Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 48


    అలాంటి సమయాల్లో రుక్మిణికి వళ్లు మండుకొస్తుంటుంది. ఇదేం మనిషి! కొత్తపెళ్లాంతో సరసాలాడాలని, సినిమాలో మాదిరి మల్లెపూలు తెచ్చి పెళ్లాం జడలో తురమాలని, సాయంత్రాలు ఏ డాబామీదో వళ్ళో తల పెట్టుకు పడుకుని కబుర్లు చెప్పాలని, వంటింట్లో పెళ్లాం కొంగు పట్టుకు తిరగాలని, అన్నం తింటూ ఒకరి నోట్లో ఒకరు తినిపించుకోడాలు, వగైరా సరదాలుంటాయని ఈ పురుష పుంగవుడికి తెలియదా అని కోపంతోపాటు ఉక్రోషం వచ్చేది. పోనీ హీరోలా కాకపోయినా హీరో గుణాలన్నా వుంటే సరిపెట్టుకునేది రుక్మిణి. పెద్ద ఛాతీ కాకపోయినా ఆ బక్కఛాతీమీదే తల ఆన్చి మైమరుద్దామనుకుంది. కానీ ఆ మహానుభావుడు ఆ అవకాశం యిస్తేనా?
    చూసి చూసి లాభం లేదని, అతన్ని తనకనుగుణంగా సంస్కరించడానికి పూనుకుంది. ముద్దులు గునుస్తూ గోముగా దగ్గర చేరే రుక్మిణిని వింతగా చూసేవాడు. కాలేజీనుంచి వస్తూ మల్లెపూలు తెమ్మంది.
    "వీధిలోకి రావూ" అన్నాడు అమాయకంగా.
    "రావు" అంది కఠినంగా.
    నిజంగానేమోననుకుని పాపం తెచ్చాడు సుబ్బారావు. "ఇవిగో పూలు తెమ్మన్నావుగా!" అంటూ పొట్లం టేబుల్ మీద పడేశాడు. "ఊహూఁ నేనే పెడ్తాను" అంటూ దగ్గరకు లాక్కొని జడలో దండ తురిమి వాసన చూసే నెపంతో దగ్గరికి లాక్కుని, పూలవాసన ఆఘ్రాణంతో ఆ మత్తులో ఓ ముద్దు యివ్వాలని తెలియని సుబ్బారావుని చూసేసరికి తిక్కరేగి, పూలు విసిరేసింది రుక్మిణి. విసిరేసినట్టు గమనించని, తెచ్చిన పూలు పెట్టుకోలేదని గుర్తించని ఆ మొగుడ్ని ఏం చెయ్యాలో అర్థం కాలేదు రుక్మిణికి.
    "డాబామీద కూర్చుందామా?" అంది ఓ రోజు రుక్మిణి.
    పేపరు చూస్తూ తలెత్తి "ఎందుకూ?" అన్నాడు. అంతలోనే రుక్మిణి మొహం మాడ్చుకోవడం చూసి స"సరే పద!" అంటూ పేపరుతో సహా బయలుదేరి, అక్కడ పిట్టగోడెక్కి పేపరు చదవడం పూర్తిచేసి తలెత్తేసరికి రుక్మిణి లేదు అక్కడ.
    పబ్లిక్ గార్డెన్ షికారుకెళ్లి, కనుచీకటి వేళలో జంటగా చెట్టాపట్టాలు వేసుకుని ఎవరూ చూడకుండా దగ్గిరకు లాక్కుని చిలిపిగా అల్లరిగా నవ్వని సుబ్బారావుని ఏం చెయ్యాలో అర్థం గాలేదు రుక్మిణికి.
    భోంచేస్తూ కూడా దిక్కుమాలిన థీసిస్ గురించి ఆలోచిస్తూ, పరధ్యానంగా అన్నం తింటాడు సుబ్బారావు. స్నానం చేస్తూంటే రుక్మిణి "వీపు రుద్దుతాను" అంది ఓసారి. "ఎందుకూ నాకు రాదేమిటి?" అన్నాడు. వీపు రుద్దుతుంటే ఆ సబ్బు వంటితోటే దగ్గరకి లాక్కుని వళ్ళో కూర్చోపెట్టుకోవాలనే చిలిపి ఊహలు ఈ మొద్దుమొహానికి రావు అని నిట్టూర్చింది రుక్మిణి.
    పోనీ మనిషి సరే యింట్లో రుక్మిణి ఊహించిన ఊహలకీ, జరుగుతున్నదానికీ ఏం పోలిక కన్పించలేదు. కాపురానికి రాగానే రెండున్నర గదుల వాటా చూడగానే నిరుత్సాహపడింది రుక్మిణి. పెద్ద సినిమా సెట్టింగులా లేకపోయినా కనీసం ఇల్లన్నాక ఓ సోఫాసెట్టు, ఓ డ్రస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్, ఫ్రిజ్ వగైరాలు లేకపోతే ఎలా? ముందు గదిలో నాలుగు పేం కుర్చీలు, బల్లమీద రేడియో, పడకగదిలో రెండు నవారు మంచాలు, బట్టల స్టాండ్. మిగతాది వంటిల్లు. రెండు పీటలు దర్శనమిచ్చాయి రుక్మిణికి. ఛ... ఈ మనుష్యులకి టేస్ట్ లేదు బొత్తిగా అనుకుంది. కాపురానికి వచ్చిన నాలుగో రోజే ఆ ఇల్లు బాగులేదని, మరో యింటికి మారాలని, సోఫాసెట్టు వగైరాలన్నీ కొనాలని ఆర్డరు జారీ చేసింది. సుబ్బారావు ఆశ్చర్యంగా "డబ్బేదీ?" అన్నాడు. "జీతం ఏం చేస్తున్నారు?" అంటూ దబాయించింది.
    "కాలేజీ లెక్చరరుకు రెండువేలు జీతం యివ్వరు" అని నవ్వాడు సుబ్బారావు.
    రుక్మిణికి ఉడుకుమోత్తనం వచ్చింది. "చేతకాకపోతే సరి!" అంది ఉక్రోషంగా.
    "ఈ నెల నుంచి జీతం నీకే ఇస్తాగా... సోఫాలే కొంటావో, ఫ్రిజ్ లే కొంటావో నీ ఇష్టం" అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.
    పాపం సుబ్బారావు ఎప్పుడూ నవ్వుతూనే వుంటాడు. అతిశాంతమూర్తి. రుక్మిణికి ఆ శాంతం, ఆ చిరునవ్వు అన్నీ చూస్తే చేతకానివాడి లక్షణాలలాగ, మొద్దబ్బాయి అవతారంలాగ అనిపిస్తుంది గాని మంచితనం అనిపించదు.
    రుక్మిణి అన్నింటికి ధుమధుమలాడుతూ, చిర్రుబుర్రుమని ఎందుకుంటుందో సుబ్బారావుకి తెలియదు. కొన్నాళ్లు చూసి స్వభావం గాబోలనుకున్నాడు. ఆ తర్వాత రుక్మిణి గొణుగుడు, కసుర్లు, విసుర్లు పట్టించుకోటం మానేశాడు. థీసిస్ వంకతో యింటికి ఆలస్యంగా రావడం, ఇంట్లో వున్నంతసేపూ పుస్తకాలు రిఫర్ చేసుకుంటూ కూర్చోడం మొదలెట్టాడు.
    అతన్ని సంస్కరించి సినిమా హీరోని చేద్దామనుకుంటే అసలుకే మోసం వచ్చి, సుబ్బారావు మరింత బుద్ధావతారం అయిపోయినందుకు రుక్మిణికి కోపం అవధులు దాటింది. ఆ కోపం పనిచేయకపోయేసరికి ఓ విరక్తి, నిర్లిప్తత ఆవరించింది రుక్మిణిని.
    ఈ బతుకింతే! 'కొందరి జీవితాలింతే!' 'నాలాంటి దురదృష్టం ఏ ఆడదానికీ వద్దు భగవాన్!' 'ఏం పాపం చేశానని నా కలలు కల్లలు చేశాడు దేముడు' మొదలైన డైలాగులు రోజుకి అనేక సందర్భాలలో వల్లిస్తుండేది. భోంచేస్తూ పరధ్యానంగా నెత్తిన చేతులు పెట్టుకు ఆలోచిస్తూ వేడి నిట్టూర్పులు కార్చేది. జుట్టు దువ్వుకోకుండా, మొహం కడుక్కోకుండా సాయంత్రం సుబ్బారావు వచ్చేసరికి జిడ్డుమొహం వేసుకు నీరసంగా కనిపించేది. సుబ్బారావు "అదేం అలా వున్నా"వంటే "యింకెలా వుంటాననేది" విసుగ్గా. రుక్మిణి అడగడం లేదని సుబ్బారావే పాపం గుర్తుంచుకుని సినిమా టిక్కెట్లు తెచ్చాడు ఓ రోజు. "సినిమా కూడానా నా బతుక్కి" అని మూలిగింది రుక్మిణి. షికారుకెళదామంటే "షికారు వెళ్లే మొహాలేలెండి" అని చెప్పేది. ఆఖరికి పడుకున్నప్పుడు కూడా ఏదో బాధపడిపోతున్నట్టు ఊరికే వూ...హు... అంటూ ఆపసోపాలు పడుతూ వేడి నిట్టూర్పులు వదులుతూ, సుబ్బారావుని కసురుతూ విసుక్కుంటూ పక్కమీద దొర్లేది.
    ఏదీ మనసుకి ఎక్కని సుబ్బారావుకి కూడా రుక్మిణి ప్రవర్తన వింతగా కనపడటం మొదలెట్టింది. "ఏం అలా వున్నావు?" అన్నాడు ప్రేమగా ఓ రోజు దగ్గరికి తీసుకుని.
    'ఎలా వున్నాను? అలా వుండాలనేగా మీ కోరిక" అంటూ కస్సుమంటూ విదిలించి వదిలించుకుని వెళ్లిపోయింది.
    "డాక్టరు దగ్గరికెడదాం" అన్నాడు మరో రోజు వంట్లో బాగోలేదేమోనని.
    "వంట్లో రోగానికి డాక్టరు మందిస్తాడు. మనసులో రోగానికి మందుల్లేవు" అంది.
    దాంతో చిర్రెత్తింది సుబ్బారావుకి - అసలు సంగతి చెప్పకుండా సాధిస్తున్న రుక్మిణి ప్రవర్తన అతి సౌమ్యుడైన సుబ్బారావు సహనాన్ని పరీక్షించింది. "ఏమిటి నీ గోల? నాకర్థం కావడం లేదు అసలు."
    "అర్థం అయితే నా బతుకిలా ఎందుకుంటుంది?" అంది కసిగా రుక్మిణి.
    "ఏం, నీ బతుక్కి ఏమయింది?" ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు.
    "ఏమయిందా... ఏమైందా? ఏం కాలేదని అడగండి..." ఏడుపు ముంచుకొచ్చింది రుక్మిణికి. ఎలా చెప్పాలో అర్థం కాలేదు.
    సుబ్బారావు తెల్లబోయాడు. చాలాసేపు బతిమిలాడి, బుజ్జగించాడు. రుక్మిణి ఏడుపు మధ్య "ఎవర్ని చూసినా ఎంత ముచ్చట వేస్తుంది. ఎన్ని కలలు కన్నాను. ఆఖరికి ఇలా జరిగింది. నా అదృష్టం అంతే, మీరింతే!" అంటూ ఒక్కొక్క వాక్యం ముక్కు చీదుతూ, కళ్లు తుడుచుకుంటూ చెప్పింది.
    సుబ్బారావు ఆశ్చర్యంగా "ఎవర్ని చూశావు? మనం ఎవరిలా లేం? నీవేం కలలు గన్నావు?" అంటూ అమాయకంగా, మొద్దబ్బాయిలా అడిగాడు.
    రుక్మిణి కోపంగా "ఎవర్ని చూడడం ఏమిటి? ఎన్ని సినిమాలు చూశాను, ఎన్ని నవలలు చదివాను? ఎవరూ మనలా లేరు."
    సుబ్బారావు ఇంకా అమాయకంగా "ఇది సినిమా కాదుగా నటించడానికి, ఇది జీవితం" అన్నాడు. "ఓ మూడు గంటలు కనక అలా కనిపిస్తారు మనకు" అని కూడా చేర్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS