Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 49


    అమాయకంగా అన్నా రుక్మిణికి గట్టిగా తగిలింది దెబ్బ. "చాల్లెండి. సినిమాయే కాదు, ఎవర్ని చూసినా ఎంతో ముచ్చట వేస్తుంది. మీలా ఏ మొగుడూ వుండడు" గట్టిగా నొక్కి అంది.
    "ఆఁ! దూరం నుంచి చూసి మనల్నీ అంతా అలాగే అనుకుంటారు. ఇంతకీ నన్నేం చేయమంటావు? కాలేజీ మానేసి ఇంట్లో కూచుని డ్యూయెట్లు పాడుకుందామా?" అన్నాడు. అమాయకుడనుకున్న సుబ్బారావు ఆ మాత్రం తెలివిగా మాట్లాడేసరికి, జవాబు చెప్పలేక ఉక్రోషం వచ్చింది రుక్మిణికి. చురచుర చూసి లేచి వెళ్లిపోయింది. రుక్మిణి వ్యవహారం అర్థం అయ్యాక ఆమె గొణుగుడికి అర్థం బోధపడ్డాక, అసలు పట్టించుకోడం మానేశాడు సుబ్బారావు.
    ఓ రోజు... ఆ రోజు రుక్మిణి పుట్టినరోజు. సుబ్బారావుకి రుక్మిణి పుట్టినరోజన్న సంగతి గుర్తు లేదు. అదే కాపురానికి వచ్చాక మొదటి పుట్టినరోజేమో! అతనికి ఎప్పుడో పెళ్లిలో జాతకంతో ఇచ్చిన బర్త్ డేట్ జ్ఞాపకం లేని మాట నిజమే. కాని రుక్మిణికి ఆ విషయం చాలా పెద్ద అపరాధంలాగే క్షమార్హం లేని నేరంలా తోచింది. పెళ్లయినాక ఆర్నెల్లకి వచ్చిన తన పుట్టినరోజుని ఇంత నిర్లక్ష్యం చేస్తాడా? ఇదే ఏ సినిమాలో, నవలలో అయితే ఎంత వేడుక చేస్తారు? ఎంత అపురూపంగా చూస్తారు? కొత్త చీర తెచ్చి, చీర కట్టుకునేవరకూ ప్రాణం తీసి, కట్టుకున్నాక ముద్దులతో ముంచెత్తి, స్వీట్, హాట్ కొనితెచ్చి, పూలు తెచ్చి, సినిమాకి తీసికెళ్లి ఎంత హడావిడి చేస్తారు. ఏం లేదు. తన ఊహలన్నీ ఒక్కొక్కటి ఇలా గాలిలో తేలిపోవాల్సిందేనా? రుక్మిణి భరించలేకపోయింది. ఏదో రాసుకుంటున్న సుబ్బారావు దగ్గరికెళ్లి దూకుడుగా, ఉపోద్ఘాతం లేకుండా "నాకు డైవోర్స్ కావాలి" అంది తీక్షణంగా.
    "అలాగే" అన్నాడు రాసుకుంటూ సుబ్బారావు పరధ్యానంగా, రుక్మిణి మామూలు ధోరణి అలవాటయి ఏదో అనుకొని.
    ఆ జవాబుకి రుక్మిణి వళ్లు ఎన్నడూ మండనంత మండింది. ఒక్క వుదుటున టేబుల్ మీద పుస్తకాలు, కాగితాలు లాక్కుని విసిరేసింది. సుబ్బారావు తెల్లబోయాడు. "నాకు వెంటనే డైవోర్స్ ఇవ్వండి" అంది.
    "ఎందుకూ?" తెల్లోయాడు సుబ్బారావు.
    "ఎందుకా? మీలాంటి మొగుడితో ఏ ఆడదీ కాపురం చెయ్యలేదు కనక. ఈ కాపురం చేసేకంటే దేన్లోనన్నా పడి చావడం మంచిది" అంటూ ఉక్రోషంగా, కసిగా మొదలుపెట్టి, ఏడుపులోకి దింపి, నానా మాటలూ అంది రుక్మిణి.
    పాపం సుబ్బారావు నొచ్చుకున్నాడు. తన అపరాధం ఏమిటో చెప్పమంటూ బతిమిలాడాడు, అరగంట బతిమాలించుకుని అరగంట ఏడ్చి అసలు విషయం చెప్పింది. నిజంగానే మర్చిపోయానంటూ బాధపడి, క్షమించమంటూ ప్రాధేయపడ్డాడు సుబ్బారావు. అప్పటికప్పుడు బజారుకెళ్లి చీర తెచ్చి, రుక్మిణిని ప్రసన్నురాలిని చేసుకోడానికి చాలా టైము పట్టింది అతనికి.
    అప్పట్నించి 'డైవోర్సు' ఆయుధం ప్రయోగించడం మొదలుపెట్టింది కోపం వచ్చినప్పుడల్లా. మొదట్లో బ్రతిమిలాడుకుని ప్రసన్నురాలిని చేసుకునేవాడు సుబ్బారావు. రాను రాను అది ఉత్త బెదిరింపు అని అర్థం అయిపోయి, "అలాగేలే" అనడం మొదలుపెట్టాడు ఏదో చదువుతూనో, రాస్తూనో పరధ్యానంగా. దాంతో 'ఈ మొగుడింతే, ఈ సంసారం ఇంతే! నా అదృష్టం యింతే, ఈ బతుకింతే!' అనుకుంటూ నిర్లిప్తంగా బతకసాగింది రుక్మిణి.
    గిర్రున ఏడాది తిరిగేసరికి రుక్మిణి తల్లి అయింది. కడుపుతో వున్నప్పుడు నవలల్లో, సినిమాలల్లోనూ అపురూపంగా చూశాడా మొగుడు! అయ్యో రామ, డాక్టరు దగ్గరికి పరిగెత్తడం తప్ప! గర్భిణీ స్త్రీని ఆనందంగా వుంచడం తెలిసేడిస్తే కదా అనుకుంది రుక్మిణి విరక్తిగా.
    కొడుకు పుట్టాక ఆఖరికి వాడైనా 'ఎడ్వర్టయిజ్ మెంట్ బెబీలా వున్నాడా? బంతిలా ఆడుతూ బోసినవ్వులు చిందించే బాబు- వాడ్ని చూస్తూ మురుస్తూ తామిద్దరూ... రుక్మిణి కలలు ఈ విషయంలోనూ తీరలేదు.
    పిల్లవాడు చాలా నీరసంగా, ఎప్పుడూ ఏడుస్తూ, ఏదో తెగుళ్లతో ఎప్పుడూ విరోచనాలో, జలుబో, దగ్గో ఏదో ఒకటితో 'గీ' అంటూ ఏడవడం, రోజంతా వాడి వుచ్చగుడ్డలు మార్చడం తప్ప వాడి నవ్వు లేదు. వాడ్ని చూసి తామిద్దరూ మురవడం లేదు. "హుఁ అన్నీ ఏ సినిమాలోనో చూసి మురవాల్సిందే, ఈ జన్మకింతే!" అనుకుంది రుక్మిణి నిట్టూరుస్తూ.
    అన్ని విధాలా తన జీవితం పాడైపోయిందన్న బాధ, అసంతృప్తి రుక్మిణిని రోజు రోజుకీ వశపరచుకుంది. దాంతో ఏదో నిరాశ, నిస్పృహ. ఆ నిరాశతో శృతిమించి కోపం, చిరాకు. తను బాధపడుతూ సుబ్బారావుకి కూడా శాంతి లేకుండా చేసింది.
    ఆ రోజు... పిల్లాడి పక్కబట్టలు మారుస్తూ తెగ విసుక్కుంటూ, వాడ్ని తిడుతూ, తన్ను తిట్టుకుంటూ "ఛా... యీ వెధవ పుట్టాడు పోదామన్నా వీలు లేకుండా. హాయిగా నా యిష్టం వచ్చిన చోటికి పోయి ఏదో ఉద్యోగం చేసుకు బతుకుదామన్నా 'వీడొకడు' నా ప్రాణానికి. ఎక్కడ సుఖపడిపోతానో అని పుట్టుకొచ్చాడు" అంటూ ఆ చిరాకులో ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తి కుదేసింది.
    పక్కనే ఏదో రాసుకుంటున్న సుబ్బారావు సాధారణంగా రుక్మిణి గోల విన్నా పట్టించుకోని సుబ్బారావుకి కూడా ఆ వరస చూసేసరికి అంత శాంతమూర్తికీ తిక్కరేగింది. చర్రున లేచి రుక్మిణి చేతిలోంచి పిల్లాడిని లాగేసుకున్నాడు. "ఫో... ఈ తక్షణమే యింట్లోంచి ఫో... నీకు స్వేచ్చ ఇచ్చేశాను విడాకులు లేకుండానే. నీకు పిల్లాడి బాధ్యత అక్కర్లేదు. నేను చూసుకోగలను. ముందు నా యింట్లోంచి కదులు. వెళ్లి నవలలు చదువుకుంటూ, సినిమాలు చూసుకుంటూ కలల్లో బతుకు" అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడు.
    ఎన్నడూ చూడని సుబ్బారావు అవతారం చూసి, ఆ కేకలకి రుక్మిణి ఒక్కక్షణం బిక్కచచ్చిపోయింది. అలా మాట్లాడేసరికి ఏం అనాలో తెలియక వెర్రిమొహం పెట్టింది. తరువాత పౌరుషంగా, బింకంగా "బాబుని వదిలి వెళ్లలేననే గదూ యింత ధైర్యంగా పొమ్మంటున్నారు. ఇన్నాళ్లు లేనిది యిప్పుడు ఎలాగో వాడిని వదిలి వెళ్లనని తెలిసే వెళ్లమని చెప్తున్నారు. దేముడు తల్లి హృదయాన్ని యింత మాతృత్వంతో, మమతతో ఎందుకు నింపాడు? అందుకే అలుసయిపోయాను..."
    "నోర్ముయ్, వెధవ డైలాగులు వల్లించకు. ఇది సినిమా కాదు. వెళ్లలేవని తెలుసు గనక, వెడతానని బెదిరించకుండా నోరు మూసుకు పడివుండు. అంతేగాని, నీ సినిమా డైలాగులు ఈ రోజునించి వినిపిస్తే తీట వదిలిస్తా. ఆ సినిమాలు చూడడానికి, నవలలు కొనడానికి కూడా డబ్బుండాలని తెలుసుకుని ఏడు. ఆ డబ్బు నేను సంపాదించాలనీ, ఇంట్లో నీ కొంగు పట్టుకు డ్యూయెట్లు పాడితే, ఎవ్వడూ డబ్బులివ్వడన్న ఇంగితజ్ఞానం నేర్చుకో. వెధవ చెత్తంతా చదివి, అతి తెలివికి పోయి నీవేడుస్తూ, నన్నేడిపిస్తున్నావు. జీవితమంటే ప్రేమకబుర్లు, డ్యూయట్లే కాక ఏడుపులు, రోగాలు వగైరా అని కూడా తెలుసుకో. నోరు మూసుకుని వున్నదాంతో సంతృప్తిపడడం నేర్చుకుంటే సుఖపడతావు. లేకపోతే ఇలాగే ఏడుస్తావు జాగ్రత్త! మళ్లీ పిచ్చివాగుడు వాగావంటే నా తడాఖా చూపిస్తా. పూనకం వచ్చినవాడిలా, ఆవేశంగా దులిపేసి విసవిస వెళ్లిపోయాడు బైటికి.
    ఒక్కక్షణం అది కలో నిజమో అర్థం కాలేదు రుక్మిణికి. నిజమే అని అర్థం అయ్యాక పిల్లాడిని గుండెలకి హత్తుకుని "మా బతుకు ఇంతేరా నాయనా!" అంటూ భోరుమని ఏడ్చింది.
    సుబ్బారావు మాటలు అర్థమయ్యేయో లేదోగాని, ఆ రోజునించి సుబ్బారావు ఎదుటపడి ఏమీ అనడం మానేసింది రుక్మిణి.

                                                                                (జ్యోతి మాసపత్రిక, 70-75మధ్య)

                                                                              *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS