Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 43


    "మీరు విదేశాలు తిరిగివచ్చి చాలా ఇంప్రెస్ అయిపోయారు. వినడానికి అంటే చాలా బాగుంది. అమలుపరచడం ఎంత కష్టమో మీకు అర్థం గాదు..."
    "అర్థం అవుతుంది సార్, ప్రభుత్వం తల్చుకుంటే చెయ్యలేనిది ఏం వుండదు. ఎటొచ్చీ ఆ ప్రభుత్వంలో నిజాయితీ కొరవడకూడదు. మీరు అడిగితే ఓ మంచిపని కోసం డబ్బే ఇచ్చే ఉదారులు, పెద్దలు, ఇండస్ట్రియలిస్టులు, స్వచ్చంద సంస్థలు ఎన్నో వున్నాయి. పెద్ద పెద్దవారు మీ పార్టీ ఫండులకి ఇచ్చేదానిలో పదోవంతు ఇచ్చినా ఈ పనులకి సరిపోతుంది సార్!" ఆవిడ మాటలకి ముఖ్యమంత్రిగారు మొహం మాడ్చుకున్నారు.
    "చూడండి, అప్పుడే నెల రోజులుగా మా వీధిలో వున్న అందరూ తు.చ. తప్పకుండా నా మాట పాటిస్తున్నారు. వాళ్ల బంధువులు, స్నేహితులు వచ్చి చూసి మెచ్చుకుని తామూ అలా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ చుట్టుపక్కల కాలనీలకి, వీధులకి, వాడలకి, ఊర్లో మహిళామండలి సభ్యులందరినీ పిలిచి బోధపరిచి అందరిచేత చెప్పిస్తున్నాను. అందరం ఇళ్లకి వెళ్లి చెపుతూంటే సంతోషంగా ఒప్పుకుంటున్నారు. నాకు తెల్సిన బిజినెస్ పీపుల్ని, డబ్బున్నవారిని వారి వారి వీధుల్లో కొన్నాళ్లు జనం అలవాటుపడేవరకు ఫ్రీగా సంచులు పంపే ఏర్పాటు చేస్తున్నాను. మీరు తల్చుకుంటే ఏం చెయ్యలేరు? ప్రతివాళ్ల జీతంలో నూటికి ఒక రూపాయి చొప్పున ఒకటి రెండు నెలలు చందాగా ఇమ్మని అఫీసులని ఆదేశించండి. చందాలకి ప్రజలని, ధనవంతులని ముందుకు రమ్మని పేపర్లలోఅభ్యర్థించండి. డబ్బు వచ్చి పడ్తుంది. ఎటొచ్చీ ఈ పథకాలన్నీ ఇంప్లిమెంటు సజావుగా చేసే నిజాయితీ ప్రభుత్వంలో పెద్ద అధికారినుండి చిన్న అధికారి వరకూ కొరవడకుండా చూడాల్సిన పూచీ మీది..." మరోసారి ముఖం మాడ్చుకున్నా, అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు కనక మొహంమీద నవ్వు పులుముకుని, వెల్... మీ మాటలు వింటూంటే మీలాంటివారు మా ప్రభుత్వంలో వుండాలనిపిస్తుంది. ఎన్నికలలో నెగ్గి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అయ్యాక ఇదంతా మీ చేతులమీదే జరిపిద్దురుగానిలెండి..." హాస్యంగా నవ్వుతూనే ఎత్తిపొడిచారు.
    "ఒక మంచిపని చెయ్యడానికి మంత్రులే అవనక్కరలేదు. స్వచ్చందంగా దేశానికి సేవ చెయ్యొచ్చు. పదవుల మీద వ్యామోహంతోనో, పేరు కోసమో నేనీ పని చెయ్యడం లేదు. మనదేశం ఓ కుళ్లుగుంటలా వుండకూడదని, మిగతా దేశాల ముందు తల దించుకునే స్థితిలో వుండరాదన్నది నా తాపత్రయం" ఆవిడ ఆయన వ్యంగ్యం అర్థం చేసుకునే జవాబిచ్చింది.
    "అధికారం చేతిలో వుంటే తప్ప పనులు జరగవంటే, మీరు అవమంటే మంత్రి అవడానికి నాకేం అభ్యంతరం లేదు." ఓ చురక అంటించింది.

                                                                                    *  *  *

    ముఖ్యమంత్రిగారు హాస్యంగా అన్నమాట నిజమైంది. మరో ఆరునెలలకే ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ఎన్నికలొచ్చాయి.
    ఈ ఆరునెలలలో విమలాదేవి చాలా పాపులర్ అయిపోయింది. ఆవిడ పేరు పేపర్లలో ప్రముఖంగా రాసాగింది తరచు. ఆవిడ వూర్లో పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నట్స్ ని పట్టుకుని చందాలు వసూలు చేస్తూ, మహిళామండలి స్త్రీలని పట్టుకుని ప్రతి వాడ, ప్రతి వీధికి వెళ్లి ప్రజలకి చెప్తూ, ఒప్పిస్తూ, సంచులు పంచిపెడ్తూ ఊరి స్వరూపం కాస్తయినా మారడానికి కృషి చేయసాగింది. నాలుగైదు నెలల్లో ఆవిడ చేస్తున్న కృషి ఇటు ప్రజలలో, అటు పేపర్లలో, ప్రభుత్వంలో గుర్తింపు పొందింది. ఆవిడ పాపులారిటీ ఢిల్లీవరకూ పాకింది. ముఖ్యమంత్రి హైకమాండ్ మీటింగ్ లో ఆ నియోజకవర్గం ప్రతిసారి మాదిరి మరో పార్టీకి దక్కకుండా చెయ్యాలంటే విమలాదేవిని ఆ నియోజకవర్గంలో నిలబెడితే గెలుపు తప్పదని చేసిన ప్రతిపాదన పార్టీ అధ్యక్షుడు ఆమోదించారు. విమాలాదేవికి రాజకీయాల్లో దిగాలని లేకపోయినా ఆ నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు అందరి బలవంతం ఒక కారణం కాగా, తనేదన్నా సాధించాలంటే చేతిలో అధికారం వుండాలని ఆవిడా గుర్తించి పోటీకి నిలబడడానికి ఒప్పుకుంది.
    అనుకున్నట్టే ఆవిడ ఎప్పుడూ వచ్చే ఆ సీటు ప్రతిపక్షపార్టీ సభ్యుడిని అధిక మెజారిటీతో ఓడించి గెలిచింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకున్న తనకు కాక ఆఖరి నిమిషంలో విమలాదేవికి పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో ఓ సభ్యుడు విమలాదేవికి టిక్కెట్టిప్పించిన ముఖ్యమంత్రిమీద, పార్టీ అధ్యక్షుడి మీదా కోపంతో మిగతా అసమ్మతివర్గంలో చేరిపోయి అవకాశం దొరికితే తన తడాఖా చూపాలని కాచుకు కూర్చున్నాడు. ఓ పక్కన చిత్తుగా విమలాదేవి చేతిలో ఓడిపోయిన ప్రతిపక్ష సభ్యుడు ఆమె మీద కక్ష సాధించే అవకాశం కోసం కాచుకుని కూర్చున్నాడు.
    విమలాదేవికి అందరూ అనుకున్నట్టే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పదవి లభించింది. ఆమెకంటే ఎంతో సీనియర్ ఎమ్మెల్యేలకి చాలాకాలంగా వున్న లభించని మంత్రిపదవి కాస్తా ఆమెకి ఇవ్వడం చాలామందిలో అసంతృప్తిని రేకెత్తించింది, కన్నెర్ర అయింది.
    విమలాదేవి మంత్రిగా ప్రమాణం స్వీకరించిన రోజునుంచి ఒక్కరోజు కూడా వృధా చెయ్యకుండా ఊరిని సంస్కరించే రంగంలోకి దిగిపోయింది. అధికారులతో అనేక చర్చలు జరిపి, అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉన్న సిబ్బందితో, వున్న లారీలతో, క్రషర్స్ తో ఏఏ వార్డులలో ఏఏ రోజు చెత్త తీయాలో, వారానికి ఒకసారి ప్రకటించిన రోజులో తప్పక లారీ ఏ వీధికి వెళ్లాలో అన్న నోటీసులు తయారుచేసి ఊరంతా అంటింపజేసి, పేపర్లో, టి.వి.లో ప్రకటనలు ఇప్పించింది. మున్సిపాలిటీ సిబ్బందిని సమావేశపరచి డ్యూటీ సక్రమంగా నిర్వహించని పనివారిమీద కఠినచర్య తీసుకోబడుతుందని, పని చక్కగా చేస్తే బోనస్ లని ప్రకటించింది. తను ప్రతిరోజూ ఒక్కో వార్డులో తనిష్టం వచ్చిన వీధిలో స్వయంగా తిరిగి పనితీరు పర్యవేక్షిస్తానని, ఎక్కడన్నా సంచులు తీయలేదని కబురు అందితే క్షమించనని చెప్పింది. మరోపక్క ప్రతి మురికివాడలో మరుగుదొడ్లు, జనం తిరిగే చోట యూరినల్స్ కట్టించడానికి ప్లాన్లు, ఫండ్స్ కలెక్ట్ చేయడం ఆరంభించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS