Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 14


    చెల్లెల్ని చూచాడు శ్రీహరి. "తప్పదంటావూ? సరే. మీరిద్దరూ కలుసుకోవడంకూడా మంచిదే. సిద్ధంగా ఉండు. టాంగా తీసుకొస్తాను. వెళ్దాం."
    "ఏం, అతడు రాడా?"
    "వెళ్ళుతున్నామని మనం చెప్పటానికి వెళ్ళటం మర్యాదా? అదీగాక ఈవేళ చాలా మంచిరోజు. అతడిని నాన్నగారికి చూపించి మాటలు జరపాలని చాలా ఆశపడ్డాను. అది పూర్తిగా విరుద్ధంగా, సెలవు తీసుకోవటంగా పరిణమించటం నాకిష్టంలేదు. నాన్నగా అతడిని చూడనేలేదు. ఇవ్వాళ ఈ విధంగా చూడ్డం దేనికి? చూస్తే ఇంకా బాధ పడతారు. అతడిని చూచినవాళ్ళెవారూ ప్రేమించకుండా ఉండలేరు" అంటూనే వెళ్ళిపోయాడు. నివ్వెరపోయింది శాంతి.
    శాంతీ, శ్రీహరీ వెళ్ళేసరికి రాజా ఇంట్లోనే ఉన్నాడు. వారలా వస్తారని ఎదురుచూచి ఉండకపోవడంవాళ్ళా, అంతకుముందే శ్రీహరి వచ్చి విషయాలన్నీ మాట్లాడి వెళ్ళటంవల్లా తిరిగి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసిరావడానికి ఆశ్చర్యపోయాడు.
    "శాంతి వెళ్ళేముందు నీకోసారి కన్పించాలనుకొందట. మాట్లాడుతూండండి. నే నిప్పుడే బజారుకు వెళ్ళివస్తాను" అంటూ సమాదానాల కెదురుచూడకుండా వెళ్ళిపోయాడు శ్రీహరి.
    రాజా, శాంతీకూడా ఆశ్చర్యపోయారు. బుద్ధి పూర్వకంగానే శ్రీహరి తమకు ఏకాంతాన్ని కల్పించాడని గ్రహించారు. స్నేహితుడికి తనపై గల గౌరవానికి రాజా, అన్నకు తనపై గల నమ్మకానికి సనతీ లోలోనే అంజలి ఘటించారు. అయిదు నిమిషాలపాటు మౌనం రాజ్యం చేసింది.
    మొదట రాజాయే మాట్లాడాడు. "నేనంటే అయిష్టం. మిమ్మల్నిక చూడడం పడదేమో అనుకున్నాను. ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది."
    "అటువంటిదేమీ లేదండీ. దృక్పథం ఒకటి కాదు. అయితే అయిష్టమని ఎందుకనుకోవాలి? వెళ్ళిపోతున్నానని చెప్పటానికి వచ్చాను." అంత స్పష్టంగా, సూటిగా శాంతి ఇదివరకెప్పుడూ మాట్లాడలేదు రాజాతో.
    రాజా కొంత ఆశ్చర్యపోయాడు. కొంత సంతోషించాడు. "అంత చక్కటి స్వభావ మున్నందుకు చాలా సంతోషిస్తున్నాను." కాని అతడిలో ఇదివరకటి చలాకీ లేనట్లు గుర్తించింది శాంతి. తిరిగి మానం రాజ్యం చేయసాగింది.
    శాంతి అతి మందస్వరంతో అంది: "నాకు వివాహంపైనా, సంసారంపైనా ఆసక్తి లేదు, రాజశేఖరంగారూ. అంతేగాని మీపై అయిష్టం, అగౌరవంమాత్రం లేవు. నాకున్న స్నేహితులు, పరిచితులు అందరికంటే మీకు నా దృష్టిలో ఉన్నతస్థానం కూడ."
    "ధన్యుడిని."
    "అంత పెద్ద పదాలు వాడకండి. కాని ఈ వివాహప్రసక్తి అన్నయ్య తలపెట్టాడో, లేక ముందుగా మీనుండి వచ్చిందో నాకు తెలియదు. అన్నయ్య మీలో ఈ అభిప్రాయాన్ని కలిగిస్తే అన్నయ్య తరఫున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. లేక మీలోనే ఆ అభిప్రాయం కలిగిందంటే అందుకు నా ప్రవర్తన మేదో అంకురార్పణ చేసివుండాలి. కాని బుద్దిపూర్వకంగా అందులో నేను చేసినదేమీ లేదు. ఒకవేళ నా ప్రవర్తనలో, మాటలలో తెలిసీ తెలియని ఒడిదుడుకులు, వెలితిదనమూ ఉండి మిమ్మల్ని బాధించితే హృదయపూర్వకంగా క్షమించండి."
    నిట్టూర్చాడు రాజా. "మీ మాటలకు కళ్ళు చెమరుస్తున్నాయి, శాంతీ. మీ హృదయం కఠినమనుకున్నాను. కానీ మీ రూపంలాగే మీ స్వభావంకూడా ఇంత లలితమైనదని తెలుసుకోలేకపోయాను. హృదయపూర్వకంగా, ఆనందంగా నిజం చెబుతున్నాను. మీ హావభావ విలాసాలలో అపోహ కలిగించేదేమీ లేదు. పైగా నిండుదనం, నమ్రత ఉండేవి. అందుకే నే నాకర్షింపబడి ఆశపడ్డాను. ఆశ తీరనంతమాత్రాన కోపాలూ, క్షమార్పణలూ ఉండకూడదు. సంఘటనలు ఆధారంగా స్నేహాలను మజిలీ చేయించేవారు ఎక్కవ ఈ ప్రపంచంలో. కాని అభిప్రాయాలూ, ఆశయాలూ ఎలా ఉన్నా, ఏం జరిగినా స్వార్దాలతో, ఆశలతో స్నేహప్రవర్తనలను బంధించకుండా ఇంత నిర్మలంగా ప్రవర్తిస్తున్న మీతో స్నేహపరిచయాలుండడం ఎంతో గర్వింపదగ్గ విషయం. శ్రీహరికి తగిన చెల్లెలు మీరు. ఈ స్నేహాన్నిమాత్రం మరువరు కదూ?"
    ఎందుకో తనకు తెలియకుండానే శాంతి నేత్రాలు అశ్రుసిక్తములైనాయి. "అవన్నీ నేను ప్రాధేయపడవలసిన సంగతులు, రాజశేఖరంగారూ, అనవసరంగా నన్నేదో ఆకాశాని కెత్తుతున్నారు మీరు."
    "లేదు, శాంతీ. నాకు సాధారణంగా పొగడ్తలు రావు. యథార్ధమే మాట్లాడుతున్నాను. మరొక్క సంగతి. మనం శాంతినికేతనం వెళ్ళేముందూ, శాంతినికేతనం చూచినప్పుడూ నా హాస్యాలతో మిమ్మల్ని నొప్పించినట్లు యిప్పుడు గ్రహించాను. అప్పుడు మీకా విషయాలేమీ తెలియవన్న సంగతి నాకు తెలియదు. మీకు అంగీకారమే ననుకున్నాను. మనస్సులో పెట్టుకోకండి" అన్నాడు తలవంచుకొని.
    "అటువంటిదానను కాను" అంది శాంతి మెల్లగా, చేతిలో లెదర్ బాగ్ తెరుస్తూ. "ఈ చిత్రాలను దగ్గరుంచుకొనే అర్హత ఇక నాకు లేదేమో!" అంది, ఆ రోజు రాజా బహూకరించిన చిత్రాలను బల్లపై ఉంచుతూ.
    బాధగా చూచాడు రాజా. "నేను గౌరవంగా, సంతోషంగా ఇచ్చాను కాని ఎటువంటి ఉద్ధేశాలూ లేవు, శాంతీ. ఉన్నా ది గౌరవమే కాని నీచభావాలు మాత్రం కావు, మీదగ్గర ఉండగల యోగ్యత వాటికి లేదనుకొంటే వాటిని పరిత్యజించండి. నామీద గౌరవంతో, మన స్నేహానికి గుర్తుగా ఉంచితేమాత్రం ఎంతైనా ఆనందిస్తాను."
    శాంతి మాట్లాడలేదు.
    రాజా అన్నాడు: "బలవంతమేమీ లేదు, శాంతీ. మీరంతగా వద్దనుకుంటే తీసుకుంటాను. కాని, చూడండి. ఎన్నో అనుకుంటాం. అన్నీ జరుగవు. వాటిగురించి అతిగా ఆలోచించి విపరీతార్ధాలు తీసుకోకూడదు. సూక్ష్మంగా చూస్తే నాకూ, శ్రీహరికీ ఎటువంటి స్నేహమో, మీకూ నాకూ కూడా అటువంటి స్నేహమే ఎందుకుండకూడదు? జీవనసాగరంలో అనేక రాగస్రవంవతులు వచ్చి కలుస్తాయి. ఆ స్రవంతులు నిర్మల మధురసపూరితమైతే సాగర హృదయం ఆనందపూరితమౌతుంది కానీ బురదనీరును చూచి సంతోషించదు. ఈ మనస్నేహఘట్టం ఆయుష్షు అత్యల్పమే అయినా చిర మధురస్మరణీయం ఎందుక్కాకూడదు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS