అందులో గర్భితమైన భావం శాంతి కర్ధం కాలేదు.
"క్రొత్తగా చేరారా?" అన్నాడు తిరిగి శాంతిని. శాంతి చెప్పింది. ఆ విధంగా పరిచయ మైంది ఇద్దరికీ. అప్ప్డుడప్పుడు మాట్లాడుతుండేది శాంతి. అతడూ ఉత్సాహంగా మాట్లాడేవాడు. కాని అతడి వైఖరి ఏమిటో అదొక మాదిరిగా శాంతి కవగాహన కాకుండా ఉండేది. ఒకనాడు శాంతి వేసిన చిత్రం చూచి, "బాగా వృద్ధి చెయ్యాలి. చేతిలో కళ ఉంది" అన్నాడు. ఏమిటో ఆ మాటలో కొంత అహం, అహం భావత్వం ఉన్నట్లనిపించినా శాంతి కంతగా బాధ కలగలేదు.
ఆదివారం శ్రీహ
రి వచ్చాడు, శాంతిని చూడటానికి. అన్న వస్తాడని తెలిసి చెట్టు క్రిందే వేచి ఉన్న శాంతి అతడి వెనుకనున్న రాజాను చూచి ఆశ్చర్యపోయింది.
"ఎలా ఉందిక్కడ?" అడిగాడు శ్రీహరి.
"చాలా బాగుందన్నయ్యా. ఇక్కడ చిత్రకారుల్నీ, విధ్యార్దుల్నీ చూస్తూంటే నాకొచ్చిన కళ ఎంత తక్కువో అన్పిస్తుంది."
నవ్వాడు శ్రీహరి. "ఎప్పుడూ ఒకర్ని మించినవారొకరు ఉంటూనే ఉంటారు. విద్యకు అంతులేదు. అయితే ఇక్కడ స్నేహితులెవరైనా దొరికారా?"
"నాకు స్నేహితుల గొడవ ఎప్పుడూ ఉండదుగా?" అంటూ నవ్వింది శాంతి. "కాని మనోరమ అని ఒక స్నేహితురాలు ఉంది. ఆవిడ నాట్యం నేర్చుకొంటూంది" అంది. గోవింద రావు సంగతి ఎందుకో చెప్పడం ఇష్టంలేక పోయింది.
అంతవరకూ ఇంటి సంగతులేమైనా శాంతి అడుగుతుందేమోనని చూచాడు శ్రీహరి. కాని అలా జరగనందుకు లోలోపల కొంచెం కోపం వచ్చింది. పైకిమాత్రం శాంతంగానే అడిగాడు! "అయితే ఇంటికి ఉత్తరాలు వ్రాస్తున్నావా?"
గతుక్కుమంది శాంతి. వచ్చేటప్పుడు రెండు రోజులకో ఉత్తరం వ్రాస్తానని చెప్పి వచ్చింది తండ్రికి. తాను వచ్చి పదిహేను రోజులైంది. ఈ పదిహేను రోజుల్లో తండ్రికి రెండు ఉత్తరాలూ, వదిన కొకటీ మాత్రమే వ్రాసింది. ఆఖరి ఉత్తరం వ్రాసి అయిదు రోజులైంది అవన్నీ ఆలోచించుకుంటూ, "వ్రాస్తున్నాను" అంది తగ్గు స్వరంలో.
"నాకెలా ఉన్నా నాన్నగారికి విడవకుండా వ్రాయి" అన్నాడు. కంఠంలో ఏమూలో కొద్ది నిష్టురత్వం ధ్వనించింది.
అప్పుడు గుర్తు వచ్చింది శాంతికి, అన్నకు ఈ పదిహేను రోజులలో ఒక్క ఉత్తరం మాత్రమే వ్రాసినట్టు. పశ్చాత్తాపంతో, సిగ్గుతో అంది! "లేదన్నయ్యా ఇకనుంచీ తప్పకుండా రెండు రోజుల కొకటి వ్రాస్తాను."
అంతవరకూ మౌనంగానే కూర్చున్న రాజా, "క్రొత్త చిత్రాలేం వేశారు?" అనడిగాడు.
"నాలుగు ప్రకృతి దృశ్యాలు వేశాను. ఇదివరకటికంటే 'ఆర్ట్', అభివృద్ధి అయింది. మీరు?"
"ఏం వెయ్యలే" దంటూ నవ్వాడు రాజా, రాజానూ, అన్ననూ సాగనంపాక శాంతి, తండ్రికి ఉత్తరం వ్రాసింది అనేక క్షమాపణలతో, వదిన కొకటి వ్రాసింది. కాని వ్రాసినంత సేపూ ఆమెకు ఎందుకో రాజా మౌనం, నిర్లిపతత జ్ఞప్తికి వస్తూనే ఉన్నాయి. ఉన్న రెండు గంటలకాలంలో అతడు మాట్లాడినవి రెండే రెండు మాటలు, ఇదివరలో ఆపులేకుండా అనేక విషయాలు మాట్లాడేవాడు హాస్యంగా. ఇప్పుడా చలాకీతనమే లేదు. అన్నయ్యకూడ మకాం అతడింటికి మార్చేశాడట, ఎంత స్నేహం వాళ్ళిద్దరికీ!
అంతలో మనోరమ రావడంతో ఆలోచనల కంతరాయం కలిగింది. ఆమె చేతిలో ఒక ఉత్తరం ఉంది. మంచంమీద పడుకుని చదువుకుంటూ తనలో తనే మురిసిపోతూంది.
"ఏమిటా సంతోషం?" అడిగింది శాంతి, వెళ్ళి ఆమె దగ్గర కూర్చుంటూ, ఇప్పుడే ఇద్దరి మధ్యా చనువు ఏర్పడుతూంది.
"సంతోషం! అతి సంతోషం! మహా సంతోషం!" అంటూ ఉత్తరం దాచేసి ఉత్సాహంగా లేచి కూర్చుంది, మనోరమ.
"చెప్పకూడదా?"
"చెప్పుకో, చ
ూద్దాం."
"మీవాళ్ళెవరో వ్రాసి ఉంటారు."
"అది సరే. వాళ్ళెవరో చెప్పుకో, చూద్దాం."
"అమ్మగారు."
"వూఁహుఁ."
"అక్క."
"కాదు."
"స్నేహితురాలు."
ఆశ్చర్యంగా చూచింది మనోరమ. "స్వజాతి మీదే అభిమానమంతా! ఆ గీటుదాటి వెళ్ళవా?"
నవ్వింది శాంతి, "అయితే అన్నయ్య ఈసారి కరెక్ట్" అంది బింకంగా.
"కానేకాదు. అసలే కాదు. వాళ్ళు రాస్త్రే ఇంత గంతులేయడం దేనికీ?"
"మరి? దేవుడు వ్రాశాడా? పోనీ చెప్పకూడదూ?" కొంచెం సిగ్గుగా అడిగింది.
"కరెక్ట్. దేవుడే వ్రాశాడు" అంది మనోరమ పడిపడి నవ్వుతూ.
"అబ్బ! మీ భాషలు నాకు తెలియవు. చెబుదూ" అంది శాంతి.
"బావ రాశాడోయ్, బావ! మా బావ!"
"అయితే?"
"అయ్యో, రాడా! మరీ చంటిపాపాయివా?" వింతగా చూచింది మనోరమ. "బావంటే ఎవరు? మా బావ! మా అత్తయ్య కొడుకు. అమెరికా నుంచి రెండు నెలల్లో వస్తున్నాడట."
"అయితే నీకంత సంతోషం దేనికీ?"
"సందేహం లేదు. నువ్వు పాపాయివే. అక్షరాలా పాపాయినే" అని నిర్దారించేసింది మనోరమ. "మా బావ అక్కడ పేద్ద ఇంజనీరై వస్తున్నాడు. రాగానే నాకీ బందిఖానా విముక్తి. బావతో ఢిల్లీ ఛలో" అని నవ్వసాగింది.
శాంతి కూడా నవ్వింది. "అయితే నీకు పెళ్ళికొడుకు వస్తున్నాడన్నమాట?"
"ధన్యులం. ఇప్పటికైనా అర్ధమైంది." హాస్యంగా నిట్టూర్చింది మనోరమ. "అయితే ఇంత అమాయకురాలవేమిటి?"
"ఇందులో అమాయకత ఏముంది?" అభిమానంగా అంది శాంతి. "నా ఆలోచనలు అటు పోలేదంతే. అది సరేకానీ, నీకీ శాంతి నికేతనం బందిఖానాయా?" కొంచెం నిష్టురం గానే అడిగింది.
"కాక ఏమిటి మరి? హాయిగా బావతో తిరుగుతూండవలసినదాన్ని. ఆయననేమో అమెరికా పంపేశారు. నేనుకూడా వస్తానంటే 'నేను వచ్చేప్పటికి మంచి ఆటా పాటా నేర్చుకుని సిద్ధంగా ఉండు. లేకపోతే పెళ్ళి చేసుకో" నంటూ తనే ఇక్కడ చేర్చి వెళ్ళారు."
"అయితే ఇప్పుడాయనకోసమా నువ్వు నేర్చుకొనేది?"
"లేకపోతే ఎందుకు చెప్పు, ఇప్పుడు నాకీ డాన్సులూ, సంగీతాలూను? ఒక్కోసారి విసుగొచ్చి మానేస్తున్నానని వ్రాస్తుంటాను బావకు. 'నాకేం? నేను వచ్చాక మళ్ళీ ఓ రెండేళ్ళు అందులో పారేస్తాను' అని బెదిరిస్తూ వ్రాస్తాడు. బావను పెళ్ళాడ్డానికే బలవంతంగా మందు మ్రింగినట్టు యివి నేర్చుకుంటూ ఇక్కడుంటున్నావనుకో."
ఆశ్చర్యపోయింది శాంతి. 'బావను పెళ్ళాడతనికె ఈ నాట్యం నేర్చుకుంటున్నాను. బావ కోసం! బావకోసం!' ఆ రోజంతా మనోరమ మాటలే చెవుల్లో గింగురుమనసాగాయి శాంతికి. ఏమిటి, మనిషికీ, మనిషికీ మధ్య ఈ బంధం? ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా తను యిక్కడికొచ్చింది తన ఇష్టానుసారం. వివాహం అనే అర్ధంలేని బంధంనుండి పారిపోవడానికే ఈ మలుపును సృష్టించింది. కాని, మనోరమ? వివాహంకోసమే, మరొకరి కోరిక తీర్చడానికే స్వంత ఇష్టాయిష్టాలను వెనుకకు నెట్టింది! శాంతి మనస్సులో తనకే తెలియని అనేక భావాలు రేగాయి. ఆ రోజు పాఠాలకు కూడా హాజరు కాలేదు. గదిలోనే ఉండిపోయింది. కాలక్షేపం కోసం రవీంద్రుని 'జోగా జోగ్' తీసి చదవడం మొదలుపెట్టింది. ఇదివరలో చదివినా కాల క్షేపం కోసం చదివింది. ఇప్పుడు వినర్శనా పూర్వకంగా చదవసాగింది. కుముదిని వ్యక్తిత్వం, అడుగడుగునా ఆమె ప్రదర్శించే నిగ్రహ వివేకాలూ, విశిష్టతా శాంతి నెంతో ఆకర్షించాయి. కుముదినీ విప్రదాసులను సోదరీ సోదరులుగా రవీంద్రుడు సృష్టించడంలో మానవత్వంలోని మమతనూ, సౌకుమార్యాన్నీ, సంఘర్షణనూ, కర్తవ్యాన్నీ నిశితంగా చూపించాడు. అంతటి అభిమానవతి-కుముదిని-కడకుఏం చేసింది? మధుసూదనుడిని మనసా అంగీకరించింది. ఛ! ఇది సాధ్యమా? జుగుప్సతో పుస్తకం విసిరేసింది శాంతి.
మర్నాడు మనోరమను అడిగింది: "అయితే , మనూ, మీ బావను వివాహమాడటం నీ కిష్టమేనా? పెద్దవాళ్ళ బలవంతమా?"
"అదేంలేదు. ఆమాటకొస్తే పెద్ధవాళ్ళకే కొంచెం అయిష్టం. 'ఇంత వయస్సొచ్చాక ఇంకా ఈ డాన్సులూ, చదువులూ ఏమిటి? నాలుగేళ్ళు అతడొచ్చేవరకూ ఉండే ఖర్మమేమిటి? ఇంకెవర్నైనా చూసి చేసేస్తా'మన్నారు. నేనే ఒప్పుకోలేదు."
"మీ బావపై నీకంత ఇష్టమన్నమాట! ఆయనక్కూడా నువ్వంటే అభిమానమేనా?"
"ప్రాణం!" కళ్ళు త్రిప్పుతూ గుండ్రంగా తిరిగింది మనోరమ.
"మరి అంత ఇష్టమైతే నీ కిష్టంలేని నాట్యం అంత బలవంతంగా నెత్తిన రుద్దుతారా?"
తేలికగా నవ్వేసింది మనోరమ. "నా కయిష్ట మైనా ఆయన కిష్టం గనుక నాకు మహాఇష్టం! నాకు కారమ్స్ ఆట అంటే బలే ఇష్టం. ఆ పేరెత్తితేనే బావకు తలనొప్పి. అయినాసరే ఎంతో ఓపికగా సరదాగా ఆడతాడు నాకోసం. ఒక్కమాట విను శాంతీ. ప్రేమకు ఇష్టాయిష్టాలుండవు. ఇంక యిదొక లెక్కా?"
కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న శాంతి అడిగింది: "అయితే, మనూ, పుస్తకంలో చూచినా అదే. మనష్యులలో చూచినా అదే. ప్రేమ, ప్రేమ అంటారు. ఏమిటిది? ఒక వ్యక్తిని వివాహమాడటం, వ్యక్తిత్వాన్ని చంపుకు బ్రతకడం - దానికి 'ప్రేమ' అనీ, 'త్యాగ' మనీ పెద్ద పెద్ద పేర్లుపెట్టి సంతోషిస్తూ ఆత్మ వంచన చేసుకుంటారు. కాని ఈ సంసార ధర్మ నిర్వహణ అనాదినుంచీ మానవులంతా చేస్తున్నదే కదా? ఇంతకుమించి జీవికి మరో ధ్యేయం, ఆదర్శం లేదా?"
"ఎందరో తాపసూలూ, మరెందరో మహానుబావులూ జయించలేక తలవంచిన ధర్మం అదే కదా శాంతీ? అయినా మానవులందరిలో ఒకరుగా పుట్టి, ఈ మానవత్వానికీ, మానవ ధర్మాలకూ దూరంగా పారిపోవడం దేనికీ? పారిపోయి ఏంచేద్దామనీ?"
"అరే! అంతకుమించిన పరమార్ధమే లేదా? పుట్టిననాటినుంచి యింతవరకూ ఎలాగున్నామో యికముందుకూడ అలాగే ఉండలేమా? ఇలాగే జీవితమంతా గడిపివేస్తే వచ్చిన లోటేమిటి? ఈ సంతోషమూ, సరదాలూ భర్త సేవలోనూ, పిల్లల పెంపకంలోనూ నామరూపాలు లేకుండా పోవా?"
శాంతిని నిశితంగా చూచింది మనోరమ. "ఎక్కడో అటువంటివారు అరుదుగా ఉంటారు. శాంతీ. కాని వారు బహుశ ఏవో సంఘటనల వల్ల అలా మారిపోయి ఉంటారు. కాని అది తగదు. బహుశః నీ మనస్సునుకూడ ఏదో సంఘటన జరిగి కదిపివేసి ఉండాలి. లేదా నీ మనస్సింకా వికసించకపోయి ఉండాలి. ఏమైతేనేం, మనం పూర్తిగా ఉత్తర దక్షిణదృవాలం. మనం ఆ విషయమై వాదించుకోకపోవటం మంచిది."
"లేదు, మనోరమా. ఈ వాదం ఎంత దూరం పోయినా మన మధ్య వైషమ్యాలు రేగవని హామీ ఇస్తున్నాను. నా సందేహానికి సమాధానం కావాలి."
"అలాగేలే. చెప్తాను, నేను వెళ్ళేలోగా ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడుమాత్రం కాదు."
