Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 16


    మధ్యాహ్నం ఒంటిగంటకు ఓ స్థలంలో ఆగారందరూ. అక్కడ చెట్లనీడలో భోజనాలు ఏర్పాటు చేశారు. పెళ్ళివారి ప్రయాణం చాలా సందడిగా తయారయిందా ప్రాంతం. భోజనాలు ముగించాక మళ్ళీ ప్రయాణం ప్రారంభమయింది.
    ఆ రాత్రికి అందరూ ఓ టౌన్ లోని హోటల్లో ఉండిపోయారు. మళ్ళీ ఉదయమే ప్రయాణం ప్రారంభమయింది. మధ్యాహ్నం రెండవుతుండగా అడవిలోకి ప్రవేశించినయ్ బస్సులు.అప్పటికే వెలుతురు తగ్గిపోయికీచుమంటూ భయం గొలుపుతోంది ఆ ప్రదేశమంతా.
    మరికొద్దిసేపట్లో టి.బి. ముందాగినయ్ బస్సులు. టి.బి. ప్రక్కనే ప్రొడక్షన్ వాళ్ళ కాటేజీలున్నాయి.
    బస్సు దిగి చుట్టూ చూస్తూ నిలబడింది చంద్రిక. ఆ దృశ్యం ఆమె కెంతో ఆనందం కలిగిస్తోంది. ఇంతకు ముందెప్పుడూ చూడని దృశ్యం.
    "అబ్బ! సిటీనుంచి అడవిలో అడుగుపెట్టేసరికి ఎంత ఆహ్లాదంగా వుందో చూశారా!" ఆమె ప్రక్కనే నిలబడి అన్నాడు ప్రేమ్ కుమార్.
    "అవునండీ! అసలు అడవిలోకి రావడం ఇదేమొదటిసారి నాకు. ఇంత బావుంటుందని తెలీదు" చెప్పిందామె.
    "నిజంగానే ఇలాంటి అవుట్ డోర్ లకు రావడంమంచి అవకాశమే!" చుట్టూ చూస్తూ అన్నాడతను.
    ప్రొడక్షన్ మేనేజర్ శర్మ హడావిడిగా వచ్చాడు అక్కడికి.
    "టి.బి.లోని నాలుగుగదులు ప్రేమ్ కుమార్ గారికీ, చంద్రిక గారికీ, భానుగారికీ, డైరెక్టరు గారికి ఎలాట్ చేశారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు" చెప్పాడతను.
    "పదండి వెళదాం" చంద్రికతో పాటు టి.బి. దగ్గరకు నడిచాడు ప్రేమ్ కుమార్.
    చంద్రిక తనగదిలోకి నడిచిగదంతా ఓసారి పరీక్షించింది. చిన్న గదేకాని, అన్ని సౌకర్యాలూ వున్నాయ్. చక్కని టేబుల్, రెండు కుర్చీలూ, డ్రెస్సింగ్ టేబుల్, డెకలాన్ మంచం - పరుపూ దాని మీద అందమయిన దుప్పటీ, కిటికీ తలుపులకి కర్టెన్లూ.
    కిటికీ కర్టెన్ తొలగించిచూసిందామె. కొద్ది దూరంలో పెద్దలోయ కనబడుతోంది.
    ఓ కుర్రాడు ట్రేలోబిస్కట్లూ, టీ తీసుకొచ్చి టేబుల్ మీద వుంచాడు. టీతాగిన తర్వాత స్నానంముగించి బట్టలు మార్చుకుందామె. అప్పటికి టైము అయిదయిపోయింది. అప్పటికే ఎంతో రాత్రయినట్లు చీకటి వ్యాపించేసింది.
    ప్రొడక్షన్ వాళ్ళందరూ కాటేజీల్లో సర్దుకున్నట్లున్నారు. అంతా నిశ్శబ్దంగా వుంది. తలుపు తీసుకుని బయటకువచ్చింది చంద్రిక. బయట పోర్టికోలో ప్రేమ్ కుమార్ కుర్చీలో కూర్చుని ప్రొడ్యూసర్ తో మాట్లాడుతున్నాడు.
    "రండి! కూర్చోండి!" అన్నాడతను చంద్రికను చూడగానే.
    చంద్రిక వెళ్ళిఖాళీగా వున్న కుర్చీలో కూర్చుంది. మర్నాడు జరుగబోతున్న షూటింగు వివరాలు మాట్లాడుతున్నారు వారిద్దరూ, కొద్దిసేపటి తర్వాత ప్రొడ్యూసర్ వెళ్ళిపోయాడు.
    "ఆ! ఇప్పుడేమయినా విశేషాలు చెప్పండి. మనం తీరిగ్గా మాట్లాడుకోవడానికి ఇలాంటి అవుట్ డోర్ లు ఎంతోఅవసరం" అన్నాడు ప్రేమ్ కుమార్ నవ్వుతూ.
    "మీకో విశేషం చెప్పాలనిఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పటికి గాని అందుకు అవకాశందొరికింది కాదు" అంది చంద్రిక.
    "ఏమిటది?"
    "నేను మీ ఫాన్ ని! కాలేజీలోచదివే రోజుల్లోనేమీరంటే పిచ్చి అభిమానం ఏర్పడిపోయిందనుకోండి. అసలు సినీఫీల్డు వేపు ఆకర్షణ కలగడానికి సగంకారణం మీరు. ఫీల్డులోకొచ్చాక ఎప్పటికయినా మీపక్కన హీరోయిన్ ఆ అవకాశం వస్తుందా అని ఆలోచిస్తుండేదాన్ని."
    అతను గలగలానవ్వాడు "చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు. థాంక్యూ!"
    అతనా మాట అనేసరికి చంద్రిక మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏనాటి నుంచో తనమనసులో గూడు కట్టుకున్నభావాలని. ఇన్నాళ్ళకువాటిని అతని ముందుంచేఅవకాశం కలిగింది.
    మర్నాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా షూటింగు ప్రారంభమయింది.
    ముందు హీరో - విలన్ ఫైటింగు దృశ్యాల్ని చిత్రీకరించారు. ఆ తరువాత అక్కడికికొద్ది దూరంలో వున్న ఓ కొలను దగ్గర హీరోహీరోయిన్ ల మీద డ్యూయెట్ చిత్రీకరించాలి.
    ఆ దృశ్యానికి అవసరమయినవారంతా ఓ వానులో కొలనుదగ్గరకు చేరుకున్నారు. డాన్సు డైరెక్టరు నృత్యభంగిమలు ప్రదర్శించిచూపాడు.
    చంద్రిక - ప్రేమ్ కుమార్ తనను అంత గట్టిగా కౌగలించుకోవడం గమనించేసరికి చంద్రిక ఉక్కిరి బిక్కిరయింది.
    ఇంతవరకూ ఏ హీరోకూడా అంత రఫ్ గా నటించలేదు. ఎవరూ తననంత గాఢంగా కౌగలించుకోలేదు.
    "మీరు జంకుతున్నా రేమిటి? లవ్ సీన్లు పండితేనే మాకు నాలుగు డబ్బులురాలేది!" నవ్వుతూ చంద్రికతో అన్నాడు డైరెక్టర్.
    "అవునవును! నేను మిమ్మల్నెంత గట్టిగా కౌగలించుకుంటున్నానో మీరు అలాగే వాటేసుకోవాలి! లేకపోతే జనం సంగతి ఎలా వున్నాముందు డైరెక్టరుగారు వూరుకోరు!" తనూ నవ్వుతూ అన్నాడు ప్రేమ్ కుమార్.
    చంద్రికకు సిగ్గుకలిగింది.
    ప్రేమ్ కుమార్ చిత్రాలు తను చూసింది. హీరోయిన్ ని లవ్ సీన్ లలో నలిపివేస్తాడతను. అదొక్కటే అతడిలో తనకు నచ్చనిది!
    తన ఉద్దేశం ఇద్దరూ అలా శారీరక ప్రదర్శనలు చేయకుండా ఆ భావాలు ముఖంలో చూపితే బావుంటుందని, కానీ అంత పెద్ద నటుడితో ఆ విషయం ఎలా చెపుతుంది? చెప్పినా అతను సహృదయంతో అర్ధం చేసుకుంటాడని నమ్మకం ఏముందీ?
    రికార్డ్ మళ్ళీ వేశారు.
    ఇంచుమించుగా బూతు అర్ధాన్నిచ్చే పాట అది. ఆ పాటను ఓ ప్రముఖ కవి రచించాడు. ఓ ప్రముఖగాయని ఎలాంటి సిగ్గులేకుండా పాడింది.
    చంద్రిక కొలనులోని రాతి మీదకు దూకి ప్రేమ్ కుమార్ కౌగిలిలో హత్తుకుపోయింది. అతని పెదాలు తనపెదాలకు తగులుతున్నాయి. శరీరమంతా అతని స్పర్శవిద్యుత్ లా ప్రవహిస్తోంది. అతను హఠాత్తుగా కౌగిలి వదిలేశాడు.
    చంద్రిక ఆ తరువాత భంగిమ చేయడం మర్చిపోయింది.
    "కట్!" అరిచాడు డైరెక్టరు.
    "సారీ!" అంది చంద్రిక.
    "ఫరవాలేదు" అన్నాడు డైరెక్టరు.
    రికార్డ్ మళ్ళీ ప్రారంభమైంది.
    "వన్, టూ - యాక్షన్---"
    చంద్రిక ఈసారి కూడా అతని కౌగిలినుంచి విడివడగానే త్వరగా తరువాతి భంగిమను ప్రదర్శించలేకపోయింది.
    "కొంచెం స్లో అయారు! ప్రేమ్ కుమార్ గారు మిమ్మల్ని వదలగానే మీరు వెనుకకుజరిగి మ్యూజిక్ తోపాటు కిక్ గా ఆ అవతలి రాతి మీదకు జంప్ చేయాలి!" చెప్పాడు డైరెక్టర్.
    "ఎన్ని టేక్ లయితే అన్నిసార్లు మిమ్మల్ని కౌగలించుకుంటూ కూర్చుంటాను. నాదేంపోయింది!" నవ్వుతూ అన్నాడు ప్రేమ్ కుమార్.
    చంద్రికకు సిగ్గుగా వుంది. అతని స్పర్శకు తనెందుకు అంతగా చలించిపోతుందో తనకే తెలీటంలేదు. ఇంతకు ముందు కూడా ఇతరహీరోలతో ప్రేమదృశ్యాలలో నటించిందిగాని ఎప్పుడూ యిలా అనలేదు.
    మళ్ళీ రికార్డ్ ఆన్ చేశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS