"డాక్టరు గారి తమ్ముడు వచ్చినట్టు లేదే! 'అంటూ ఆశ్చర్య పోతున్న జనం మొహాలు చూడలేక, "ఏవండీ తమ్ముడు గారు ఎందుకు రాలేదు?' అడిగే వాళ్ళకి సమాధానం ఏం చెప్పలేక , భారంగా నిట్టురుస్తూ , అంత మంది జనం లోనూ అవమానపడుతున్నట్లు కించపడసాగాడు శంకరం.
గృహప్రవేశం అయింది.
భోజనాలు అయ్యాయి.
వచ్చిన స్నేహితులు , అతిదులూ ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. వాన కురిసి వెలిసినట్లు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అలసిపోయాను ధ్యాన అయినా లేకుండా. ఆరోజు కూడా అడపా దడపా వస్తూన్న రోగుల్ని పరీక్షిస్తూ , రోజులాగే ఆరోజు కూడా "రాత్రి జట్కా తీసుకురా, పోరుగూళ్ళ కి వెళ్లి మామూలుగా రోగుల్ని చూడాలి' అని సుబ్బడికి ఆదేశిస్తున్నాడు శంకరం. అది విని శేషయ్య "ఇవాల్టి కి పోరుగూళ్ళు వెళ్ళడం మానేసి విశ్రాంతి తీసుకో కూడదు?" అని అన్నాడు.
శంకరం పొడిగా నవ్వి "విశ్రాంతి అంటే ఎలా?.....అవతల జబ్బో?" అన్నాడు.
"అబ్బ! మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏం ఒపికండి .....రాత్రి ఒంటి గంటా రెండు ఆయె దాకా అన్నిఊళ్లూ తిరిగి పేషెంట్స్ అందరినీ చూసి వస్తారు. రాత్రి తెల్లవార్లూ చుట్టూ పక్కల ఓ పల్లె నుంచి ఓ పల్లె కు వెళుతున్న మీ జట్కా చప్పుడు చెవుల్లో సన్నగా వినిపిస్తూ , బండికి కట్టిన లాంతరు దూరం నుంచి మినుకు మినుకు మని కనిపిస్తూనే ఉంటుంది. డాక్టరు బండి వచ్చిందంటే రెండు అయిందన్న మాట అనుకుంటూ ఉంటాం-- మీకు తగ్గవాళ్ళే ఆ గుర్రమూ, సుబ్బడూనూ . మీతో పాటు సమానంగా పోకపు చెక్క అరిగినట్లు అరుగుతున్నారు" అన్నాడు శేషయ్య.
శంకరం ఏం సమాధానం చెప్పలేదు. నవ్వి ఊరుకున్నాడు.
కొత్తగా ప్రవేశించిన ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.పచ్చి తోరణాలు పసుపు గడపలు కొత్త సున్నం సిమ్మెంటు , తలపులకి వేసిన వార్నిషు . వాసనలతో గుప్పుమంటూ ఉంది.
గృహప్రవేశం హడావిడి అయిపొయింది.
గోపాలం మాత్రం ఇంకా రాలేదు.
ఇంక వచ్చేదేమిటి అని అంతా నిరాశ చేసుకున్న తర్వాత , ఇంకో గంటకి చీకటి పడుతుందనగా సాయంత్రం సమయంలో , వీధి కటకటాల్లో కూర్చుని శంకరం పడక కుర్చీలో విశ్రాంతి తీసుకుంటూండగా గోపాలం ఆదరా బాదరా వచ్చాడు. ఒడిలిన తోరనాలూ, గుమ్మం ముందు చిందర వందరగా పడి ఉన్న కుర్చీలూ, బెంచీలు, రోడ్డు పక్కని పెంట మీద పడి వున్న పెద్ద పుల్లి విస్తరాకుల గుట్ట .దూరం నుంచే గృహప్రవేశం హడావిడి పరిసమాప్తం అయిందని చెపుతున్నాయి. అరుగు చివర కూర్చుని కొత్త తాటాకు బొమ్మకి కాటుకా బొట్టూ దిద్దుతోంది మణి. దగ్గరో నిలబడి వాసు చూస్తున్నాడు. రెండేళ్ళ క్రితం తను చూసినప్పటి కంటే ఇద్దరూ బాగా ఎదిగారు. ఎనిమిదేళ్ళ మణి పన్నెండేళ్ళ పిల్లలా అనుతోంది. పద్నాలుగు పదిహేనేళ్ళ వయసులో ఉన్నాడేమో శరీరం బాగా సాగి నునుపు దేరి పచ్చని ముఖం మీద అప్పుడప్పుడే రూపు కడుతూన్న మీస కట్టుతో ఆకర్షణీయంగా ఉన్నాడు వాసు. బొమ్మల హడావిడి లో ఉండి తనని చూడలేదని భావించి "మణీ!" అని కేకేశాడు గోపాలం. ఉలిక్కిపడి తలెత్తి చూసీ, వెంటనే బొమ్మా , అవీ ఎక్కడి వక్కడ పడేసి చెంగున బాబయ్య దగ్గరికి పేరిగేత్తుకు రాబోయింది. కాని ఇంతలోనే మనస్సు మార్చుకుని, తిరిగి తల వంచుకుని తన పనిలో తాను నిమగ్నం అయిపొయింది.
గోపాలం నవ్వుకున్నాడు.
"ఏం వాసూ!....కులాసాగా ఉన్నావా?....అన్నట్టు మెట్రిక్ చదువు ఎంతదాకా వచ్చింది ! అంటూ పలకరించాడు వాసుని.
"పరీక్షలు రాశాను" అన్నట్టు తల ఊపాడు.
"ఎప్పుడు , యీ ఏడా?"
"ఊ!"
"చప్పుని ఆ బొమ్మలూ, అవీ కట్టిపెట్టి లోపలికి రా మణి ....నీకు మద్రాసు నుంచి బిస్కెట్లూ, మంచి బొమ్మలూ తెచ్చాను" అంటూ ముందుకు కదిలాడు. వెనకాల నుంచి కోపంగా నాలిక ఇవతల పెట్టి వెక్కిరిస్తున్న మణిని గమనించకుండా.
వీధి కటకటాల్లో నే కనిపించాడు అన్నయ్య.
పడక కుర్చీలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. తన రాకని గమనించినట్లు లేదు. గృహప్రవేశం సమయానికి తను రానందుకు ఏం కోపం వచ్చిందో ఏమో -- అన్నయ్య ఇటు చూడడం లేదు. పలకరించడం లేదు. తనయి ముందుగా ఏమని పలకరించడం ?...ఏం చెయ్యడానికి తోచడం లేదు. నిశ్శబ్దంగా నిలబడి ఉంటె పైకి వినిపించే టంత శబ్దంతో గబగబా గుండెలు కొట్టుకుంటున్నాయి. అలా తను ఎంత సేపని నుంచునేటట్లు ?
కాస్సేపు చూసి కావాలని చిన్నగా దగ్గాడు గోపాలం.
శంకరం తలఎత్తి చూశాడు.
నిశితంగా గోపాలం ముఖం లోకి చూశాడు.
ఆ చూపులో "వచ్చావా?' అన్న పలకరింపు లేదు. "ఏం పొద్దున్న ముహూర్తం టైము కి రాలేదేం?" అన్న గదమాయింపు లేదు -- రా, కులాసాగా ఉన్నావా" అన్న ఆదరణ లేదు. "ఏం , ఆరోజు "లా" యే చదువుతాను అని మొరాయించి వెళ్లి పోయావెం? ఇన్నాళ్ళ కి కనిపించిందా మళ్ళీ ఇల్లు? అనే ఎత్తి పొడుపు లేదు.
ఏం లేదు.
ఆ చూపులో ఏ భావమూ లేదు.
గోపాలం భయపడ్డాడు. "ఏరా-- ఎందుకు రాలేదు.?.... ముందుగా రాకుండా ముహూర్తం అయిపోయాక ఇప్పుడు వచ్చావేమిటి ?" అని గట్టిగా చివాట్లు పెట్టి కేకలేస్తాడు, 'అప్పుడు జరిగిన పొరపాటు ఇది, నేను పిఠాపురం లో ఉండగానే కవరు రాజమండ్రి వెళ్ళింది. రామనాధం గారికి కవరులో ఉన్న సంగతులు తెలియక నేను వచ్చే దాకా తన దగ్గరే పెట్టుక్కూర్చున్నారు. ఇవాళ పది గంటల పొద్దు ఎక్కాక కాని నేను నీ కవరు చూచుకోలేదు . చూసి, జరిగిన పొరపాటు కి బాధపడుతూ గుండెలు గతుక్కుంటూ బయలుదేరాను" అని సంజాయిషీ చెప్పవచ్చు అని గోపాలం ఆలోచించాడేమో, ఇప్పుడు శంకరం అలా ఏం కేకలు వెయ్యకుండా నిర్లిప్తంగా కూర్చోవడం తో గోపాలం పని ఇరుకున పడింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవడం ఎలా?...జరిగిన సంగతిని చెప్పడం ఎలా ?..... అడక్కుండా తనంతట తానై "జరిగింది ఏవిటంటే......" అంటూ మొదలెట్టాడనుకో, ఇదేదో కల్పిస్తున్నానని అనుకోడూ?
మరి ఏవిటి చేసేటట్టూ?
తనే ముందు పలకరిస్తే !.......ఏవని ?....కులాసాగా ఉన్నావా? అనా? .... అది ఎంత అసంబద్ధంగా ఉంటుంది ?.....పోనీ గృహప్రవేశం సలక్షణంగా జరిగిందా ?....అంటే -- తను ఇప్పుడొచ్చి ఈ ప్రశ్న వేస్తె హేళనగా అడిగినట్లు ఉండదూ?........
చాలా ఇబ్బందిగా ఉంది గోపాలం పరిస్థితి. తనయి ముందుగా ఏం మాట్లాడినా అగ్ని పర్వతం లా నిశ్శబ్దంగా ఉన్న అన్నయ్య లోంచి నిప్పులు వర్షించేలాగ ఉన్నాయి. అందుకే ఏం చెయ్యడానికి తోచక, వచ్చిన వాడు వచ్చినట్లు ఆ మట్టునే నిశ్శబ్దంగా తల వంచుకొని నిలబడి ఉన్నాడు గోపాలం. కాస్సేపు గోపాలం కేసి నిశితంగా చూసి ఆ తర్వాత తల తిప్పుకుని, ఇంకో పక్కకు చూస్తూ కూర్చున్నాడు శంకరం.
నిమిషాలు కొండలు మూసుకు నడుస్తున్నట్లు అతి భారంగా కదులుతున్నాయి. ఈలోగా ఒకటి రెండు మాట్లు తలఎత్తి అన్నయ్య కేసి చూశాడు గోపాలం. స్థాణువు లా చలనం లేకుండా కూచున్నాడు శంకరం ఎటో చూస్తూ. ఇది కాదని, అన్నయ్యని ఏదో ఒక విధంగా పలకరిద్దామని పెదిమలు కదిల్చాడు గోపాలం. కాని గొంతు దాటి మాట బైటికి రాలేదు. చివరకి ఎలా గయితేనేం ప్రయత్నం చేసి గొంతుక స్వాధీనం చేసుకొని, ఉత్తి నోటినే ఓమారు గుటక వేసి, "అన్నయ్య" అన్నాడు గోపాలం.
చట్టున గోపాలం కేసి ముఖం తిప్పి చూశాడు శంకరం.
గోపాలం ఎదో చెప్పబోయాడు.
చివాలున లేచి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శంకరం.
గోపాలం మనస్సు చివుక్కుమంది దాంతో -- తల పంకించి, పౌరుషం వచ్చి "సరే!" అని మనసులో అనుకున్నాడు. "గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోతే!" అని ఒక్క క్షణం అనిపించింది. కాని, వెంటనే అలా చేస్తే కుర్రతనంగా ఉంటుంది అని తమాయించుకుని ఆగాడు.
అన్నయ్య కోపం ఎప్పుడు లేంది?
ఏ మాత్రం తప్పు కనిపించినా పేగులు తెగేటట్లు కేకలేస్తాడు ఎటొచ్చీ ఇప్పుడు కేకల రూపంలో కాకుండా మరో రూపంలో తన కోపాన్ని చూపించాడు అంతే -- అన్నయ్య కాకపోతే వదినేనా తనని సరిగా అర్ధం చేసుకుంటుంది . తను చెప్పేది సానుభూతి తో వింటుంది.
ఇలా అనుకుంటూ గోపాలం వంటింట్లో కి నడిచాడు.
చాకలి కీ, పని మనిషి కీ నౌకర్ల కీ డాక్టర్ల కీ బూరె లూ, కూరలు అన్నం బుట్టలలో సర్ది పెట్టుబడులు పెట్టె హడావిడి లో , పెట్టుకున్న కుంకం బొట్టు చెమట కి కరిగి పోయి, తలంటుకొన్న జుత్తు చిందర వందరగా రేగిపోయి, కట్టుకున్న పట్టు చీర మడతలునలిగి పోయి, వదిన ఎంతో బడలిక చెందినట్లు అనిపించింది గోపాలానికి. పని హడావిడి లో వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడ్డ మరిదిని చూసుకొనే లేదు సావిత్రి. కొంచెం సేపు ఆగి "వదినా అన్నాడు గోపాలం నెమ్మదిగా --
సావిత్రి ఉలిక్కిపడి తలఎత్తి చూసింది.
ఆమె ముఖంలో ఒక్క క్షణం నల్లని విషాద మేఘం ఒకటి కనిపించి మాయం అయింది.
"ఎంతసేపయింది వచ్చి" అంది.
ఆ పలకరింపు లో పూర్వపు ఆర్ద్రత కాని, ఆప్యాయత కాని కనిపించలేదు గోపాలానికి. అలా పలకరించి సమాధానం కోసం వేచి ఉండకుండా తిరిగి తన పెట్టుబళ్ళ హడావిడి లో పడిపోయింది సావిత్రి. అన్నయ్యే కాకుండా వదిన కూడా నిర్లిప్తంగా నూ ముభావంగానూ ఉండడంతో గోపాలానికి అర్ధం అయింది ఇదేదో అసాధారణ పరిస్థితిలో పడింది కాని సామాన్యమైన మామూలు పద్దతిలో లేదు అని. తను రానందుకు బహుశా కోపం వచ్చి పొద్దున్న బాగా కేకలేసి ఉంటాడు అన్నయ్య.
"ఏం వదినా?....అన్నయ్య కేక వేశాడా నేను రాలేదని ?" అని అడిగాడు గోపాలం.
అతని ప్రశ్నకి సమాధానం ఇయ్యడం ఇష్టం లేక, "ఎప్పుడు బయలుదేరావు రాజమండ్రి లో- భోజనం చేశావా?' అంటూ తప్పిస్తూ అడిగింది సావిత్రి. వదిన అంతర్యం అర్ధం అయింది గోపాలానికి. వదిన కూడాతనను సరిగా అర్ధం చేసుకోలేదా .?.... గోపాలం ప్రాణం విలవిల్లాడింది. తన నిర్ధిషిత్వాన్ని వదిన కెనా చెబితే తన సంజాయిషీ నీ ఆమె అయినా వింటే తనకి తృప్తి.
అందుకే "అసలు ఎవైందంటే ..." అంటూ మొదలెట్టబోయాడు కాని సావిత్రి అతన్నేం చెప్పనీయకుండా "భోజనం చేసినట్టు లేదు మొహం నీరసించి ఉంది. లే -- అన్నం పెడతాను" అంది.
"ఏదీ కాని వేళ ఇప్పుడేవిటి?....పైగా నేను మధ్యాహ్నం భోజనం చేసే బయలు డేరా "-
"అయితే సరే ' అంటూ ఇంకో పని మీద అక్కడి నుంచి కదిలి వెళ్ళబోయింది.
"వెళ్ళిపోకు వదినా-- నేను గృహప్రవేశానికి ఎందుకు రాలేక పోయానోనంటే ........"
"నాయనా-- ఇప్పుడవన్నీ ఎందుకు? రాలేదేం అని నిన్నేవరేనా నిలదీశారు కనుకనా ?.....జరిగిందేదో జరిగిపోయింది?...ఇప్పుడవన్నీ ఎందుకు ఎవరంతటి వాళ్ళు వాళ్ళు -- వస్తా -- నాకవతల పనుంది " అంటూ వెళ్ళిపోయింది.
