చంద్రిక మళ్ళీ అదే నటన ప్రదర్శించింది.
'కట్' అరిచాడు డైరెక్టర్.
ఒంటిగంట వరకూ షూటింగ్ జరుగుతూనే వుంది.
అన్నీ తనూ, కౌశల్ ఉన్న షాట్ లే! అంచేత త్వరత్వరగా జరిగిపోయింది. అందరూ భోజనాలకు బయల్దేరారు. కౌశల్, డైరెక్టరూ, కెమెరా మన్, చంద్రిక కలిసే భోజనం చేశారు. మధ్యాహ్నం వేర్వేరు యాక్టర్స్ కాంబినేషన్స్ ఉన్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగింది.
ఎనిమిది గంటలకల్లా ఇల్లు చేరుకుంది చంద్రిక.
స్నానం చేసి తనగదిలో పడుకుండిపోయింది. బడలిక వల్లనిద్ర ముంచుకొస్తోంది. కానీ అతికష్టం మీద నిద్రఆపుకుంది.
ఆ రాత్రే మళ్ళీ పదిగంటలకు మరోచిత్రంతాలూకా షూటింగ్ కి హాజరవాలి. రెండుగంటల వర్క్ ఉంటుంది. ఆ చిత్రం స్క్రిప్టు తీసుకుని పరిశీలించసాగిందామె.
కధ ఏమాత్రం బావుండలేదు. డైలాగులూ అంతే! ఏమాత్రం స్క్రిప్టువాల్యూలేదు. అయినా పట్టించుకునేవారెవరు?
ఆ చిత్రానికి కధ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం అన్నీ ఒక్కరే! సరిగ్గా ఏడుగంటలకు మోహన్ వచ్చాడామె ఇంటికి.
ఓ నిమిషం ఏవేవో విషయాలు మాట్లాడాక అసలు విషయం ప్రస్తావించాడు.
"మా నెక్స్ట్ ప్రొడక్షన్ లో మీరుండాలి! ఏమంటారు?" అన్నాడు నవ్వుతూ.
"మీరు అడిగితే కాదనేదేముందీ? ఏ కారెక్టరు?"
"హీరోయిన్!"
"హీరో ఎవరు?" కుతూహలంగా కొద్దీ అడిగిందామె.
"ప్రేమకుమార్!"
ఉలిక్కిపడిందామె. కొద్దినిమిషాలు ఆమె గుండెలు ఆనందం పట్టలేకవేగంగా కొట్టుకున్నాయ్.
అతను ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఏకైక కధానాయకుడు తను ఈ ఫీల్డులోకి రాకముందునుంచే అతను తన అభిమానహీరో అతని సరసననాయికగా నటించేఅవకాశం ఇంత త్వరగా లభిస్తుందనుకోలేదు.
"మరి మీకెంత ఇవాలో చెప్పారు కాదు!" అడిగాడతను.
"ఇంతవరకూ తక్కువే తీసుకున్నాను. కానీ డిమాండ్ పెరగడం వల్ల పదిలక్షలు తగ్గగూడదనుకుంటున్నాను" ఉన్నదున్నట్లు చెప్పిందామె. అతడునవ్వేశాడు.
"మీరు మరీ ఇంత ఓపెన్ గా మాట్లాడుగూడదు. మన ఫీల్డు మంచిదికాదు!" చంద్రిక కూడా నవ్వేసింది.
"ఆల్ రైట్! పదిలక్షలిస్తాను. బ్లాకులో ఎంత ఇవ్వాలి?"
"మీ ఇష్టం! ఆ గొడవలన్నీ నాకు తెలీదు"
"అలాగయితే మీరు సెక్రటరీని ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మీకు సెక్రటరీ చాలా అవసరం. కాల్ షీట్లూ- ఆ గొడవలన్నీ మీరు చూసుకోవడం కష్టం! అలాగే ఈ టాక్స్ గొడవలు కూడా!"
"అవునండీ! నేనూ అదే అనుకుంటున్నాను"
"సరే - ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తాను! మిగతా విషయాలన్నీ మరోసారి మాట్లాడుకుందాం! మాది రెండు మూడు రోజుల్లో ఫైన్లైజ్ అయిపోతుంది అంతవరకూ ఎవరికీ కొత్తకాల్ షీట్స్ ఇవకండి!"
"అలాగే!"
అతను చెక్ బుక్ తీసి లక్షరూపాయలకు ఆమెపేర చెక్కురాసి ఇచ్చాడు. అతను వెళ్ళిపోయినచాలాసేపటి వరకూ అతని గురించే ఆలోచిస్తూండిపోయిందామె.
అతనిలాంటి మంచిమనుషులు ఎంతమంది ఉంటారు ఈ పరిశ్రమలో ఒకరో, ఇద్దరో! అంతే! అంతనెంత మంచివాడు కాకపోతే తనకు అంత మంచిసలహాలిస్తాడు?
అలాంటి వ్యక్తికిసహాయం చేయగలఅవకాశం తనకెప్పటికయినా లభిస్తుందా? ఏమో! తనకు నమ్మకం లేదు. అయినా అతనికలాంటి అవసరం కలగకూడదు.
అతనిలాంటి వ్యక్తులు ఎప్పుడూ నష్టపోకూడదు.
అతను పదిలక్షలివ్వడం వల్ల ఇకముందు ఏ నిర్మాత అయినా పదిలక్షలకు సంసిద్ధమవాల్సిందే. నిజంగా ఈరోజు చాలా అదృష్టకరమయిన రోజు తనకు. ఆర్ధికంగా కూడా తను ఓ దశకు చేరుకోబోతున్న తరుణం ప్రారంభమయింది ఇప్పుడు. పక్కనే ఉన్న ఫోన్ మోగడంతో ఆలోచనల్లో నుంచి తేరుకుని రిసీవర్ తీసుకుంది చంద్రిక.
"హలో"
"నమస్కారమండీ! నేను రామదాస్ ని మాట్లాడుతున్నాను. ఆంధ్రదీపిక వారపత్రికసినిమా విలేఖరిని!"
"నమస్తే! ఏమిటి విశేషం చెప్పండి!"
"మీతో ఇంటర్ వ్యూకోసం వారంరోజుల్నించీ ప్రయత్నిస్తున్నాను. మీరు బిజీగా ఉండడంవల్ల కాంటాక్ట్ చేయడం కుదరడంలేదు. దయచేసి మీరెప్పుడు తీరికగా ఉంటారో చెప్తే....."
చంద్రిక కొద్దిక్షణాలు ఆలోచించింది.
"రేపు ఉదయం ఎనిమిది, పది మధ్య తీరిగ్గానే ఉంటాను"
"థాంక్యూ వెరీమచ్! రేపు ఎనిమిదన్నర కల్లావచ్చేస్తానండీ!"
"అలాగే...." ఫోన్ పెట్టేసిందామె.
సినిమా తారలకు సినిమాజర్నలిస్టుల అవసరం ఎంత ఉంటుందో తనకు తెలుసు. కానీ అదంతా ప్రేక్షకుల్లో గుర్తింపు పొందేవరకే ఆ తరువాత అంత ఎక్కువ ఉపయోగం ఉండదు.
అయితే గాసిప్ కాలమ్స్ రాసే హిందీ జర్నలిస్ట్ ల వల్ల కొన్ని లాభాలున్నాయ్. అబద్దాలయినా వారురాసే వార్తలుఅందరినీ తమమీద కుతూహలంకలిగిస్తాయ్. ఒకోసారి కొన్ని విచిత్రమయిన అబద్దాలు రాయడంవల్లకొన్ని చిత్రాల్లో బుక్ అయే అవకాశాలు కూడా లభిస్తాయ్.
తెలుగు చిత్రపరిశ్రమలో అంత ధైర్యంగల జర్నలిస్ట్ లూ లేరు. అలాంటి వార్తలను సహించగలనటీనటులూ లేరు.
ఎవరి విషయమో ఎందుకు? తన గురించి లేనిపోనికల్పితాలు రాస్తే తనూరుకొంటుందా?
రామ్ దాస్ సంగతి సరేసరి. తనకు బాగా తెలుసు. అతని పొగడ్తలు జుగుప్స కలిగిస్తాయే! అతని దృష్టిలో తారలందరూ ఇంచుమించుగా దేవుడితో సమానం.
అతను వారిని ఎందుకంతగా నెత్తిన పెట్టుకుని పూజిస్తాడో కూడా తనకు తెలుసు. అలా పొగిడినందుకు ఆయా తారలనుంచి అతనికి తృణమెపణమో ముడుతుంది.
మర్నాడు చెప్పినట్లే ఎనిమిదిన్నరకల్లా ప్రత్యక్షమయ్యాడు రామదాస్.
వంట మనిషి శాంతమ్మ అతని విజిటింగ్ కార్డ్ తెచ్చి ఇచ్చింది చంద్రికకు.
"కూర్చోమని చెప్పు! నేను పదినిముషాల్లో వస్తాను..." అంది చంద్రిక.
ఆమె రడీ అయి మేడ దిగేసరికి రామదాస్ తన నోట్ పుస్తకంలో ఏదో రాసుకుంటూ కూర్చుని ఉన్నాడు.
"నమస్కారమండీ!" అన్నాడు ఆమెను చూడగానేవినయంగా లేచినిలబడి.
"నమస్తే! కూర్చోండి" అంది చంద్రిక చిరునవ్వుతో.
"మీరు నటించేసినిమాలన్నీ శతదినోత్సవాలు చేసుకుంటాయని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు" అన్నాడతను. చంద్రికకు నవ్వువచ్చింది.
"అప్పుడే పొగడ్తలు మొదలు" అనుకుందామె.
"అందుకని ఇకనుంచీ మీపేరు 'శతదినోత్సవనటి' అని మార్చేయాలనుకుంటున్నాను" తిరిగి అన్నాడతను.
"మీరు పేరు మార్చినంతమాత్రాన సినిమాలు శతదినోత్సవాలు చేసుకుంటాయా ఏమిటి" కావాలనే హేళనగాఅందామె.
"అహహ! అలా అనకండి! నేను మన అగ్ర నటీనటులందరికీ సరిగ్గా సూటయే పేర్లు పెట్టాను. మా పాఠకులంతా సతోషించారు. ఆ పేర్లతోనే వారూ సంభాషించుకొనేప్పుడు రిఫర్ చేసుకుంటూంటారు".
