రోజుకి పదహారు గంటలు పనిచేస్తూ ఒక్కో ప్రణాళిక అమలుపరచడానికి కృషి చేస్తూనే మరోపక్క అమెరికాలో వున్న కొడుకును ఇండియా వచ్చి ప్లాస్టిక్ సంచులు తయారుచేసే ఫ్యాక్టరీ పెట్టి ప్రజలకు సంచులు కాస్త చవకగా అందించాలని, కెమికల్ ఇంజనీరింగ్, ఎం.బి.ఏ. చేసిన కొడుకు రావాలని ఫోన్ ల మీద ఫోన్లు కురిపించింది. మంచి ఉద్యోగము, అమెరికా సుఖాలు వదులుకుని రానన్న కొడుకుని "నీ దేశం కోసం ఈ మాత్రం చెయ్యవా, అందరూ నీలా స్వసుఖమే చూసుకుంటే దేశం గతి ఏం కావాలి?" అని చెప్పి వాదించి ఊదరగొట్టి ఆఖరికి కొడుకుచేత ఊ అన్పించింది. కొడుకు వచ్చేలోగా ఫ్యాక్టరీకి కావాల్సిన స్థలం, యంత్రాంగాలు అంటే తన పరపతి, పలుకుబడి వినియోగించి సమకూర్చి ఫ్యాక్టరీ ప్రారంభింపచేసింది.
అదే విమలాదేవి చేసిన పెద్ద పొరపాటని ఆవిడ ఆరోజు గ్రహించలేకపోయింది. ప్రజలకి సేవ చేయాలన్న ఆరాటంతో, ప్లాస్టిక్ సంచులు చవకగా అందించి, ప్రజలని ఆకర్షించాలన్న తాపత్రయంతో ఆవిడ చేసిన ఈ పని ఆవిడ అంటే గిట్టనివారికి, ఆవిడ పాపులారిటీని సహించలేనివారికి ఆవిడని దెబ్బతీయడానికి అదే స్ట్రాంగ్ పాయింట్ అవుతుందన్నది ఊహించలేక పోయింది.
విమలాదేవి ఈ చేస్తున్నదంతా ప్రజలమీద ప్రేమతో, దేశంమీద భక్తితో చెయ్యడం లేదని, కొడుకు చేత ఫ్యాక్టరీ పెట్టించి ప్లాస్టిక్ సంచులు ప్రజలచేత కొనిపించడానికి చేసిందనీ, లక్షలు ఆర్జించే ఉద్దేశంతో ఇదంతా చేస్తోందని టిక్కెట్ దొరకని మాజీ ఎమ్మెల్యే ఓ పక్క, ఆమె చేతిలో ఓడిపోయిన ప్రత్యర్థి మరోపక్క చిన్న చిచ్చు అంటించారు. ఆ నిప్పురవ్వ రాజుకుని దావానలంలా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అటు అపోజిషన్ పార్టీకి ఈ వార్త మంచి ఆహారం అయింది.
దానికితోడు అటు ఆఫీసులో విమలాదేవి స్ట్రిక్ట్ నెస్ వర్కర్స్ కి చాల ప్రాబ్లమ్ అయింది. ఇన్నాళ్లు యిష్టం వచ్చిన రీతిలో పనిచేసినవారు ఆవిడ ధాటికి తట్టుకోలేకపోయారు. ఏ రోజు ఏ వార్డుకి, ఏ వీధికి వస్తుందో తెలియకుండా వచ్చి తనిఖీ చేసి సరిగా లేకపోతే తీసుకునే కఠినచర్య ప్రాణాంతకంగా తయారయింది. ఓ ఆరునెలలు ఆవిడ తయారుచేసిన ప్రణాళికను ఉత్సాహంగా 'న్యూమ్ర్ స్పీప్స్ క్లీన్' అన్నట్టు అమలుపరిచినా రోజులు గడుస్తున్నకొద్దీ బద్ధకానికి, లంచాలకి అలవాటుపడ్డ స్టాఫ్ కి ఆవిడ ఉనికి నచ్చలేదు. ఏ రోజు ఎవరు సస్పెండ్ అవుతారో తెలియని స్థితిలో పనిచేయడంతో ఆవిడపట్ల విముఖత పెరగసాగింది.
ఇటు ప్రజలు? ఊరికే సంచులు ఇచ్చినన్నాళ్లు చెత్త సంచులలో ఎత్తిపెట్టిన ప్రజలు పదో ఇరవయ్యో ఖర్చు పెట్టి కొనడానికి గింజుకున్నారు. ఎవరూ చూడకుండా చెత్త డబ్బాల్లో పోసేయటం ఆరంభించారు. ఏ బజారులోనన్నా ఎవరన్నా యూరినల్స్ ఉపయోగించకుండా రోడ్డుమీద చేస్తే పది రూపాయల ఫైన్ కలెక్ట్ చేయడంతో ఈ ఆంక్షలు ప్రజలకు నచ్చలేదు. దానికితోడు ఇదంతా విమలాదేవి కొడుకుచేత ఫ్యాక్టరీ పెట్టటానికి చేస్తుందన్న వార్త జనానికి చేరటంతో ఆవిడపట్ల గౌరవం తగ్గిపోసాగింది. జనం చెవులు కొరుక్కున్నారు.
ఈ వార్త పేపర్ లో రావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అటు వర్కర్స్ ఆవిడ ధాటికి తట్టుకోలేక 'వర్క్ టు రూల్'తో మొదలుపెట్టి స్ట్రయిక్ నోటీసులు ఇచ్చారు.
పేపర్లలో తన గురించిన వార్తలు చదివి విమలాదేవి దిగ్భ్రాంతిచెందింది. తనింత శ్రమపడుతూంటే, తన నిస్వార్థ సేవకి జనం యిచ్చిన నిర్వచనం విని చేష్టలుడిగినదానిలా అయింది. వార్తలు చదివిన కొడుకు తల్లిమీద ఎగిరిపడ్డాడు.
"చూశావా, నీవు చేసిన సేవకి జనం వేసిన పూలమాలలు" అంటూ హేళన చేసి "ఇప్పటికయినా చాలించు నీ దేశసేవ. అనవసరంగా నన్ను పిలిపించావు" అంటూ దుయ్యబట్టి, ఇలాంటి దేశంలో ఒక్కక్షణం వుండనని, ఇదివరకు తను పనిచేసిన కంపెనీకి ఫోన్ చేసి వాళ్లు తిరిగి ఉద్యోగం ఇస్తాననటంతో నెల రోజులలో ఫ్యాక్టరీ మూసేసి అమెరికా వెళ్లిపోయాడు.
స్వంత లాభం కోసం, మంత్రిగా పలుకుబడి, అధికారం దుర్వినియోగం చేసి స్వప్రయోజనం కోసం లాండ్ అక్వైర్ చేసి ఫ్యాక్టరీ పెట్టించిందని ఆరోపణలు చేశాయి అపోజిషన్ పార్టీలు. అటు అసమ్మతివర్గం, ఇటు అపోజిషన్ ధాటికి తట్టుకోలేక ముఖ్యమంత్రి ఆవిడని సంజాయిషీ కోరాల్సి వచ్చింది. ఇటు ప్రజలు, వర్కర్సు అవసరాన్ని మించిన అధికారం చెలాయిస్తూ జులుము సాగిస్తుందన్న ఆరోపణలు ఓ ప్రక్క, పేపర్లలో ప్రముఖంగా వస్తున్న వార్తలు అన్నీ చదివిన విమలాదేవికి అవమానం కంటే బాధ ఎక్కువ అన్పించి ఈ కుళ్లు రాజకీయవ్యవస్థ నుంచి తప్పుకోడం మినహా దారి లేదని ఆవిడ రాజీనామా చేసింది.
మరో నాలుగైదు నెలల్లో ఫ్యాక్టరీ, ఇళ్లు, ఆస్తులు అన్నీ తెగనమ్మి ఆవిడా కొడుకు దగ్గరకు వెళ్లిపోయింది.
స్వేచ్చ దొరికిందన్నట్టు చక్కగా వీధులు అన్నీ చెత్తతో పొంగిపొర్లాయి. చెత్తకుప్పలన్నీ కన్నులపండుగగా నిండిపోయాయి. యథాప్రకారం పొంగిపొరలే డస్ట్ బిన్నులతో ఊరు కళకళ్లాడిపోయింది.
(వనిత దీపావళి సంచిక, 1993)
* * * *
