ఆదిశక్తి
"మామ్మగారూ, రమ ఎక్కడికి వెళ్లిందో మీకేం చెప్పలేదా? ఏడవుతుంది, యింకా యింటికి రాలేదు చూడండి."
"నాకేం చెప్పలేదు బాబూ! 'మామ్మగారూ! ఆయన వచ్చేవరకు పిల్లల్ని మీ యింట్లో కాస్త కూర్చోపెట్టుకుంటారా, ఆయనొచ్చాక తాళం యిచ్చి, పిల్లల్ని అప్పగించండి' అంది. అక్కడికీ అడిగాను 'ఎక్కడికి వెళుతున్నావు? మీ ఆయన వచ్చేలోగా రావా?' అంటే, 'పనుంది, వచ్చాక చెపుతా, ఆలస్యం అవచ్చు, అందుకే తాళం యిచ్చాను' అంటూ హడావిడిగా వెళ్లింది బాబూ!"
"ఎక్కడికెడుతున్నది చెప్పకుండా వెళ్లడం ఏమిటి? నాకు ఫోనన్నా చెయ్యొచ్చు గదా! పిల్లల్ని వదిలేసి వెళ్లి ఇంతసేపు ఏం చేస్తున్నట్టు?"
"ఏదో పనుండే వెళ్లి వుంటుందిలే నాయనా! రమ అలాంటి బాధ్యత లేకుండా తిరిగే రకమా? నీవు ఫోను చెయ్యకపోయావా?"
"ఆ చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తూంది. అసలు ఎన్ని గంటలకి వెళ్లింది?"
"పిల్లలు స్కూలునించి రాగానే వాళ్లకి టిఫిను అదీ పెట్టి, బట్టలు మార్చి, పుస్తకాలు యిచ్చి యిక్కడ కూర్చుని హోమ్ వర్క్ చేసుకోండి అంటూ వెళ్లింది. నాలుగు దాటింది..."
"సామానేమన్నా తీసికెళ్లిందా వెంట?"
"ఏదో భుజాన గుడ్డ బ్యాగ్ తప్ప యింకేం లేదు బాబూ..."
"ఎటు పోయిందీ, చెప్పాచెయ్యకుండా యీ వెళ్లడం ఏమిటి? పిల్లలు అమ్మ అని గోలపెడ్తున్నారు. ఆకలంటున్నారు. రానీండి చెపుతా, చెప్పా పెట్టాకుండా..."
"అంత కోపం ఎందుకులే, వచ్చేస్తుంది. ఈ వూర్లో బయటికి వెళ్లిన మనిషి తిరిగి టైముకి రావడం అంటే ట్రాఫిక్ లో పడి ఎంత కష్టం. కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్లకి ఆకలంటే ఇదిగో యీ బ్రెడ్ తీసికెళ్లి పెట్టు. లేదంటే కాస్త బయటనించి ఏమన్నా తెచ్చిపెట్టు. ఊరికే గాభరాపడకు అలాగ..."
* * *
"హలో... హలో... ఎవరు? ప్రసాదా... ఏమిటి బాబూ, ఇంత పొద్దుటే ఫోను చేశావు? అంతా కులాసాయే గదా! ఏమిటి సంగతి?"
"మామయ్యగారూ, రమ అక్కడికేమన్నా వచ్చిందా?"
"రమా! ఇక్కడికి రావడం ఏమిటి, ఎందుకు, వస్తున్నట్టు మాకేం చెప్పలేదే, మా యింటికేం రాలేదే? ఏమిటి, ఏం జరిగింది?"
"ఏమోనండి, నిన్న సాయంత్రం నాలుగు గంటలకి వెళ్లిన మనిషి ఎక్కడికెళ్లిందో, ఎందుకెళ్లిందో ఏమీ చెప్పకుండా పిల్లల్ని పక్కింట్లో మామ్మగారి దగ్గిర వదిలి, తాళం యిచ్చి వెళ్లింది. ఇప్పటివరకూ యింటికి రాలేదు. రాత్రంతా ఎక్కడుందో, ఏమయిందో తెలీదు. వరంగల్ మీ ఇంటికి ఏమన్నా వచ్చిందేమోనని..."
"అయ్యో, అయ్యో! అదేమిటి బాబూ! రాత్రంతా రాలేదా యింటికి. ఎక్కడికి వెళ్లింది, ఏమయింది? ఇక్కడికేం రాలేదు. అంటే ఏమయింది నాయనా, ఇంట్లో ఏమన్నా గొడవ పడ్డారా? దాన్నేమన్నా అన్నావా? బాధలో, కోపంలో ఇల్లు వదిలి, ఏ అఘాయిత్యమన్నా చేసుకుందా? చెప్పవయ్యా బాబూ, అసలేం జరిగింది?"
"బాగుంది, చాలా బాగున్నాయి మీ మాటలు. మీ అమ్మాయిని నేనేదో తిట్టి కొడితే యింట్లోంచి వెళ్లిపోయిందన్నట్టు ఏమిటా మాటలు? నిన్నేం జరగలేదు మా మధ్య గొడవ. అయినా యింట్లో మొగుడు పెళ్లాం మాటమాట అనుకుంటే అలా పిల్లల్ని వదిలిపోతుందా ఆడది - అలా చెప్పకుండా చెయ్యకుండా వెళ్లిపోతుందా? రానీండి చెపుతా..."
"ఇదిగో, ఈ నీ కోపం, అహంకారం భరించలేకే ప్రాణం విసిగి ఎటన్నా పోయిందేమో! ఏదో అనే వుంటావు లేకపోతే పిల్లల్ని వంటరిగా వదిలి ఓ తల్లి అలా ఎందుకు వెడుతుంది? చెప్పు ఏం జరిగిందీ, ఇప్పటికన్నా నిజం చెప్పు. నా కాళ్లు చేతులు ఆడడం లేదు.
"ఎన్నిసార్లు చెప్పాలండి, ఏం జరగలేదు నిన్న..."
"నిన్న కాకపోతే మొన్న, మొన్న కాకపోతే అంతకుముందు. కారణం లేకుండా ఎందుకు పోతుంది? ఇప్పటికైనా వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇయ్యి. అది యీ పూట రాకపోతే మాకు చెప్పు. వెంటనే వస్తాం. నేనూ మా వాళ్లకి అందరికీ ఫోన్లు చేసి అడుగుతా. వెళ్లవయ్యా బాబూ, వెళ్లు ముందు పోలీస్ స్టేషన్ కి."
* * *
"మీరా, ఏమిటింత పొద్దునే వచ్చేశారు. రమ వచ్చిందా అక్కడికి? ఏది? మీరూ వచ్చారా అత్తయ్యగారూ... రమ కబురు తెచ్చిందా ఏమన్నా?"
"రమ రావడం ఏమిటయ్యా నాయనా! కొంపముంచి వెళ్లిపోయిందయ్యా! ముప్ఫై ఏళ్లకే నూరేళ్ల బతుకు బుగ్గి చేసుకుందయ్యా నాయనా!"
"ఏమిటండీ మీరనేది? ఏమిటి, ఏమయింది?"
"నిన్న నీతో మాట్లాడాక ఫోనులో మెసేజ్ చూశాను. ఎప్పుడు పెట్టిందో, నేను సాయంత్రం చూసుకోలేదు. రాత్రి చూసుకున్నాను."
"ఏం మెసేజ్ పెట్టింది?"
"ఏం పెడ్తుంది? ఓ ఆడపిల్ల మనసు విరిగిపోయి, అఘాయిత్యం చేసుకోడానికి ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఆడది ఏం రాస్తుంది? 'నాన్నా, అమ్మా, యింక నేనీ కష్టాలు భరించలేను. నాలో ఓపిక, సహనం చచ్చిపోయి యీ నిర్ణయానికి వచ్చాను. పెళ్లయిన పదేళ్లలో ఒక్క రోజు నా బతుకులో సంతోషం అన్నది లేదు. కట్టుకున్న భార్య అన్న ప్రేమ, అభిమానం ఎలాగో దక్కలేదు. ఎప్పుడూ కసుర్లు, విసుర్లు, ఎత్తిపొడుపులు, అరుపులు, సామాను విసరడాలు, మగ అహంకారంతో ఏ చిన్నపాటి తప్పునీ కొండంత చేసి అవమానపరుస్తూ, సాధిస్తూ, అసలు ఆ మనిషిలో మానవత్వం వుందా అనిపిస్తుంది నాన్నా! పిల్లలు పుట్టాక అయినా మారతారన్న ఆశ అడియాస అయిపోయింది. తెల్లారిం దగ్గిరనించి ఏదో తప్పు దొరకదా అని సాధించడమే పని. ఇంక భవిష్యత్తు మీద ఆశ చచ్చిపోయింది. సుఖం, సంతోషం లేని బతుకు నాకక్కరలేదు నాన్నా! పిల్లలకోసం వాళ్లని అనాధలుగా చేసి పోలేక యిన్నాళ్లు ఓర్చుకున్నాను. ఇంక సహనం ఆఖరి మెట్టుకు వచ్చాక నాకు మరో దారి కనపడక యింతకు తెగించి, ఇల్లు వదిలి ఎటో వెళ్లి చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను. నే పోయాక అన్నా ఆయన మారతారేమో అన్నది ఒక్కటే ఆశ.' చూశావా ఎంత పెద్ద ఉత్తరం పెట్టిందో? రమా, ఎంత పని చేశావే తల్లీ! చావడం ఎందుకే తల్లీ! మేం యింకా బతికే వున్నాం గదా! మా దగ్గరకి రాలేదేమే తల్లీ! అయ్యో... రమా! ఏదో సంసారంలో చిన్నాచితక గొడవలనుకొన్నాం గాని నీ ప్రాణం యింత విసిగిపోయిందనుకోలేదే..."
"ఏమిటండీ... నేనేదో మీ అమ్మాయిని రాచిరంపాన పెడితే, బాధలు పడలేక ఇల్లొదిలి పోయి చచ్చినట్టు నేరం నామీద వేస్తున్నారు. ఏదో భార్యాభర్తల మధ్య మాటమాట అనుకోరా? కోపాలు, తాపాలు వుండవా? అంతమాత్రానికి యిలా ఇల్లు, పిల్లల్ని వదిలి ఆడవాళ్లు చావడానికి పోతారా? దానికి పొగరెక్కింది. మొగుడు చిన్న మాట అంటే యిలా పిల్లలని కూడా చూడకుండా వదిలేసి పోతుందా? ఏ యింట్లో గొడవలుండవు. అందరు ఆడవాళ్లు యిలాగే ఇల్లు వదిలి చావడానికి పోతున్నారా?"
