Previous Page Next Page 
దీప శిఖ పేజి 14


                                  6
    "ముహూర్తం సమీపిస్తోందని పురోహితుడా వరసని అకక్డ హడావిడి పడుతూ వుంటే మీరిక్కడ ఏమిటి అంత నిర్లిప్తంగా కూచుంటారు?...." అన్నాడు శేషయ్య ప్రవేశిస్తూ.
    శంకరం తల ఎత్తి శూన్యంగా శేషయ్య కేసి చూశాడు!
    "ఊ....లేవాలి, పట్టు బట్టలు కట్టుకుని దేవుడి ఫోటో ఒకటి చేత్తో పట్టుకోండి-- అక్కయ్య గారు ఏరీ?....ఆవిడ ని గౌరీ దేవి తీసుకొని సిద్దం కమ్మనండి -- అవతల ఆవుని తెప్పించి వుంచాను, నీళ్ళ బిందెలు పట్టుకుని పుణ్య స్త్రీలు కూడా సిద్దంగా ఉన్నారు."
    శేషయ్య చెబుతున్న మాటలేవీ శంకరం చెవుల్లో పడటం లేదు. తల వంచుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. శంకరం పడుతున్న ఆవేదనని గ్రహించి శేషయ్య "బావగారూ!....పదేపదే అలోచించి మనస్సు పాడు చేసుకోకండి. మీరు మాత్రం ఏమి చేస్తారు ?....వివరంగా కవరు రాశారు. అన్నగారు గృహప్రవేశం చేసుకుంటున్నాడు. మనం వెళ్ళకపోతే ఎలాగ అనే జ్ఞానం అతనికి ఉండాలి గాని మనం ఏం చేస్తాం?' అన్నాడు.
    "అది కాదండీ -- మనం వ్రాసిన కవరు వాడికి అంద లేదేమో! లేకపోతె నిన్న సాయంత్రాని కెనా రెక్కలు కట్టుకు వచ్చి వాలక పోయాడా?"
    "అదేమిటండీ , ఖచ్చితంగా మొన్న శని, ఆదివారాల నాటికి రాజమండ్రి వచ్చి ఉండాలి. రామనాధం గారి మాటల్ని బట్టి. మీరు సోమవారానికి అందేలా కవరు రాశారాయేను "ఇలా ఫలానా రోజున గృహప్రవేశం వుంది రాజమండ్రి లో ఆగకుండా తిన్నగా వచ్చేయ్యి " అని- ఇన్నాళ్ళు అయిదారు రోజులు వ్యవధి వుండగా ఇంక అందక పోవడం ఏమిటి?"
    "మనం రాజమండ్రీ రాశాం-- వాడు మద్రాసు లోనే ఉండి పొతే ఇప్పటి దాకా? మనం పోరావాటు చేశాం -- మద్రాసు కు కూడా ఓ కవరు రాయవలసింది --"
    శేషయ్య తల పంకించి ఊరుకున్నాడు.
    "ప్రక్కని వుండి అన్నీచూసుకునే తమ్ముడు లేకుండా అసలీ గృహప్రవేశం , హడావుడి ఏవిటి నాకు? ఎంత ఖర్చు పెడితే ఏం? ఎన్ని వందల మంది వస్తే ఏం? వాడు రాకపోయాక?"
    "గోపాలం ఇలా చేశాడేవిటి ?' అని శేషయ్య కూడా మనస్సులో తెగ మధన పడసాగాడు.
    ఇంతలో పురోహితుడు కేకేశాడు "ఏవండోయ్ !.....తొందర పడాలి ముహూర్తానికి ఇంక ఎంతో వ్యవధి లేదు" అంటూ. అది విని శంకరం గట్టిగా శ్వాస వదిలి నిస్సహాయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు.
    "అక్కయ్య గారిని కూడా తొందర చేసి మీరు చప్పున రండి. నేను వెళ్లి అతిదుల్నీ, తక్కిన ఎర్పటుల్నీ అన్నీ చూస్తాను" అంటూ శేషయ్య వెళ్ళాడు. శంకరం నీరసంగా సావిత్రి ఉన్న గదిలోకి నడిచాడు.
