9
ఆ రాత్రి తాంబూలం సేవిస్తూ అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు.
"శాంతీ, రేపు మేము వెళ్ళిపోతాం. అన్నయ్యతో ఉంటావా? మాతో వస్తావా?" అడిగాడు బలరామయ్య.
శాంతి ఒక్కసారి అందరి ముఖాలూ చూచి కళ్ళు వాల్చుకుంది. మెల్లగా చెప్పింది: "ఇక్కడ ఈ హడావుడీ, రొదా, మిల్లుల కూతలూ. ఉండలేకపోతున్నాను, నాన్నా. ప్రశాంతత' లేదు."

"అయితే వచ్చేయి. నేను అనుకున్నాను, ఈ పట్టణ వాతావరణం నీకు సరిపడదని."
"వూఁహు." తలపంకించింది శాంతి. "మీతో రావాలనికూడా లేదు."
"మరి?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శ్రీహరి. బలరామయ్యకూడా సందిగ్ధంగా చూచాడు.
"కొంతకాలం శాంతినికేతనంలో ఉండాలని ఉంది, నాన్నా-" మెల్లగా చెప్పింది.
"ఆఁ!" ఆశ్చర్యపోవడంతప్ప ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. శ్రీహరి విసురుగా అక్కడినుంచి లేచిపోయాడు.
"ఇన్నేళ్ళొచ్చి ఇదేమైనా బాగుందా నీకు? మేం పెళ్ళి తలపెడితే అదీ కాదన్నావు?" తల్లి అనునయించబోయింది.
"శాంతినికేతన్ లో ఏం చేద్దామని?" బలరామయ్య అడిగాడు.
"నా 'ఆర్ట్' బాగా అభివృద్ది చేసుకుందామని." అలాగే తలవంచి జవాబిచ్సింది, శాంతి.
చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. కొంత సేపటికి బలరామయ్య అడిగాడు: "అయితే మమంల్ని వదిలి ఉండగలవా, తల్లీ?" ఆ గొంతులో వణుకును శాంతి గ్రహించలేక పోయింది.
"ఎందరుండడంలేదు, నాన్నా? నేనేమన్నా పసిపిల్లనా?" విస్మయంగా అడిగింది.
"సరేనమ్మా. అలాగే ఉందువుగాని. నీ కెక్కడ సంతోషంగా ఉంటే అక్కడే ఉందువు గాని" అంటూనే త్వరత్వరగా పడక జేరాడు బలరామయ్య.
"ఇక నీ నిర్ణయం మార్చుకోవటే, అమ్మాయీ?" అడిగింది తల్లి బాధగా.
"ఇప్పుడేం? నువ్వు దాన్నేం విసిగించకు, లక్ష్మీ. అమ్మాయి సంతోషమే నా సంతోషం" అని భార్యను వారించాడు. కాని అతడి కదలికలలో వ్యక్తమౌతున్న భాధను శాంతి గ్రహించక పోలేదు. అయినా కోరిక తీరబోతూంది, శాంతినికేతనం వెళ్ళబోతున్నాను-అవే సంతోషంలో ఆ విషయం పట్టించుకోలేదు.
"మీతోవచ్చి ఒక వారంరోజులుండి తిరిగి వచ్చే స్తాను, నాన్నా. అక్కడ నా చిత్రాలూ, దుస్తులూ కొన్ని తీసుకోవాలి" అంది శాంతి.
"అలాగే."
సంభాషణ మరి సాగలేదు. శాంతి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
తృప్తిగా నిద్రపోయిన శాంతికి ఉదయం నిద్రలేచాక తల్లీ, తండ్రీ, అన్నా, వదినా అందరి ముఖాలుకూడ రాత్రంతా నిద్రలేనట్టు, బరువుగా, భారంగా తోచాయి. శాంతి గ్రహించగలిగింది. కాని పట్టించుకోలేదు. అందరూ కూడ ముభావంగా ఉన్నట్టే కన్పించారు.
గదిలోకి కాఫీ తెచ్చి యిచ్చిన పద్మ మెల్లగా శాంతి భుజంపై చెయ్యివేసి నచ్చచెప్పబోయింది. "చూడు, శాంతీ. అమ్మగారూ, నాన్నగారూ నీమాట తీసివేయలేక అంగీకరించినా వారు లోలోపల చాలా బాధపడుతున్నారు. ఇది నీకు భావ్యంకాదు."
"మీకందరికీ పెళ్ళీ, సంసారం మినహా లోకం కన్పించదు. వృథాగా తీరి కూర్చుని బాధపడితే నేనేం చెయ్యను? నా మనస్సిక తిరగదు. వెళ్ళే ముందు నాచేత నిష్టూరంగా మాట్లాడించకు, వదినా."
"సరే. నీ ఇష్టం. పెద్దదాన్నిగనుక నీమీద ప్రేమతో చెప్పబోయాను."
"అన్నయ్య ఇంటిదగ్గరున్నాడా?"
"లేరు. రాజాతో చెప్పిరావడానికి వెళ్లారు" అంటూనే వెళ్ళిపోయింది, పద్మ.
శాంతి అడిగిందికూడా అందుకే. రాజాతో కొంత స్నేహమంటూ ఏర్పడింది. వెళ్ళేముందు అతడికి చెప్పివెళ్ళటం భావ్యంగా తోచింది శాంతికి. కాని ఇంత జరిగాక అతడి పేరెత్తడానికి సాహసం చాలటంలేదు. అతడేమనుకుంటున్నాడో? కోపమొచ్చిందేమో? అనుకున్నది జరగకపోతే బాధగానే ఉంటుంది మరి! ఏదో ఒక మీమాంస జరిగింది అతడి విషయంలో. కాని అందుకు తాను బాధ్యురాలు కాదు. అది ఫలించలేదు. అందువల్ల ఎవరికి బాధ కలిగినా తడ బాధ్యత లేదు. 'అయినా వాళ్ళ బాధాభావనలతో నాకు పనిలేదు. చెప్పివెళ్ళడం స్నేహధర్మం. ఆపైన అతడెలా స్వీకరించినా సరే. అన్నయ్య వచ్చాక అడుగుతాను' అనుకొంటూండగానే శ్రీహరి వచ్చాడు గదిలోకి. అతడు క్రితందినం చెల్లెలితో మాట్లాడటానికి వచ్చినప్పుడు అక్కడ వదిలేసిన 'గాగుల్స్' వెతుక్కుంటున్నాడు.
"అన్నయ్యా, రాజా రావటం లేదేం ఈమధ్య?" అనడిగింది శాంతి.
ఆశ్చర్యంగా తలెత్తాడు శ్రీహరి. అతడి కనుబొమలు ముడిపడ్డాయి. కాని మాట్లాడలేదు.
తిరిగి శాంతే మాట్లాడింది. "చాలా చోట్లకి కలసి తిరిగాం. కొంత స్నేహమంటూ ఏర్పడింది. వెళ్ళేముందు అతడికి చెప్పినవెళ్ళటం యుక్తమని" అంది ఎటో చూస్తూ.
"యుక్తమైన పనులు చాలా ఉంటాయి." నిష్టూరంగా అన్నాడు శ్రీహరి. "నే నిప్పుడే వెళ్ళివచ్చాను, వెళ్తున్నామని."
"వెళ్తున్నామనా? మీరూ వస్తున్నారా?" ఆశ్చర్యంగా అడిగింది, శాంతి.
"అవును మళ్ళీ నిన్ను తిరిగి తీసుకురావద్దూ మరి? నువ్వు ఒకత్తెవూ తిరగగలిగినా మేం వదల్లేం. వచ్చేటప్పుడు వదిననక్కడ వదిలేసి వస్తాను. ఎవ్వరూ దగ్గర లేకపోతే పెద్దవారి మనసులు బాధతో కృంగిపోతాయి."
కొంచెం చలించింది శాంతి. కాని తొణకలేదు. "మనం కలకత్తాలో ఉన్న ఈ రెండు నెలలనుంచీ ఒకళ్ళూకాక ఎవరుంటున్నారు వాళ్ళదగ్గర?"
విసుగ్గా పెట్టాడు శ్రీహరి ముఖం. "వృథాగా తర్కించుకు, శాంతీ అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటి స్థితి వేరు. సక్రమంగా సద్భావంతో ఎక్కడున్నా వారికి చింత ఉండదు. కాని నువ్వు వివాహానికే విముఖంగా ఉన్నానని తెలిసిఎంత బాధపడుతున్నారో ఎరుగుదునా? నాకు వీలుండదు. తమ్ముడెక్కడో ఉన్నాడు. నువ్వు సరేసరి, ఇక వదినగాక ఎవరున్నారు, వారి మనస్సు సాంత్వన పొందేట్టు చేయడానికి?"
శాంతి మౌనంగా భూమికేసి చూస్తూ నిలబడింది. సమాధానం రాకపోయేసరికి వెళ్ళిపోతున్న శ్రీహరి, చెల్లెలి పిలుపుకు వెనుదిరిగాడు.
"రాజా నొకసారి కలుసుకోవాలి వెళ్ళేముందు రమ్మని ఫోన్ చెయ్యి." స్థిరంగా ఉంది శాంతి గొంతు.
