చెమ్మగిల్లిన కళ్ళతో విజయ తల నిమురుతూ "పిచ్చి తల్లీ! ఈ తనువూ నేడు కాకపొతే రేపైనా పోయేదే ....మావయ్య ఎల్లకాలం ఉంటాడా?....అయినా మీ అమ్మ కంటెనూ మీ నాన్న కంటే నూ ఎక్కువా నేను. నాకోసం అలా ఇదవు తున్నావు కాని, అన్నాడు రామనాధం.
తలఎత్తి బేలగా చూసింది విజయ.
వాళ్ళిద్దరూ అలా బాధపడుతున్నప్పుడు , ముఖ్యంగా రామనాధం గారు "విజయ భవిష్యత్తు ఏమిటా ?" అని మధన పడుతున్న సమయంలో తన కేమి పట్టనట్లు ఊరుకోవడం కంటే, మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని కాస్తా తెలియపరచి, అటు అయన మనస్సుకి ఊరటనీ, ఇటు తన హృదయానికి తెలికనీ, కలిగించడం తన తక్షణ కర్తవ్యం అనుకున్నాడు గోపాలం.
ఇంతలో "ఊపిరి పీలుస్తుంటే ఈ ఎడం పక్క పట్టేసినట్టుంటుంది . కొంచెం గోరు వెచ్చగా కాసిన్ని నీళ్ళు కాచి అందులో పేరిన నెయ్యి వేసి పట్రా అమ్మా, తాగుతాను " అన్నాడు రామనాధం . విజయ ఆ ప్రయత్నం మీద వంటింట్లో కి వెళ్ళిపోయింది. గోపాలం "మరేమోనండి......మీతో ...ఒక్క విషయం.....మాట్లాడాలను కుంటున్నా, ఎన్నాళ్ళ నుంచో" అన్నాడు -- రామనాధం "దానికంత అనుమానం ఎందుకు?' అన్నాడు నవ్వుతూ. గోపాలం ఇంకా తటపటా యిస్తుండడం చూసి "చెప్పవోయ్! ఎందుకలా సందేహిస్తావు ?' అన్నాడు.....
గోపాలం నెమ్మదిగా "మీకు అభ్యంతరం లేకపోతె నేను విజయ ని ....పే...ళ్ళి....చే......సు కుంటా" అన్నాడు.
రామనాధం కళ్ళు అంత చేసి ఆశ్చర్యంగా ఒక్కక్షణం ఉండిపోయి తర్వాత నీరసంగా "హు!...చివరికి నేనేదైతే భయపడ్డానో అదే జరిగిందన్న మాట!' అన్నాడు.
గోపాలం "రామనాధం గారూ!" అన్నాడు బాధగా.
"ఉద్వేగం చెందకు గోపాలం . నేను అన్ని విధాల కోరేది విజయ వివాహమే!..... అందులో నీలాంటి బుద్ది మంతుడితో అవుతుందంటే నాకు అంతకంటే కావలసింది ఏముంది !.... అయితే ఇందులో ఒక భయంకర మైన అభ్యంతరం ఒకటుంది "
"అభ్యంతరమా?"
"అవును-- ఇన్నాళ్ళూ నిప్పులా నా గుండెల్లో దాచుకున్న ఆ భయం కర సత్యాన్ని వినడంతో నీకు విజయని వివాహం చేసుకోవడానికి అభ్యంతరం కలగవచ్చు. ఏ నిర్ణయమూ తారుమారు కావచ్చు."
ఆ సత్యమేదో చెప్పండి. అది ఎంతటి భయంకర మైనదేనా నా నిర్ణయాన్ని మార్చలేడు! ఏ పరిస్థితిలో నైనా సరే విజయ ని వివాహం చేసుకుని తీరుతాను! మీకు అలా మాట ఇస్తున్నాను."
రామంధం గారు నీరసంగా నవ్వాడు.
"నామాట మీద మీకు నమ్మకం లేదా?"
"మాట మీద కాదు బాబూ-- పరిస్థితుల మీద"
"ఓహో! అర్ధం అయింది. మా అన్నయ్య సనాతనపరుడు కదా బ్రహ్మ సమాజ మతస్తుల పిల్లల్ని అందులో ఈడేరిన అమ్మాయిని నేను చేసుకోవడానికి అంగీకరిస్తాడా అనే కదూ మీ అనుమానం?..... మీకా అనుమానం ఏం అక్కర్లేదు. నేనో నిర్ణయానికి వచ్చి, మాట ఇచ్చి ఓ నియమానికి కట్టుబడిన తర్వాత, అన్నయ్య అంగీకార అనంగీకరాలూ కోపతాపాలే కాదు; ఈ లోకంలో ఏ మహా శక్తి అయినా సరే నా నిర్ణయాన్ని మార్చలేదు."మాటకి కట్టుపడడం , కొన్ని నియమ నిబంధనల ప్రకారం జీవించడం " ఈ రెండూ నేను మిమ్మల్ని చూసి నేర్చుకొన్న పాఠాలు -- వీటి కింక చలనం లేదు. నామాట నమ్మండి "
"నీమీద నాకు ఎట్టి అపనమ్మకం లేదు గోపాలం. కానయితే ఈ వయస్సు అనేది ఉంది చూశావు ఇది చాలా చెడ్డది. మనిషికి ముప్పయ్యేళ్ళ వస్తే కాని దీని ప్రభావం మనిషి మీద పోదు. ఈలోగా తీసుకునే నిర్ణయాలు ఆలోచన మీద కాకుండా కేవలం ఆవేశం మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ఇవాళ నువ్వు కంగారుగా చేసిన పనులకి అనక ఖాళీగా పశ్చాత్తాపం పడతావు. అప్పుడు అది ఎన్నో అనర్దాలకి దారి తీస్తుంది. కనుక ఏ మనిషి అయినా ముప్పయి ఏళ్ళ తర్వాత తీసుకున్న నిర్ర్నయలె బలంగా నిలబడతాయి."
"అయితే, ఇంకొక అయిదారేళ్ళు పోయాక నేను ముప్పయ్యో వడిలో పడి, ఇవాళ విజయాని వివాహం చేసుకున్నందుకు పశ్చాత్తాపం చెందుతా నంటారు......దీని బట్టి విజయాని నేనెంత గాడంగా ప్రేమిస్తున్నానో మీకు అర్ధం కాలేదన్న మాట!"
"అర్ధం అయింది కనకే భయం -- పరిణత వయస్సు రాని ప్రేమలన్నీ తమని తాము మోసగించు కోవడంతో ప్రారంభం అయి ఎదటి వాళ్ళని మోసగించడం తో సమాప్తం అవుతాయి."
'ఇంతకీ మీరనేదేమిటి ?......నాకు ముప్పయ్యేళ్ళు వచ్చేదాకా విజయని పెళ్లి చేసుకోవద్దనెగా? అలాగే! నా ప్రేమ ఎంత దృడ మైనదో, నా నిర్ణయం ఎంత బలమైందో నిరూపించడం కోసమైనా అప్పటి దాకా ఆగుతాను. అంతేకాదు అప్పటి దాకా విజయ ని కేవలం ఒక స్నేహితురాలిగా పవిత్రంగా చూస్తాను. సరేనా?' అన్నాడు గోపాలం కంఠం లో ఒక దృడ సంకల్పాన్ని , ఒక గంబీర్యాన్నీ ధ్వనిస్తూ.
రామనాధం కళ్ళూ రెండూ చెరువులు కాగా "నేను ఇలా అంటున్నాన్నంటే లోకం మంచి చెడ్డలు , ఈ సందర్భంలో ఉన్న పూర్వాపరాలూ అన్నీ ఆలోచించే అంటున్నాను. వెయ్యేళ్ళ కి మీ ఇద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావలసింది. ఆ ఉద్దేశంతోనే ఇంకో అయిదారేళ్ళు నిన్ను ఆగమన్నది కూడా . అంతకంటే వేరే ఏం కాదు, అయితే విజయాని పెళ్లి చేసుకోవాలని నువ్వు గట్టిగా ఓ నిర్ణయం చేసుకోడానికి ముందు విజయ కి సంబంధించిన వివరాలు కొన్ని నువ్వు తెలుసు కోవలసి ఉంది, అని అన్నీ సంక్షిప్తంగా ఓ పేజీలో రాసి ఎప్పుడో ఈ కవరు లో పెట్టి సీలు వేశా-" విజయ ని పెళ్లి చేసుకొనే వాళ్లకి ఇవ్వాలని. ఇది నీదగ్గర పెట్టుకో. నేను చనిపోయిన తర్వాత దీన్ని విప్పి చదువుకుని, అప్పటికి నువ్వు విజయ ని వివాహం చేసుకోడానికే నిర్ణయించు కుంటే, నేను చెప్పిన వయస్సు వచ్చేదాకా ఆగి బాగా ఆలోచించుకొని మరీ చేసుకో. లేదా నిర్ణయం మార్చుకుంటే, విజయ కి నా అన్న వాళ్ళు లేని లోటు కనిపించకుండా ఓ అన్నగారి లాగా ఉండి, దాని బ్రతుకు బాటని సక్రమంగా ఏర్పరచి పుణ్యం కట్టుకో. అన్నీ తెలుసు నీకు , విస్తారం చెప్పవలసిన అవసరం లేదు" అన్నాడు రామనాధం కవరు గోపాలానికి అందిస్తూ.
ఈ కవరు విప్పవలసిన అవసరమూ లేదు, నా నిర్ణయాన్ని మార్చుకోవలసిన అవసరమూ లేదు అనుకున్నాడు గోపాలం.
"ఇంకొక్క సంగతి, మనం ఇప్పుడు అనుకొన్న సంగతులు కాని, కవరు లో ఉన్న విషయాలు కాని నా చిట్టి తల్లికి చెప్పకు సుమా!.... అది భరించలేదు " అన్నాడు ప్రాధేయ పూర్వకంగా రామనాధం.
"మీకా భయం అక్కర్లేదు , విజయకే కాదు, మన ఇద్దరికీ తప్ప మూడో వాడికి ఈ విషయాలేం తెలియ నివ్వను -- సరా?' అన్నాడు గోపాలం.
"హమ్మయ్య" అని ఏదో పెద్ద భారం తీరినట్లు శ్వాస వదిలాడు రామనాధం.
ఇంతలో విజయ గోరువెచ్చని నీళ్ళల్లో పేరిన నెయ్యి వేసిన గ్లాసు పట్టుకు వచ్చింది.
ఆమె చేతిలో గ్లాసు అందుకుంటూ " అన్నట్లు గోపాలం , మొన్న మీరు ఫిరాపురం వెళ్ళిన మర్నాడు నీపేర నాకే ఒక కవరు వచ్చిందోయ్....పిఠాపురం నేను వచ్చేటప్పుడు తెద్దాం అనుకోవటం, నాకీ బ్లడ్ ప్రేఫర్ రావడం, మన కబుర్లూ , ఈ హడావిడి లో మరిచిపోయాను, ఆపీసర్ కోడ్ లో ఉండాలి చూడు అన్నాడు రామనాధం.
"పీనల్ కోడ్" పేజీలు తీసి కవరు చించి కంగారు కంగారుగా చదువుతూన్న గోపాలం ముఖం లోని అడుర్ధాని గమనించి "ఏమిటి ? ఎక్కడ నుంచి వచ్చింది ?...ఏవిటి విషయం ?" అంటూ ఒక్కసారిగా అరిచారు విజయా, రామనాధంలు-
