21

ఓ! సత్యాదేవీ! అమ్మగారు కూడా వచ్చారా! రండి రండి!" సుమిత్రా సత్యలకు ఆనందంగా ఎదురేగి అత్యాదరంతో తీసుకు వచ్చి కూర్చుండచేశాడు ధర్మారావు.
"అమ్మా , ఇటు రా.' ధర్మారావు పిలుపు విని లోపలి నుండి వచ్చింది దయామయి. "సత్యాదేవి వారి పిన్ని గారిని కూడా శ్రమ పెట్టి తీసుకు వచ్చారు. చూచావా, అమ్మా, మనమంటే ఎంత అభిమానమో!" అన్నాడు ధర్మారావు.
గంబీరంగా మందహాసం చేసి, నమస్కరించింది దయామయి. "తమ రాక ముందుగా తెలిసి ఉంటె సిద్దంగా ఉండే వాళ్ళము. మీకు ఎదురు రాలేకపోయాను క్షమించాలి."
"ఫర్వాలేదు లెండి. ఏమిటో రావాలనుకోగానే వచ్చేశాము. ఇంతకాలం పిల్లల మధ్యనే కాని, మన మధ్య స్నేహం లేదు. ఒకసారి పరిచయం చేసుకోవాలని వచ్చాము."
ఎందువల్లనో సుమిత్రాదేవి మాటలలో కనిపిస్తున్న కలుపుగోలు తనం , ఆప్యాయత, అంతరంగం లో జనించినవి కావని పించింది దయామయి కీ, ధర్మారావు కూ కూడా.
సత్యాదేవి ఉదాసీనంగా ఉండిపోయింది దిక్కులు చూస్తూ.
లాంచన పూర్వకమైన మర్యాదలైన తర్వాత తీరికగా ఇంటిని, మనుషు లనూ పరీక్షించసాగింది సుమిత్ర. వాతావరణం ఏమిటో బరువుగా ఉన్నట్ల నిపించింది నలుగురికి కూడా. సుమిత్రాదేవి వదనం లో క్షణ క్షణానికి మారిపోతున్న రంగులను చూచి ఆమె వచ్చిన కారణం ఏదో, సాధారణ మైనది మాత్రం కాదని సూక్ష్మ గ్రాహి అయిన దయామయి గ్రహించింది. తనను మించిన దర్జా ఒలికించే వాళ్ళు ఉండబోరని ఒక విధమైన గర్వం కల సుమిత్ర, దయామయి లో ఉన్న ఠీవికి, దర్జాకూ , ఏమో తెలియని విశిష్తోన్నత్యానికీ లోలోన కలవరపడింది కూడా!
"అయితే అబ్బాయి కిదే ప్రధమం మనుకుంటాను , ఉద్యోగం చేయడం?' దయామయి తో సంభాషణ లోకి దిగింది సుమిత్రాదేవి.
"ఔనండీ" అన్నది దయామయి.
"ఆస్తి పాస్తులేమాత్రం ఉన్నాయో?"
గంబీర విషాదం ధ్వనించింది దయామయి నవ్వులో. "ఏమీ లేవు. అతి బీదవాళ్ళం."
"ఆహా!'అసంతృప్తి గా తల పంకించింది సుమిత్రాదేవి.
"అయితే అసలు మనదే ఊరు ?' మరో ప్రశ్న.
"ఉద్యోగాలు చేసేవాళ్ళ కోక ఊరేమిటి? ఏ ఊళ్ళో ఉంటె అ ఊరే మనది!" నిర్లిప్తంగా అన్నది దయామయి.
"ఆహా, అంతే అనుకోండి. కాని, స్వగ్రామ మంటూ ఒకటి ఉంటుందిగా?"
దయామయి సమాధానం చెప్పలేదు.
"అయితే ఈ అబ్బాయి ఒక్కడేనా మీకు ?"
ఒక్క క్షణం ఆగి అన్నది దయామయి "అవును."
ధర్మారావు కుర్చీలో అటూ ఇటూ ఇబ్బంది గా కదిలాడు.
"ఇంతకీ అబ్బాయి తండ్రి గారే ఊళ్ళో ఉన్నారు? అయన కేం ఉద్యోగం?"
సుమిత్ర అడిగిన ఈ ప్రశ్న వింటూనే దయామయి స్పృహ తప్పిపోయింది.
"అయ్యో! అయ్యో! ఏమిటిది? ఎప్పుదైనా ఇలా వస్తుంటుందా?" అంది ఖంగారుగా సుమిత్రా దేవి.
"అమ్మా! అమ్మా!" ఖంగారుగా వచ్చి పట్టుకున్నాడు ధర్మారావు. అప్పటికప్పుడే జేయిలు డాక్టరు కు ఫోను చేసింది సత్య.
పావుగంట అనంతరం స్పృహ వచ్చిన దయామయి కనుల వెంట అశ్రు ధారలు అవిరళం గా కారిపోయాయి. ధర్మారావు స్తబ్దుగా నిల్చున్నాడు. సత్య కేమిటో అయోమయంగా ఉంది అంతా.
సుమిత్ర ముఖం చాలా అప్రసన్నంగా ఉంది. "అమ్మగారి మనస్సు బాగున్నట్టు లేదు. మేము మరోసారి వస్తాములే, నాయనా!' అంటూ లేచి దారి తీసింది. సత్య ఒక్కసారి ధర్మారావు నూ, దయామయి నీ నిస్సహాయంగా చూచి, పిన తల్లిని అనుసరించింది. ధర్మారావు మౌనంగానే కారు వరకూ అనుసరించి సాగనంపాడు వారిని.
ఇంటికి తిరిగి వచ్చిన సుమిత్ర భర్త మీదా, సత్య పైనా , నౌఖర్ల పైనా కోప వర్షం కురిపించి, కంటి కెవరు కనిపిస్తే వారిని కాల్చి భస్మం చేసేటంత పని చేసింది.
"ఎమావేశించిందే, నీకు?" విసుగ్గా ప్రశ్నించాడు మిత్రా, కొంచెం ధైర్యం చేసి.
"ఛీ. తగుదునమ్మా అంటూ మళ్ళీ మాట కూడాను. ముష్టి సంబంధం. బోసి కొంపా, బోడి చరిత్రలూను" అంటూ చీదరించు కుందే కాని, అసలు సంగతి ఏమిటో చెప్పలేదు.
"జరిగిన విషయం ఏమిటమ్మా?" సత్యను ప్రశ్నించాడు మిత్రా. ఆమె వివరించింది.
"మొగుడు వదిలేశాడు. కావాల్ను. లేకపోతె అంత రహస్యం , దిగులూ దేనికి? చాలు ఇక ఆ ధర్మారావు గాడి సంగతి ఎత్తకండి." శాసనం ప్రకటించి, లోనికి నిష్క్రమించింది సుమిత్ర.
ఆ అజ్ఞాలోని ఉత్తరార్ధం మాట ఎలా ఉన్నా పూర్వార్ధాన్ని మాత్రం భార్య ఊహించిన విధంగానే ఊహించుకోక తప్పలేదు న్యాయమిత్ర కు.
మౌనంగా భారమైన హృదయంతో తన గదికి చేరింది సత్య.
22
దయామయి స్పృహ వచ్చిన చాలాసేపటి వరకూ ధర్మారావు ముఖం వంక చూడలేదు. నిర్లిప్తంగా ఎటో చూస్తుండి పోయింది. తర్వాత లేచి మౌనంగా గృహకృత్యాలలో లీనమై పోయింది. ఉప్పెనకు ముందుండే భయంకర నిశ్శబ్ద నిశ్చలత వంటి ఆ గంబీర్యాన్ని చూచి పలకరించ సాహసించ లేకపోయాడు ధర్మారావు.
మనుష్యులేలా ఉన్నా, మనసు లేలా ఉన్నా కాలం ఆగదు; కర్త నిర్వహణ తప్పదు.
వికల మానసం తోనే ఆఫీసు దుస్తులు వేసుకుని బయలుదేరబోతున్న అతడు దయామయి వచ్చి దగ్గరగా నిల్చోవడం తో ఆగి, "ఏమిటమ్మా?' అన్నాడు.
దయామయి ఏమిటో అలోచిస్తున్నట్లూ చెప్పటానికి తటపటా యిస్తున్నట్లూ కనిపించింది.
"అమ్మా" అన్నాడు దగ్గరకు వెళ్ళి. "ఏమిటి నీ భాధ? ఎప్పుడడిగినా చెప్పవు?"
బలవంతంగా అణిచి పెట్టినా అణగ కుండా భారమైన విశ్వాసం బయల్పడింది. "నా బాధ..... నా గురించి కాదు. నీ గురించే. ఇంతకాలం నుండీ నీకో విషయం గురించి హెచ్చరిద్దామనుకొంటున్నాను. కాని జాప్యం చేస్తూ వచ్చాను. ఇవాళ చెప్పి తీరవలసిన అగత్యం కలిగింది."
"చెప్పమ్మా . నాతొ ఏం చెప్పడాని కైతే మాత్రం, సందేహం దేనికి?"
"చూడు. నన్ను అడ్డు ప్రశ్నలు వేయకు. చెప్పినది మాత్రం విను....ఇప్పుడు నువ్వొక ఉద్యోగస్తుడి వె కాని, అంతమాత్రాననే గౌరవస్తుడి వై పోలేదు."
"అమ్మా!"
"అవును. నేనేది చెప్పినా నీ మంచికే. సత్యతో స్నేహం వద్దని ఏనాడో హెచ్చరించ బోయాను. కాని వెనుదీశాను అదే ఇంత వరకూ తెచ్చింది. ఇకనైనా మేల్కొనటం అవసరం. సత్యతో స్నేహం మానెయ్యి. కల వారితో స్నేహాలు నీకు తగవు. ఎంతలో వాడివి అంతలో ఉండు.' వింటున్న విషయాలు భరించలేక , కలో నిజమో తేల్చుకోలేక , నోట మాట రాక , తల తిరుగుతుంటే కుర్చీలో కూలబడ్డాడు, పగిలిపోతున్న తలను రెండు చేతులతో పట్టుకుని.
"ఆ సుమిత్రాదేవి వేస్తున్న ప్రశ్నలను చూస్తె నా అనుమానాలు చాలావరకూ పోయాయి. అందులో ఒక్కటి మాత్రం నీకు చెబుతున్నాను. ఆమెకు మీ ఇద్దరి విషయం లో ఏదో పెద్ద ఆశ ఉన్నట్లుంది. కాని అది జరిగేది కాదు!"
దిగ్భ్రాంతి లో అన్నాడు ధర్మారావు ; "ఆమెకే కాదమ్మా, మాకూ ఉన్నాయి. సమయం చూచి నీకు చెప్పాలను కుంటున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నాము."
"అదే అందని ఆశ అని చెబుతున్నాను." కఠిన గంబీరస్వరం! "నీవు అనాధ శ్రమం లో పెరిగిన వాడివి. సభ్య సమాజస్తులు నిన్ను పురుగును చూచినట్లు చూస్తారు. 'మా అమ్మాయికి నువ్వు అర్హుడవు కావు'-- అని వాళ్ళ చేత చెప్పు దెబ్బలా అనిపించుకుంటే నీ హద్దుల్లో నీవుండి ఉన్న గౌరవాన్నయినా కాపాడుకో" అని సమాధానం కోసం ఎదురు చూడకుండానే వేగంగా వెళ్ళిపోయింది దయామయి.
పగిలిన గుండెతో, చెదిరిన మనసుతో డ్యూటీ కి వెళ్ళాడు. జెయిలు ఆవరణ లో అడుగు పెట్టుతుంటే అర్జున్ కూడా అప్పుడే వచ్చి కలిశాడు. ఇద్దరూ మాట్లడుకుంటూ ఖైదీల వైపు నడిచారు. ఖైదీ లందరూ నడుం వంచి పనులు చేస్తున్నారు. ఎండతాపం చాలా అధికంగా ఉంది. పోలీసులు అజమాయిషీ చేస్తున్నారు.
పోలీసుల, ఖైదీల నమస్కారాలను అందుకోకుండా దూరానికి దృష్టి నిగిడించి చూచి, అక్కడి గలభా గమనించి, వడివడిగా అటు నడిచాడు ధర్మారావు. హత్యా నేరంతో యావజ్జీవ శిక్ష విధింప బడి రెండురోజుల క్రితమే ఆ జెయిలు కు తీసుకు రాబడ్డాడు బలరం అనే ఒక కర్షకుడు. అతడు ఒక పెద్ద జమీందారు కింద ఉద్దారకుడుగా ఉండేవాడు. ఆ జమీందారు చాలా మంచివాడని పేరు. ఒకవంక ఎంతో ఘతుకుడని కూడా పేరు ఉంది. ఏది నిజమో, ఎవరికీ తెలియదు కాని, అతడి జమీ లో ఇంచుమించు అయిదారు నెలల కో హత్య, లేక దొమ్మీ తప్పక జరుగుతుంటుంది. అతడి కింద పనిచేసే వాడే ఎవడో ఒకడు వ్యక్తిగత కారణాల వల్ల అది చేసినట్టు బలమైన సాక్ష్యాలతో రుజువౌతుంటుంది. ప్రతి నేరస్తుడూ తనకు ఏమీ తెలియదనే మొర పెడతాడు. కాని అందరికీ మరే ఆలోచనా అవసరం లేకుండా అతడే కారకుడని స్పష్టంగా నమ్మే నిదర్శనాలన్నీ కనిపిస్తాయి. అందుకు ఎన్నో కట్టు కధ లుంటాయి. నిజం ఒక్క దైవానికి మాత్రమే తెలియాలి. అటు వంటి నేరస్తులలో ఒకడే బలరాం.
అతడు ఈ జెయిలు లో ప్రవేశించిన నాలుగైదు రోజుల నుండి అలజడి అధికంగానే ఉన్నది. తాను నేరస్తుడను కానని పోలీసులకు లొంగకుండా మహా గొడవ పెడుతూ, పని చేయకుండా నోటికి వచ్చినట్లు అన్ని రకాల తిడుతున్నాడు బలరాం. పోలీసులకు చేతనైనది , చావగొట్టి అదుపులోకి తేవడానికి ప్రయత్నించడమే, మొక్కలకు నీళ్ళు మోయమని , అతడికి తీసిపోకుండా తిడుతూ లాఠీ లతో చావగొడుతున్నారు.
"ఏమిటది?" సింహలలా గర్జిస్తూ నిల్చున్న అర్జున్ నూ, ధర్మారావు ను చూచి పోలీసులు ఆగారు. బలరాం నోట నురుగులు కక్కుకునే దశకు వచ్చి కూడా వాక్ప్రవాహం తగ్గడం లేదు.
"ఏమిటి, సంగతి?' ఉరిమి చూచాడు అర్జున్.
ఏమనుకొన్నాడో ఏమో, బలరాం ధోరణి ఆగిపోయింది. చెమటలు తుడుచుకుంటూ , దెబ్బలు తగిలిన చోట సవరించు కుంటూ ఉగ్ర రూపంతో నిల్చున్నాడు.
"ఏమిటి రభస?' సాధారణ స్వరంతోనే ప్రశ్నించాడు ధర్మారావు.
"బాబూ!" అంతవరకూ అతి దురుసుగా అరుస్తూన్న బలరాం ఆబల లాగా బోరుమన్నాడు. "నేనే పాపం చెయ్యలేదు. నా గుడిసె లో నేను నిద్దర పోతుంటే అర్ధరాత్రి వేళ మా జమీందారు గారి గుమస్తా -- నన్ను బాబుగారు అర్జంటుగా రమ్మన్నా రంటూ వచ్చాడు. నిజమే ననుకుని నేను వెళ్తే జమీందారు గారి దివాణం గేటు దగ్గర శవం పడి ఉంది. ఏమిటో నని నేను వంగి చూస్తుంటే నేనే చంపానని అందరూ అన్నారు. నన్నిందులో పడేశారు. నాకే పాపం తెలియదు, బాబూ!"
"అదంతా కోర్టు లోనూ చెప్పావు; ఏం లాభం? బలమైన సాక్ష్యాలతో రుజువైంది. నువ్వు శిక్ష అనుభవించక తప్పదు" అన్నాడు అర్జున్.
"పోనీ జెయిల్లో పెట్టారు. నేను మీకు పనులెందుకు చెయ్యాలి? మీ కూలోడినా? కూరలు పండించమని, మొక్కలకు నీళ్ళు పోయ్యమనీ నన్ను వేపుకు తినేస్తున్నారు ఈ పోలీసోళ్ళు."
అతడెంత అమాయకుడో, అత్మాభిమానో అర్ధం చేసుకున్న ధర్మారావు - హృదయం అర్ద్రమై పోయింది. నచ్చ చెబుతున్నట్లు అన్నాడు : "ఊరికే కూర్చుంటే ఎవరికి మాత్రం తిండేలా వస్తుంది, చెప్పు? ఏ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి మరి! అరుగో నీ తోటి ఖైదీ లంతా పనులు చేయడం లా?"
నిర్లక్ష్యంగా చెయ్యి గాల్లోకి విసిరాడు బలరాం: "చేసుకొనీ దొరా! వాళ్ళయితే నేరం చేశారు, అనుభవిస్తారు . నాకేమిటి పని? నేనునేరం చేయలేదు... మొర్రో అంటుంటే నన్నుతీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. తీసుకొచ్చినోళ్ళు మీరే కూర్చో బెట్టి కూడు పెట్టండి. నేనిలాగే దర్జాగా కూర్చుంటా. కూర్చోబెట్టి పెట్టలేని వాళ్ళు వదిలెయ్యండి!" అంటూనే బైటాయించాడు బలరాం.
