ఇది జీవితం!
రుక్మిణి ఈ కాలం పిల్ల, ఇరవై ఏళ్లు మొన్ననే నిండాయి. బి.ఏ. పాసయింది. ఈ కాలం పిల్లల్లాగే ఆధునిక అలంకరణ మీద మోజు, చీర కట్టడం 19వ శతాబ్దపు అనాగరిక ఆడవారి లక్షణం అనుకుంటుంది. మాటకోసారి 'యా' అంటుంది. బెల్ బాటమ్స్ తొడుక్కుని, గోగో గ్లాసులు పెట్టుకుని, జుత్తు పొట్టిగా కత్తిరించి, రబ్బరు బ్యాండుతో కట్టుకుని, తెలుగు సినిమాలు బోర్, హిందీ, ఇంగ్లీషు మాత్రమే చూడాలనుకునే అందరి అమ్మాయిల మనస్తత్వమే రుక్మిణిదీను.
ఆమెకి జీవితం అంటే ఈస్ట్ మన్ కలర్ హిందీచిత్రం అనే అభిప్రాయం వుంది. తెలుగు సినిమాలు బోర్ అనుకుంటుంది, అంటుంది. కాని ఆమె తెలుగు పత్రికలు, నవల్సు అంటే చెవి కోసుకుంటుంది. అందుకే రచయిత్రీ మణుల సీరియల్స్ కంఠతా పట్టి కాచి వడబోసింది. ఆ నవలలు చదివి చదివి, సినిమాలు చూసి చూసి - చదివిన నవలల్లో చక్కని భావాలు, చూసిన సినిమాల్లో అందమైన సీనులు, అన్నీ కలబోసి ఆలోచించి ఆలోచించి, ఓ రంగుల దృశ్యకావ్యం తయారుచేసుకుంది మనసులో. తన జీవితం ఆ రకంగానే సాగాలని, సాగుతుందని నిర్థారించుకుంది రుక్మిణి.
అన్నీ అనుకుంది. కాని పాపం రుక్మిణికి జీవితం అంటే అందమైన హిందీ టెక్నికలర్ పిక్చరులాగానే వుండదు, సత్యజిత్ రాయ్ సినిమాలలాగ కూడా కొందర్ జీవితాలుంటాయని అనుకోలేదు. పాపం రుక్మిణి సత్యజిత్ రాయ్ సినిమాలు చూడలేదు.
అసలు రుక్మిణికి మొదటి చిక్కు పేరుతోనే వచ్చిపడింది. ఆధునికత అంటే ఎంతో ఇష్టపడే రుక్మిణికి, తన పేరు పాతచింతకాయ పచ్చడిలా కన్పించింది. ఛ... ఈ తెలుగువాళ్లకి సీత, సుబ్బలక్ష్మి, రుక్మిణి, సూర్యకాంతం లాంటి పేర్లు తప్ప తట్టవు. తన కాలేజీలో అమ్మాయిల పేర్లు ఎంత నాజూగ్గా వుంటాయి. సుచరిత, సుస్మిత, సీమ, సుప్రియ, తనూ వగైరా వగైరాలంతా ఎంత అదృష్టవంతులో! ఆఖరికి పోనీ ముందే వెనకో కత్తిరించి, నాజూగ్గా పొట్టి చేసుకునే వీలయినా కనపడకపోయేసరికి పేరు మార్చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చేసింది రుక్మిణి.
"అయ్యో! ఇదేం విడ్డూరమే!" బుగ్గలు నొక్కుంది బామ్మ.
ఆ మాట విని "చాల్లే పిచ్చివేషాలు మాను" కసిరింది తల్లి.
"బామ్మ బాధపడ్తుంది తల్లీ!" అని తండ్రి.
ఖర్మకాలి బామ్మ పేరు తనకే పెట్టాలా? బామ్మ బతికుండగా తను పేరు మార్చుకోడం ఉత్తమాట! పాపం బామ్మ మంచిదే. పేరింటిగత్తి అని తనకి తన నాలుగుపేటల చంద్రహారం యిచ్చింది. చక్కా అది చెరిపించి ఈనాటి ఫ్యాషన్ కి తగ్గట్టు దవురుగళ్లీ నెక్లెస్, వెడల్పు గాజులు, చాటంత బంగారు దుద్దులు అన్నీ సెట్టుగా చేయించుకుంటానంది.
"నిక్షేపంలాంటి పెద్ద గొలుసు చెరిపించక" అంటూ గోల పెట్టింది బామ్మ.
అదృష్టవశాత్తూ ఈలోగా ఏదో సినిమాలో హీరోయిన్ నాలుగు పేటల చంద్రహారం గొలుసూ రెండు పేటలు క్రిందికి పొడుగ్గా పడేట్టు వ్రేలాడదీసింది. అది చూసి మర్నాడు రుక్మిణి అలా వేసుకువెళ్లింది. ఆ మర్నాటినించి ఆడపిల్లలంతా అమ్మల్ని, బామ్మల్ని పీడించి బీరువాలో పడేసిన చంద్రహారాలు, పలకసర్లు తీసి వేసుకెళ్ళడం ఆరంభించారు. చంద్రహారం ఫ్యాషన్ అయి కూర్చుంది. అలాగే పోనీ పాత పేర్లు ఫ్యాషన్ అయితే బావుండనుకుంది రుక్మిణి.
పోనీ పేరుకి ఎలాగో సరిపెట్టుకుంది. ఆఖరికి యిష్టం వచ్చిన డ్రస్సులయినా వేసుకోనిస్తేనా యింట్లో? ముచ్చటపడి బెల్ బాటమ్స్ కుట్టించుకుంటానంటే, ఎవడితోనో లేచిపోతున్నంత గొడవ చేశారు పాపం.
'ఇదేం పోయేకాలమే! మొగాడిలాగ పేంట్లు తొడుక్కుంటానంటావు ఆడపిల్లవు పెళ్లీడుకొచ్చినదానివి" అంటూ బామ్మ నోరు నొక్కుకోడం.
"ఇదిగో అవన్నీ మనలాంటివాళ్లకి కాదు. ఊరికే పదిసార్లు విసిగించకు" తల్లి కసుర్లు.
ఆఖరికి ఏడ్చి పస్తులుండి సాధించి ఒకటి కుట్టించుకుంది రుక్మిణి. అది తొడుక్కున్నప్పుడల్లా యింట్లోవాళ్ల చూపులు విసుర్లు చూసేసరికి, దానిమీద మోజు కాస్తా చచ్చిపోయింది రుక్మిణికి. ఛీ... వీళ్లంతా పదో శతాబ్దంలో పుట్టాల్సినవాళ్లు. ఈ యింట్లో వున్నన్ని రోజులు తన ఖర్మ యింతే! ఇలాంటి చోట పుట్టడం దురదృష్టం. పెళ్లి అయి వెళ్లాక చూపిస్తుంది తన అభిరుచి. పెళ్లి అయ్యాక తన కలలు పండించుకోవాలని నిర్ణయించుకుంది.
కాని పెళ్లి విషయంలో కూడా రుక్మిణి ఆశలు అడియాసలు అయిపోయాయి పాపం! సినిమాలు చూసి, నవలలు చదివి ఆ హీరోల్లాంటి హీరో... ఆజానుబాహువు, అరవింద దళాయతాక్షుడు వగైరా వగైరాలున్న ఓ రూపు సిద్ధం చేసుకుంది రుక్మిణి మనసుకు.
తీరా పెళ్లిచూపుల్లో సుబ్బారావుని చూసి నీళ్లుగారిపోయింది రుక్మిణి. సుబ్బారావు, ఛ... పేరే బాగాలేదే? ఏ రాజశేఖరమో, విజయసారథో, నళినీమోహనుడో ఎన్ని పేర్లు కావు. తన పేరు కంటే కూడా అసహ్యంగా వుందనుకుంది రుక్మిణి. పేరు సరే, మనిషో - అతడు ఆరడుగులు కాదు 5-6 అంగుళాలు కూడా లేడు. మహా వుంటే 5-4 అంగుళాలు వుంటాడు. సన్నగా, బక్కపలచగా, చామనఛాయ రంగులో వున్నాడు. పోనీ రూపు సరే, కనీసం కథల్లోలాగ ప్రవర్తించాడా, చిలిపిగా చూశాడా? కొంటెగా నవ్వాడా? 'మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి, అలా డ్రైవ్ కెడదామా?' అని ఆహ్వానించాడా? ఏం లేదు. తనకంటే నెర్వస్ గా కూర్చున్నాడు. మాటిమాటికీ కళ్లజోడు తీసి తుడుస్తూ (హీరోలకి కళ్లజోడు వుండచ్చా?) పెద్దవాళ్ల మాటలు వింటూ ముంగిలా కూర్చున్నాడు. ఛా... అనుకుంది రుక్మిణి. నచ్చలేదు పొమ్మంది పెద్దవాళ్లు అడగ్గానే. అంతా తెల్లబోయారు. పిచ్చి పట్టలేదు గదా అన్నట్టు చూశారు రుక్మిణిని. అంతకంటే మంచి సంబంధం మరో జన్మ ఎత్తినా తేలేం అన్నారు.
పిల్లాడు బుద్ధిమంతుడు. కాలేజీలో లెక్చరరు. ఆరేడు వందలు తెచ్చుకుంటాడు. బాదరబందీలు లేవు. ఇంతకంటే మంచి సంబంధం తపస్సు చేసినా దొరకదు. అంతకంటే తెచ్చే తాహతూ లేదు అంటూ నచ్చజెప్పి, బతిమాలి, బెదిరించి, తిట్టి అందరూ కలిసి వప్పించారు రుక్మిణిని. 'హుఁ యీ దేశంలో పుట్టిన ఆడపిల్లని ఇంతకంటే ఏం చెయ్యగలను?' అనే ఓ నవల్లో డైలాగు గుర్తు తెచ్చుకుని, మూగగా రోదించి పెళ్లిపీటలమీద కూర్చుంది రుక్మిణి.
సుబ్బారావు తనూహించిన హీరోకి రూపంలోనే కాక, ఏ విషయంలోనూ సరితూగడని రుక్మిణిని చాలా కొద్దిరోజులలోనే అర్థం అయిపోయింది. సుబ్బారావు మంచివాడవుగాక! మంచితనం ఒక్కటీ సరిపోతుందా, ఆడదాన్ని ఆకట్టుకొనే శక్తి వుండొద్దూ మగాడికి. పెళ్లాం అనగానే జీతం డబ్బులు తెచ్చిచ్చి, ఏ వారానికో ఓసారి సినిమాకి తీసికెళ్లి, ఏ ఆర్నెల్లకో ఓ చీర కొంటే సరిపోతుందా? పెళ్లాం కోరేవి ఇంతేనా? రుక్మిణి ఆలోచనలివి. రుక్మిణికి అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతోంది.
సుబ్బారావు ప్రతి చర్యలో తన హీరో నీడన్నా ఎక్కడన్నా కనిపిస్తుందేమోనని ఆరాటంగా వెతికేది. ఊహుఁ! సుబ్బారావు అదేం గుర్తించేవాడు కాడు. గుర్తించాలని తెలియదు కూడా అతనికి. ఏదో వేళకింత తిని, కాలేజీకి వెళ్లి పాఠాలు చెప్పుకుని, మిగతా సమయంలో డాక్టరేటు తెచ్చుకోడానికి థీసిస్ వ్రాస్తున్నాడేమో! ఎప్పుడూ ఏ లైబ్రరీలోనో పుస్తకాలు వెతుక్కుంటూ, ఆ పుస్తకాలు యింటికి తెచ్చుకుని తల దూర్చుకుంటాడు.
