Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 51


    ఇంక తమ్ముడున్నాడు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క అబ్బదు వాడికి. కాని షోకులకి, వేషాలకి లోటు లేదు. టైము టెర్లిన్ పాంట్సు, చవకరకం జిగేలుమనే షర్టులు, రంగు రంగుల సాక్సు బూట్సు వేసుకుని సెంట్లు రాసుకుని జులాయిలా రోడ్లంతా తిరగడం, క్లాసులు ఎగగొట్టి మాట్నీలకి వెళ్లడం, కిళ్లీకొట్లలో అరువులు పెట్టి సిగరెట్లు కాల్చడం... చెత్త పత్రికలు చదవడం... యిదీ వాడి వరస.
    చెల్లెలుందంటే తొమ్మిదేళ్లు వచ్చినా చెడ్డీ లాక్కుంటూ గౌను అన్నా లేకుండా పెరట్లో మట్టిలో పొర్లుతూంటుంది. చీమిడి ముక్కు, చింపిరి జుత్తు, జుత్తు నిండా పేలు... స్కూలుకి తిట్టి పంపిస్తే దానిష్టం వచ్చినపుడు చెప్పా చెయ్యకుండా యింటికి వచ్చేస్తుంది. తిడితే, కొడితే తల్లి శోకాలు పెడ్తుంది.
    వాళ్లందరినీ ఆదుకుని వాళ్లని సుఖపెట్టాలని తీసుకొస్తే అందరూ కలిసి తనకి తలవంపులు తీసుకొస్తున్నారు. తనవాళ్లని చూసి బంట్రోతులు ఎలా నవ్వుకునేది, డ్రైవరు వాళ్లు ఎలా గుసగుసలాడుకునేది తన చెవిన పడకపోలేదు. బంట్రోతుల ద్వారా ఆఫీసులోకి కూడా వార్తలు వెళ్లి అందరూ తనవాళ్ల గురించి హేళనగా మాట్లాడుకుంటున్నారని తనకి తెలుసు. గత ఏడాదిగా వాళ్ల వలన పనివాళ్లముందు తనెన్నిసార్లు అవహేళనలు, అవమానాలు ఎదుర్కోవలసి వచ్చిందో తనకి తెలుసు.
    ఛీ... వీళ్లు మారరు, వీళ్లని మార్చడం తనవల్లగాదు... విసుగ్గా, ఆవేదనగా అనుకుంది సుశీల కుర్చీలో జారగిలబడి కళ్ళు మూసుకుని. అసలే నిన్నటినుంచి... రమాకాంత్ ఉత్తరం వచ్చిన దగ్గరనుంచి అవమానంతో, ఆవేదనతో ఆమె మనసు ఉడికిపోతూంది. అసలే ఓ రకం విరక్తి, నిరాశ, నిస్పృహల మధ్య టెన్షన్ లో వున్న సుశీలకి ఆ దృశ్యం అవసరాన్ని మించిన ఆవేశాన్ని కలుగజేసింది.
    రమాకాంత్ సుశీలతోపాటు ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ పాసయ్యాడు. ఆ బ్యాచ్ లో వాళ్లిద్దరే తెలుగువారవడంతో మొదట్లో పరిచయం, తరువాత స్నేహం... ఆ తరువాత మనసులు కలవడం... ఒకరంటే ఒకరికి యిష్టం పెరగడం... ట్రైనింగ్ పీరియడ్ సంవత్సరం అయ్యేసరికి యిద్దరూ అతిచేరువ అయిపోయారు. రమాకాంత్ కి ఖమ్మం సబ్ కలెక్టరుగా పోస్టింగ్ వచ్చింది. ఎవరి ఉద్యోగాలలో వారు చేరాక ఆరు నెలల యిద్దరి మధ్య ఉత్తరాలు నడిచాయి. ఎదుట వుండగా చెప్పుకోలేనివి ఉత్తరాల ద్వారా సులువుగా చెప్పుకున్నారు మనసులు విప్పి... నెల రోజుల క్రితం రమాకాంత్ నుంచి వచ్చిన ఉత్తరం అందుకున్న సుశీల మనసు చెప్పుకున్నారు మనసులు విప్పి... నెల రోజుల క్రితం రమాకాంత్ నుంచి వచ్చిన ఉత్తరం అందుకున్న సుశీల మనసు పురివిప్పిన నెమలిలా అయింది. "మన యీ పరిచయం పరిణయంగా మారాలి అని... యీ స్నేహం శాశ్వతబంధం కావడానికి గత ఏణ్ణర్థంగా మనం వేసిన పునాదులు గట్టిపడ్డాయని భావించి... నీ చేయి అందివ్వమని అడగడానికి నాల్గురోజులు సెలవు సంపాదించి వస్తున్నాను. నన్ను కాదనవని, నిరాశ పరచవన్న నమ్మకంతో, ఆశగా చేతులు చాచి వస్తున్నాను..."
    ఆ ఉత్తరం ఎన్నిసార్లు చదువుకుందో సుశీల. సంస్కారం, హోదా, అందం అన్నీ వున్న రమాకాంత్ ని కోరడం అత్యాశ ఏమోనని మొదట్లో జంకింది. రోజులు గడిచాక అతని మాటలు, చేతలు, చూపులు, అర్థం చేసుకోలేనంత వెర్రిది కాదు కనక, వాటికి అర్థాలు తెలిసి మనఃపూర్వకంగా అతనిని అన్నివిధాల ప్రోత్సహించింది. అతను తనవాడయితే యింతకంటే తను కోరుకునేది ఏముంటుంది? అతని రాక కోసం ఆశగా ఎదురుచూసింది.
    అతని కోసం ఆ నాలుగు రోజులు సెలవు పెట్టింది. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇల్లంతా అలంకరించింది. స్వీట్లు, పళ్లు కొంది. తనకోసం చీరలు కొనుక్కుంది.
    స్టేషనులో అతన్ని రిసీవ్ చేసుకుంటూంటే రమాకాంత్ చూసిన చూపుకి మెత్తగా తన చెయ్యి చేతిలోకి తీసుకున్నప్పుడు పులకరించిపోయింది. రెండు రోజులు ఈ లోకంలో లేనట్టే చుట్టూ ప్రపంచాన్నే మరిచిపోయి అతని సమక్షంలో గడిపింది. ఎన్నెన్నో మాటలు, మరెన్నో జ్ఞాపకాలు గుర్తు చేసింది. ఓ రోజు పిక్నిక్, యింకో రోజు పార్టీ... మరో రోజు సినిమా... ప్రోగ్రాంలు వేసింది. అన్నింటి మధ్య రమాకాంత్ వచ్చిన రోజు వున్నంత ఉత్సాహంగా తరువాత లేడన్నది గుర్తించలేక పోయింది. ముందు రోజు మాట్లాడినట్టు తరువాత రోజులు అంత మాట్లాడకుండా ముభావంగా, పరధ్యానంగా వున్నాడన్నది కనిపెట్టలేకపోయింది. అనుకున్నదాని కంటే ఒక రోజు ముందే ప్రయాణం అయ్యాడు. పక్క వూరిలో ఎవరో బంధువులున్నారు చూడాలంటూ బయలుదేరిన రమాకాంత్ ని అర్థం కానట్టు చూసింది.
    రమాకాంత్ వెళ్ళాక గాని... రమాకాంత్ చెప్పాలని వచ్చిన మాలు ఏమీ చెప్పలేదన్నది గుర్తు రాలేదు. చేయి అందుకోడానికి అడగలేదన్నది తట్టాక ఆమె మనసు కాస్త చిన్నబోయింది. ప్రత్యేకంగా యింకా ఏం అడగాలని చెప్పి అడగలేదేమో... భవిష్యత్తు గురించి ఏం చర్చించకుండా, నిర్ణయాలు తీసుకోకుండానే మూడు రోజులు దొర్లించేశారే తాము, అతను ఏదన్నా చెపుతాడేమోనని చూసింది తను. ఏం చెప్పని అతన్ని చూసి యింత దూరం వచ్చాక అడగడాలు, అంగీకారాలు అవసరం ఏమిటని అడగలేదేమో అని సరిపెట్టుకుంది. పది రోజులు రమాకాంత్ నుంచి ఉత్తరం కోసం ఆశగా, ఆరాటంగా ఎదురు చూసింది. ఆమె సందేహాలకి, ప్రశ్నలకి జవాబులుగా ఆఖరికి రమాకాంత్ నుంచి పదిహేను రోజుల తరువాత వచ్చిన ఉత్తరాన్ని ఆనందంగా, ఆశగా, ఆరాటంగా అందుకుంది.
    "డియర్ సుశీలా! ఈ ఉత్తరం ఇలా రాయాల్సి వస్తుందని నేను మన పరిచయం అయ్యాక ఏనాడు అనుకోలేదు. ఎదురుగా చెప్పలేక, నిన్ను నొప్పించలేక మరో గత్యంతరం లేక యిలా రాసినందుకు నీవు ఎంత నొచ్చుకుంటావో, ఎంత బాధపడ్తావో తెల్సినా రాయక తప్పలేదు..." ఆ ఉత్తరం చదువుకుంటున్న సుశీల మనసు ఒక్కసారి గతుక్కుమంది. ఏమిటి రమాకాంత్ యిలా రాస్తున్నాడు? తరువాత అక్షరాల వైపు ఆమె కళ్ళు పరిగెత్తాయి గబగబ...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS