సురేంద్రనాద్ మాటలు పూర్తికాకముందే కయ్యిన లేచాడు గోవర్ధనరావు. ఇద్దరిమధ్యా మాటా, మాటా పెరిగింది. అసలు విషయం అర్ధంకానందువల్ల అక్కడవున్న ఎవరూ పెదవి కదపలేదు, చూస్తూ నుంచున్నారు.
"హత్య ఏమిటి? ఎవరు చేశారు? ఎవరిని?" గోవర్ధనరావు అడిగాడు.
"అయ్యో పాపం, ఏమీ తెలియదు? చ్చొ చ్చొ" అన్నాడు సురేంద్రనాథ్.
"వాట్ నాన్సెన్స్! ఇంక చాలు విషయానికి రా. శీతల్ ని ఎందుకు దాచావు, ఎక్కడ దాచావు? నాకేం తెలియదని నీవంటే పోలీసులు రంగప్రవేశం చేస్తారు. నా బంగారుతల్లి శీతల్ ని వాళ్ళే వెతికి తీసుకొస్తారు.
కాదంటే చెప్పు నీవు ఈ నాటకం ఎందుకు ఆడావు! ఆ వచ్సినవాళ్ళు ఎవరు? శీతల్ ఎక్కడవుంది. ఊ... చెప్పు మూడే మూడు నిమిషాలు టైము ఇస్తున్నాను. పోలీసులకి ఫోన్ చేయడానికి" గోవర్ధనరావు కోపంగా అరుస్తూ అన్నాడు.
"ఫోను చెయ్యి గోవర్ధనరావ్! అదే మంచిపని" తాపీగా పలికాడు సురేంద్రనాథ్.
ఏ ధైర్యంతో సురేంద్రనాథ్ అంటున్నాడో తెలియక తెల్లబోయాడు గోవర్ధనరావు.
"మేజరు అయిన కూతురి మెడలువంచి బలవంతాన ఈ పెళ్ళికి ఒప్పించి పెళ్ళి కాంగానే యీ పరిసరాలకి దూరంగా మావాడితో మీ అమ్మాయిని అమెరికా పంపిద్దామనుకున్నావు కదా! ఆ విషయంలో ముందు పోలీసులు నిన్ను అరెస్టు చేయకుండా వదిలితే ఆ తర్వాత నా సంగతి" వ్యంగ్యంగా పలికాడు సురేంద్రనాథ్.
"ఏమంటున్నావ్?"
"ఉన్నమాట..."
"నా కూతురికి నేను బలవంతాన ఎందుకు పెళ్ళి చేస్తాను?"
"చేసిన నేరం పూర్తిగా తుడిచేయటానికి."
"పిచ్చి పిచ్చిగా వాగకు."
"వ్యవహారం పచ్చిగా తయారయినప్పుడు ఇలాగే వాగాల్సి వస్తుంది."
"నీతో చేతులు కలపడం నా బుద్ది తక్కువ."
"ఇదేమాట నేనూ అనుకుంటున్నాను."
"శీతల్ కంటపడిందాకా నిన్ను, నీ కొడుకుని ఇక్కడ నుంచి కదలనివ్వను. అమ్మాయిని దాచి పెద్ద అభాండం వేసి ఓ కట్టుకథ చెప్పి తప్పించుకుపోవాలని చూస్తున్నావా?"
"నేను దాయలేదు. ఇదంతా చూస్తుంటే నీవే ఏదో పెద్ద నాటకం ఆడుతున్నావేమో అనిపిస్తున్నది" ఎకసెక్కంగా పలికాడు సురేంద్రనాథ్.
"షటప్!"
"యూ షటప్!"
మళ్ళీ కథ మొదటికి వచ్చింది. పరస్పరం నిందారోపణ చేసుకుంటూ తిట్లు శాపనార్దాల స్థితి దాటిపోయి చేతులు కలిపేదాకా వచ్చారు. పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులకి గంట క్రితం జరిగిన తమాషా ఆచారం ఆటకన్నా యిప్పుడు జరుగుతున్న భాగోతం చాలా వింతగా, విడ్డూరంగా, తమాషాగా కనీ వినీ ఎరుగని రీతిలో వుంది.
పెళ్ళికి వచ్చిన మిత్రులతో ఒకాయన గప్ చిప్ గా అవతలికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేశాడు. ఆ ఫోను అయినా సరీగా చేయక గోవర్ధనరావు ఇంటి అడ్రస్ చెప్పి ఆ ఇంట్లో పెళ్ళి జరుగుతుంటే మాటా మాటా వచ్చి కత్తులతో పొడుచుకున్నారని చెప్పాడు.
పావుగంట పూర్తికాక ముందే పోలీసు జీపు వచ్చి పెళ్ళివారి ఇంటిముందు ఆగింది.
* * *
శీతల్ నెమ్మదిగా కళ్ళు విప్పింది.
క్షణకాలం తనెక్కడ వుంది శీతల్ కి అర్ధం కాలేదు. పూర్తిగా తెలివి వస్తూ వుండగా జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. అంతే టకీమని లేచి కూర్చుంది.
ఇది రాత్రా! పగలా!
గదిలో లైటు వెలుగుతున్నది. కనుక రాత్రి అనుకోవచ్చు. అలాకాక మరో విధంగాకూడా అనుకోవచ్చు. ఆ గదికి కిటికీలు, తలుపులు పూర్తిగా మూసి వున్నాయి. గదిలో చీకటిగా వుంటుంది. కాబట్టి వెలుతురు కోసం లైట్ వేసి వుంచారేమో.
శీతల్ కాళ్ళకి, చేతులకి బంధాలు లేవు కానీ స్వేచ్చగా వుంది అనుకోడానికి లేదు. ఎందుకంటే ఆ తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి వున్నా శీతల్ ఆలోచనలోంచి బైటికి వెళ్ళలేదు కాబట్టి.
రుద్రమదేవి, ఝాన్సీరాణి లాంటి ధైర్యసాహసాలు శీతల్ కి వున్నాయో లేదో శీతల్ కే తెలియదు. కానీ మొత్తానికి కొన్ని సాహసపు పనులు ధైర్యంగా చేసి వుంది. పిరికిది మాత్రం కాదు.
ఎవరో తనని మోసం చేసి ఎత్తుకొచ్చారన్నది ఖాయం. అసలు మోసం అనేమాట తానూ పొరపాటు అనుకోడం లేదు కదా! రజియా చేతికి అయిదు వేలు ఇచ్చి పెద్ద లెటర్ కూడా రాసి ఇచ్చి ఇదంతా కాకుండా తగు జాగ్రత్తలు చెప్పి రంజిత్ దగ్గరకు పంపించింది. తగు విషయంలో రంజిత్ మనుషులు వచ్చారనుకుంది కానీ వచ్చిన ఆంటీ, పెద్దమనుషులు రంజిత్ పంపిస్తే వచ్చినవాళ్ళు కాదేమో! మరి రంజిత్ సంగతి వాళ్ళకి యెలా తెలుసు...!
అలా ఆలోచిస్తున్న శీతల్ కి ఏదో అనుమానం రాగా నొసలు ముడిపడ్డాయి. ఈ తఫా ఇంకోరకం ఆలోచనలు సాగాయి.
రజియాని మధ్య దోవలో ఎవరో బంధించారు. రాసిన లెటర్ చదివి వాళ్ళు వేరే పథకం వేసుకుని ఎత్తుకు వచ్చారా! అలా కూడా జరిగి వుండొచ్చు. తనని ఎత్తుకు తీసుకురావలసిన అవసరం ఎవరికి కలిగింది. ఏ ప్రయోజనం ఆశించి ఈ పని చేశారు? వచ్చినవాళ్ళు మగ పెళ్ళివారి తరఫువారు అంటే వాళ్ళే తనని...
