వారం పదిరోజుల్లో నిజంగానే ఆ వాడ రూపు మారిపోయింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రతివారూ ఇంటి ముందు, సందు ముందు చెత్త పోయకుండా సంచుల్లో పెట్టి డ్రమ్ములలో పెట్టారు. వీధిలో వున్న ఆడవాళ్లు వంతులవారీగా యిద్దరు ముగ్గురు కలిసి వీధులు తుడిచారు. పిల్లలు రోడ్లు పాయిఖానాలు చేయకుండా బుద్ధిగా లావెట్రీ ఉపయోగిస్తున్నారు. విమలాదేవి ప్రత్యేకంగా పనికట్టుకుని రోజూ ఒకసారి ఆ వీధుల వెంట రెండు మూడుసార్లు తిరిగి వచ్చేది.
ఆ రోజు చెత్త లారీ వచ్చింది. ఆ వీధిలో చెత్తడబ్బా చుట్టూ ఎప్పుడూ పొంగి పొర్లుతూ వుండే చెత్త లేదు. వారిని చూసి అందరూ కట్టిపెట్టిన సంచులు తీసుకొచ్చి వీధి చివర పెట్టారు. అది చూసి మున్సిపాలిటీ వర్కర్లకి ఆశ్చర్యంతో పాటూ ఆనందం కలిగింది ఆఫీసుకి వెళ్లాక వర్కర్స్ అందరితో ఈ విషయం చెప్పారు. అంతా కలిసి చర్చించారు. కూడబలుక్కున్నారు. "మనం ఇంక యిట్టా చెత్తకుప్పలు తియ్యొద్దు. అట్టా సంచులలో కట్టిపెడితేనే తీద్దాం. ఆ వీధివాళ్లంతా చక్కా ఎత్తిపెట్టారు సంచుల్లో. అందరూ కలిసి ఆళ్లని చూసి అట్టాగే చెయ్యాలని చెబుదాం. మనం చెత్తకుప్పలు ఎత్తం అంటే అంతా అట్టాగే పెడతారు. కాదంటే స్ట్రయిక్ చేద్దాం" అంటూ కలిసి నిర్ణయించారు. ఆఫీసరుకి కబురు చేరింది. వాళ్లూ ఆశ్చర్యంగా విన్నారు.
కమీషనర్ గారి దగ్గరకు కబురు చేరింది. ముందే తెలిసినవాడవడం వలన ఆయన ఆశ్చర్యపడలేదు. "అవును, నిజంగా మన నగరం ఆ వీధిలా మారితే మన దేశానికి మంచిరోజులు వచ్చాయని ఆనందపడొచ్చు. కానీ ఒక రోజులో జరిగే పనా?"
"ఎందుకు కాదు సార్! మీరు పేపర్లో నోటీసులు వేయించండి. చెత్తకుండీలలో వేస్తే చెత్త తీయరని, సంచుల్లో కట్టిపెట్టాలని రూలు పెట్టామని మున్సిపాలిటీ నోటిఫికేషన్ వేయండి. ప్రతిచోట పోస్టర్లు అంటింపచేయండి. జనంలో వెంటనే కాకపోయినా కొద్దిరోజులలో మార్పు వస్తుంది సార్!" కమీషనర్ పర్సనల్ సెక్రటరీ అన్నాడు.
"నోటీసులతో ప్రజలలో మార్పు వస్తుందంటావా? ప్రతివాళ్లల్లో సివిక్ సెన్స్ వుండాలి గాని, మనం ఏదో చేద్దాం అనుకున్నా ఈ పొలిటీషియన్స్ సాగనిస్తారా? ప్రజలు మనకు కోపరేషన్ ఇస్తారా?" సందేహాలు వెలిబుచ్చాడు కమీషనర్.
"సార్, ఏ మంచిపని మొదలుపెట్టినా ముందు తీవ్రవిమర్శలు ఎదుర్కోవాలి అన్నది మీకు తెలియదా సార్! రైలు ఇంజన్ కనిపెట్టిననాటి నుంచి ఈ విమర్శలు ఎదుర్కొంటూనే వున్నారు. ప్రజలు వారంతట వారు శుభ్రత అలవర్చుకోకపోతే గవర్నమెంటు కఠినమైన రూల్సు పెట్టి అలవాటు చెయ్యాలంటాను. విదేశాల్లో అలా కాగితం ముక్క పారేసినా కఠినంగా ఫైనులు వేయబట్టి గదా వారంతా శుభ్రత అలవరచుకున్నారు. ఏ మంచైనా అలవాటు పడడానికి టైము పడ్తుంది సార్! మనం చెత్త అలా విడిగా పోస్తే తీయం, సంచుల్లో ఎత్తిపెట్టాలని రూలు పెడితే జనం కొన్నాళ్లకయినా మారతారు సార్!" సెక్రటరీ వినయంగా అన్నాడు.
"సరే, చూద్దాం. ముందు పేపర్లలో ఓ నోటిఫికేషన్ ఇవ్వండి. ఇటు ప్రజలు, అటు పొలిటీషియన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చూద్దాం!" కమీషనర్ ధైర్యంగా ఆర్డరు పాస్ చేశాడు.
ఇలాంటి నోటిఫికేషన్స్ కి ఏం చలించం అన్నట్లు ఓ మూలబడిన వార్త ప్రజలు పట్టించుకోలేదు. ప్రభుత్వం దృష్టికి రాలేదు. యథాప్రకారం చెత్తడబ్బాలు నిండాయి. నెలకొకసారన్నా వచ్చే చెత్తలారీలు రాకపోవడంతో చెత్తకుండీలు పొంగిపొర్లి రోడ్లన్నీ నిండాయి. ప్రజలలో కాస్త చలనం కల్గినవాళ్లు మున్సిపాలిటీ పనితీరును గురించి పత్రికల్లో ఉత్తరాల శీర్షికలో దుమ్మెత్తిపోశారు. పేపర్లు తీవ్రంగా విమర్శించాయి. క్రమంగా కొన్నాళ్లకి ఈ వార్త ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగారు కోపంతో మండిపడ్డారు జరిగింది విని. కమీషనర్ కి కబురు వెళ్లింది. ఎవరి అనుమతితో ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చావని మంత్రిగారు ఎగిరిపడ్డారు. కమీషనర్ వినయంగానే తను మనుష్యులలో మార్పు తెచ్చి, ఊరిని శుభ్రపరచాలన్న సదుద్దేశంతో చేశానని చెప్పిన మాట మరింత కోపం కల్గించింది ఆయనకి.
"రూల్సు, రెగ్యులేషన్స్ మార్చేయడం, కొత్త ప్రణాళికలు పెట్టేయడం, దేశాన్ని ఉద్ధరించేయడం అంత మీ ఆఫీసర్లు చేసేస్తే ఇంక మేం ఎందుకు?" అంటూ ఎగిరాడు.
"ఇచ్చే ముందు నాకు చెప్పక్కరలేదా? నీకెవరిచ్చారు పవరు?" ఆఫీసరు తను ఏ ఉద్దేశంతో చేశాడో చెప్పినా వినకుండా ఎగురుతున్న మంత్రిగారి ఆవేశం తగ్గేవరకూ ఆగి, రాణి విమలాదేవి ఆరంభించిన ఈ ఉద్యమానికి చేయూతనిచ్చి ప్రోత్సహించితే ఊరు బాగుపడ్తుందన్న ఆశతో చేశానని చెప్పాడు. మంత్రిగారి భ్రుకుటి ముడిపడింది. "ఎవరా విమలాదేవి?" కమీషనర్ జరిగింది వివరించాడు.
మంత్రిగారు కుతూహలంగానే విన్నారు. కాస్త శాంతించాడు. "బాగానే వుంది. ఇలా ఒక్క రోజులో రూల్సు మార్చేసి ప్రజలని ఇబ్బంది పెడితే జవాబుదారీ మాది. ముందు చెత్త తీయించండి. రోడ్లన్నీ నిండిపోయాయి. నేను ఈ విషయం ముఖ్యమంత్రిగారితో మాట్లాడాక ఆలోచిద్దాం!" తమ పవరు, ప్రాముఖ్యత తగ్గకూడదని, ఆఖరి నిర్ణయం తమదే అని తేల్చారు మంత్రిగారు. ఆ మాత్రం దారికి వచ్చినందుకు సంతోషించాడు కమీషనర్.
* * *
"ఎవరావిడ? ఎవరా విమలాదేవి? ఇదంతా ఎందుకు చేస్తోంది?" మంత్రిగారు చెప్పిన వార్త విని ఆశ్చర్యంగా, కుతూహలంగా అడిగారు ముఖ్యమంత్రి. జనంలో, ఓ వీధిలోనయినా ఈ మాత్రం మార్పు తీసుకురాగలిగిందంటే... ఆవిడను చూడాల్సిందే. "ఐ లైక్ టు మీట్ హర్" అన్నారాయన మంత్రితో.
విమలాదేవిని కలుసుకున్నాక ఆవిడ అందం, ఠీవి, రాచరికపు హోదాలతో పాటు ఏదో చెయ్యాలన్న తాపత్రయం, దీక్ష, కృషి, పట్టుదల అన్నీ నచ్చాయి ఆయనకి.
"విమలాదేవిగారూ, బాగానే వుంది మీరు చెప్పింది. ఊరు, దేశం బాగుపడాలని మాకూ వుంది. బాగుపడితే మాకు సంతోషమే. కాని మీరు ఒకటి మర్చిపోతున్నారు. ఆ దేశాలతో పోల్చుకోడానికి మనది బీదదేశం అన్న సంగతి మరవకండి. తిండికి గతిలేని వారెందరో వున్న ఈ దేశంలో నెలకి పదిహేనో, ఇరవయ్యో పెట్టి సంచులు కొనే స్థితిలో అంతమంది వున్నారా? అంతేకాక వున్న యూరినల్స్ శుభ్రత లేకుండా కంపు కొడ్తున్నాయి. వారిలా మనకి నీటివనరులు లేవు. ఎక్కడ పడితే అక్కడ బోరింగులు తవ్వించి, యూరినల్స్ కట్టించి మెయిన్ టైన్ చెయ్యడానికి మనకు గ్రాంటులు ఏవి? తాగడానికే నీరు లేని బీదదేశం మనది..."
"క్షమించండి సార్... మీరు చెప్పినట్లు మనది బీదదేశమే. కానీ ఇంటికి నెలకి పది పదిహేను ఖర్చు పెట్టలేని స్థితిలో వున్నారంటే మాత్రం నమ్మలేను. బీదరికానికి, అసలు శుభ్రతకి సంబంధం ఏమిటి సార్? మనుష్యుల్లో సివిక్ సెన్స్ లోపించడం వల్ల, ఇదంతా ప్రభుత్వం పని, బాధ్యత అనుకోడం వల్ల వచ్చిన అలసత్వం అంటాను. ప్రజలలో చైతన్యం తీసుకురావాలి ప్రభుత్వం - వారానికి రెండు సినిమాలు చూసే జనం ఒక సినిమా త్యాగం చేసి పరిసరాలు శుభ్రంగా వుంచుకోడానికి జనాన్ని అలవాటు చెయ్యడం ప్రభుత్వం పని అంటాను. ముందుగా కఠినంగా రూల్సు పెడితే కానీ ప్రజలు అలవాటుపడరు. ఏ పనికైనా ఆదిలో ప్రతిఘటన తప్పదు. ఓ మంచిపని చెయ్యడానికి ప్రభుత్వం కొన్నాళ్లు కఠినంగా వ్యవహరించక తప్పదు సార్. మనది బీదదేశమే! ఈ ఎనభై కోట్లమంది ప్రజలు తలొక రూపాయిచ్చినా ఎనభై కోట్ల రూపాయలతో వూరిలో బస్ స్టాండుల్లో, రైల్వేస్టేషన్స్ లో, బజార్లలో, నాలుగు రోడ్ల కూడలిలో యూరినల్స్, లావెట్రీలు కట్టించి విదేశాల్లో మాదిరి ఏ వికలాంగులకో బాధ్యత అప్పగించి మనిషి దగ్గిర పావలా వసూలు చేసి అవి మెయిన్ టైన్ చేసే పని అప్పగించవచ్చు" విమలాదేవి ఆవేశంగా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిగారు మధ్యలోనే నవ్వారు.
