Previous Page Next Page 
శాంతినికేతన్ పేజి 12


    "నిజమే. శుభ్రం తక్కువ. వీధులూ అంతే" అంది లక్ష్మీదేవి.

                                     8

    శుక్రవారం సాయంత్రం నలుగు గంటల వేళ టాగూర్ 'రెక్' చదువుకుంటూన్న వెల్లెలి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, శ్రీహరి.
    "పుస్తకం మూసేసి, "ఏమన్నయ్యా?" అనడిగింది శాంతి.
    "నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలి, శాంతీ. మంచి రోజుకోసం చూస్తూ యిన్నాళ్ళూ నీ దగ్గర ఈ ప్రసక్తి తేలేదు."
    నవ్వింది శాంతి "అయితే తిథి నక్షత్ర వర్జ్య వారలన్నీ చూచి వచ్చావా? ఏమిటా గొప్ప సంగతి?"
    కొంచెంసేపు ఊరుకొని, "రాజా గురించి నీ అభిప్రాయమేమిటి, శాంతీ?" అన్నాడు.
    ప్రశ్న వినగానే శాంతి నివ్వెరపోయింది. వెంటనే విషయం అర్ధమైంది. అన్నయ్య అర్ధయుక్తమైన మాటలు, రాజా కొంటెతనం, తల్లిదండ్రుల రాక- అన్నిటినీ సమన్వయ పరచసాగింది, ఆమె మనస్సు.
    "మాట్లాడవేం? సిగ్గా?"
    ఇక ఏదో ఒకటి సమాధానం చెప్పవలసి ఉంది శాంతి. చెప్పటం అవసరం కూడాను.
    "అభిప్రాయమంటే? ఏమిటి? ఎందుకు?" తిరిగి ప్రశ్న వేసింది.
    "అంటే అతడి అందచందాలు, గుణగణాలు వగైరా, వగైరా...." అని నవ్వేశాడు.
    శాంతి నవ్వలేదు. "నా కే అభిప్రాయమూ లేదు. అటువంటి ఆలోచనలు రావు నాకు."
    విస్తుపోయాడు శ్రీహరి. చెల్లెలి ధోరణికి. "ఒక వ్యక్తితో పరిచయమున్నప్పుడు సాధారణంగా వాళ్ళపై ఏదో ఒకరకం అభిప్రాయం ఉండడం సహజం కదా?"
    నవ్వింది శాంటి. "మరి నీ స్నేహితులను చాల మందిని పరిచయం చేశావు యిదివరలో నాకు."
    కొద్దిగా కోపంవచ్చినా శ్రీహరి పైకి కనిపించనీయలేదు. "అటువంటి పెంకె సమాధానాలు వదిలెయ్యి. శాంతీ. నేను సీరియస్ గా అడుగుతున్నాను. రాజాకూ, మరొకరికీ పోలికా? అతడిలో నీ కేమీ ప్రత్యేకతలే కన్పించలేదా?"
    శాంతి ముఖం గంభీరమై పోయింది. ఒక్క సారి అన్న ముఖంలోకి చూచి కళ్ళు వాల్చేసింది. కాని సమాధానం చెప్పలేదు.
    "రాజా అన్నివిధాలా యోగ్యుడు. సౌందర్యం, విద్య అంతస్థు - ఒకటేమిటి? అన్నివిధాలా మన యింటికి తగినవాడు. పైగా నీలాగే కళాభిరుచి ఉన్నవాడు కూడా. మీ ఇద్దరికీ వివాహానికి తగుతుందని అనుకుంటున్నాను."
    అయోమయంగా చూచింది, శాంతి.
    "అలా చూస్తావేమిటి? ఇది అందరికీ వచ్చింది. ఇక నీ అంగీకారమే తరువాయి. అందుకే అసలు అమ్మనీ, నాన్నగారినీ రప్పించాను" అంటూ శాంతి ముఖంలో రంగులు చూడబోయాడు, శ్రీహరి.
    నేలకేసి చూస్తూ, శాంతి తల బాగా వంచుకు కూర్చునుండడంవల్ల అతడి ప్రయత్నం సఫలం కాలేదు. కాని శాంతినుండి ఒక్క బలమైన నిట్టూర్పు వెలువడడంమాత్రం గమనించాడు.
    అలా తల వంచుకునే శాంతి చాలా తగ్గుస్వరంలో చెప్పింది: "నాకు వివాహంనీద కోరిక లేదన్నయ్యా." అలా అంటూనే లేచి అక్కడినుంచి వెళ్ళిపోబోయింది. కాని శ్రీహరి వెళ్ళనివ్వలేదు. చెయ్యి పట్టుకుని ఆపాడు. "కొంచెం ఆలోచించు, శాంతీ. అలా తొందరపడకు."
    నీరసంగా నవ్వింది శాంతి. "నేను చిన్నపిల్లను కాదన్నయ్యా. నా మనసు నాకు తెలుసు."
    "అదేం మాట, శాంతీ? వివాహం చేసుకోక ఏం చేద్దామనీ?"
    "వివాహమే జీవితపరమావధా? వివాహ మంత అర్ధంలేని పని అదేకాని మరొకటి లేదు."
    "కాక యింకేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీహరి. "చిన్నపిల్లను కానని నువ్వే చెప్పావు కదా? అందుకే బాగా ఆలోచించుకోవాలి. చుట్టూ ఇంతమందిని, రకరకాల ప్రజలను, అనేక వర్గాలవారిని, జాతులవారిని చూస్తున్నావు కదా? అందరూ చేస్తున్నదేమిటి? ఈ వివాహాలెందుకు? ఇదంతా నీ దృష్టిలో అర్ధంలేని పనేనా?"
    నిర్లక్ష్యంగా నవ్వింది శాంతి. "చూస్తూండబట్టే అటువంటి నిర్ణయానికొచ్చాను. చూడక పోతే, ఆలోచన లేకపోతే అందులో ఏదో స్వర్గమున్దనే భ్రమపడుదును. ప్రేమనీ, పెల్లినీ ఎగిరెగిరిపడి ఉవ్విళ్ళూరుతూ ఏదో అనుభవిద్ధామని వివాహాలు చేసుకోవడం, తీరా అయిన తర్వాత ఆ ఊహామాధుర్యాల రంగు రంగుల నీటిబుడగ ప్రేలిపోయి నిర్వచనమేకాని, ఆకారం లేని ఆ ప్రేమ - పెళ్ళి తెరలచాటున ఉన్న కఠోర సత్యం బయటపడుతుంది. గృహ నిర్వహణ, తాపత్రయం, అనుమానాలు, ధనాభావం, పిల్లలు - ఒకటేమిటి? అనేకమైన చికాకులతో    అభిప్రాయాలు, ఆదర్శాలు నట్టేట కలుపుకొని, మొండికెత్తిపోయి చావలేని బ్రతుకులు బ్రతకాలి."
    "శాంతీ!" అనిర్వచనీయమైన ఆవేదనతో అరిచాడు, శ్రీహరి. "చాలావరకు పోయాయి నీ ఆలోచనలు. కొలది కష్టాలుంటే ఉండవచ్చు కాని, మరీ అంత దారుణంగా మాట్లాడతావేమిటి? అవివాహితులైతే అన్నీ సుఖాలేనా? వాళ్ళకే కష్టాలూ లేవంటావా?"
    "............."
    "అంతెందుకు? నన్నూ, వదిననూ చూస్తున్నావు కదా? మా విషయంలో కూడా నీ అభిప్రాయం అంతేనా?"
    "క్షమించన్నయ్యా. నేను చెప్పేది ఒక వ్యక్తిత్వమంటూ ఏర్పడిన స్త్రీల గురించి. ఆమెకు నీ ఆజ్ఞావర్తనమే కాని తన వ్యక్తిత్వం గుర్తు ఉండదు."
    దెబ్బతిన్నట్లు చూచాడు, శ్రీహరి అలా అయిదు నిమిషలు కన్నార్పకుండా చెల్లెల్ని చూచి, మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. అతడికి కోపం వచ్చిందని గ్రహించింది, శాంతి.
    "అమ్మా! పద్మా, నువ్వూ ఏమైనా ప్రాయత్నించి చూడండి. చాలా మూర్ఖంగా ఉంది దాని ధోరణి" అంటూ బయటికి వెళ్ళిపోయాడు, శ్రీహరి.
    "ఇంతవరకూ అన్నయ్య గొడవ అయింది. మళ్ళీ మీరేమిటి, పెళ్ళో పెళ్ళో అని? నా దగ్గర మళ్ళీ ఈ సంగతి ఎత్తవద్దు' అంటూ కయ్యిమంది. అసలు మాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు" అని చెప్పింది పద్మ, రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన శ్రీహరికి.
    "ఊఁ. దాన్ననవలసిన పనిలేదు. నాన్నగారలా తఃయారుచేశారు దాన్ని అతి గారాబంచేసి" అని. విసుక్కున్నాడు, శ్రీహరి.
    అది విన్న బలరామయ్యగారికి కోపం వచ్చింది. "ఇప్పుడేం కష్టమొచ్చిందిరా?" కఠినంగా ప్రశ్నించారు. శాంతి విషయంలో ఎవ్వరూ కఠినంగా మాట్లాడటం సహించరు ఆయన.
    "అది కాదు నాన్నా....." ఏదో చెప్పబోయాడు, శ్రీహరి.
    "నాకు తెలుసు, నువ్వు విశదీకరించ నవసరం లేదు. ముందు శాంతి అంగీకారం తీసుకునే నువ్వు మాకు కబురంపవలసింది. ఏవిదంగానూ శాంతి మనస్సు బాధపడకూడదు. అది నాకు బరువు కాదు. నా లక్ష్మి."
    "నాన్నా!" దీనంగా ఉంది శ్రీహరి గొంతు. "ఒక్కగా నొక్క చెల్లెలు. నాకుమాత్రం బరువా? శాంతి నాకు ప్రాణం. కాని రాజా దాటిపోతే యిక అటువంటివాడు దొరకడని నా బాధ."
    "దైవనిర్ణయం. మనమేం చేస్తాం? కాని శాంతిని బలవంతపెట్టకండి." ఆజ్ఞాపించాడు బలరామయ్య. ఆ ఆజ్ఞకు ఇక తిరుగు ఉండదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS