చేయూతనివ్వండి
"అమ్మా!"
కేక కాదది గావుకేక!
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి నిద్ర లేచి బద్ధకంగా ఆవులిస్తూ వరండాలోకి వచ్చిన సుశీల, కింద చెట్లకింద ఎండుపుల్లలేరుతున్న తల్లిని చూడగానే ఒక్క కేక పెట్టింది.
సుశీల కేకకి బిక్కచచ్చిపోయి పుల్లలు కింద పారేసి గబగబా లోపలికొచ్చేసింది రాజమ్మ. వీధి వరండాలో బంట్రోతు నర్సయ్యతో కబుర్లాడుతూ బీడీ కాలుస్తున్న యాదయ్య కూడా ఆ కేకకి బీడి విసిరేసి పిల్లిలా లోపలికి నడిచాడు.
మెట్లు దిగి విసవిస హాలులోకి వచ్చింది సుశీల. "అమ్మా... ఏం చేస్తున్నావు అక్కడ?" అరిచినట్టే అడిగింది.
"నీళ్ళ కాగుకిందకొస్తాయని ఎండుపుల్లలుంటే ఏరుతున్నాను..." నసుగుతూ అంది రాజమ్మ.
"నీళ్ళకాగుకి కావలిస్తే కర్రలు కొంటాను. ఇలా పుల్లలు, పిడకలు అంటూ నిన్నా వెధవ పనులు చెయ్యవద్దని ఎన్నిసార్లు చెప్పానిదివరకు. అమ్మా! నాన్నా! మీరిద్దరూ నన్ను పరువుగా బతకనీయరా? ఛీ... ఛీ... కుర్చీమీద దర్జాగా కూర్చోండి అన్నా కూడా మీకు కష్టంగా వుంది. అంతే... కనకపు సింహాసనం మీద కూర్చున్నా బుద్ధులు ఎక్కడికి పోతాయి? మీవల్ల నాకు చచ్చే తలవంపులుగా వుంది. నాన్నా! నీకెన్నిసార్లు చెప్పాను. అలా బంట్రోతులతో కలిసి కబుర్లాడవద్దని. వాళ్ళకి నేనంటే ఎంత చులకన అవుతుందీ నీకసలు తెలుస్తూందా?"
"ఏదో పొద్దుపోక..." తండ్రి నసిగాడు.
"పొద్దు పోకపోతే పేపర్లున్నాయి, పుస్తకాలున్నాయి. రేడియో విను. అక్షరం ముక్కలు వచ్చుగదా! చదువుతూంటే అదే అలవాటవుతుంది. పుస్తకాలు చదువు అంటే వినవేం? సాయంత్రం అలా వాక్ కి వెళ్ళు, లైబ్రరీకి వెళ్ళు... అంతేగాని బీడీలు కాలుస్తూ బాతాఖానీలు మాను. నీకు పుణ్యం వుంటుంది. నా పరువు సంగతన్నా ఆలోచించండి." కాస్త కటువుగా అని విసవిస మళ్ళీ మేడమీదకి వెళ్ళిపోయింది అసిస్టెంట్ కలెక్టరు సుశీల.
"ఏదో గుడిసెలో కలో గంజో తాగినపుడే పానం సుకంగా వుంది. మేడలోకి తీసుకొచ్చి కుర్చీలో కూచోపెట్టింది సరే, బాగుంది. కాని యిక్కడ కూకోకు, అక్కడ కూకోకు, యిది సెయ్యకూడదు, అది సెయ్యకూడదు, అలా నవ్వకు, అలా మాట్లాడకు, అలా కొప్పు సుట్టకు, సీర ఎగ్గట్టకు, అలా తినమాకు, అంత తినమాకు, అక్కడ ఊయకు, యిక్కడ బట్టలేయకు... యిదేటి ఏది సేసినా తప్పంటే సస్తామా? కలక్టరమ్మయితే ఏన్నీళ్ళు పోసుకోదేటి? సెట్టుకింద ఊరికే పుల్లలు పడున్నాయని ఏరితే అలా ఎగిరిపడ్తుంది. కన్నతల్లి అని కూడా సూడకుండా సిన్నపిల్లలా కసురుతది. నా గుడిసెలో నానుండపుడే సుకం గుంది పానం..." రాజమ్మ చురచుర మొగుడిని చూస్తూ అంది.
"బాగుందే, యిప్పుడది నీ కూతురేంటి మరి... ఊరంతటికి పెద్ద ఆఫీసరు. దాని పరువు సూడాలి గదా మనం... ఏటో మన ఎదవబుద్ధులు మారవు. ఆ పుస్తకాలు సదవబుద్ధి గాదు. పడుకుంది గదా అని నర్సింలుతో కబుర్లేసుకున్నా. ఇంతలో లేస్తాదనుకోలేదు."
"ఏందయ్యా! మరీ అట్టా కూతురికి బయపడి సస్తావు? దాన్నింతదాన్ని సేసిందెవరు? మనం కాదేటి. ఈనాడు కలక్టరమ్మయిందని కన్నాళ్ళనే ఛీ కొడ్తుందా? అసలు నిన్ననాలి. 'నా కూతురు... సదివిస్తా, ఆఫీసరు సేస్తా, కలక్టరు సేస్తా' అని సంకలు గుద్దుకున్నావు. కలక్టరమ్మ అయ్యి కుర్సీ మీద కూకోపెడ్తుందని మురిసావు. కుర్సీలో కూకోపెట్టి కూడెడితే సరిపోతుంది గాబోలు. మనం మడుసులం కామేటి, కుక్కల్లా గుమ్మానికి కట్టేసి కూకోమంటే కూకోడానికి..." ఉక్రోషంగా అంది రాజమ్మ. పెళ్లాం మాటల్లో నిజం వుందని యాదయ్యకి తెలుసు కనక జవాబివ్వలేక పోయాడు. "బంట్రోతు కూతురినని మర్సిపోయింది గాబోలు... ఈనాడు కలక్టరమ్మ కాంగానే బంట్రోతుతో మాట్లాడితే పరువు పోతుందట!" నిరసనగా అంది.
"ఊరుకోయే... దాని సంగతి కూడా మనం అలోసించాలిగా! అదేమంది? 'తిని కూకోండి' అంది గాని రాళ్లెత్తమందా, తట్టలు మోయమందా?"
"రాళ్లెత్తినపుడే నయం - పాపానికి సుకం వుండేది. తిన్నది వంటబట్టేది. ఇప్పుడు ప్రతి నిమసం ఏం సేస్తే ఏం తప్పో, ఎక్కడ కూసుంటే ఏం ముప్పో అని పానం ఉగ్గబట్టుకుని బతకడం... సీ, కూతురికి బయపడే ఎదవ బతుకయినాది" రాజమ్మ గొణుక్కుంటూ లోపలికెళ్లిపోయింది.
ఛా... వీళ్ళెంత చెప్పినా ఎందుకు మారరు? మట్టిలో పుట్టాం అని యింకా మట్టి పిసుక్కుంటూనే వుండాలా? గుడిసెల్లో పందుల్లా బతికినవాళ్లకి మారడానికి అవకాశం యిచ్చినా యింకా బురద గుంటల్లోనే దొర్లాలా? తనేం అంది? హాయిగా తిని కూచోండి. కాస్త సంస్కారం అలవరుచుకోండి అంటే వినరేం? నిజమే అట్టడుగువర్గాలనించి వచ్చారు తాము. అదృష్టం బాగుండి, తను చదువుకుని, మంచి హోదా తెచ్చుకుంది. ఇప్పుడైనా యీ అవకాశం అందిపుచ్చుకుని వీళ్లెందుకు బాగుపడరు? నిజమే! తండ్రి కడుపు కట్టుకుని చదివించాడు. ఆడపిల్లకి చదువులెందుకు, నాలుగిళ్ల పాచిపని చేసుకుంటే రెండొందలొస్తాయి అని సాధించే తల్లి మాట వినకుండా చదివించాడు. ముందునించి తెలివిగా చదువుకుంది. ఫస్టున పాసయ్యేది. చిన్నప్పటినించి, స్కూల్లో చదువుకునే దగ్గరనించి తోటిపిల్లల్లా తన తల్లీ తండ్రీ వుండాలని, ఇల్లు, వళ్లు శుభ్రంగా వుంచుకోవాలని తాపత్రయ పడేది. తను చదువు యిచ్చిన విజ్ఞానంతో సంస్కారం అలవరుచుకుంది. కాని తనవాళ్లని మార్చలేకపోయింది. మెట్రిక్ ఫస్టున పాసవగానే స్కాలర్ షిప్పు సంపాదించుకుని పట్టుబట్టి కాలేజీలో చేరింది. కనీసం డిగ్రీ తెచ్చుకోవాలని తన ఆరాటం. బి.ఏ. ఫస్టున పాసయింది కష్టపడి... తన అదృష్టం బాగుండి తండ్రి పనిచేసే సివిల్ సప్లయ్స్ ఆఫీసుకి అసిస్టెంట్ కమీషనర్ గా కలెక్టరు విజయలక్ష్మి వచ్చింది. తండ్రి గొప్పకోసం తనని వెంటబెట్టుకుని ఆఫీసరమ్మగారికి చూపించాడు. ఆవిడ ప్రోత్సాహం, సహాయంవల్ల తనీనాడు కలెక్టరయింది. ఇంత తెలివైన పిల్లని చదువు మాన్పించకు అని తండ్రిగా గట్టిగా చెప్పింది. ఐ.ఎ.ఎస్.కి కట్టమని తనని ప్రోత్సహించింది. ఉత్తి ప్రోత్సాహమే కాకుండా తాను చదివిన పుస్తకాలిచ్చింది. ఆర్ధికసహాయం చేసింది. పరీక్షకి ఎలా ప్రిపేరు అవ్వాలో చెప్పింది. తెలియనివి కూచోపెట్టి చెప్పింది. ఆవిడ అండదండలుండబట్టి 'తనేమిటి, కలెక్టరేమిటి?' అని నిరుత్సాహపడకుండా చదివింది. మొదటి పదిహేనుమందిలో వచ్చింది. అసిస్టెంటు కలెక్టరయి మొదటి పోస్టింగ్ పార్వతీపురానికి వచ్చింది.
లంకంత బంగళా బ్రిటిష్ కాలంనాటిది. చుట్టూ ఎకరాల స్థలం. వంటకి మనిషి, పనికి మనిషి, తోటకి మనిషి, జీపుకి డ్రైవర్లు. అన్ని హంగులూ సమకూర్చుకుని, తండ్రి రిటైరవడానికి ఇంకా రెండు మూడేళ్లున్నా ఉద్యోగం మాన్పించి తీసుకొచ్చేసింది. తమ్ముడిని, చెల్లెలిని స్కూల్లో జాయిన్ చేసింది. ఇదంతా తను ఎందుకు చేసిందని ఎవరూ గుర్తించరేం? తనవాళ్లు యింకా కష్టపడకూడదని, ఇప్పుడైనా సుఖపడాలని గదా తన కోరిక. తనవాళ్లు అట్టడుగునించి పైకి వచ్చి సభ్యసమాజంలో సంస్కారవంతంగా గడపాలని గదా తన ఆరాటం! అదేం గుర్తించరేం తనవాళ్లు.
ఎంత చెప్పినా తల్లి ఎక్కడ పడితే అక్కడ తుపుక్కు తుపుక్కుమని వుమ్ముతుంది. ఎక్కడ పడితే అక్కడ కాళ్లు జాపుకుని చతికిలపడ్తుంది. అసహ్యంగా పేలు కుక్కుతుంది చెల్లెలికి. బల్లమీద కూచుని తినమంటే తినకుండా రెండు కాళ్ల మధ్య గిన్నె పెట్టుకుని అసహ్యంగా తింటుంది. బట్టలుతకడానికి పని వాళ్లున్నా కుళ్లు బట్టలు ఉతికించుకోదు. వంట ఆమెతో, పనిమనిషితో వెంట వెంట తిరుగుతూ పోచికోలు కబుర్లు చెబుతుంది. చెప్పులు కొని యిచ్చినా బయట కూడా వుత్త కాళ్లతో తిరుగుతుంది. తండ్రి కాస్త నయం, కాస్త చెప్పులేసుకుని వుతికిన తెల్లపంచె కట్టుకుంటాడు. కాని బంట్రోతులతో బాతాఖానీలు మానడు. కాస్త చదవడం వచ్చు. పుస్తకాలు, పత్రికలు చదవమని కొని పడేసినా ఏదీ చదవడు. ఆ చుట్టలు మానమంటే వినడు. తనకోసం ఆఫీసువాళ్లెవరన్నా యింటికొస్తే మా అమ్మాయిని యిలా కష్టపడి చదివించాను. కలెక్టరుని చేశానని గొప్పలు చెపుతూ కబుర్లు వేసుకుంటాడు.
