి ధర్మారావు ను చూస్తూ అన్నాడు గౌతమ్.
    "ఏమిటి?"
    "నేను ఖైదీ నే కాని , బాబూ , మీ క్షేమం కోరే వ్యక్తిని . పెద్దవాడిని. చెబుతున్నాను. మీరు చేస్తున్న పనికి స్వర్గం నుండి దేవతలే పుష్ప వర్షం కురిపించుతారు. కాని ధర్మ నిర్వహణ లో ఆత్మ రక్షణా విస్మరణ తగదు. ఇక్కడ చాలామంది మహా ఘాతుకాలు చేసిన వాళ్ళు, కక్షలతో, క్రౌర్యాలతో ఉడికి పోతున్న కసాయి వాళ్ళు వీళ్ళ మధ్య మీరు జాగ్రత్తగా ఉండాలి, బాబూ!"
    "మీ సలహా కు కృతజ్జుడి ని" అన్నాడు ధర్మారావు దరహాస వదనంతో.
    "ఆ దైవం మీ జీవితాన్ని చక్కగా సరిదిద్దాలి, బాబూ!"
    ప్రేమతో దీవిస్తున్న అతడి నొక్కసారి ఆపాద మస్తకం చూచి, కండ్ల తోనే కృతజ్ఞతలు చెప్పి కదిలి పోయాడు ధర్మారావు.
    ఆఫీసులో కూర్చున్న అర్జున్, ధర్మారావు చాలాసేపటి వరకు మాట్లాడుకోలేదు.
    "ఏమిటి, ఆలోచిస్తున్నారు? అలా మౌనంగా ఉన్నారేమిటి?" అన్నాడు ధర్మారావు.
    అర్జున్ ఒక్కసారి తలెత్తి చూచాడే కాని, ఏమీ మాట్లాడలేదు. ఏమిటో! అతడి కండ్ల లో భాష కందని అనేక భావాలు!
    "నా పద్దతి మీకు నచ్చలేదా?"
    ఇబ్బందిగా పెట్టాడు ముఖం అర్జున్. "నా మనస్సును సరిగా వ్యక్తీకరించటానికి మాటలు చాలటం లేదు, ధర్మారావ్! అయినా ప్రయత్నిస్తాను. నేను మీ స్థాయిని అందుకో లేను. మీవి మహా ఘనమైన ఆశయాలు. నిజంగా మిమ్మల్ని చూచి నేను మానవుడుగా గర్విస్తున్నాను."
    "మరి? ఏమిటి మీ నిర్లిప్తతకు కారణం?"
    "చూడండి. మనం ఒక ఉన్నతమైన సంస్కారాన్ని అలవరుచు కున్నాము. మనలో మనకున్న విషయ గ్రాహ్యాశక్తి ఆ ఖైదీలకు లేదు. మన ఆశ ఒకటైతే , వాళ్ళ తీరు ఒకటౌతుంది. దీనివల్ల మనం కోరింది నెరవేరక పోగా కొత్త సమస్య లేమైనా ఉత్పన్న మౌతాయెమోనని భయంగా ఉన్నది. మనం ఇచ్చేది స్వీకరించే స్థితిలో, ఖైదీలలో అసంఖ్యాకులు లేరు. అంటే వాళ్ళ అంతర్గత సంస్కారం సంగతి, నేను మాట్లాడేది."
    "నిజమే , కాని వాళ్ళ కా సంస్కారం అలవడేలా చేయడానికే కదా , ఇప్పుడు మన ప్రయత్నం? అందుకే కొంత ఒర్మీ అవసర మంటున్నాను. మన పధకం నెరవేరితే సరేసరి. సంతోషమే! అయితే కొత్త సమస్యలను మాత్రం తల ఎత్త నీయనని మాట ఇస్తున్నాను."
    'అల్ రైట్. మరి వెళ్దామా?"
    "వెళ్దాము. కాని, మీకోక్కమాట."
    "చెప్పండి."
    "ఆ ఖైదీలను ఎంతో అవసరమైతే కాని, మరీ అలా చావగొట్టే యవద్దని చెప్పాలండీ , పోలీసులతో. అలా కొట్టడం -- ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి కూడా పొవచ్చు కదా?"
    "అవును" తల పంకించాడు అర్జున్. "ఇప్పుడే చెబుతాను, వాళ్ళందరికీ."
    "నాకు ఒక ఆలోచన కలుగుతుంది ."
    "ఏమిటి?"
    "మనం మెల్లగా ప్రయత్నించి రాష్ట్రం లోని జెయిలు అధికారులను అందరినీ సమావేశపరిచి అసలు ఖైదీల పట్ల మన అందరి ప్రవర్తనలూ ఎట్లా ప్రవర్తించాలో మొదలైన విషయాలన్నీ సమగ్రంగా చర్చించి, రాష్ట్ర వ్యాప్తంగా , దేశ వ్యాప్తంగా ఈ నేరస్తుల ఉద్దరణ జరిగే ఏర్పాట్ల ను చేయగలగాలి. అప్పుడు ఈ జన్మకు సార్ధకత!"
    "బాగానే ఉంది మీ ఆలోచన. సరే. ఆ విషయాలన్నీ తర్వాత చర్చిద్దాము. మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి."
    ఏకాంతంగా మిగిలిన ధర్మారావు మనస్సు ఎంత ప్రయత్నించినా , అదుపును దాటిపోయి, ఆనాడు ఉదయం నుండి జరుగుతున్న విపరీత సంఘటన లన్నిటినీ సామూహికంగా చేర్చి చూచుకుని బాధ పడసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS