"వదినా......."అంటూ నిస్సహాయంగా అరచిన గోపాలం కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి.
గోడచాటు కి వెళ్లి సావిత్రి పైట చెంగుతో కళ్ళు ఒత్తుకుంటూన్న సంగతి అతను గమనించనే లేదు.
అటు హాస్పిటల్ ఇటు ఇంటికీ ఉపయోగపడేలాగ కట్టిన అంత పెద్ద ఇంట్లోనూ ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది గోపాలానికి. ఆరోజు తనతో ఎవళ్ళూ మాట్లాడలేదు. వదిన ఎక్కడ బాధపడుతుందో నని రెండు మెతుకులు కొరికాడు. కాని ముద్ద నోట్లోకి పోలేదు. ఆరోజు అయిపోయాక కూడా తన తోటి తిన్నగా ఎవరూ మాట్లాడలేదు. అన్నయ్య తనకేసి కన్నెత్తి అయినా చూడలేదు. వదిన అవసరం అయితే ముక్తసరిగా మాట్లాడుతోంది. ఆఖరికి మణి కూడా తన మీద కక్ష కట్టింది. ఏంటో ఆప్యాయత ఉండవలసిన ఆ ఇల్లు తనకి పరాయి ఇల్లులా ఉంది. ఎవరూ తనని పలకరించరు. తన సంగతి పట్టించుకోరు. ముళ్ళ మీద ఉన్నట్లు అలా ఒకటి రెండు రోజులుండే సరికి గోపాలానికి మతి పోయినట్లయింది. కాసేపు ఏ చేల గట్లవేపో పోయివస్తే కొంత మనస్సుకి శాంతిగా ఉంటుందని బయలుదేరాడు ఓ రోజు సాయంత్రం. గోపాలం బయటకు బయలుదేరడం చూసి "నీతో నేనూ వస్తాను బాబయ్యా?!" అంటూ మణి బయలుదేరింది వెనకాలే, గోపాలం నీరసంగా నవ్వి "వస్తే రా" అన్నాడు.
దారిలో గోపాలం మౌనంగా నడుస్తున్నాడు. మెదడు నిండా ఏవో ఆలోచనలు, ఇంట్లో ఉన్నంతసేపూ సరిగా మాట్లాడని మణి గడప దాటగానే మామూలుగా మాట్లాడటం ప్రారంభించింది. అసలే వాగడం ఎక్కువేమో అందులో ఈ రెండు మూడు రోజుల నుంచీ నాలిక కట్టేసినట్లు అవడంతో వస పిట్టలా వాగుతోంది.
"నాన్నకి నీ మీద బలే కోపం వచ్చిందిలే . అమ్మకీను-- నువ్వు చూడలేదు కాని ఎంతమంది జనం వచ్చారో?....వచ్చిన వాళ్ళంతా పాతికా యాభై పాతిక యాభై చదివించారు. ఆ డబ్బంతా శేషయ్య మావ దగ్గర ఉంది. అన్ని గదులు ఎందుకు కట్టేరో తెలుసా ?.....మొన్న మావయ్య ఎవరికో చెబుతుంటే విన్నాను. అటువేపు మొహం పెట్టి ఉన్న హాలు , వరండా , నడవ , నాలుగు గదులూ ఆసుపత్రి కట. ఇటు పెరటి వైపు కి ఉన్న హాలు కటకటాల వరండా గదులూ మనం ఉండాడానికట-- కటకటాల వరండా ఎందుకో చెప్పుకో?..... నే చెప్పనా?...... రాత్రిళ్ళు ఎప్పుడూ నాన్న అక్కడే పడుకోడానికి . ఏవంటే లోపల పడుకుంటే పాపం ఏ అర్ధరాత్రయినా జబ్బు చేసినవాళ్ళు వచ్చి కేకేస్తే వినిపించవద్దూ.......అందుకని మరచి పోయాను....బాబయ్యోయ్!.... అన్నట్టు నీ పెళ్లిట?...."
గోపాలం ఉలిక్కిపడి ఎవరన్నారు?" అన్నాడు.
మొన్న నాన్న అమ్మ తోటి అంటుండగా విన్నాను. ఏవైనా సరే ఈ ఏడు తమ్ముడి పెళ్లి చేసెయ్యాలి. ఇప్పటికే బోలెడు ఆలశ్యం అయిపొయింది. ముందు వాడి పెళ్లి చేస్తేనే కాని.........
మణి పెళ్లి చేయడానికి వీలులేదు అన్నాడు.....అవునా?........."నవ్వుతూ గోపాలం మణి కేసి చూశాడు.
"ఫో బాబయ్యా-- నేనసలు పెళ్లి చేసుకోను"
"మరేం చేస్తావు?"
"ఇందక్కా చదువు కుంటా"
"వెరీ గుడ్......అలా చెయ్యి"
కాని బాబయ్యా. నాన్న చదివించే లాగ లేడు. మొన్నేమోనే మెట్రిక్ అయిన తర్వాత నేను రాజమండ్రి లో ఎస్.సి. లో చేరతాను అని వాసు అంటుంటే -- నేనూ చేరతాను, నన్ను కూడా మెట్రిక్ చదివించు నాన్న అన్నాను. దాంతో నాన్న గట్టిగా 'ఆడదానివి నీకు చాడువేమిటి?.....పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యక వెళ్ళు" అని కేక లేశాడు.
"నాన్న అంతేలే- ఏమైనా సరే -- నేను చదువుతానని పేచీ పెట్టి మరీ చదువు -- అంతకీ నాన్న ఒప్పుకోకపోతే నా దగ్గరకు వాచ్చేయ్యి. అక్కడ రాజమండ్రి లో ఆడపిల్లల చదువు కోసమని వీరేశలింగం గారు ఓ స్కూలు పెట్టారు. అందులో నిన్ను చదివిస్తాను."
"నిజంగా?"
"ఊ!"
"మరయితే మన ఇద్దరికీ అన్నం ఎవరు వండి పెడతారు?..."
"మీ పిన్నీ".....పిన్నా?" "ఊ!...."
"ఏదీ ? ఎక్కడ ఉంది ?"
"ఉంది . ఇదిగో ఈ కవరు లో ఉంది" అంటూ చేతిలో ఉన్న భక్త చింతా మణి పుస్తకం పేజీలు తిప్పి, ఆ పేజీల మధ్య వున్న సీల్డు కవరు చూపించాడు. ఒక్కమారు ఆ కవరు కేసి తేరిపార చూచి "భలేవాడిని బాబయ్యా" అంటూ మణి పకపకా నవ్వింది . గోపాలం కూడా నవ్వాడు.
కన్నానినంత మేర ఖాళీ పొలాలు కనిపిస్తున్నాయి. ఎండలకి ఎండి బీటలు వారుతున్న ఆ చేల మధ్య అక్కడక్కడ ఆకుమడులు ఎడారి మధ్య ఒయాసిస్సులు లాగ చల్లగా వున్నాయి కంటికి. ఒత్తుగా పచ్చగా వున్న ఆకుమడుల నుంచి చల్లని గాలి మెల్లగా వీస్తుంటే, ఆ గాలికి ఆకుమళ్ళ ఉపరి భాగం కెరటాలు కెరటాలుగా కదులుతూ చూడ్డాని కెంతో అందంగా వుంది. ఎర్రగా కుంకం ఆరబోసినట్లున్న పడమటి దిక్కున దూరంగా ఎర్ర కాగితం మీద వేసిన నల్లని కదిలే బొమ్మలా కదులుతూ ఆకుమళ్ళ కి కాబోలు ఏతాము తో నీళ్ళు తోడుతున్నారు ఎవరో.
అంతదూరంలో ఏతాము మీద చిత్రంగా కదులుతూ నల్లగా కనిపిస్తున్న రైతునీ, అతని వెనకాల ఆకాశం దిగువున కాల్చిన ఇనుప గుండులా ఖాణఖణ లాడుతున్న సూర్యుణ్ణి కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు గోపాలం. ఆకాశం మీద బారులు కట్టి గూళ్ళ కి యెగిరి పోతున్న పక్షుల్ని చూస్తూ వుండి పోయింది మణి.
ఇంతలో కిర్రు చెప్పుల చప్పుడు వినిపించి ఇద్దరూ అటు తిరిగి చూశారు. "అదుగో శేషయ్య మావ వస్తున్నాడు. నువ్వు గృహ ప్రవేశానికి రాలేదని మావయ్య కి కూడా కోపంగానే వుంది. అసలు నువ్వు రాజమండ్రి వచ్చి వారం రోజులయిందటగా ?" అంది మణి.
"ఎవరు చెప్పారు?"
"మావయ్యే చెప్పాడు నాన్నతో. గృహప్రవేశానికి ఎందుకు రాలేదో కాని రాజమండ్రి వచ్చి చాలా రోజులయిందని."
దాంతో అన్నయ్య కి ఎందుకంత కోపం వచ్చిందో గోపాలానికి అర్ధం అయింది. చల్లగా దగ్గిరికి చేరి ఈ శేషయ్య -- అన్నయ్య మనస్సు విరుస్తున్నాడన్న మాట ....ఈ శేషయ్య ఏం చెప్పకపోతే అన్నయ్య అలా ఎందు కుంటాడు?....ఎప్పుడేనా కోపం వస్తే గట్టిగా నాలుగు కేకలేసి ఊరుకొనేవాడు. కాని , ఇలా ఎప్పుడేనా పూర్తిగా మాట్లాడడం మానేశాడా?....దుర్మార్గుడు ఈ శేషయ్య తనకీ, అన్నయ్య కి మధ్యన తంపులు పెట్టాలని చూస్తున్నాడు. "లా" చదువదానికి వెళతానన్నప్పుడూ అంతే, అతి తెలివిగా మాట్లాడి అన్నయ్య కోపం ఎగదోశాడు. నవ్వుతూ మాట్లాడతాడు కాని, నిలువెల్లా విషమే!....
ఇంతలో శేషయ్య దగ్గరికి వచ్చి మసక వెలుగు లో గోపాలాన్ని చూసి "ఏం గోపాలం బాబూ! ఎప్పుడొచ్చావు ? గృహప్రవేశానికి రాలేదే.. నువ్వు రాలేదని మీ అన్నయ్య యెంత బాధ పడ్డాడో తెలుసా.......ఎంతమంది వచ్చిన నువ్వు రానిలోటు అలా కనిపించి పోయింది" అన్నాడు.
గోపాలం వ్యంగ్యంగా 'కనిపించకుండా ఎలా వుంటుంది , కావలసిన వాణ్ని అయాక. ఒకవేళ కనిపించకపోయినా కనిపించే లాగా చెయ్యగల పెద్దలు తమలాంటి వాళ్ళు ఉన్నారు" అన్నాను.
"అంటే."
"అంటే. తమర్ని అనవసరంగా మా విషయాల్లో జోక్యం కలిగించుకో వద్దని హెచ్చరిస్తున్నా. అంతే. వస్తా-- రా మణి. పోదాం" అంటూ విసావిసా వెళ్ళిపోయాడు గోపాలం.
గోపాలం ప్రవర్తన అర్ధం కాక శేషయ్య అలా విస్తుపోయి నిలబడి ఉండిపోయాడు వెళ్ళిపోయిన అతని కేసి చూస్తూ.
గోపాలం ఇంటికి వెళ్ళేటప్పటికీ రాజమండ్రి నుంచి టెలిగ్రాం వచ్చి ఉంది. రామనాధం గారికి సీరియస్ గా ఉండి వెంటనే బయలుదేరి రావలసింది అని . అది ఎప్పుడో ప్రొద్దుట వచ్చిన టెలిగ్రాం గురించి చెప్పి, అక్కడి నుంచి మెసెంజరు తెచ్చేటప్పటికి ఇంత ఆలస్యం అయింది. టెలిగ్రాము సంగతి అన్నయ్య కి, వదిన కి చెప్పి వెంటనే బయలు దేరాడు గోపాలం. శంకరం గాని, సావిత్రి గాని ఏం మాట్లాడలేదు. మౌనంగా తలవూపి ఊరుకున్నారు. గోపాలం వెళ్ళిపోయాక మాత్రం గట్టిగా నిట్టూర్చి ఒకరి కేసి ఒకరు చూసుకున్నారు.
