శాంతి అప్పుడూ మాట్లాడలేదు. కాని ఆ చిత్రాలను తీసి తిరిగి మౌనంగా బాగ్ లో ఉంచింది.
"మనస్ఫూర్తిగానే తీసుకున్నారా?" అడిగాడు రాజా.
నవ్వింది శాంతి, "హృదయపూర్వకంగా" అంటూ.
"అయితే ఉండండి." లేచి లోపలికి వెళ్ళాడు రాజా. వస్తూ మరొక చిత్రం అందించాడు శాంతికి. ఆత్రుతగా కవరు తొలగించి చూచింది. ముఖంలో భావాలు మారనివ్వకుండా రాజా వైపు చూచింది.
అతడు ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. "మనం శాంతినికేతన్ వెళ్ళిననాటి మీ రూపం నా మనస్సులో హత్తుకుపోయింది. తిరిగివచ్చిన రాత్రే చిత్రించాను" అంటూ వెళ్ళి కిటికీదగ్గర నిల్చున్నాడు.
ఒకరి భావావేశాలు ఒకరు తిలకించరాదనే అతడలా దూరంగా వెళ్ళిపోయాడని గ్రహించింది శాంతి. ఆ చిత్రం ఇవ్వటంలో అతడి ఉద్దేశ్యమేమిటో బోధపడుతూనే ఉంది. అతడి పవిత్ర హృదయనివేదన గర్భితమై ఉంది ఆ చిత్రాల బహూకరణలో.ఆ నివేదన నందుకోగల స్థితిలో తన హృదయం లేదు. ఫలితంగా అతడి హృదయంలో అశాంతి ఏర్పడుతుందనడానికి సందేహం లేదు. ఆ అశాంతి నణచగల శక్తీ లేదు, అవసరమూ లేదు తనకు. కాని దానిని స్వీకరించి తాత్కాలికోపశమనం కల్పించడం కనీసధర్మం. ఆలోచిస్తూ మెల్లగా అదికూడా భద్రపరిచింది.
అలా మౌనంగా కొంతఃసేపు గడిచింది. అంతలో శ్రీహరి వచ్చాడు. అతడిని చూచి రాజా కిటికీ దగ్గరినుండి వచ్చి కూర్చున్నాడు.
తలవాల్చి కూర్చున్న శాంతి, "వెళ్దామా, అన్నయ్యా?" అనడిగింది.
"ఊఁ. మాట్లాడావా, రాజాతో?"
శాంతి సమాధానం ఇవ్వలేదు. శ్రీహరి జవాబు ఆశించలేదు కూడా. రాజా డ్రింకులు కలిపి ఇచ్చాడు. మౌనంగా స్వీకరించారు. సంభాషణ సాగడంలేదు. శ్రీహరి ఎంతకూ కదలక పోవడంతో అతడు బహుశః రాజాతో ఏదో అనవసరంగా మాట్లాడాలనుకుంటున్నాడని భావించిన శాంతి మెల్లగా లేచి వరండాలోకి వెళ్ళింది. పూలమొక్కలు చూస్తూ స్తంభాన్నానుకొని నిల్చుంది. అప్రయత్నంగానే లోపల జరిగే సంభాషణ ఆమె చెవులను తాకింది.
"ఏమంటుంది, శాంతి?" అడిగాడు శ్రీహరి.
"వెళ్ళుతున్నానని చెప్పింది."
"అంతేనా? నువ్వేమీ కదపలేదా? ఆ యాషతోనే నేను వెళ్ళిపోయాను. ఎందు కిష్టంలేదో అడగలేదా, నువ్వు?"
"లేదు, శ్రీహరీ. క్షమించు. నీ ఉద్దేశ్యం గ్రహించాను. నీకు నాపైగల ప్రేమ గౌరవాలు మరిచిపోలేను. కాని శాంతి మనస్సు శిరీష కుసుమకోమలం. ఆమెను అనవసర వాదాలతో నొప్పించలేను. మనమేదో ఆశపడ్డాం. భగవంతుడు అనుకూలించలేదు."
"ఊఁ." నీరసంగా మూలిగాడు శ్రీహరి. "మరైతే వెళ్తాం. మళ్ళీ వారాని కొచ్చేద్డామను కుంటున్నాను."
"ఆగు. నేనుకూడా వస్తాను."
"నువ్వా?" శ్రీహరి గొంతు. "వద్దు, రాజా, ఇక్కడికి నిన్ను చిన్నబుచ్చినది చాలు. మరి వద్దు. నువ్వు శ్రమపడకు."
"శ్రీహరీ!" భుజం తట్టాడు రాజా. "ఏమిటోయ్, ఇది? ఫలిత మెలా ఉన్నా మన స్నేహం పాడవ్వకూడదని నువ్వేగా అన్నావు? ఈమధ్య జరిగింది మరిచిపో. మనం ఎప్పుడూ స్నేహితులమే."
"సరే, నీ ఇష్టం. నీలాంటి వ్యక్తితో బంధుత్వం కలుపుకోలేకపొతున్నాను." బాధ ధ్వనించింది, శ్రీహరి గొంతులో.
రాజా నమ్రప్రవర్తనకూ, కలుపుగోలు తనానికీ బలరామయ్యా, లక్ష్మీదేవమ్మా ముగ్ధులు కావడంకంటే, అతడిని తమవాడిగా చేసుకోలేక పోయామని మూగగా బాధపడ్డారు. సాయం కాలం ట్రెయినెక్కేవరకూ వారితోనే ఉండిపోయాడు రాజా. ముభావంగా ఉన్న శ్రీహరిని అనేక విధాలుగా సంతోషపెట్టాలని చూచాడు. వెళ్ళేముందు పద్మతో, "నమస్కారం, అక్కగారూ. తిరిగి చాలా రోజులకు కలుసుకుంటా మేమో" అన్నాడు. పద్మ హృదయం కలుక్కుమంది. శాంతి చాలా మూర్ఖురాలనిపించింది. అంతటి ఉత్తముడిని అల్లుడుగా పొందలేక పోయాననే బాధ లక్ష్మీదేవి వదనంలో ప్రస్ఫుటమైంది. బలరామయ్య ఏ బావమూ ప్రదర్శించకుండా గంభీరంగా ఉండిపోయాడు.
కదిలిపోయే రైలునుంచి, "నమస్తే" అంది శాంతి రాజా నుద్దేశించి.
"నమస్తే." నిర్మల వదనంతో మర్యాదగా తిరిగి రెండు చేతులూ జోడించాడు, రాజా.
10
శాంతివనంలో అడుగు పెట్టిన శాంతి పర్వం మరిచిపోయింది. శాంతినిలయంలో గదులవెంబడి, శాంతివనంలో చెట్లవెంబడి పరుగులెట్టి ఆడుతూ పాడుతూ పరవశించి పోయింది. నదీ విహారాలలో తన్మయమయి పోయింది. తన శాంతినికేతన్ ప్రయాణానికి అన్నీ సర్దుకోసాగింది. బట్టలు సర్దుకునేటప్పుడు ఆ గులాబీరంగు షిఫాన్ చీర చూడగానే ఈ నాలుగు రోజులనుండీ మరవు తగిలిన రాజా స్మృతిపథంలో మేల్కొన్నాడు. తెల్లటి దుస్తులు ధరించినప్పుడెల్లా శాంతినికేతన్ వెళ్ళడమూ, రాజా హాస్యలూ గుర్తుకువస్తాయి. తన గదిలో కూర్చుని సూర్యోదయ, సూర్యాస్తమయాలను తిలకించుతూంటే ఎందుకో రాజా విగ్రహం పదే పదే కళ్ళెదుట నిలిచేది. 'రెండు మూడు నెలలు సన్నిహితంగా ఉండడంవల్ల' అవి సరిపెట్టుకుంది. రాధాకృష్ణుల చిత్రం చూచినప్పుడెల్లా దానికి వన్నెలు తీర్చిదిద్దిన రాజా నేత్రాలలో నాట్యమాడేవాడు.
"ఆ రాధా మాధవ చిత్రాన్నిక్కడుంచెయ్యమ్మా" అంది తల్లి, అన్నీ సర్దుకుంటూన్న శాంతిని.
'అలాగే' అనబోయిన శాంతి తిరిగి మాట వెనక్కు తీసుకుంది. ఎందుకో రాజా దిద్దిన రాధా మాధవుల్ని - రాజాతో పరిచయం చేసిన రాధామాధవుల్ని - ప్రత్యేకంగా తన దగ్గరే పదిలపరుచుకోవాలన్పించింది. "ఇదివరకు వేసిన కొన్ని బొమ్మ లుంచేస్తున్నానమ్మా. రాధామాధవుల్ని నేను తీసుకుపోతాను" అంది. తల్లి మరి మాట్లాడలేదు.
ఒక రోజు శ్రీహరితో పట్నంవెళ్ళి కావలసిన దుస్తులూ, జోళ్ళూ అన్నీ కొనుక్కు తెచ్చుకొంది.
మర్నాడే ప్రయాణం. ఆ సాయంత్రం తల్లీ, వదినా ప్రయాణానికి కావలసినవన్నీ సర్దుతున్నారు. శ్రీహరి ముభావంగా ఒక చోట కూర్చున్నాడు. శాంతి ఇవతలకు వచ్చి తోటలో తిరుగాడసాగింది. తన కిష్టమైన శాంతి వృక్షాల వద్ద పరధ్యానంగా కూర్చుని ఉన్నాడు బలరామయ్య. మెల్లగా దగ్గరకు వెళ్ళి కూర్చుంది శాంతి.
"అన్నీ సర్దుకున్నావా అమ్మా?" అన్నాడు శాంతివైపు తిరిగి.
తల ఊపింది శాంతి. క్రమంగా మాటల సందడిలో చీకటి పడింది.
"అక్కడికి వెళ్ళాక రెండు రోజులకో ఉత్తరం వ్రాయాలమ్మా. వ్రాయగలవా?"
అతడెంత దిగులుగా అడిగాడో అంత ఉత్సాహంగా చెప్పింది శాంతి: "మీరు కావాలంటే రోజుకో ఉత్తరం వ్రాస్తాను, నాన్నా."
బలరామయ్య మాట్లాడలేదు. మళ్ళీ కాస్సేపటికి అన్నాడు: "చూడు, శాంతీ. ఈ కొబ్బరీ, ఈ పారిజాతమూ నువ్వు పుట్టినప్పుడే పుట్టాయి. మీరు ముగ్గురూ కవలలు" అని, శాంతిదెస చూస్తూ.
అందరికీ తెలిసిన ఆ అతి పాత విషయం క్రొత్తదిగా తండ్రి తనకెందుకు చెబుతున్నాడో తెలియక శాంతి ఆ రెండు చెట్లనూ పరీక్షగా చూచింది. కొబ్బరిచెట్టునిండా కాయలు. ముదిరి పసుపువన్నెకు తిరుగుతున్నాయి గెలలు. మళ్ళీ క్రొత్త వెన్ను వేస్తున్నాయి, వాటిని చెట్టునుండి విడదీసి, ఏ విదేశీయుడికో చూపిస్తే అందమైన దంతం తయారీ అనుకొంటాడు కాని వృక్షసంబంధమని నమ్మడు. కొద్ది దూరంలో పారిజాతం విరబూసి ఉన్నది. తండ్రి ఎదలో భావం చూచాయగా అర్ధమైంది శాంతికి.
"అయితే, నామాట కాదనలేక అంగీకరించావా, నాన్నా? నన్ను మనస్ఫూర్తిగా పంపటం లేదా మీరు?" తండ్రి ముఖంలోకి చూస్తూ మందస్వరంతో అడిగింది.
నీరసంగా నవ్వాడు బలరామయ్య. "ఆ ప్రశ్న కసలు ఆస్కారం లేదమ్మా. నా జీవితంలో శాంతి సృష్టించటానికే నువ్వు పుట్టావు. నీ కోరిక తీర్చడానికే ఈ తండ్రి. నీ అభిప్రాయాలను వ్యాఖ్యానించటంగానీ, నీ కోరికలకు ఆటంకం కలిగించటం గానీ ఈ తండ్రి చెయ్యడమ్మా" అన్నాడు, కూతురు తల నిమురుతూ. గొంతులో ఎక్కడో విషాదం ధ్వనించింది. ఆ తండ్రీ కూతుళ్ళ అపూర్వ సంబంధాన్నాశీర్వదిస్తున్నట్లు పారిజాతంమీద పూలు వర్షించింది.
లేచి మెల్లగా నదివైపు నడక సాగించారు. ఆషాఢమాసం. నది వరదతో పరవళ్ళు త్రొక్కుతూంది. రెండు రోజులనుండి వానలు లేకపోవటం వల్ల నదీతీరంలో ఇసుక పొడిపొడిగానే ఉంది. గట్టువెంబడే చాలాదూరం నడిచి ఒక చోట కూర్చున్నారు. పగలంతా చేపలవేట సాగించి జాలరుల గృహోన్ముఖులయ్యారు. నదిలో నాలుగైదు పడవలు ప్రయాణం చేస్తున్నాయి. తీరస్థంగా లంగరువేసి ఆపిన ఒక పడవలోని స్త్రీ వంట చేస్తూంది. సరంగు హాయిగా చుట్ట కాల్చుకొంటూ పల్లెదనం అందుకున్నాడు. 'నదిలో తేలుతూన్న పడవపై నిశ్చింతగా పడుకుని ఆకాశంలోకి చూస్తూ పాడుకోగల అదృష్ట వంతుడు! ఈ జీవికిగల తృప్తి ఇంకెవరికైనా ఉంటుందా జీవితంలో? అలా నదిలో ఒక్క త్తెనూ పడవ నడుపుకుంటూ రాత్రింబవళ్ళూ ఉండిపోగలిగితే?' శాంతి మధురభావాలు ఆ పడవమనిషి భార్య గొంతు కంచుగంటలా పలకడంతో చెదిరిపోయాయి. "ఏటి సేద్దారి మావాఁ మరి? రేపు యజమాని వొత్తాడు గద?"
"ఏటే, రంగీ?" పరాగ్గా అడిగాడు, సరంగు.
"రాబడి సూత్తే దమ్మిడి మిగలడల్లేదూ. రేపు యజమాని అప్పు తీర్చమని వచ్చి నిల్చుంటాడూ. ఏటి చేత్తావని అడుగుతున్నాను." నొక్కి నొక్కి పలుకుతూ విసుగ్గా అరిచింది, రంగి.
చుట్ట విసిరేసి లేచి కూర్చున్నాడు, సరంగు. "రెక్కలు ముక్కలు చేసుకు సంపాదించిందంతా పొట్టకూటికే సాలటంలేదు. రెండొందలప్పు! ఎట్ట దీర్చేదో పాలుపోవటంలేదు. ఏం జేయను? వత్తాడు, నిట్టురమాడిపోతాడు. దయిద్రపు జలమలు. ఏటికి పుట్టించినాడో బగమంతుడు!"
వింటూన్న శాంతికి కంపరమెత్తింది. "ఇక వెళదాం, నాన్నా?" అంటూ నిల్చుంది, అప్పుడే దర్శనమిచ్చిన తదియ చంద్రుడిని చూస్తూ. అంతలో రంగి దృష్టి శాంతిమీద పడింది. ముట్టుకుంటే కందిపోయేట్టున్న పసిమిచ్చాయ. గాలి వీస్తే ఎగిరిపోయేట్టున్న నాజూకు తనూ వల్లరి. అందుకు తగినట్లున్న అపురూపమైన దుస్తులు, నగలు. రెప్పార్పకుండా చూచింది.
'ఎంతదుష్టమంతురాలు!' అనుకొంటున్న ట్టున్నాయి ఆ చూపులు.
ఆ భావం పసిగట్టిన శాంతి నిర్లిప్తంగా నవ్వుకుంది. 'దూరపు కొండలు!'
తండ్రీ కూతుళ్ళు గృహోన్ముఖులయ్యారు. నలుదెసలా చీకట్లు ముసురుకున్నాయి. తదియ చంద్రుడు మెల్లగా ఆకసంలో ఎగబ్రాకుతున్నాడు. శాంతివనం చేరేసరికి రాత్రి ఏడు గంటలైంది. వారు ఇంటికి రాగానే అందరూ భోజనాలకు కూర్చున్నారు. వాతావరణం చాలా స్తబ్ధంగా ఉంది.
బలరామయ్య అన్నాడు: "రెండు వారాల కోసారైనా శాంతిని చూచి వస్తూండు, అబ్బాయీ. తరుచు ఉత్తరాలు వ్రాస్తూండు."
"అలాగే, నాన్నా. కాని తరుచు తనదగ్గరకు రావడం శాంతి కిష్టముంటుందో లేదో?"
అన్నం కలుపుతూన్న శాంతి చటుక్కున తలెత్తింది. "అదేమన్నయ్యా, అంత నిష్టురంగా మాట్లాడుతావు?"
"నిష్టురం కాదే. ఇక్కడేదో ప్రశాంతత లోపించినట్టు నువ్వు మా అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నావు. నాన్న లోలోపల ఎంత బాధ పడుతున్నారో అనైనా ఆలోచించావా? అటు వంటి నీకు మరి నేను అస్తమానూ రావడం ఇష్టముంటుందా?"
శాంతి ఏదో అనేలోపల బలరామయ్య తీవ్రంగా కొడుకును మందలించాడు. "కట్టిపెట్టరా, అధికప్రసంగం, నువ్వూనూ, నేను మనస్ఫూర్తిగా పంపుతున్నాను. నాకే బెంగా లేదు."
అంతటితో సంభాషణ ఆగిపోయింది.
