"రాత్రి వచ్చిన తను మీకు చాలాకాలంనుంచీ తెలుసా?" అడిగింది చంద్రిక శ్రీనివాసరావు ని.
అతను తడబడ్డాడు.
"అబ్బే - నాకేం తెల్సు?" అన్నాడు కంగారు పడుతూ.
"మరతని మీద అంతటి ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు చూపినట్లు?"
"ఆహ! అలాంటిదేమీలేదండీ! అతను మీతో కొద్దిసేపు మాట్లాడివెళ్ళిపోతానని ప్రాధేయపడితే..."
"ఇంకోసారి ఎవరినీ తీసుకురాకండి! ఇంటి దగ్గర కలుసుకోనునేను!"
"అలాగేనండీ!"
కొద్దిసేపు హాల్లోకూర్చొని సినిమా పత్రికలు చదవసాగింది ఆమె.
ఆంద్రదీపిక పత్రికలో తన ఫోటో - దానికింద ఇంటర్ వ్యూ ప్రచురించబడినయ్. తను ఊహించినట్లే తనని విపరీతంగా పొగుడుతూ తనుచెప్పని విషయాలుకూడా రాస్తూ తనని ఆకాశానికెత్తే ఆ జర్నలిస్ట్.
తనకు చిన్నప్పుడు జరిగిన ఓ తమాషా అనుభవం కూడా అతనే ఊహించిరాశేశాడు. అది చదువుతూంటే నవ్వాపుకోవడం ఎంతోకష్టమయింది.
లైట్ స్విచ్ ఆఫ్ చేసి పడుకోబోతుండగా ఫోన్ మోగింది.
"హలో" రిసీవర్ అందుకుంటూ అందామె.
"హలో! నమస్కారమండీ!"
"నమస్తే! ఎవరు మాట్లాడుతోంది!"
"నేను మీ లక్షలాది అభిమానుల్లో ఒకరిని!"
చంద్రికకేం మాట్లాడాలో తోచలేదు.
"ఏం కావాలి మీకు?"
"మీరే కావాలి!"
చంద్రికకు కోపం నవ్వూ రెండూ వచ్చినయ్.
"మీకు కోపం వచ్చిందికదూ! అయినా ఫర్వాలేదండీ! నేను మీ అందానికి దాసుడనయిపోయాను. మిమ్మల్ని వివాహంచేసుకోవాలని నా కోరిక! ఈ కోరిక ఇప్పటిది కాదు. కానీ ఇంతకాలం లోలోపలే అణిచేసుకున్నాను. చంద్రికగారూ! మీరు అంగీకరించకపోతే నేను బ్రతకలేనండీ......!"
చంద్రిక ఫోన్ పెట్టేసింది. ఆమెకు అతని మాటలునవ్వు కలిగించసాగినయ్. ఫోన్ మళ్ళీ మోగసాగింది. రిసీవర్ తీసి కింద పెట్టేసిందామె.
ఉదయం తొమ్మిదిన్నరకల్లా రెడీఅయి కారుకోసం ఎదురుచూడసాగిందామె.
అప్పుడే ఓ కారు ఇంటిముందు ఆగడం అందులోనుంచి ఓ వ్యక్తి దిగి లోపలికి రావడం కనిపించింది. అతన్ని అంతకుముందెక్కడో చూసిన గుర్తుంది.
"నమస్కారమండీ" చిరునవ్వుతో నమస్కరించాడతను.
"నమస్తే! కూర్చోండి!"
అతను సోఫాలో కూర్చున్నాడు.
"నన్ను గుర్తించారా?" అడిగాడతను.
"అదే ఆలోచిస్తున్నాను. మిమ్మల్నెక్కడ చూశానా అని!"
"నా పేరు ధనుంజయరావ్! మనిద్దరికీ సురేష్ గారు విజయవాడలో పరిచయంచేశారు"
"ఆ అవును! గుర్తొచ్చింది" నవ్వుతూ అందామె.
"నిన్న రాత్రే మద్రాస్ వచ్చాను. అప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. అంచేత మీ దగ్గరకురాలేదు"
"ఏం పనిమీద మద్రాసు వచ్చారు?"
"కేవలం మీ గురించే! అప్పుడు మీకు చెప్పను గుర్తుందో లేదో! వీలయినంత త్వరలో మద్రాసువచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని"
"ఓహో!" తనను కలుసుకోడానికి అంతదూరంనుంచి ఎందుకు రావాలో అర్ధం కాలేదామెకి.
"మీరివాళ నా గెస్ట్! మధ్యాహ్నం లంచ్ కి రావాలి!" అన్నాడతను.
"సారీ! ఇంకాసేపట్లో అవుడ్దోర్ కెళ్ళిపోతున్నాను. మళ్ళీ పదిహేనురోజుల వరకూ అక్కడే మకాం!"
"అయ్యో!" నిరుత్సాహపడ్డాడతను.
"మరోసారి విజయవాడ వచ్చినప్పుడు తప్పక మీ యింటికి డిన్నర్ కి వస్తాను లెండి!"
"అదెప్పటిమాటో!"
అతను చుట్టూ చూశాడు.
"ఇలాంటి వాతాహవరణంలో కాదు మీతో మాట్లాడదల్చుకుంది. సరే పోనీండి. నా దురదృష్టం అనుకుంటాను. విషయం ఏమిటంటే....." చెప్పబోయి ఆగాడతను.
చంద్రిక కుతూహలంగా చూసిందతనివేపు.
"నేను యింతవరకూ ఎవరిమీదా ఇంతగా మనసుపడలేదు చంద్రికగారూ! మీ సినిమా చూశాక నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను. నాకు మీరు కావాలి. నా దగ్గర ఎంత డబ్బుందో నాకేతెలీదు. కానీ డబ్బేసరసం కాదని ఇప్పుడు తెలిసింది. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను నేను. మనం వివాహంచేసుకుందామన్నా నాకు అభ్యంతరం లేదు. మీరు ఎన్ని సినిమాలు నటిస్తే లభించేమొత్తం నేను ఇప్పుడే ఇస్తాను. అసలు డబ్బు విలువ ఏనాడూ తెలీదునాకు"
చంద్రిక విస్తుపోయిందతని మాటలకు. అతనికేం జవాబు చెప్పాలో తెలీటం లేదామెకి.
"మాట్లాడరేం చంద్రికగారూ! నేనేం అసభ్యంగా మాట్లాడడం లేదుకదా!"
"ఇంక మీరు వెళ్ళి రావచ్చు "కోపం అణచుకుంటూ అందామె.
అంతలో కారువచ్చి ఆగడం అందులో నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ హడావుడిగా లోపలకు రావడం జరిగిపోయింది.
"నమస్కారమండీ! రెడీ అయారా!" నమ్రతగా అడిగాడతను.
"ఓ! మీ కారుకోసమే ఎదురు చూస్తున్నాను"
"అలాగయితే పదండి. మీ లగేజ్ ఈ సూట్ కేస్ ఒక్కటేనా?" అది తీసుకుంటూ అడిగాడతను.
"అవును" అనేసి అతనితో పాటు బయటకు నడిచికార్లో కూర్చుంది చంద్రిక.
అసిస్టెంట్ డైరక్టర్ కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు ధనుంజయరావ్ కూడా బయటికొచ్చేసి తన కారు దగ్గర నిలబడిపోయాడు. కారు బయల్దేరింది.
"ఈ అవుడ్డోర్ ట్రిప్ మీరు బాగా ఎంజాయ్ చేయగలరండీ! ఎంత బావుంటుందో నేను చెప్పలేను. మాంచి అడవి ప్రదేశం కదా! చాలా భయంకరంగానూ, తమాషాగానూ కూడా వుంటుంది. అక్కడక్కడ సెలయేళ్ళు రాత్రుళ్ళు మాత్రం తలుపులు జాగ్రత్తగా వేసుకుని పడుకోవాలి. పెద్దపులులు, చిరుతపులులు రావడం మామూలువిషయమట అక్కడ....."
అసిస్టెంట్ డైరెక్టర్ తామువెళ్ళబోయే అవుడ్దోర్ వివరాలు చెప్తోంటే సరదాగా వుంది చంద్రికకు.
కారు ప్రొడక్షన్ ఆఫీసుకి చేరుకుంది. అక్కడ అప్పటికే చాలాహడావిడిగా వుంది. ఒక పెద్దవ్యానూ, దానివెనుక రెండు మినీబస్ లూ నిలబడి వున్నాయి. వ్యానులో కెమెరా ఎక్కించేశారు.
ఆఫీసు కుర్రాళ్ళు ఏవేవో సామాన్లు బస్ ల పైన వేసి తాళ్ళతో కట్టేస్తున్నారు. "ఒరేయ్! కొంచెం గట్టిగాకట్టండి. అసలే ఘాట్ రోడ్ అది!" ప్రొడక్షన్ మేనేజరు అరుస్తున్నాడు.
మరి కాసేపట్లో నటీనటులందరితోపాటు బస్సు స్టార్టు అయింది. ముందు రెండు బస్సులూ, వెనుక వ్యానూ మొత్తం యూనిట్ బయల్దేరింది.
శ్రీరంగం ఏవేవో తమాషాసంఘటనలు వర్ణించి చెప్పడం ప్రారంభించాడు. చంద్రికకు ఆ ప్రయాణం చాలా ఉత్సాహంగా వుంది. ఇలా అందరూ కలసి పిక్నిక్ కి వెళ్ళడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు అవుత డోర్ లకు వెళ్ళింది గానీ ఎప్పుడూ ఎవరి దారిన వాళ్ళు రైళ్ళలోనో, బస్సుల్లోనూ అక్కడకు చేరుకోవడమే.
