"మీరేం వెనకబడిన వాళ్లయ్యా! అదృష్టవంతులయ్యా బాబూ! ముప్ఫై మార్కులు వచ్చినా సీట్లు మీకే. థర్డు క్లాసులో పాసయినా ఉద్యోగాలలో రిజర్వేషన్లు మీకే. చవకబియ్యాలు మీకు, చవక చీరలు మీకు... మీరేం వెనకబడినవారయ్యా? మేమూ వెనకబడినవాళ్లం. అన్ని విధాల నష్టపోతున్న వాళ్లం మా మధ్యతరగతి వాళ్లం" సుబ్రమణ్యం అన్నాడు.
"అద్సరే... కలెక్టరమ్మగారి ప్రేమకథకి తెరపడిపోయిందేమిటయ్యా... ఇంటర్వెల్ కాకముందే! నిన్న ఉత్తరం వచ్చింది. అమ్మగారి మొహం మాడిపోయిన అట్టులా నల్లబడిపోయింది. నాలుగు రోజులు విహారాలు సడన్ గా బ్రేకేసినట్టు ఆగిపోయాయేమిటి?"
"ఏముంది? ఆ రమాకాంత్ గారు యింటికి వచ్చి పిడకలు చేస్తున్న తల్లిని, తుపుకు తుపుకు వుమ్ముతున్న తండ్రిని, చీమిడిముక్కుతో తిరిగే చెల్లెలిని, జులాయిలా తిరిగే తమ్ముడిని చూసి మొహం తిరిగిపోయి పెళ్లి వద్దు, పెటాకులు వద్దు అని పారిపోయి వుంటాడు."
"కాదయ్యా మరి! ఎంత ఈవిడ కలెక్టరయితే మాత్రం వంశం, సంప్రదాయం, కుటుంబం చూసుకోవద్దూ! పెళ్లా, మరొకటీనా? అందులో ఆ రమాకాంత్ గారి తాతముత్తాతలు ఐ.సి.ఎస్.లు, జడ్జీలు... అంత ఉద్యోగాలు చేసినా సంధ్యవార్చనిదే విస్తరి ముందు కూర్చోని సాంప్రదాయం వాళ్లది... వాళ్ల చెప్పులు పట్టుకోడానికి కూడా వీళ్లు సరిపోలేరు..." హెడ్ గుమాస్తా సుబ్రమణ్యం అంటున్నాడు.
"భలేవాళ్లులే... పనిమీద బంగళాకి వెడితే వాళ్లని చూస్తూ నవ్వాపుకోలేక చస్తూంటాను" టైపిస్టు అంటున్నాడు.
గుర్తించలేనట్టుగా నల్లబడిపోయిన మొహంతో స్థాణువులా నిలబడి పోయిన సుశీలని చూసి చప్పున తెలివి తెచ్చుకుని చకచక లోపలికి అడుగులు వేశాడు. పి.ఏ. మూర్తి. వెనకాతల తప్పు చేసినదానిలా తలొంచుకు నడిచి తన గదిలోకి వెళ్లిపోయింది సుశీల. కుర్చీలో కూలబడి అవమానంతో దహించుకు పోతూ... ఆవేశంతో శరీరం వణుకుతుండగా టేబుల్ మీద రెండు చేతుల మధ్య తల నొక్కిపట్టి మనసుని, శరీరాన్ని కంట్రోలు చేసుకోడానికి ప్రయత్నించసాగింది.
"సారీ మేడమ్! ఆఫీసు స్టాఫ్ అందరి తరపున నేను క్షమాపణ చెపుతున్నాను. అందరినీ బాగా కేకలు వేశాను. లోకులు కాకులు. మీరా మాటలన్నీ పట్టించుకో కూడదు" మూర్తి సానుభూతిగా, అభిమానంగా అన్నాడు. సుశీల తెలివితేటలు, ఆమె సమర్థతపట్ల అతనికి నిజంగానే గౌరవం వుంది. "మీరు ఇలా బాధపడకూడదు మేడమ్!"
సుశీల తలెత్తి అతని వంక చూసి శుష్కహాసం చేసింది. "బాధ ఎందుకు? వాళ్లన్నవన్నీ నిజాలేగా!"
"ఏదో ఒకటి అనడం, అనుకోడం జనం నైజం. చెడుని గుర్తించినంత తొందరగా మంచిని గుర్తించి గౌరవించకపోవడం లోకనైజం. వెనుకబడిన తరగతిలో పుట్టినా మీరెంత తెలివితేటలతో, స్వయంకృషితో పైకి వచ్చారన్నది ఎవరూ గుర్తించకుండా... మారని మీవాళ్లని గురించి అవహేళన చెయ్యడం నిజంగా విచారకరం. బాగా మందలించాను. అందరూ బాధపడ్తున్నారు. అలా మాట్లాడినందుకు. ప్లీజ్, ఈ విషయం మీరింక మర్చిపోవాలి. లేకపోతే నేను చాలా బాధపడ్తాను" సిన్సియర్ గా అన్నాడు.
"ఏం చెయ్యను మూర్తిగారూ! ఎంతగా వారిని మార్చాలని ప్రయత్నించినా వాళ్లా పాత అలవాట్లు మార్చుకోరు. వాళ్లని కాస్త సంస్కారవంతులుగా మార్చాలన్న నా ప్రయత్నాలు ఫలించడం లేదు. వారివల్ల నేను ఎంత నగుబాట్ల పాలవుతున్నానో, ఎంత నష్టపోయానో..." ఆవేదనగా అంది సుశీల ఆప్తుడితో చెప్పుకున్నట్టు.
"మేడమ్, మీరు ఒక సంగతి మర్చిపోతున్నారు. మీరు ఈ తరంవారు. చదువుకున్నారు. చదువు సంస్కారాన్నిచ్చింది మీకు. మీ తల్లిదండ్రులు పాత తరంవారు. వారు పుట్టి పెరిగిన పరిసరాలు వేరు. చదువు సంధ్యలు లేక అనాగరికంగా పెరిగిన వారిలో సంస్కారం కొరవడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి! ఏ మార్పూ ఒక్క రోజులో రాదు. తరతరాలుగా మీ పూర్వులందరూ చదువు సంధ్యలు లేకుండా మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి అదే జీవితం అనుకుంటూ కూపస్థమండూకాల్లా బతికారు. ఒక్కసారిగా వారిలో మీరు నాగరికత, సంస్కారం ఎలా తీసుకురాగలరు? ఈ తరంలో మీరు చదువుకున్నారు కనక రేపు మీ పిల్లల తరంలో వాటంతట అవే సంస్కారం, నాగరికత వస్తాయి వారిలో. అలా ఇంకో రెండు జనరేషన్స్ కి మీ అందరూ యింత వెనకబడిన తరగతులవారి కింద జమ కట్టబడరు. మీరు కాస్త ఓర్పుగా, నేర్పుగా వారిని మార్చడానికి ప్రయత్నించాలి.
"మీకు తెలియదు మూర్తిగారూ! నేనెంతగా ప్రయత్నించినా వారిలో మార్పు తేలేకపోయాను. హాయిగా తిని శుభ్రంగా తయారై కూర్చోండి అన్నా కూడా వాళ్లకి కష్టంగానే వుంది. ఇంటి శుభ్రం లేదు, వంటి శుభ్రం లేదు. వాళ్ల వల్ల నేను ఎంత హేళన పాలవుతున్నానో నాకు తెలుసు. అలా అని ఏ ఆధారం లేనివాళ్లని అలా గుడిసెల్లో వదిలేయలేను. ఒకోసారి విరక్తిలో ఏ నాలుగువందలో పారేసి ఆ గుడిసెల్లో పడుండండి అని పంపేద్దామనిపిస్తుంది. కాని వాళ్లు అలా గుడిసెల్లో బతకడమూ మళ్లీ నాకే అవమానం గదా!" ఆవేదనగా అంది.
మూర్తి ఆమె బాధని అర్థం చేసుకున్నట్టు సానుభూతిగా చూశాడు. "మేడమ్! ఒక చిన్నమాట చెప్పనా? మన భారతదేశం మిగతా సంపన్న దేశాలతో పోలిస్తే అతి బీదదేశం. ఈ దేశ ప్రజలలో మూడొంతులమంది చదువు, సంస్కారం లేని మూర్ఖులు. అజ్ఞానంతో, అంధకారంలో పడి కొట్టుకుంటున్న నిర్భాగ్యులు చాలామంది వున్నారు. ఈ దేశంలో బీదరికం, అనారోగ్యం, అజ్ఞానం, అశుభ్రత, ఆకలి, రోగాలు, రొచ్చులు అన్నీ ఎక్కువగానే వున్నాయి. మిగతా దేశాల ప్రగతి చూసి తలలు దించుకోవాల్సిన స్థితిలో వుంది మనదేశం. కాని మనది బీదదేశం అని, మన ప్రజలు దరిద్రులని, సంస్కారం లేనివాళ్లని, యితర దేశాల ముందు తల దించుకోవాల్సిన పరిస్థితిలో వున్నామని యిది నా దేశం కాదని మనం అంటామా? మన ప్రధాని తన దేశాన్ని చూసి సిగ్గుపడతాడా? వీళ్లు నా ప్రజ అని చెప్పుకోడానికి బిడియపడతాడా? చేతనయినంతగా తన దేశాన్ని సుభిక్షం చెయ్యాలని, ప్రజలకి చదువు సంస్కారాలు నేర్పాలని, విజ్ఞానవంతుల్ని చెయ్యాలని తాపత్రయ పడుతున్నారు గదా! విదేశాల సహాయం తీసుకుని తన దేశాన్ని ఆ దేశాల స్థాయికి తీసుకెళ్లాలని తాపత్రయపడుతున్నారు గదా! తన కన్నతల్లిని, తన జన్మభూమిని తనది అని గర్వంగా చెప్పుకోడానికి సిగ్గుపడడం క్షమించరాని నేరం. దేశం ఎలా వుండనీయండి, ఎంత బీదరికంలో వుండనీయండి, ఎంత కుసంస్కారంలో, అజ్ఞానంలో వుండనీయండి, ఆ దేశాన్ని నాది కాదు అని చెప్పుకుంటే ఆ పౌరుడు సిగ్గుపడి తలదించుకోవాలి. అలాగే... అజ్ఞానంలో వున్న మీ వాళ్లని చూసి మీరు సిగ్గుపడడం క్షమించరాని నేరమే అవుతుంది. కన్నతల్లిని, జన్మభూమిని ప్రేమించనివారు క్షమార్హులు కారు. మీరు చేతనయినంతగా మీవారిని పైకి తీసుకొచ్చిననాడే మీ చదువుకి, సంస్కారానికి సార్థకత చేకూరుతుంది. మీవాళ్లని మీ స్థాయికి తీసుకురావడమే మీ ధ్యేయం కావాలి. మీ తరంలో మీరు సాధించిన ప్రగతి మీ ముందు తరాలవారికి మార్గదర్శకం కావాలి. ఎవరో మూర్ఖులనే మాటలకి బాధపడి, సిగ్గుపడితే రేపు మీరేం సాధించగలరు మేడమ్? క్షమించండి, మీ పర్సనల్ మేటర్ అనుకోకపోతే... ఈ రమాకాంత్ కాకపోతే వందమంది ఉమాకాంత్ లు దొరక్కపోరు మీకు. పోనీండి దొరక్కపోతే... జీవితానికి పెళ్లి ముఖ్యమే కాని పెళ్లే జీవితం కాదు. ఈ మాత్రం దానికి మీరు మనసు పాడుచేసుకోకూడదు మేడమ్! క్షమించండి, చాలా ఎక్కువ మాట్లాడినందుకు" ఆవేశంగా అన్నాడు మూర్తి.
అంతసేపు మూర్తి మాటలని విస్ఫారిత నేత్రాలతో వింటున్న సుశీల కళ్లలోకి మెరుపు వచ్చింది. నల్లబడిన ఆమె మొహంలో నలుపు మాయమయింది. ముకుళించిన ఆమె మొహం వికసించింది. "థాంక్స్ మూర్తిగారూ! ఎంత బాగా చెప్పారు. మెనీ థ్యాంక్స్, యూ ఓపెన్డ్ మైఒ ఐస్. థ్యాంక్స్ వన్స్ ఎగైన్..." తేలికపడ్డ మనసుతో టేబుల్ మీద వున్న ఫైలు ముందుకు లాక్కుంది సుశీల.
(వనిత దీపావళి కథల పోటీలలో బహుమతి పొందిన కథ)
* సమాప్తం *
