ఆ పేరు చూస్తూనే ఆశ్చర్యపోయింది చంద్రిక.
"అరె! మోహన్ గారా!" అంది నమ్మలేనట్లు.
"అవును గుర్తుకొచ్చింది. మోహన్ అని చెప్పారు పేరు. నీకు తెలుసా ఆయన?"
"ఆయన తెలీకపోవడమేమిటి నాన్నా! ఇప్పుడున్నవాళ్ళలో పెద్దప్రొడ్యూసర్ వీరే! వీరి తర్వాతే ఎవరయినా" అంటూ ఫోన్ అందుకుందామె. ఇదే అవకాశమనిజగన్నాధం అక్కడనుంచి జారుకుని తన గదిలోకి చేరుకున్నాడు.
ఫోన్ లో మోహన్ మాట్లాడాడు.
"నమస్తే చంద్రికగారూ! ఎప్పుడొచ్చారు మీరు?"
"ఇంతకు ముందేనండీ! రాగానే మీరు వచ్చారని తెలిసింది."
"అవునండీ! మీతో మాట్లాడాలి. ఎప్పుడు రమ్మంటారు?"
"సాయంత్రం ఏడుగంటలకు ఇంటిదగ్గర వుంటాను"
"ఓ.కే. ఆ టైంకి వస్తానులెండి"
ఫోన్ పెట్టేశాడతను.
తప్పక తనను అతని సినిమాలో బుక్ చేసుకోవటానికే అతను నిర్ణయించుకుని ఉంటాడు. లేకపోతే అతనెవరిదగ్గరకూ రాడు. ఎవరితోనూ అవసరం లేనిదేమాట్లాడడు.
ఇప్పుడు నాలుగు లక్షలకు కొన్ని చిత్రాలు వప్పుకుంది. మిగతావి అంతకంటే కూడా తక్కువే.
కానీ తనకు పెరుగుతున్నడిమాండ్ కి తనింకా నాలుగు లక్షలకు అంగీకరిస్తూకూచుంటే ఎక్కువ ఆదాయం తక్కువ అయిపోతుంది.
ఇలాంటి పేరున్న బానర్ దగ్గరే తనవాల్యూ పెంచుకోవాలి. ఒకసారి తను తీసుకునే మొత్తం పెరిగిందంటే అదింక ఎప్పటికీ అలానే ఉండిపోతుంది.
వంటామె కాఫీ, ఫలహారం తీసుకొచ్చి ఆమె ముందుంచింది. ఫలహారం చేయసాగింది చంద్రిక.
పదిగంటలకల్లా తిరుపతి చేరుకుందామె. కారు వచ్చేసింది.
త్వరత్వరగా రడీ అయి షూటింగ్ స్పాట్ కి బయల్దేరింది. తనను చూడగానే పనిచేస్తున్న వాళ్ళందరూ గౌరవంగా పలుకరించారు. కొంతమంది నమస్కారాలు చేశారు.
తనకు తేడా తెలుస్తూనే ఉంది. కొంచెం పేరు ప్రఖ్యాతులొస్తే చాలు! ఎక్కడలేని గౌరవమూ లభిస్తుంది ఫీల్డులో.
మొదట్లో తనీస్టూడియోకి వచ్చినపుడు అందరూ తనని పురుగుని చూసినట్లు చూసేవారు. తన చిత్రం శతదినోత్సవం చేసుకోవడం, తననటనకు గుర్తింపురావడంతో తనునటిస్తున్న మిగతా చిత్రనిర్మాతలు తనకు అదివరకులేని గౌరవం ఇస్తున్నారు.
"ఏమిటి శతదినోత్సవాల విశేషాలు?" నవ్వుతూ దగ్గరకొచ్చి అడిగాడు డైరెక్టరు.
"చాలా ఎంజాయ్ చేశాం!" నవ్వుతూ చెప్పింది చంద్రిక.
"అన్నీ విన్నాన్లే! జనం మీరు కనిపించేవరకూ వదల్లేదటగదా!"
"అవును!"
"నిజంగా ఇంత తక్కువ పీరియడ్ లో అంతపేరు తెచ్చుకోవడం గొప్ప విశేషం....." చంద్రిక మేకప్ రూమ్ లోకి నడిచింది.
మేకప్ మన్ శివనాధం ఆమెకు గౌరవంగా నమస్కరించాడు. మేకప్ పూర్తయ్యాక డ్రస్ మార్చుకుందామె.
సెట్లో కొచ్చి ఓ సోఫాలో కూర్చుంది.
"కౌశల్ గారేరీ?"
"ఇప్పుడే ఫోన్ వచ్చిందండీ! బయల్దేరుతున్నారట" చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్.
"అయితే నేను ఆలశ్యంకాదన్నమాట!"
"ఎలాగయినా ఒకటేలెండి! హీరోగారు ఇంటిదగ్గరే మేకప్ అయి వస్తున్నారు!"
"ఓహో"
అతను ఆమెకు స్క్రిప్ట్ అందించాడు. ఓసారి చదువుకుంది చంద్రిక.
"నమస్కారమండీ!"
తలెత్తి చూసింది చంద్రిక. రచయిత రత్నారావ్ నిలబడివున్నాడు.
"నమస్తే!" ప్రతి నమస్కారం చేసిందామె.
"ఈ సీన్లో మీకు ఇబ్బందికలిగించే పదాలేమీలేవుకదా?" నమ్రతగా అడిగాడతను. ఆమెకునవ్వువచ్చింది.
ఇంతవరకూ ఎవరూ తననీ ప్రశ్న అడగలేదు. సాధారణంగా పెద్ద హీరోలకూ, హీరోయిన్ లకూ మాత్రమే ఈ సౌకర్యం.
"అన్నీ బాగానే ఉన్నాయిలెండి!" నవ్వుతూ చెప్పింది.
"థాంక్యూ!" అతను వెళ్ళిపోయాడు.
కౌశల్ హడావుడిగా వచ్చాడు.
"లేటయ్యానా!" అడిగాడు టైం చూసుకుంటూ.
"ఆ - ఎంతలెండి! పదినిమిషాలు!" తేలిగ్గా చెప్పాడు డైరెక్టర్.
అక్కడున్న వారంతా కౌశల్ కి గౌరవ సూచకంగా లేచినిలబడ్డాడు. లేచి 'నమస్తే' అంది చంద్రిక చిరునవ్వుతో.
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న పెద్ద హీరోలు తక్కువమంది. ఆ కొద్దిమందితోనూ జాగ్రత్తగా ప్రవర్తించకపోతే తనలాంటి హీరోయిన్లకు మనుగడ ఉండదు. ఈ విషయం ఫీల్డ్ లో అందరికీ తెలుసు.
నిజానికి కౌశల్ నటుడు కాదు.
అతనికసలు 'నటన' అనేది తెలీదు. ఈ విషయం ఫీల్డ్ లో అందరికీ తెలుసు. అటు ప్రజలకూ తెలుసు.
కానీ అతడు అదృష్టవంతుడు. కేవలం అదృష్టం వల్ల అగ్రనటుడిగా నిలబడ్డాడతను. అతనికున్న అర్హత ఒకే ఒక్కటి, అందగాడు అంతే! అంతకు మించి మరే అర్హతా లేదు. అయితే అతనికంటే అందం ఉన్నవాళ్ళు కూడా అవకాశాలు లభించకఅడుగంటిపోయారు.
"నమస్తే చంద్రికగారూ! విజయవాడ, బందరు శతదినోత్సవాలకు వెళ్ళినట్లున్నారు కదూ!" అడిగాడు కౌశల్.
"అవునండీ! ఇవాళే వచ్చాం!"
"పేపర్లో ఫోటోలు చూశాను లెండి!"
ఇద్దరూ కెమెరాముందుకి నడిచారు. అసిస్టెంట్ డైరక్టర్ కౌశల్ కి స్క్రిప్ట్ అందించాడు. డైరెక్టర్ కెమెరామెన్ కి వివరాలు చెప్తున్నాడు.
"చంద్రికగారు ఇంట్లోనుంచివస్తారు. కౌశల్ గారు సోఫాలోపడుకుని పేపర్ చదువుతూంటారు. డైలాగు....."
లైట్స్ ఆన్ - అంతాహడావుడి లైట్లు వెలిగినయ్.
"యాక్షన్"
చంద్రిక లోపల్నుంచి వచ్చి సోఫాలో పడుకున్న కౌశల్ ని చూసింది.
"అయితే మీరు ఇంట్లో ఉండికూడా నాకు అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారన్న మాట!" అంది కోపంగా.
"అభిమానాలకూ, అవమానాలకూ బెదిరిపోతే ఎలా? అన్నీ సమంగా సహించడం నేర్చుకోవాలి!" నవ్వుతూ అన్నాడు కౌశల్.
"అన్నీ సహించాల్సినగతి నాకేం పట్టలేదు! నేనిప్పుడే మా ఇంటికెళ్ళిపోతున్నాను....." రోషంగా అని గదిలో నుంచి బయటకు నడిచిందామె.
"గుడ్, బావుంది!' సంతృప్తిగా అన్నాడు డైరక్టర్.
అసిస్టెంట్ క్లాప్ కెమెరా ముందుంచాడు.
"టేక్....."
