7
"మీరెందు కిలా రోజురోజుకీ వాయిదా వేస్తున్నారో నాకర్ధం కావడం లేడు అంది విజయ విసుగ్గా గోపాలం ముఖంలోకి చూస్తూ .
"అదికాదు విజయా! నేను చెప్పేది కూడా కొంచెం సావకాశంగా విను" అన్నాడు గోపాలం చదువుతున్న "లా" పుస్తకం మీంచి దృష్టి మరల్చకుండానే.
"వింటూనే వున్నా -- మన పరిచయం అయిన ఆరు సంవత్సరాలకి కాని మీరొక నిర్ణయానికి రాలేదు కదా?..వచ్చి తీరా మీ మనస్సులో వున్న అభిప్రాయాన్ని మావయ్య కి చెప్పాక అతనికి వ్యవధి లేకపోయింది !.... పది పదిహేను రోజులు జరగకకుండానే ఆ పాడు గుండె జబ్బు పొట్టని పెట్టుకుంది .....మావయ్య పోయిన ఏడాది లో వివాహం చేసుకోవడం సమంజసం గా ఉండదని ఊరుకున్నాం సరే. పోయిన ఎడంతా 'ఇప్పుడే కదా నేను అప్రేంటీస్ పూర్తీ చేసింది!....కొన్నాళ్ళు లాయరుగా స్థిరపడి , అనుభవం సంపాదించి సమర్ధుడనే పేరు రావడం కోసం కృషి చెయ్యాలి. ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం" అంటూ వచ్చారు. సరే ఇప్పుడు అదీ అయి, న్యాపతి సుబ్బారావు గారు, చిత్రపు వెంకట చలం గార్ల వంటి పెద్ద ప్లీడర్ల కి ఎదర పార్టీ వకాల్తా తీసుకుని నిలబడే స్థితికి వచ్చారు. మీ ఆశయాలన్నీ ఇలా నెరవేరాయి కదా ఇంక అడ్దేవిటి?"
"ఎలాగా ! ఇన్నాళ్ళూ ఆగాం కదా -- ఇంకో రెండేళ్ళు ఉంటె ఏం?"
"ఎందుకంట?....కారణం ఫలానా అని చెప్పండి . ఏమీ చెప్పకుండా ఇంకా రెండేళ్ళు పోనీ, రెండేళ్ళు పోనీ అంటే ఏవిటీ అర్ధం "
"నేనెందుకు చెబుతున్నానో విను విజయా?"
"విన్నానండి. ఇన్నాళ్ళ నుంచీ విన్ విని ఈ స్థితికి వచ్చాను.... ఇంక వినదలుచు కోలేదు."
"అంటే?"
'అంటే - అంతంత ఈ కొంపల్లో నేను ఒక్కదాన్నీ, ఇక్కడ - "వేరే రెండు గదులు తీసుకుని ఏకాంతంగా మీరు అక్కడ. ఏ "లా" పుస్తకాలు చూచుకోదాని కో "విజయా కులాసాగా ఉన్నావా?" అని ఏ మెరమొప్పపు మాటకో ఓ గంట ఇక్కడికి వస్తుండడం . ఒక్కదాన్నీ ఉండలేక పోతున్నాను తోచడం లేదంటే, సంగీత సాదన చెయ్యి అని మీరు అనడం నేనా హార్మోనియం ముందు "కూర్చొనే టప్పటి కల్లా ఇరుగు పోరుగు అమ్మలక్క లంతా , సాని పెట్టి వాయిస్తొందమ్మా అంటూ ఒక బుగ్గల నొక్కుకోవడం . లోకం అంతా మనం బార్యాభర్తలు అనుకోవడం . మనం మాత్రం పరస్పరం ముఖ పరిచయం లేని వ్యక్తులు లాగ మసులు తూండడం -- ఈ పరిస్థితి నేనింకొక్క క్షణం కూడా భరించలేను. తర్వాత మీ ఇష్టం "
'అది కాదు విజయా!"
"మీరు వెయ్యి చెప్పండి . లక్ష చెప్పండి . ఈ పద్దతి మాత్రం బాగా లేడు. ఇలా ఉండడం మీకేవైనా సరదాగా ఉందేమో కాని నాకు మాత్రం మహా చెడ్డ విసుగు వస్తోంది."
"ఇలా ఉండడం నాకు సరదా ?....."
"మరి.....?"
"కొన్ని కొన్ని కారణాల వల్ల ఇంకో రెండేళ్ళు. అంటే నాకు ముప్పయి ఏళ్ళు వచ్చేదాకా మన వివాహం ఆగాలి అంటున్నా."
"అదేం నియమం అండీ?...ముప్పయి ఏళ్ళు రావాలని లెక్క ఏవిటి ?....అప్పటి కేమేనా గొప్ప మార్పు వస్తుందనా, ఈలోగా మహా ప్రమాదం ఏమైనా జరుగుతుందనా?.... చాల్లెండి -- ఎవరేనా వింటే నవ్వి పోతారు . జాతకాల పిచ్చి మీరూనూ"
"జాతకాలు కారణం అని ఎవరన్నారు?"
"మరి లేకపోతె ఏవిటి?" నిశితంగా గోపాలం ముఖంలోకి చూస్తూ అడిగింది. గోపాలం తలవంచుకుని ఏం మాట్లాడలేదు.
"ఓహో....సదాచార సంపన్నులైన మీ అన్నగారు యుక్త వయస్సు వచ్చిన స్త్రీ ని అందులో బ్రహ్మ సమాజ మతస్తుడి మేనకోడల్ని మీరు వివాహం చేసుకోడానికి అంగీకరించరనా?.....ఆ అభ్యంతరం అంటూ అసలు ఆయనకి ఉంటె రెండేళ్ళ తర్వాత ఉండదని ఏముంది?..... ఈ అభ్యంతరం అప్పుడూ ఉంటుంది. అందుకోసం ఇంకా రెండేళ్ళు అగడంలో అర్ధం లేదు. ఇప్పుడే అయన అభిప్రాయం కనుక్కోవడం ఆయనకి అంగీకారం కాని పక్షంలో ఏం చెయ్యవలసి ఉంటుందో నిర్ణయించు కోవడం మంచిది."
"అది సమస్య కాదు విజయా. నేను వివాహం చేసుకోదలచు కుంటే అన్నయ్య అంగీకారా నంగీకారాలు అడ్డు కావు"
'అదికాక పొతే మరి ఏది సమస్య?"
గోపాలం ఏం మాట్లాడలేదు.
"మీరేదో చెప్పకుండా దాస్తున్నారు'
గోపాలం విజయ కళ్ళల్లో కి చూశాడు.
'అసలు మన వివాహం మీకే ఇష్టం లేదేమో? అందుకే ఇన్నాళ్ళ నుంచీ ఇలా వాయిదాలు వేస్తూ వచ్చారు. మనస్పూర్తిగా ఇష్టం లేనప్పుడు ఎందుకీ నాటకం ఆడడం?.....నాకిష్టం లేదని ఒక్కమాట అంటే సరిపోదూ....? ఇన్నాళ్ళూ ఇలా మాటలతో మభ్యపెట్టి , చేతలతో మోసం చేసి మనస్సు తో చెలగాటం ఆడి నన్ను సర్వనాశనం చెయ్యడం దేనికి?..... ఇలా కక్ష కట్టి హింసించడానికి నేనుమీకేం అపకారం చేశానని?....అంటూ నాలుగూ గబగబా అనేసి చేతుల్లో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ కూచుంది విజయ.
గోపాలం కళవళపడ్డారు. దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చేయి వేస్తూ "విజయా!" అన్నాడు డగ్గుత్తిక పడిన కంఠంతో. అతని చేతిని తోసేస్తూ "నన్ను తాకకండి. వెళ్ళండి -- ఇప్పటికే నా జీవితం మీ కారణంగా చాలా అస్తవ్యస్తం అయిపొయింది. ఇక నా బ్రతుకు సమృద్దిగా బతకనీయండి. వెళ్ళండి -- మీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళండి -- మీకు దణ్ణం పెడతాను. ఇకముందు అయినా ,మీదారిన మీరు వెళ్లి నన్ను హింసించడం మానేయ్యండి" అంటూ ఇంకా వెక్కి వెక్కి ఏడవసాగింది.
"ఏవిటిది విజయా!....నీకు మతి గాని పోయిందా?"
"ఇప్పటి కింకా పోలేదు , మీరు ఇంకా ఇక్కడ ఉండి హింసిస్తే మాత్రం నిశ్చయంగా పోతుంది. " అంది కళ్ళు తుడుచుకుంటూ.
"నేను చెప్పేది వినవా?"
"వినక్కర్లేదు"
"నా మాట మీద విశ్వాసం లేదా?
"ఉంది క నకే ఈ స్థితికి వచ్చాను"
"నన్ను నమ్మి ఈ రెండు సంవత్సరాలూ అగు, ఆ తర్వాత మన వివాహం చేసుకుందాం."
'అక్కర్లేదు"
"తొందర పడుతున్నావు సుమా!"
"అని మీరు భ్రమ పడుతున్నారు"
"అంతేనా?"
"అంతే !"
"సరే అయితే ...." అంటూ చేతిలో ఉన్న "లా' పుస్తకం టేబిల్ మీద పెట్టి కుర్చీలోంచి లేచాడు గోపాలం.
"ఆ పుస్తకం మీకు అవసరం అయితే పట్టికేళ్ళండి. అదే కాదు , మావయ్య పుస్తకాలు ఏవి కావలిస్తే అవి పట్టి కేళ్ళవచ్చు" అంది విజయ నేలకేసి చూస్తూ. విజయ వేపు పరిశీలనగా చూసి, గట్టిగా నిట్టూర్చి "అక్కర్లేదు' అంటూ బరువుగా అడుగు కదిపాడు గోపాలం. వీధి మలుపు తిరిగేదాకా అతన్ని చూస్తూ నిలబడి ఉండి ఆ తర్వాత గట్టిగా ఏడుస్తూ సోఫాలో కూలబడి పోయింది విజయ. ఆమెకి ఆ గదితో పాటు తన జీవితమూ ఈ లోకమూ కూడా వెలవెల పోయినట్లు చెప్పలేని వెలితి ఏర్పడి శూన్యంగా మారినట్లు అనిపించి హృదయం బాధతో మండి పోసాగింది.
ఆ హటాస్సంఘటనతో ,మనస్సంతా వికలం అయిపోయి తీవ్రమైన ఆలోచనల వేడితో మెదడంతా కాగిపోయి స్థిమితం లేక ఫలానా చోటుకి అని నిర్దేశం లేకుండా తన కాళ్ళు ఎటు తీసికెళితే అటునీరసంగా కదులుతూ తిరిగి తిరిగి గోదావరి ఒడ్డుకి చేరుకున్నాడు గోపాలం. అక్కడ పడవల లోంచి దింపి నేట్టుగాకట్టిన కొబ్బరి కాయల బస్తాల మీదికి ఎక్కి, కూర్చోబోతుంటే , గోపాలానికి జీవితంలో తానూ ఒక్కొక్క మెట్టూ ఎక్కి ఎలా ఈ స్థితికి చేరుకున్నది జ్ఞాపకం రాసాగాయి.
అమ్మా నాన్నా లేని లోటు లేకుండా ఆప్యాయతతో అభిమానంతో పెంచి పెద్ద చేసిన వదిన, అన్నయ్యా- శేషయ్య గారి మాట సహాయం వల్ల రామనాధం గారు ఇచ్చిన చేయూత-- అలోచనల పరిదిలు పెద్దవి కావడానికి కూల్డ్రే ఆచరణ విధానాలు విసృతం కావడానికి రామనాధం గార్లు తనపై నెరసిన స్వభావం. తను "లా" లో చేరడానికి విజయ చేసిన సాయం, చదువు అయి వచ్చే దాకా వద్దువద్దు అంటున్నా కాదూ కూడదని నెలనెలా క్రమం తప్పకుండా డబ్బు పంపించిన రామనాధం గారి సౌజన్యం. చనిపోయిన రామనాధం గారితో తనకు గల స్నేహాన్ని పురస్కరించుకుని, ఏడాది పాటు తన దగ్గర అప్రంటీసు గా వేసుకుని, ప్లీడరీ వవృత్తి లోని మెళకువల్ని ఆ వృత్తి లో పైకి వచ్చి రాణించడానికి అనువైన మార్గాన్నీ నిష్కపటంగా చూపించి తర్ఫీదు ఇచ్చిన న్యాపతి సుబ్బారావు గారి ఉదారత. ఇందులో ఏ ఒక్కటీ లేకపోయినా తానీ రోజున ఈ స్థితిలో ఉండి ఉండక పోను. --- ఆరు మూడయ్యేది -- గోపాలం గారు అన్నారంటే మాట తప్పరు అని , చిన్నవాడయినా పెద్ద అర్యుమెంటు ఇస్తాడు' అని జడ్జీలు మెజిస్ట్రేటు లు, "నిర్బయత్యాన్ని స్వాతంత్ర్యాన్నీ నియమం తప్పకుండా పాటిస్తూ మొత్తం "భారీ" కే గౌరవం తెస్తున్నావు" అని అభినందించే నీసియర్ లాయర్లూ -- సంఘంలో తన స్థానం యెంత పెరిగింది?.....
కాని ఏం లాభం ?....తన మనస్సుకి శాంతి లేదు . అటు అన్నయ్యా, ఇటు విజయా అంతా తనని అపార్ధం చేసుకొనే వారే! కోర్టులో ఆర్గ్యూ చేసే టప్పుడు అంత బాగా లేచే కంఠం, ఆప్యాయత ఉన్నవాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఏవిటో, పూర్తిగా లేవదు. అందువల్ల మనస్సులో ఉన్న నిజాన్ని పూర్తిగా చెప్పలేకపోవడం అందువల్ల ఎదటి వాళ్ళు తనని తప్పుగా అర్ధం చేసుకోవడం.
లేకపోతె ఏవిటి ?....యౌవ్వనం మీద యౌవ్వనం లో తీసుకునే నిర్ణయాల మీద నమ్మకం లేని రామనాధం గారు , ముప్పయి ఏళ్ళు వచ్చేదాకా విజయ ని వివాహం చేసుకోననీ తనకి సీల్డు కవరు విప్పి చూసుకుని ఆమీదట అంగీకారం అయితేనే ఆమెని చేసుకుంటాననీ తన దగ్గర్నుంచి మాట తీసుకుని, ఈ వ్యవహారం ఏదీ విజయకి తెలియనివ్వనని తనచేత వాగ్దానం కూడా చేయించడం ఏవిటి? అప్రకారం తను మాటకి కట్టుబడి వ్యవహరిస్తుంటే , విజయ తనని అపార్ధం చేసుకుని ఇలా నిష్టూరంగా ప్రవర్తించడం ఏమిటి?....
ఎప్పుడూ లేంది ఇవాళ విజయ ఎందుకిలా తనని విదిలించేసింది ?.... ఇంక ఎప్పుడూ మొహం మొహం చూచుకోనట్లుగా అనేసింది? ...ఇంతటితో ఇన్ని నాళ్ళ సంబంధం పోయినట్టే!....అక్కడికి వెళ్ళకుండా తను గాని తనని చూడకుండా ఆమె గానీ ఉండగలరా?....ఏవిటో ? ..తను ఇలా అనవసరంగా పెళ్లి వాయిదా వేస్తున్నానని అంది కాని, నిజంగా విజయ కి తనమీద యెంత మక్కువ ఉందొ తనకి తెలియదూ?....విజయ వట్టి పిచ్చిది. పసిపిల్ల కంటే అన్యాయం ఆవేశం తప్ప ఏం తెలియదు.
నిజమే, రామనాధం గారు అన్న మాటలు నిజం. పాపం అయన చనిపోయేటప్పుడు తన చేతిలో విజయ చేతిని పెడుతూ అన్న ఆ మాటలు అక్షరాలా నిజం. సంతోషం వస్తే ఎలా దాచుకోలేదో, దుఖం వచ్చినా అలాగే అణచు కోలేదు.
రామనాధం గారు పోయిన రోజున అలాగే అయింది కదా!....
తనకి సాయంత్రం టెలిగ్రాం అంది రాత్రికి రాత్రి బయలుదేరి రాజమండ్రీ వస్తే నిజంగానే అయన పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. విపరీతమైన రక్తపు పోటు వల్ల హెమరేజి వస్తుందేమోనని డాక్టర్లు అంతా ఓ పక్క నుంచి కంగారుపడుతూ ఉంటె, ఎలా ఉంటుందో అని అయన స్నేహితులూ తనూ ఇంకో పక్క ఆందోళన పడుతూ ఉంటె మావయ్య కి ఎలా ఉంటుందో అని మనస్సులో భయం పెట్టేసు కుని, తను ఎంతసేపు ఓదార్చినా ధైర్యం తెచ్చుకోలేక, చివరికి స్పృహ తప్పి పడిపోవడం దాకా వచ్చింది. రామనాధం గారు తననీ విజయ నీ దగ్గరికి పిలిచి, తలగడా కింద ఉన్న తాళం చెవులు, విజయ కీ విజయ బాధ్యత ని తనకీ అప్పగిస్తుంటే నోటిలో పైట కొంగు కుక్కుకుని ఎంతెలా ఎడిచేసింది ?....ఊరుకోబెట్టబోయిన తనని తోసేసి టేబిల్ కి తల కొట్టుకుని యెంత ఇది అయిపొయింది ?....శవం నుంచి ఆమెని విడదీయడానికి అందరితో పాటు తను కూడా చివరికి కేకలు వెయ్యవలసి వచ్చింది కదా!....
అన్నం తినిపించడం, ఏడుపు మానిపించడం , ఆ బాధని మరిపించడం ఆ వారం పది రోజుల లోనూ యెంత కష్టం అయింది? ఉండుండి ఏడవడం, నిద్దర్లో ఉలిక్కిపడి లేచి కూర్చోవడం, మావయ్య కి మందు ఇచ్చే టైమయిందని పలవరించడం -- అబ్బబ్బ -- నెలానెలా పదిహేనురోజులు పిచ్చి ఎక్కుతుందేవీటి చెప్మా అన్నంతగా కంగారు పెట్టింది. రెండు మూడు నెలల తర్వాత కదా, తను నెమ్మదిగా సర్ది చెప్పి ఒప్పించి, రోజూ రెండు పూటలా వచ్చి కబుర్లు చెప్పి భోజనం చేసి వెళ్ళే షరతు మీద వేరే లాడ్జింగ్ తీసుకుని ఉన్నది ?... నిజమే....పాపం ఒక్కత్తే తన మాట ప్రకారం ఈ రెండేళ్ళ నుంచి అంత ఇంట్లో కాలక్షేపం చేస్తోంది. అటు నా అన్న వాళ్ళెవరూ లేక" ఇటు నమ్ముకున్న తను ఒక్కడూ కారణం ఏం చెప్పకుండా ఊరికే పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తూ ఉంటె ,, భవిష్యత్తు ఏమౌతుందో అని భయం వేయదూ?....భయం వల్లే ఆ విసుగూ, కోపమూను , అవును విజయ నీ అలా అసందిగ్ధస్థితిలో ఉంచడం అన్యాయం.