    ఊళ్ళో కి వచ్చే రోడ్డు , కిటికీ లోంచి దూరంగా కనిపిస్తోంది. కిటికీ దగ్గర కూచుని రోడ్డు కేసి పదేపదే చూస్తోంది సావిత్రి. పక్కనే పట్టు పరికిణీ కట్టుకుని పెట్టె మీద కూచున్న మణి , సావిత్రి చీరకొంగు పట్టుకొని లాగుతూ "చెప్పమ్మా -- బాబయ్య ఎందుకు రాలేదు?....నిన్నేనా తప్పకుండా వస్తాడన్నావు కదా? మరి ఇప్పటికి కూడా రాలేదేం?" అంటోంది. మణి చూడకుండా కన్నీళ్ళు తుడుచుకుంటూ కిటికీ లోంచి ఇంకా ఆశగా చూస్తోంది సావిత్రి. -- సావిత్రి ఎందుకలా మాటి మాటికి కిటికీ లోంచి కనిపించే రోడ్డు కేసి చూస్తోందో , ఎంతటి ఆవేదన ఆమె హృదయం లో గూడు కట్టుకొని ఉందొ-- గ్రహించే సరికి శంకరానికి మళ్ళీ మనస్సంతా బాధతో వికలం అయిపొయింది. అవును మరి!...వాడిని ఎప్పుడేనా మరిడిగా చూసిందా తను  కాస్తా తమ్ముడి కంటే ఎక్కువగా, కన్న కొడుకు కంటే మిన్నగా చూచుకుంది! అటువంటి గోపాలం ఈ రోజున ఇక్కడ లేకపోవడం సావిత్రి కి మాత్రం బాధ కాదూ?.... దుర్మార్గుడు ?....తను ఒక్కడు రాక ఇక్కడ ఎంతమందిని ఎడిపిస్తున్నాడు?....చంటిది ఆ వరసని బాబయ్య, బాబయ్య అంటూ పలవరిస్తోందే?....పోనీ తన మొహం చూసి కాకపోయినా తల్లిలా పెంచినా వదిన గారి తృప్తి కోసమైనా రావచ్చే? అదీ వద్దు , ఆ పసిదాని మొహం చూసేనా రాకూడదూ?....కాఠినాత్ముడు -- కాఠినాత్ముడు అని -- మనస్సులోంచి పెల్లుబికి వస్తూన్న దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద అణచు కుంటూ ఏవిటలా కూర్చున్నావు ?అవతల ముహూర్తం వేళ అవుతుంటే ?" అంటూ కోపంగా కసురుకున్నాడు శంకరం.

                      
    "అప్పుడే ?.....ఇంకా గోపాలం రాలేదు " అంది సావిత్రి.
    ఇంక వాడెం వస్తాడు ?....వచ్చే వాడయితే ఈ పాటికే వచ్చును వాడికి రావాలని లేదు, రాలేదు, అంతే." అన్నాడు దుఃఖంతో పూడుకుపోయిన కంఠం తో.
    "అదేవిటండీ  రావాలని ఎందుకు ఉండదూ?"
    "అదేమో -- మనకేం తెలుస్తుంది ...."
    "అలా అనకండి"
    'అవునే-- ప్రాజ్ఞుడయ్యాడు . వాదంతటి వాడు వాడయ్యాక ఇంకాస్తమానూ అన్నగారింటికి , అన్నయ్య ఇంటి గృహ ప్రవేశానికి రావాలని ఏముంది?'
    "మీరలా బాధ పడకండీ."
    "నాకు బాదేమిటే!....వాడు రాకపోతే నాకు బాధేం?....పది మందీ అడుగుతారు మీ తమ్ముడు రాలేదా అని. అడగనీ-- నాకు అవమానమా?..."
    "పోనీ గృహప్రవేశ ముహూర్తం మారిస్తే?"
    "ఏవిటి ఇప్పుడా ?....అంతా సిద్దం అయి అన్ని ఊళ్ళ జనం డాక్టరు గారి ఇంటి గృహప్రవేశం అని చెప్పి వచ్చి కూర్చున్నాక ?......అక్కర్లేదు. ఏం ఆకర్లేదు లే....వాడు రాకపోతే ఏం ఆగిపోదు-- లే-- బయలుదేరు -- ఇప్పటికే  ఆలశ్యం అయిపొయింది -- ఊ."
    శంకరం కంఠం లోని తీవ్రత ని చూసి సావిత్రి లేచింది.
    "బాబయ్య రాడా నాన్నా" అంది మణి.
    "రాడమ్మా -- వాడికి మన మీద కోపం వచ్చింది. వాడినేంతో ప్రేమగా పెంచి, కావాలన్న "లా" చదువు చెప్పించాం కదూ?....అందువల్ల మనం వాడికి విరోదులం అయ్యాం" అంటుంటే .
    "అదేవిటండీ ? చంటి పిల్లకి అలా చెప్పారు?...బాబయ్య వస్తాడమ్మా.......తప్పకుండా వస్తాడు......"అంటూ ఏదో చెప్పబోయింది సావిత్రి.
    "ఇదిగో సావిత్రి ఇదే చెప్పడం . ఇంక వాడి ప్రస్తావన ఎత్తడం కాని, వాడి గురించి తలుచుకోడం కాని ఏం జరగడానికి వీలులేదు. ఇంకా విషయం ఇంతటితో కట్టిపెట్టి లే- మణి -- బాబయ్య బాబయ్య అన్నావంటే తన్నులు తింటావు. జాగ్రత్త అంటూ నిప్పులు కక్కుతూ వెళ్ళిపోయాడు శంకరం. మణి, సావిత్రి బిత్తరపోయి నిలబడి చూస్తూ ఉండి పోయారు......
    "ఆ......ముందు మీరు మజ్జిగ కవ్వం, మహాలక్ష్మీ పెట్టె పుచ్చుకుని నడవండమ్మా-- ముందు కుడి కాలు పెట్టండి. మీరు కూడా డాక్టరు గారూ-- ఆ....అదీ ....ఈమారు పుణ్యస్త్రీలంతా నీళ్ళ కడవలు పుచ్చుకొని లోపలికి వెళ్ళొచ్చు. పెద్ద కాపుగారు మీరా అవునీ దూడనీ లోపలికి తీసుకుని వెళ్ళండి అంటూ ఓ పక్క నుంచి పురోహితుడూ, "ఓ గోవు మహాలక్ష్మీ ? మా డాక్టరు బాబు ఇంట్లోకి వచ్చిన వేళ మంచిదయి , సిరి సంపదలతో చల్లగా కలకాలం వర్ధిల్లే లాగ చెయ్యి అంటూ ఇంకో పక్క నుంచి శేషయ్య అంటుంటే, డాక్టరు గారు గృహప్రవేశం అని చుట్టూ పక్కల ఊళ్ళ నుంచి వచ్చిన జనం వందల కొద్ది నిలబడి ఆ సంతోషాన్ని పంచుకుంటుంటే , డాక్టరు భార్య మాత్రం బరువైన హృదయంతో , ఆవేదనా అసంతృప్తి తో నిండిన మనస్సులతో అయిష్టంగా, నూతన గృహప్రవేశం చేశారు.
    ఏ పరిచితమైన కంఠం వినిపించినా తమ్ముడే వచ్చాడని శంకరం , ఏమాత్రం అలజడి అయినా గోపాలం వస్తున్నాడు కాబోలని సావిత్రీ పీటల మీద కూర్చున్నంత సేపూ ఆశతో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ , పురోహితుడు చేయిస్తున్న తంతు నంతనీ పరధ్యానంగా నే చేస్తున్నారు. మణి బిక్క మొహం వేసుకుని వీధి అరుగు చివర వెళ్లి కూచుంది. వాసు పలకరిస్తున్నా వినిపించుకోకుండా , వచ్చిన వాళ్ళు చదివిస్తున్న కట్నాలన్నీ పుచ్చుకొని జాగ్రత్త పెడుతూ పక్కనే కూచున్న శేషయ్య ని చూసి వస్తే ఈ స్థానం వాడిది కదా!' అని అనుకుని బాధగా నిట్టూర్చాడు శంకరం.
    పురోహితుడి మంత్రాలతో , ఊరి పెద్దల అభినందనలతో , చుట్టూ పక్కల ఊళ్ళ నుంచి వచ్చిన జనం కబుర్లతో, ఒకరి మాట ఒకరికి వినిపించకుండా ఒకళ్ళు అంటున్నది ఇంకొకళ్ళ కి అర్ధం కాకుండా, మంచి హడావిడి గా లేనంత కోలాహలంతో చాలా సందడిగా ఉన్న ఆ వాతావరణం , శంకరంకి మాత్రం వెలితి గానూ, నిర్జీవంగా నూ నిశ్శబ్దం గానూ కనిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS