"సుశీలా! మన పరిచయం అయిన ఈ ఏణ్ణర్థంలోనూ నేను ఏనాడూ నీ గురించి వివరాలు తెల్సుకోవాలని గట్టిగా ప్రయత్నించలేదు. కులాలు, గోత్రాలు అడగడం సభ్యత కాదని... చదువుకునీ, సంస్కారం అలవరుచుకున్నామనుకుంటూ రెండు మనసులు కలిశాక ఇంకా కులగోత్రాలు అడ్డుగోడలు కాకూడదు అని నిర్ణయించుకున్నాను. నాకు నచ్చింది నీ రూపం, నీ సంస్కారం, నీ సహృదయత. నా అర్థాంగిగా ఏమేం కావాలని కోరుకున్నానో అవన్నీ నీలో కనిపించి సంతృప్తి పడ్డాను. సింపుల్ గా, నిర్మలంగా, చక్కని శరీర సౌష్ఠవంతో, శుచిగా, శుభ్రంగా, విజ్ఞానంతో మెరిసే నీ కళ్లల్లో తెలివితేటలని చూసి నీవు అయినింటినించి వచ్చిన అమ్మాయివి అయివుండవు అన్న ఆలోచనే రాలేదు నా మనసులోకి ఎప్పుడూ. ఒకసారి ఏదో మాటల సందర్భంలో నీ తండ్రి సివిల్ సప్లయ్ ఆఫీసులో పనిచేస్తున్నారని చెప్పావు. ఏదో మామూలు గుమాస్తా ఉద్యోగం అయి వుంటుంది. ఏ పెద్ద ఆఫీసరో అయితే ఆ విషయం చెప్పేదానివి గదా! 'సరే నాకు కావాల్సింది నీ తండ్రి హోదా కాదు గదా!' అనుకున్నాను.
అక్కడే నేను చాలా పొరపాటు చేశానని యిప్పుడు తెలుసుకున్నాను. సుశీలా! వివాహం అంటే ఇద్దరి మనసుల కలయిక, యిద్దరి కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక. నా కుటుంబం, నీ కుటుంబం మధ్య పూడ్చలేని అగాధమంత దూరం వుంది అన్నది నీ దగ్గరున్న మూడు రోజులలో నాకర్థం అయింది. నా తండ్రి జిల్లా జడ్జి, నా తల్లి కాలేజీ లెక్చరరు. నా చెల్లెలి భర్త పెద్ద డాక్టరు, నా తమ్ముడు ఇంజనీరు, నా తాతగారు ఆ కాలంలోనే పెద్ద వకీలు, నా మాతామహుడు ఆ రోజుల్లో ఐ.పి.ఎస్. చేసిన విద్యాధికుడు. ఉన్నతవర్గంలో, ఉన్నత కుటుంబంలో నిష్ఠ, నియమాల మధ్య పుట్టి పెరిగిన నేను నిన్ను చేసుకుంటే కులాల, గోత్రాల భేదాలు అటుంచి ఆ వాతావరణంలో ఇమడగలనా అనిపించింది. నిజంగా నేనేనాడూ ఊహించనంత షాక్ అయ్యాను నీవాళ్లని చూసి. నిన్ను చూసి నీలాగే నీవాళ్లు చదువు, సంస్కారం వున్నవాళ్లు అయివుంటారని పొరపడ్డాను. బడుగు వర్గాలు, చేయూతనివ్వాలి, పైకి తేవాలి - ఇలాంటి కబుర్లన్నీ వుత్తప్పుడు బాగుంటాయిగాని, వివాహ సందర్భంలో మనవాళ్లు అనే 'సమాన వియ్యం' అనే మాటకి అర్థం నాకిపుడు బాగా బోధపడింది.
పోనీ నీవాళ్లతో నాకేమిటి అనుకుందామన్నా... ఆ యింట్లో అందరికీ ఆధారం నీవన్నది నా కర్థం అయింది. నీ తమ్ముడిని పైకి తేవాలి. నీ చెల్లెలికి పెళ్లి చెయ్యాలి. దమ్మిడీ సంపాదన లేని నీ తల్లితండ్రుల పోషణ జీవితాంతం నీదే అన్నది అర్థం అయ్యాక పెళ్లి అయిన తరువాత - 'నీ వాళ్లని వదిలేయి, వాళ్లకీ నీకూ ఏ సంబంధం వుండరాదు' అని ఆంక్షలు పెట్టేంత దుర్మార్గుడిని కాలేను. పెళ్లి అయి నా భార్య తనవాళ్లని ఆదుకుంటూ తన సంపాదన అంతా వారికే వినియోగించుకుంటే ఆమోదించగలిగే సంస్కారం, సహృదయత నాకున్నాయని అనిపించడం లేదు.
ఈ పెళ్లి చేసుకుని నా వాళ్లందరి మధ్య అవహేళనలకి గురి అయి, అవమానాలు సహించాల్సి వుంటుంది అన్నది తెలుస్తూంది. నావాళ్లు నిన్నెప్పటికీ కోడలిగా అంగీకరించరు. నీ వాళ్లని అసలు వారి దరిదాపులకి కూడా రానీయరు. ఇలాంటి స్థితిలో మనం యీ పెళ్లి చేసుకుంటే నా వాళ్లందరికీ దూరం అయి, నీవారి మధ్య ఇమడలేక 'ఎందుకీ పెళ్లి చేసుకున్నాను' అని భవిష్యత్తులో వగచి, విచారించి, దానివల్ల మన మధ్య కలతలు, కలహాలు తలెత్తి కాపురం నరకం చేసుకునే కంటే అది నిష్ఠూరమే నయం అనిపిస్తూంది. కొన్నాళ్లు బాధపడతాం. మరిచిపోవడానికి ప్రయత్నిస్తాం. ఎవరి దారి వారిదవుతుంది. ఎవరి జీవితాలు వారివి అవుతాయి.
గత పదిహేను రోజులుగా అన్ని రకాలుగా ఆలోచించి, ఆలోచించి ఆఖరికీ నిర్ణయం నీకు, నాకు మంచిదే అనిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను క్షమించగలిగితే క్షమించమని కోరుతే...
-రమాకాంత్
ఉత్తరం చదివిన సుశీల మొహం అవమానంతో నల్లబడింది. లోపల్నించి ఉక్రోషం, ఆక్రోశం తన్నుకొచ్చింది. ఎంత దగా... ఎంత అవమానం... ఎంత హేళన! ఎంత వ్యంగ్యం! నీవెక్కడ, నేనెక్కడ అని చెప్పుచ్చుక్కొట్టినట్టు ఎలా చెప్పాడు రమాకాంత్! బంట్రోతు కూతురినని ఈ సమాజంలో మనుష్యులు నన్ను మరిచిపోనీయరన్నమాట! అందని పండ్లకి అర్రులు చాచిందా తను! కలెక్టరయినంత మాత్రాన గతం చెరిగిపోదని రమాకాంత్ లాంటి విద్యాధికులు కూడా నమ్ముతూంటే యింకా తను చెప్పగలిగింది ఏముంది? అవమానంతో, ఆవేశంతో, ఆవేదనతో ఆఫీసులో కూర్చోలేక ఇంటికొచ్చి తలుపులు బిగించుకుని మనసులో బరువు తీరేవరకు ఏడ్చింది నిన్నంతా. ఇంతకీ కారణం తన పుట్టుక, తనవాళ్లు అన్న నిజం మనసులో ముల్లులా దొలుస్తున్న సమయంలో తల్లిదండ్రుల ప్రవర్తన అగ్నిలో ఆజ్యం పోసినట్లనిపించింది. ఏదో విరక్తి, వైరాగ్యం... నిర్లిప్తత, నైరాశ్యం... మనసుని దొలిచేస్తుండగా సుశీల మామూలు మనిషి కాలేకపోయింది.
మర్నాడు డిస్ట్రిక్ట్ కలెక్టరు టూరు మీద వస్తే ట్రావలర్స్ బంగళాలో కల్సుకుని మాట్లాడి రెండుగంటలు ఆలస్యంగా ఆఫీసులో అడుగుపెట్టింది సుశీల. వెంట పి.ఏ. మూర్తి కూడా వున్నాడు. ఆఫీసులో అడుగు పెట్టగానే వినబడిన మాటలకి అప్రయత్నంగానే ఆమె అడుగులు ఆగిపోయాయి.
"ఏంటి? కలెక్టరమ్మగారి అమ్మగారు చెట్లకింద పుల్లలేరుతున్నారుట. రేప్పొద్దుట తట్ట పట్టుకుని పేడ ఏరి పిడకలు చేస్తుందేమో..." డిస్పాచ్ క్లర్క్ సుబ్బారావు నవ్వుతూ అంటున్నాడు.
"కలెక్టరమ్మ అయితే వేడినీళ్లు పోసుకోదా ఏమిటీ? అందుకే పుల్లలేరి కూతురికి కర్రలు ఆదా చేస్తూందయ్యా..." టైపిస్టు నారాయణ ఎగతాళి.
"కర్రలేరుకునేవాళ్లు, పిడకలు చేసుకునేవారు, అంట్లు తోముకునేవారు అందరూ మరి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవబట్టే దేశం యిలా తగలడుతోంది" ముక్కుపొడుం పీలుస్తూ హెడ్ క్లర్క్ సుబ్రమణ్యం అన్నాడు.
'బాగుందోయ్... అంట్లు తోముకునేవారు తోముకుంటూనే వుండిపోవాలంటారేమిటి? వెనకబడిన వాళ్లని పైకి తేకూడదంటారేమిటి?" బంట్రోతు నర్సింలు సానుభూతి.
