Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 17


    "తీరికలేక కాదు, రాజా...." నసుగుతూ ఊరుకున్నాడు శ్రీహరి. కొద్దిసేపు నిశ్శబ్ధం తాండవించింది.
    గంభీరంగా అన్నాడు రాజా: "ఇందువల్ల మన స్నేహం దెబ్బతినకూడదన్న నువ్వే యిలాగై పోయావేమిటి, శ్రీహరీ? అయిందేదో అయిపోయింది. ఇక మరిచిపో."
    శ్రీహరి మాట్లాడలేదు. అంతరంగం ఎంతగా బాధాసాగరంలో మున్కలు వేస్తున్నా స్థిర సహిష్టుతతో వెలుగొందే రాజా గంభీర వదనాన్ని తేరి చూడలేకపోయాడు.
    "నాన్నగారు కులాసా? అక్కగారి దగ్గర్నుంచి ఉత్తరాలు వస్తున్నాయా?" అన్నాడు తిరిగి రాజా.
    "ఆఁ."
    "ఏమిటి, శ్రీహరీ, అంత బాధ? నాతో చెప్పవూ? లేక నామీదేమైనా కోపమా?"
    "లేదు, రాజా, లేదు." నొచ్చుకున్నాడు శ్రీహరి. "నీమీద కోపమెందుకు? ఏమిటో శాంతి విషయమే నాకు చాలా విచారంగా ఉంటోంది. చూస్తూ చోస్తూ ఏమీ అనలేము. దాని పెంకెతనం అలాగే సాగుతోంది. ఆ జీవితాని కర్ధ మేముంటుంది చెప్పు?"
    కొద్దిసేపటికి అన్నాడు రాజా: "మరీ అంత విచారించవలసిన విషయం కాదు, శ్రీహరీ, అది. మెల్లగా కాలమే తీసుకురావాలి ఆ మార్పు ఆమెలో. దైవం దయదలిచితే బహుశః అక్కడే తన అభిప్రాయాకు తగిన వరుడిని పొందగలదు."
    "రాజా!" దెబ్బతిన్నట్టు అరిచాడు శ్రీహరి. "అలా జరుగుతుందంటావా? అదే నిజమైతే శాంతి నిప్పుడే తీసుకొచ్చేస్తాను, అక్కడినుంచి. ఆ మార్పు కాదు నాకు కావాల్సింది. అది కాదయ్యా నేను కోరేది." బాధగా అన్నాడు.
    "తెలుసు." రాజాకూడా బాధ పడ్డాడు. నవ్వలేక నవ్వాడు. "మన ఆశలొకవిధంగా ఉంటాయి. దైవనిర్ణయం ఒక విధంగా ఉంటుంది. సరిపెట్టుకుపోక తప్పదు."
    "......."
    "ఇంతకూ నువ్వు హోటల్ భోజనమేనా?" మాట మార్చాడు, రాజా.    
    "కాక, వేరే గతేముంది?" తిరిగి కొంతసేపు మౌనం రాజ్యం చేసింది.
    "నాదో చిన్నప్రార్ధన, శ్రీహరీ. తీర్చగలవా?" నిట్టూర్చాడు శ్రీహరి. "ఇతరులతో ప్రమేయం లేకుండా అనా చేతిలో పనైతే తప్పక తీర్చగలను, రాజా. అంతకంటే సంతోషం నా కింకొకటుండదు. అడుగు, ఏమిటో?"
    "మళ్ళీ మాట తిరగకూడదు సుమా!"
    "ఒకసారి అలా జరిగి నిన్ను బాధించడమూ అయిందిగా? తిరిగి అటువంటి పరిస్థితులు రాకూడదు. అందుకే ఒక్క నాకు సంబంధించిన దైతేనే అడగమన్నాను."
    "ఈ యిల్లు వదిలేసి నాదగ్గరి కొచ్చెయ్యి. నాకు వంటమనిషీ, నౌకర్లూ ఉన్నారు. ఏ లోటూ ఉండదు. మళ్ళీ అక్కగారు వచ్చాక కావాలంటే వేరే ఉందువుగాని!"
    నిర్ఘాంతపోయాడు శ్రీహరి. "ఇదేం కోరిక, రాజా?"
    రాజా మాట్లాడలేదు.
    "నాకేం ఇబ్బందిగా లేదు. బహుశః ఒకటి రెండు నెలల్లో పద్మ వచ్చేస్తుంది. ఎందుకు చెప్పు, ఈ మార్పులన్నీ? అప్పుడు మళ్ళీ ఇల్లు దొరకడం కూడా కష్టమౌతుంది."
    "పోనీలే. నువ్వు తీర్చగలిగితేనే. కలిసి ఉందా మని సరదాపడ్డాను." తెచ్చి పెట్టుకున్న నిష్టురతతో అన్నాడు. కాని శ్రీహరికి తెలుసు ఆ నిష్టురత వెనుక దాగిఉన్న సత్యం. తాను ఒంటరిగా ఉండి యిలా రకరకాల విచారాలతో బాధపడుతున్నాడని రాజా ఆ ఉపాయం ఆలోచించాడన్న మాట! కాని పోల్చిచూస్తే అతడి బాధలో తనదెన్నో వంతు?
    "సరే. ముందే కాళ్ళకు బంధంవేసి అడిగావు కదా? ఇక కానిదేముంది? అలాగే చేద్దాం. ఇటువంటి స్నేహితుడున్నందుకు ఎంతైనా గర్విస్తున్నాను" అన్నాడు శ్రీహరి. రాజా ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
    
                                     13

    తిమిరాచ్చన్నమైన ఆకాశం క్రమంగా ధవళదీప్తి మంతం కాసాగింది. పక్షుల కలకల నాధాలతో, విద్యార్ధుల గీతాలతో శాంతినికేతనం కళకళలాడసాగింది.
    సన్నగా మధురంగా వేణుగానం వినవస్తూంది. ఆ ప్రశాంతవేళ ఆ మధుర మంజులరవానికి శాంతి దేహం పులకరించింది.
    కిటికీ దగ్గరగా వెళ్ళి ఆ నాదం వినవస్తూన్న దిక్కుగా దృష్టి సారించింది. సూర్యరశ్మి వృక్షాగ్రభాగాలలో వింతగా మెరుస్తూంది. పచ్చికపై, తరుపత్రాలపై హిమబింధువు లింకా మగతగానే నిద్రపోతున్నాయి. దూరాన చెట్టు మ్రాను నానుకుని పచ్చికపై కూర్చుని ఒక యువకుడు మురళి వాయిస్తున్నాడు. అర్ధ నిమీలిత నేత్రాలతో తల్లీనమైపోయి గానం చేస్తున్న అతడెంత అదృష్టవంతుడో అనిపించింది శాంతికి. ప్రతిదినం ఆ ప్రశాంత సమయంలో ఆ మనోహర వేణుగానం వినడం ఆమె కొక వేడుకైంది. ఒక దినం మనోరమ చెప్పింది, అతడు గోవిందరావనే మహారాష్ట్రుడని. శాంతి నికేతన్ లో ఎమ్.ఏ. చదువుతున్నాడు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం కూడ అభ్యసిస్తున్నాడు. అతడి మాతృభాషే కాక తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మలయాళం భాషలు నాలుగింట్లో అనర్గళంగా మాట్లాడగలడు. శాంతినికేతన్ నృత్య నాటికా కార్యక్రమాలన్నిటిలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారిలో ప్రప్రథముడు.
    క్రమంగా ప్రతి ఉషస్సూ ఆ మురళీగాన శ్రవణంలోనే గడపడం మామూలైంది శాంతికి. శాంతినికేతన్ లో చేరాక ఉదయం నాలుగు గంటలకే లేవడం అలవాటైంది. సరిగా నాలుగున్నరకు వేణుగానం వినవస్తుంది. ఒక సాయంత్రం అతడు శాంతినికేతనం వెలుపల ఆవరణలో అతి మనోహరంగా వేణువుపై గానం చేస్తున్నాడు. శాంతి షికారు తిరుగుతున్నదల్లా అతఃడికి దగ్గరగా వెళ్ళి కొద్ది దూరంలో కూర్చుంది. "ఎంత సుందరమైన గానం మీది!" అంటూ అభినందించింది, అతడు గానం ఆపుజేశాక.
    అతడు నవ్వాడు. "వ్యక్తిలోనో, వ్యక్తి కళలలోనో సుందరత్వం మిళితంజేసి నిర్మించడం ఆ సుందరరూపునికి అలవాటు" అన్నాడు, భగవంతుడి నుద్దేశించి, ఆకసం వైపుగాచేతులు జోడించి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS