Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 16

                                    
                                    11

    స్టేషన్ కు వచ్చి సాగనంపుతున్న తల్లి మరీమరీ కళ్ళు తుడుచుకుంది. "అక్కడికి వెళ్ళాక అయినా తీరిగ్గా ఆలోచించుకో, అమ్మా, నీలో మార్పు కలిగితే సిగ్గుపడకు. ఉత్తరం వ్రాయి. వచ్చెయ్యి. కాస్త కన్నువిప్పి లోకంతీరు అర్ధం చేసుకో."
    రైలు కదిలిపోతూంటే బలరామయ్య నేత్రా లలో కూడా బాష్పబిందువులు ఉదయించడం శాంతి చూచింది. క్షణకాలం హృదయం కలుక్కుమంది. రైలు పరుగుతీసింది. దృశ్యాలు మారిపోయాయి. పచ్చని పొలాలు, నిండుగా నిలిచిన చెట్లు, పంటకాలువలు ఆమె కళా హృదయ నేత్రాలను ఆకర్షించి తమవైపు త్రిప్పుకున్నాయి. శ్రీహరి అన్నయ్యకు కోపం వచ్చిందనీ, తనతో సరిగ్గా మాట్లాడడనీ, మళ్ళీ తనకు దారిలో ఏమైనా బోధింపజూస్తాడనీ తలపోసింది. కాని ఆ మూడు అభిప్రాయాలలో ఒక్కటికూడా నిజం కాలేదు. ఎప్పటిలాగే శ్రీహరి చాలా సరదాగా, వాత్శాల్యపూర్వకంగా ప్రవర్తించాడు. చిన్నప్పటినుండీ కూడా శాంతికి తనకంటే రెండేళ్ళు మాత్రమే పెద్ద అయిన నారాయణ దగ్గరకంటే ఏడేళ్ళు పెద్దయిన పెద్దన్నయ్య శ్రీహరి దగ్గరే ఎక్కువ చనువు. ఆ ప్రేమాదరణలు ఈ సంఘటనలవల్ల కొంచెం తొణుకుతాయని శాంతి భయపడింది కాని అలా జరుగలేదు.
    హౌరా స్టేషన్ లో ట్రెయిన్ దిగుతూండగానే రాజా నవ్వుతూ స్వాగతమిచ్చాడు. కాని అతడిని చూస్తూండగానే శాంతీ, శ్రీహరీ చాలా ఆశ్చర్యపోయారు.
    "అలాగై పోయావేమిటి, రాజా? ఏమైనా సుస్తీ చేసిందా? నాకు వ్రాయలేదేం?" అనడిగాడు శ్రీహరి ఆశ్చర్యంగా, ఆత్రుతగా.
    "అబ్బే, లేదే! ఎలాగున్నాను?" ఆశ్చర్యంగా తిరిగి ప్రశ్నించాడు రాజా.
    "చాలా చిక్కారు" అంది శాంతి సాలోచనగా చూస్తూ.
    "పది రోజులయ్యాక చూస్తే అలా గన్పిస్తుందేమో!" బలవంతంగా నవ్వాడు రాజా. శ్రీహరి పరీక్షగా చూడడం మినహా ఇంకేం మాట్లాడలేదు. కారణం అతడికి తెలుసు.
    శాంతిని శాంతినికేతన్ లో చేర్చడానికి శ్రీహరితోబాటు రాజాకూడా వెళ్ళాడు. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ ముందే జరిగిపోయాయి. పూర్వంలాగే రాజా ఏమీ జరగనట్లే చాలా కలుపుగోపుతనంగా తిరగడం చూచిన అన్నాచెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. కాని ఇద్దరూ గ్రహించారు, రాజాలో పూర్వపు చలాకీతనం, హాస్యం మాయమై ఒక విధమైన గాంభీర్యం అతన్ని ఆవరించిందని. చాలా తూచి తూచి మాట్లాడుతున్నాడు. కూడా కూడా తిరగడమే కాని శాంతితో ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడడు. కాని అతడి సౌందర్యాన్నినుమడింప జేసి, వ్యక్తులను ఆకర్షించే ఆ స్నిగ్ధ చిరుదరహాసం మాత్రం పెదవులపై ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.
    శాంతిని విడిచివచ్చేముందు రాజా, శాంతి చేతికొక పుస్తకం అందించాడు. శ్రీహరి చూస్తూనే ఉన్నాడు. కాని ఏమీ మాట్లాడలేదు. ఏమాత్రం సంకోచం లేకుండా అందుకుంది శాంతి. 'ఫేర్వెల్, మై ఫ్రెండ్!' త్రిప్పిచూస్తూ "ఇందులో మీరేం వ్రాయలేదేం?" అనడిగింది.
    నీరసంగా నవ్వాడు రాజా. "అది మరిచి పోయే ఘట్టమైతే వ్రాయవలసిన అవసరం ఉంటుంది. కాని ఈ సంఘటనా సందర్భాలను మనమెవరమూ మరిచిపోలేము. సెలవు."
    "అన్నయ్యా!" మెల్లగా పలుకరించింది, శాంతి.
    "ఏమిటి?" అడిగాడు శ్రీహరి.
    "మీ అందర్నీ నొప్పిస్తున్నట్టు నాకు తెలుసు. కానీ క్షమించాలి" అంది మెల్లగా.
    "లేదు, శాంతీ." ప్రేమగా చెల్లెలి తల నిమిరాడు. "పెద్ధవాళ్ళం ఏదో ఆశపడ్డాం. అంతే నీమీద కోపంలేదు. నీ అభిప్రాయాలు నీవి. అంతే మనస్సులో ఏం పెట్టుకోకు. మళ్ళీ ఆదివారం వస్తానులే" అంటూ సాగిపోయాడు. వెళ్ళిపోతున్న ఆ ఇద్దర్నీ చూస్తూ నిలిచిన శాంతి నేత్రాలలో ముత్యాలవంటి రెండు బాష్పకణాలు నిలిచి మెల్ల మెల్లగా జారిపోయాయి.
    రాత్రి హాస్టల్ లో పడుకుని ఆ నవల ఆద్యంతం కుతూహలంగా చదివింది శాంతి. 'శేషేర్ కవిత' అనే టాగూర్ బెంగాలీ నవలకు ఆంగ్లానువాదం అది. లావణ్య అనే విద్యావతి, అమిత్ రాయ్ అనే బారిష్టర్ ల భగ్న ప్రణయగాధ. ఇద్దరి మధుర మంజుల ప్రేమకూ పాఠకుని హృదయం ఎంత ఆనందంగా నాట్యం చేస్తుందో, అటుపిమ్మట ఆ ప్రేమ భగ్న మైనాక ఆ యువతీ యువకుల హృదయ మధన చిత్రీకరణ అంత కదిలించివేస్తుంది. ఇద్దరూ స్నేహంగానే విడిపోతారు. తమ తమ స్వభావ వైరుధ్యం గుర్తిస్తారు. షిల్లాంగ్ కొండలపై కారు ప్రమాదంతో నాందీగీతాలాపన జరిగిన ఆ విశిష్ఠ స్నేహపరిచయాలకు మృదువైన మంగళగీతంతో భరతనాట్యం పలుకుతారు.
    ఎందుకో శాంతి మనస్సు చాలా బాధ పడింది. రాజా హృదయావేదన అంతా అందులో యిమిడి ఉన్నట్టు తోచింది. మాటలతో చెప్పకుండా తన మూగ బాధనంతనూ తద్వారా తెలియపరిచాడనుకున్న హృదయం జాలితో కరిగి పోయింది. కాని, ఏంచేయగలదు? తనకు వివాహంపై కోర్కె లేదు. ఎందుకో అటువంటి ఆలోచనలే జుగుప్సాకరంగా ఉంటాయి.
    మర్నాడు మనోరమ అనే అమ్మాయితో పరిచయమైంది శాంతికి. మనోరమ కూడా ఆంద్ర యువతే. ఆమె కళావిభాగంలో నృత్యసంగీతా లభ్యసిస్తూంది. శాంతీ, మనోరమా కలిసి మళ్ళీ విశ్వభారతి అంతా తిరిగి చూచారు. శాంతినికేతనంలో ఆ పరిసరాలలో ఉన్న సుందర ప్రకృతిలో తనను తానే మరిచింది శాంతి. ఆమె అంతరంగమంతా అనిర్వచనీయానందంతో చిందులువేసింది. శాంతినికేతనంలో విద్య నభ్యసిస్తూన్న తన జన్మ చరితార్దమైనదని మురిసింది. వేకువనే ప్రార్ధనా గీతాలతో నిద్రలేవడం, మౌన ప్రార్ధన, విద్యాభ్యాసం, తిరిగి ప్రార్ధన గీతాలతోనే దినచర్య ముగింపు. ఎంత ప్రత్యేకమైనది ఈ విద్యాభ్యాసం! ఎంత ఆనంద మయమైన దినచర్య! రవీంద్రుని జీవిత కాలంలో ఇంకా చాలా బాగుండేదట. అసలైన గురుకులంగా భాసించిందట. ఇప్పుడు అక్కడ కూడా అక్కడక్కడ నవ్యనాగరకతా చిహ్నాలు గోచరిస్తున్నాయి. కాలానుగుణమైన మార్పులు తప్పవు మరి!
    
                                       12

    "శ్రీహరీ!"
    పిలుపు నిన్న శ్రీహరి తలెత్తి చూచాడు.
    "రాజా!"
    "ఏం, ఆదివారంకూడా రావడానికి తీరిక లేకుండా ఉందా?" భుజంపై చరుస్తూవచ్చి దగ్గర కూర్చున్నాడు, రాజా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS