"పోరు నాయనా, ఏ ఆడదీ భర్త, సంసారం, పిల్లలు అన్నీ వదులుకుని అంత సులువుగా పోలేదు నాయనా! అందుకే ఎన్ని కలతలు, కలహాలు, కన్నీళ్లు వున్నా అన్నీ భరిస్తూ తనింతే పెట్టిపుట్టానని మనసులో దుఃఖిస్తూ భరిస్తుంది. ఏ ఆడదైనా ఇల్లు వదిలి చావాలనుకుంటే ఇంక భరించే ఓపిక లేకే వెళ్తుంది. బాబూ! నేనూ ఆడదాన్ని, భార్యని, తల్లిని. ఆడదాని మనసు నాకు తెలిసినట్టు మీ మగవాళ్లకేం తెలుస్తుంది బాబూ! ఓ ఆడపిల్లని కని ఇరవై ఏళ్లు పెంచి ఇంకో అయ్య చేతిలో పెడతారు కన్నవారు. ఇరవై ఏళ్లు ఒకచోట తల్లిదండ్రులు, అప్పచెల్లెళ్లు, అన్నదమ్ముల మధ్య ఆప్యాయతానురాగాల మధ్య పెరిగిన ఒక ఆడపిల్ల పుట్టి పెరిగిన చోటు, ప్రాణంలో ప్రాణంగా పెంచిన తల్లిదండ్రులని వదిలి, కేవలం పెళ్లి అనే రెండక్షరాల బంధంతో భర్త వేలు పట్టుకొని కొత్త చోటుకి, కొత్త మనుష్యుల మధ్యకి, కొత్త అలవాట్లు, కొత్త ఆచారాలు, కొత్త అనుబంధాలు, కొత్త చుట్టరికాల మధ్యకు కొత్త యింటికి కాపురానికి వెళ్లిన ఆడపిల్ల మనసు అప్పుడు ఎలా వుంటుందో మీ మగవాళ్లకేం తెలుస్తుంది? కొత్త ఇల్లు, కొత్త మనుష్యులు, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఏం అనాలో, ఏం అనకూడదో, తెలియని అలవాట్లు, తెలియని స్వభావాలు, అందరినీ విడిచివచ్చిన బెంగ, బితుకు బితుకుమంటూ ఎలా మనుష్యుల స్వభావాలు తెలుసుకుని కలుపుకుపోవాలో తెలియని అయోమయ స్థితిలో నమ్ముకుని తాళి కట్టించుకున్నవాడొక్కడే ఆప్తుడులా కనిపిస్తాడు. ఆ సమయంలో భర్తామెకి అండగా నిలిచి, ప్రేమానురాగాలు పంచి, నీకు నేనున్నానని భరోసా ఇస్తే ఆ భార్య భర్తని అల్లుకుని ఆ యింటిని పొదరిల్లుగా మారుస్తుంది. కొత్త భార్యకి భర్త సహకారం యివ్వకపోతే, అత్తమామలు యీ ఇల్లు నీది, యిక మనందరం ఒక కుటుంబం అనిపించేటట్టు ఆప్యాయతానురాగాలు చూపించి కొత్త కోడలిని ఆదరించాలి. పెళ్లయ్యాక నీవు అసలు దానితో ఏనాడన్నా ప్రేమగా వున్నావా? నీ శారీరక అవసరాలకి దగ్గిరవడం తప్ప భార్యకి ప్రేమానుభూతులు ఏనాడన్నా యిచ్చావా? బాబూ! పిల్లనిచ్చినవాళ్లం, ఎప్పుడు పుట్టింటికి వచ్చినా చిరునవ్వేనా కనపడని దాని మొహం చూసి ఎంత అడిగినా మొదట్లో అసలు చెప్పేది కాదు. పిల్లల పురుళ్లకొచ్చినపుడు మీ యిద్దరి మధ్య అన్యోన్యం, అనురాగం లేదన్నది కనిపెట్టినా, అల్లుడిని నిలదీయలేని కన్నవాళ్లం. మొన్న వాళ్ల తాతగారు పోయినపుడు వచ్చినపుడు దాని అవతారం చూసి ఎంతో అడిగాం? ఏం చెప్పను, ఎన్నని చెప్పనమ్మా! ఆ సంసారంలో ఒక్క రోజు సుఖం, సంతోషం లేదని ఏడ్చింది. ఇంటినిండా బంధుజనం. ఆ సమయంలో అంతకంటే ఏం అడగలేకపోయాం."
"దాని బతుకులో సుఖం లేకుండా చేశావు గదా! మీ అత్తగారు ఆడది కాబట్టి తోటి ఆడపిల్ల మనసు చెప్పగలిగింది. దానికేం లోటని, నీకు ఏం వుందని అంత అహంకారం? మొగుడ్ని అన్న ఒక్క అధికారంతో భార్యని మాటలతో, చేతలతో హింసించే అధికారం నీకెవరిచ్చారు. నా కడుపు మండిపోతోంది, దాన్ని పొట్టన పెట్టుకున్నావు."
"ఏంటండి, మీరు నాకు పాఠాలు చెప్తున్నారు. ఆ పాఠాలు అత్తవారింట ఎలా వుండాలో, మొగుడి దగ్గర ఎలా వుండాలో మీ అమ్మాయికి చెప్పి వుంటే ఇంతదాకా వచ్చేది కాదు. మొగుడన్నాక ఒక మాట అంటే జవాబిస్తుందా, బొత్తిగా భయం లేకుండా ఎదిరించి జవాబులిస్తుంటే ఏ మొగుడూరుకుంటాడు?"
"చూడు బాబూ, అల్లుడివని కూతురికోసం ఇన్నాళ్ళూ సహించాం. మర్యాద యిచ్చా. ఇంటి ఇల్లాలు, ఆడదంటే ఏమనుకుంటున్నావు? నీ కష్టంలో, సుఖంలో భాగమయి, ఇంటెడు చాకిరి చేస్తూ, నీ విసుగులు, కసుర్లు భరిస్తూ, తెల్లారిందగ్గిరనించి రాత్రింబవళ్ళు నీకోసం, నీ యింటికోసం, నీ పిల్లలకోసం చాకిరీ చేసే భార్య. అర్థాంగి అంటే ఏమిటో ఇప్పటికన్నా తెల్సుకో. ఆడదంటే ఆదిశక్తి, లోకానికి జగన్మాత. అమ్మలగన్న అమ్మ ఆ శక్తి స్వరూపిణి. జగన్మాతకి పది చేతులు ఎందుకున్నాయో తెలుసా? పాపులని శిక్షించడానికి, నమ్మినవారికి ఆశ్రయం ఇవ్వడానికి, దుష్టులని దునుమాడడానికి, మంచివారిని అక్కున చేర్చుకోడానికి, లోకరక్షణ, దుష్టశిక్షణ చేస్తూ జగానికంతటికీ జగన్మాత ఆ తల్లి - యింట్లో యీ తల్లి పదిచేతులున్నట్లే భర్త అవసరాలు తీరుస్తూ, పిల్లల్ని కని పెంచుతూ, ఇల్లూ వాకిలీ సరిదిద్దుకుంటూ, తెల్లారి లేచింది మొదలు పది చేతులున్నట్టే నీ పని, పిల్లల పని, వంటపని, నీ విసుగులు, కసుర్లు భరిస్తూ, పిల్లలని బుజ్జగించి, తినిపించి, స్కూలుకి పంపి, యింటికొచ్చిన అతిథులని అన్నపూర్ణలా ఆదరిస్తూ, అత్తమామలని గౌరవిస్తూ, ఎన్ని అవతారాలెత్తుతుందో రోజుకి. ఆ ఆదిశక్తి కంటే ఈ గృహిణి ఏం తక్కువ కాదు. అలాంటి ఇల్లాలికి కావాల్సిందేమిటి? రవంత ప్రేమ, కాస్తంత అభిమానం, అనురాగం. అది భర్త ఇచ్చిననాడు దాసిలా సేవ చేస్తుంది భార్య. 'కార్యేషు దాసి, కరణేషు మంత్రి...' సామెత వినలేదా? క్షమయా ధరిత్రి అయిన పుడమితల్లి భూమాత కూడా ప్రకృతిని నిర్లక్ష్యం చేసి, నాశనం చేస్తే భరించలేక విలయం సృష్టించి తన శక్తి ఏమిటో నిరూపిస్తుంది సునామీలు సృష్టించి. అలాగే ఆడది సహనం ఆఖరిమెట్టుకి వచ్చినరోజు శిక్ష వేస్తుంది. చచ్చిపోవడం శిక్ష తనకు కాదు, నిన్ను శిక్షిస్తుంది. చచ్చి సాధించింది. ఇంక అనుభవించు. ఈ పిల్లలని ఎలా పెంచుతావో పెంచు. రెండు రోజులు ఇల్లాలు యింట్లో లేకపోతే తల్లకిందులవుతున్నావు, అనుభవించు. ఓ తల్లి గర్భశోకంతో ఇచ్చే శాపం ఇది నీకు. ఈ వయసులో మా కడుపు కోత బాధ యిది!"
"నీ శాపాలు అతన్ని ఏం చేస్తాయో, నీ పిచ్చిగాకపోతే, ఇతన్ని వూరికే వదలను. ఇప్పుడే పోలీసులకి కంప్లైంట్ ఇస్తా. భార్యని హింసించి, ఆమె చావుకి కారణం అయిన ఇతను జైలుకెళితే తప్ప ఇలాంటివారికి బుద్ధి రాదు."
"నాన్నా, ఆగండి. అంత అవసరం లేదు. పోలీసుల దాకా ఎందుకు? వెయ్యాల్సిన శిక్ష నేనే వేస్తాను."
"అమ్మా! రమా... రమా! నీవా? ఏమిటమ్మా, ఎక్కడికి వెళ్లిపోయావమ్మా? ఒక్కమాట చెప్పకుండా ఏమిటమ్మా యీ పని? నీ మెసేజ్ చూసి కాళ్లు, చేతులు ఆడక పరుగెత్తి వచ్చాం. ఈ రెండు రోజులుగా మా పరిస్థితి...
"తెల్సు నాన్నా! మిమ్మల్నందరినీ బాధపెట్టాను. నాలుగు రోజుల కిందట నిజంగానే చావాలనుకుని వెళ్లాను. ఉప్మాలో ఉప్పు మర్చిపోయిన నేరానికి ప్లేట్ మొహాన విసిరికొట్టి, యింట్లో పనిమనిషి ముందే నానా తిట్లు తిట్టి చేయి చేసుకున్న మొగుడు మారడని, చావొక్కటే దారి అనుకున్నా. కాని... నా పిల్లలు అనాధలయిపోకుండా సరిగా సమయానికి దుర్గ వచ్చి కాపాడింది నాన్నా! దేవతలా వచ్చి నాకుపదేశం చేసింది."
"దుర్గా... ఎవరు దుర్గామాత, ఏమిటి అమ్మవారా?"
"కాదు నాన్నా! దుర్గ నా చిన్నప్పటి స్నేహితురాలు. మన పక్కింట్లో కృష్ణమూర్తి గారుండేవారు, దుర్గా, నేను క్లాస్ మేట్స్ మీ మెట్రిక్ వరకూ. మర్చిపోయారా?"
"ఆ దుర్గా... ఆ గుర్తుంది. ఆ అమ్మాయేం చేసింది? ఎలా వచ్చింది సమయానికి?"
"నాన్నా, దుర్గ పెళ్లయి భర్తతో ఢిల్లీకి వెళ్లిపోయింది నాలుగేళ్లక్రితం. ఇప్పుడు వాళ్లాయన ఉద్యోగం వదిలి, స్వంతంగా బిజినెస్ పెట్టారుట. అదిక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూలు మొదలుపెట్టిందట. మీరు స్వంత వూరు వరంగల్ వెళ్లిపోయారు. నేను ఎక్కడున్నది తెలుసుకోడానికి ప్రయత్నించినా అవలేదు. వారం క్రితం బజార్లో కనపడింది. సంతోషంగా కావలించుకుని, అడ్రసు అడిగి తీసుకుని, రెండు రోజుల క్రితం యింటికొచ్చింది నాన్నా! ఆ రోజు నా ఏడుపు అవతారం, ఇల్లు, ఇంటినిండా విసిరేసిన ఉప్మా ప్లేటు అన్నీ చూసి అంతా గ్రహించి మొత్తం చెప్పేవరకూ వదల్లేదు. అంతా విని 'ఎలా సహిస్తున్నావు? ఎందుకు సహిస్తూ పడివున్నావు? బుద్ధి లేదా అని తిట్టింది. బి.ఇ.డి. చేశావు. నీకు లెక్కలు ఎంత బాగా వచ్చు. హాయిగా టీచర్ ఉద్యోగం కళ్లకద్దుకుని యిస్తారు. చేతకానిదానిలా యింట్లో ఇలా పడివున్నావా? రా, నీకు నేను మా స్కూల్లో ఉద్యోగం ఇస్తాను. ఇరవై వేలు జీతం. మాకు అవుట్ హౌస్ వుంది. అందులో పిల్లలని పెట్టుకుని నీ పాటికి నీవు స్వతంత్రంగా బతుకు. ఆ మొగుడికి బుద్ధి చెప్పు. వెంటనే నీ సర్టిఫికెట్లు పట్టుకురా' అని చెప్పింది. అందుకే ఆ రోజు బయటికి వెళ్లాను. చెప్తే వెళ్లనివ్వరని తెలుసు. అప్పటివరకూ చావాలనే ఉద్దేశం రాలేదు. అక్కడికి వెళ్లాక 'నీ మొగుడికి షాక్ ట్రీట్ మెంట్ యివ్వాలి బుద్ధి రావాలంటే' అని మీకు మెసేజ్ పెట్టమంది. 'ఒక రోజులో పిల్లలెం అవరులే' అంటూ ధైర్యం చెప్పింది.
"నీకెంత ధైర్యం? నాతో ఆటలాడతావా? స్నేహితురాలి మాటలు పట్టుకుని ఇల్లొదిలి పోతావా? పో...పో... పిల్లలని తీసికెడతావా? అంతా నీ యిష్టమా?"
"అవును, అంతా నా యిష్టమే! మీ యిష్టం చెల్లుబడి కాదింక. పిల్లలని వుంచుకుంటారా, వుంచుకోండి. కోర్టుకెక్కి ఎలా తెచ్చుకోవాలో నాకూ తెలుసు. విడాకులు కావాలంటే మీరే కోర్టుకెక్కి తెచ్చుకోండి."
"ఎంత పొగరే నీకు, ఏమిటండీ, పెద్దవారు, మీ అమ్మాయి అలా మాట్లాడుతూంటే విని వూరుకుంటున్నారు."
"బాబూ, విని సంతోషిస్తున్నాం. దానికి ఆ ధైర్యం భగవంతుడి రూపంలో దుర్గ యిచ్చినందుకు. అణిచిపెట్టిన, తొక్కిపెట్టిన మెత్తని రబ్బరు కూడా వదలగానే ఇంతెత్తుకి లేస్తుంది. ఆడదీ అంతే బాబూ! భరించలేని స్థాయికి వస్తే ఆదిశక్తి అవతారం ఎత్తుతుంది. దాని ప్రతాపం చూపిస్తుందని ఇప్పటికైనా తెలుసుకో!"
(ఆకాశవాణి సౌజన్యంతో, సెప్టెంబర్ 2018)
* * * *
