షూటింగ్ ప్రారంభంకాక ముందు అతని దగ్గరకెళ్ళి నమస్కరించింది. అతను చిరునవ్వుతో ప్రతినమస్కారం చేశాడు.
"ఇది మనిద్దరం కలసినటించే మొదటిపిక్చర్ కదూ!" అడిగాడతను.
"అవునండీ!"
"మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారని విన్నాను. అందుకే ఈ చిత్రంలో మీకు అవకాశం ఇమ్మని మోహన్ కి చెప్పాను" చంద్రికకు ఆశ్చర్యం కలిగింది.
ఇది ప్రేమ్ కుమార్ కోరికమీద జరిగిందన్నమాట.
"చాలా థాంక్సండీ" మర్యాదపూర్వకంగా అందామె.
"నాతో వర్క్ చేస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు మీకు ముందే చెపుతున్నాను. మీరు టైంకి షూటింగ్ కి రావడం చాలా ముఖ్యం. ఒకరికోసం వేచి వుండడం అంటే నాకు చిరాకు! నేను సాధారణంగా వాళ్ళిచ్చిన టైంకి పదినిముషాలు ముందే మేకప్ తోరడీగా వుంటాను....."
"అలాగేనండీ"
వారం రోజులపాటు ఆ చిత్రం షూటింగ్ లో పాల్గొందామె. అ వారం రోజుల్లోనూ ప్రేమ్ కుమార్ తో చక్కని సన్నిహితత్వం ఏర్పడింది.
అతను పైకి కనిపించినంత సీరియస్ గా ప్రవర్తించకపోవడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.
విరామం దొరికినప్పుడల్లా నవ్విస్తూ సరదాగా మాట్లాడటం ఏవేవో విశేషాలు చెప్పడం తనకు ఆనందం కలిగించేది.
అతనంటే హీరోవర్షిప్ ఉండటం వల్ల అతని మాటలు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవామెకు.
మొదటి షెడ్యూల్ మరో నాలుగు రోజుల్లో పూర్తయింది. ఈలోగా శ్రీనివాసరావ్ ఆమె దగ్గర సెక్రటరీగా చేరాడు.
అతను చేరడంవల్ల అప్పుడప్పుడే పెరిగిపోతున్న తన చిత్రాలగురించి పట్టించుకోవాల్సిన చికాకు తొలగిపోయింది.
తనెప్పుడు ఎవరెవరికి కాల్షీట్స్ ఇచ్చిందీ, ఎప్పటివరకూ తనకి ఖాళీ ఉండదని -అన్నీ అతనికి అర్ధం అయిపోయాయ్.
అంతేకాకుండా తనులేని సమయంలో చంద్రిక ఆ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సులభంగా అర్ధమయ్యేలా నోట్స్ రాసి ఉంచేవాడు.
ఇంటిపనులన్నీ క్రమేపీ అతని చేతిమీదుగానే జరగడం ప్రారంభమయింది.
ఇది జగన్నాధానికి మరింత ఆనందం కలుగజేసింది. అతనిగురించి పట్టించుకునేవారేలేరు.
చంద్రికకు విరామంలేకుండా షూటింగ్స్ ల్ పాల్గొనాల్సి రావడంవల్ల జగన్నాధం తో తాపీగా మాట్లాడే అవకాశం లభించడంలేదు. ఇది అదనుగా తీసుకుని అతను తాగుడు, పేకాటలను తనస్నేహితుడింటికి తరలించాడు.
ఆ రోజు చంద్రిక స్టూడియో కెళ్ళడానికి సిద్దమవుతోంటే నెమ్మదిగా ఆమె దగ్గరకొచ్చాడు శ్రీనివాస్.
"ఏమిటి?" అడిగింది చంద్రిక.
"మీకోసం ప్రహ్లాదరావ్ అనే ఆయన రెండు మూడుసార్లు వచ్చి వెళ్ళారు....." అన్నాడతను వినయంగా.
"ఎవరతను?" అడిగింది చంద్రిక.
"ఆయన కోటీశ్వరుడులెండి! మీరంటే అభిమానమట ఆయనకు. కేవలం మీతో మాట్లాడ్డానికని ఆయన హైద్రాబాద్ నుంచి వచ్చాడు. ఇవాళ సాయంత్రం మీరు అంగీకరిస్తే వచ్చి వెళతారుట"
"సాయంత్రం ఎలా? నేను షూటింగ్ నుంచి వచ్చేసరికి ఎనిమిదిన్నర ఐపోతుందిగా?"
"అప్పటివరకూ వేచివుంటానంటున్నారు....."
"మీతో రెండు నిముషాలు మాట్లాడ్డానికి ఎన్నివేలయినా ఖర్చు చేయటానికి సిద్దంగా ఉన్నారట! అంత అభిమానం మీరంటే....."
అతని గురించి శ్రీనివాసరావ్ చెపుతుంటే ఆమెకు ఆశ్చర్యం కలిగింది.
తనతో మాట్లాడ్డానికి అంత డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం ఏముంటుంది?
ఆ రాత్రి ఆమె వచ్చేసరికి తొమ్మిదైపోయింది. బయటహాల్లో శ్రీనివాసరావ్ తోపాటు కూర్చున్న వ్యక్తిని చూడగానే ఆమెకు అతనెవరో అర్ధమైపోయింది.
"నమస్కారమండీ!" లేచి నిలబడి నమస్కరిస్తూ అన్నాడు అతను.
"నమస్తే! కూర్చోండి! ఇప్పుడే వస్తాను....." అంటూ తను మేడమీద నడిచి బట్టలు మార్చుకుని వెంటనే కిందకు దిగి వచ్చిందామె. ఇంటి ముందు అతనికారు కాబోలు - ఉంది.
"వీరేనండీ ప్రహ్లాదరావ్ గారు!" అతన్ని చంద్రికకుపరిచయం చేశాడు శ్రీనివాసరావ్.
"నమస్కారమండీ!" లేచి నిలబడినమస్కరించాడతను.
"నమస్తే! కూర్చోండి!" తనూ అతని కెదురుగాకూర్చుంటూ అందామె.
"నేనిక వెళతానండీ! ఇప్పటికే ఆలస్యమైపోయింది" అంటూ శెలవు తీసుకునిఅక్కడినించి బయటకి నడిచాడు శ్రీనివాసరావ్.
"మీరు చాలా అలసిపోయి ఉంటారనుకుంటాను" చిర్నవుతో అన్నాడు ప్రహ్లాదరావ్.
"ఔననుకోండి! ఐనా రెండుమూడుసార్లు ఇప్పటికేతిరిగి వెళ్ళారని చెప్పాడు అందుకని....."
"చాలా థాంక్సండీ!" ఆమెవంకే తదేకంగా చూస్తూ అన్నాడు అతను.
అతని చూపులు చంద్రికకు చిరాకు కలిగించినయ్.
"అసలు ఎప్పటినుంచి మిమ్మల్ని కలుసుకోవాలని అనుకోవడం! కానీ వీలుకుదిరింది కాదు...."నవ్వుతూ అన్నాడతను.
"మీరు కాఫీ తీసుకుంటారా?" అతన్ని త్వరగా వదిలించుకోవలన్న ఉద్దేశంతో అడిగింది చంద్రిక.
"ఇప్పుడేమీ వద్దండీ! భోజనం చేసేసమయం కదా! మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే మీరూ నాతోడిన్నర్ కి రండి -"
అతని చనువు ఆమెకు ఆశ్చర్యం, కోపం కలిగిస్తున్నాయ్.
తనని డిన్నర్ కి రమ్మని ఆహ్వానించేటంత ధైర్యం అతనికెలావచ్చింది?
"సారీ! నాకు వీలుండదు!" కటువుగానే అందామె.
"మీతో కొంచెం మాట్లాడాలి! మీరు భోజనం ముగించాక మళ్ళీ వస్తాను" అన్నాడతను.
"ఏం మాట్లాడాలి?" అనుమానంగా అడిగింది చంద్రిక.
"అదే మీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి మీతో ఉంటాను! మీకెంత కావాలన్నా ఇస్తాను. డబ్బుదేమీ సమస్య లేదు"
చంద్రిక ఉగ్రురాలయిపోయింది.
"ముందు బయటకుపో" అంది అతని మాటపూర్తి కాకుండానే రౌద్రంగా.
అతను కంగారుపడ్డాడు.
"మీరు - నేను చెప్పేది- మీరెంతడిగితే అంత-"
"ఇడియట్! మర్యాదగా పోతావా? గెంటించమన్నావా?"
అతను ఇంకొక్క మాటకూడా మాట్లాడకుండా అక్కడి నుంచి బయటకునడిచి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు.
కొద్ది క్షణాల వరకూ చంద్రిక కోపం చల్లారలేదు. తనకేదో అవమానం జరిగినట్లు అనిపించసాగింది.
మర్నాడు ఉదయం శ్రీనివాసరావ్ ని చూస్తూనే మళ్ళీ రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. హఠాత్తుగా ఆమెకో అనుమానం కలిగింది.
"ప్రహ్లాదరావ్ గురించి తనకు చెప్పింది శ్రీనివాసరావే.
ఒకవేళ ప్రహ్లాదరావ్ కు శ్రీనివాసరావ్ ప్రోత్సాహంలేదుకదా? లేకపోతే అతనంత ధైర్యం ఎలా చేయగలడు?
