Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 41


    "అయిపోయిందా, ఇంతేనా సినిమా!" అనుకున్నారంతా. కుర్రాళ్లైతే పైకే అన్నారు.
    "చూశారుగా ఈ సినిమా. ఇది మామూలు సినిమా కాదు. నేను విదేశాలు వెళ్లినప్పుడు మీకు చూపించడం కోసం ప్రత్యేకంగా తీసి తెచ్చాను. ఈ సినిమా మీకెందుకు చూపానో అర్థమైందా?" రాణి విమలాదేవి అందర్నీ ఉద్దేశిస్తూ అంది.
    "చూశారుగా ఆ దేశాలలోని ఊర్లన్నీ ఎంత శుభ్రంగా, ఒక్క కాగితం ముక్కయినా రోడ్లమీద కనపడదు. చూస్తే ఎంతో ఆశ్చర్యం వేసింది. ఆ వూర్లు అన్నీ చూస్తుంటే మనదేశం గుర్తువచ్చి ఎంత బాధ కలిగిందో! మనదేశంలో రోడ్లు, కుళ్లుకాల్వలు, ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు, మనదేశంలో ట్రాఫిక్... రోడ్లమీదే ఉచ్చాలు, దొడ్లు అన్నీ గుర్తువచ్చి సిగ్గుతో తలవంచుకున్నాను. ఆ క్షణంలోనే అన్పించింది. మనం ఇంత అధ్వాన్న స్థితిలో ఎందుకున్నాం? స్వతంత్రం వచ్చి నలభై ఏళ్లయినా ఇలాగే మురికిగుంటల్లో పందుల్లా ఎందుకు బతుకుతున్నాం? ఇది ప్రభుత్వ లోపమా, ప్రజల్లో లోపమా? మనదేశం బీదదేశమైనా... బీదరికానికి, పరిశుభ్రతకి సంబంధం ఏముంది? బీదవారైనంత మాత్రాన ఇల్లు, వీధి, వూరు శుభ్రంగా వుంచుకోడానికి ఏం సంబంధం వుంది? అన్నిటికీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టే ముందు మనల్ని మనం బాగుచేసుకోడానికి ప్రయత్నించాలి. మన ఇల్లు శుభ్రం చేసుకున్నట్టే మన వీధి వుంచుకోవాలి. ఒక్కో వీధివారు ఎవరి వాడ వారు శు&ఉభముగా వుంచుకుంటే వూరు మొత్తం అదే శుభ్రం అవుతుంది. మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా అలాగే సంచులలో కట్టి మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడు పడేస్తే మన వీధులు ఎంత శుభ్రముగా వుంటాయి. ఇంత చిన్న విషయం మనం ఎందుకు చేయం? ప్రతివారూ వీధులు శుభ్రం చేయడం మున్సిపాలిటీ పని అనుకునే బదులు, మనం వారితో ఎంతవరకూ సహకరిస్తున్నాం అని ఆలోచించుకుని మనవంతు సహాయపడ్డాక అప్పుడు ప్రభుత్వం చేయలేదంటే ప్రజలు తిరగబడాలి. మీరు ఈ సినిమా చూశాక మన రోడ్లు, మన వీధులు, మన ఊర్లు అలా వుండాలని మీకు అనిపించడం లేదా?" విమలాదేవి అందర్నీ ఉద్దేశిస్తూ అడిగింది. అందరూ అంగీకారంగా తలలూపారు.
    "కానీ అమ్మగోరూ... మనం అట్టా ఎట్లాగుండగలం అమ్మా..."
    "ఏం ఎందుకుండలేం? మన చెత్త రోడ్ల ముందు కుప్పల్లా పారేసే బదులు సంచుల్లో కట్టిపెట్టే మాత్రం కూడా మనం చెయ్యలేమా? ఆ మాత్రం మన చుట్టూ శుభ్రంగా వుంచుకోగలం గదా! ఎవరికివారు ఆ మాత్రం చేస్తే ఊరు బాగుపడదా?"
    "ఆ సంచులు ఎంత ఖరీదుంటాయి?" ఒకరి సందేహం.
    "ఎంతుంటుంది? మహా అయితే రూపాయో, రెండో అనుకోండి. వారానికి ఓ రెండు చొప్పున నెలకి ఎనిమిది అయినా... ఓ పదో పదిహేనో అవుతుంది నెలకి. నెలకి పది రూపాయలు ఖర్చుపెట్టలేని స్థితిలో ఎంత బీదవారు కూడా లేరని నా ఉద్దేశం. మీరు వారానికి ఓ సినిమా కోసం ఖర్చుపెట్టే కంటే తక్కువే. మీ ఇల్లు, వూరు శుభ్రంగా వుంచుకోడానికి ఆ మాత్రం త్యాగం చెయ్యలేరా?"
    విమలాదేవి అందరివంక చూసింది.
    'అమ్మగోరూ... పదిహేను రోజులకోసారయినా చెత్త లారీ రాదమ్మగోరూ! ఈ మూటలు ఇంట్లో ఎన్నాళ్లెట్టుకుంటాం?" మరొకరి సందేహం.
    విమలాదేవి అంగీకారంగా తల పంకించింది.
    "అవును నిజమే... విదేశాల్లో పట్టణాలలో అయితే వారానికి రెండు రోజులు, గ్రామాలలో వారానికి ఒకసారి ఖచ్చితంగా అన్న రోజుకి వచ్చి చెత్తసంచుల్ని తీస్తారు. మనదేశంలో అలా లేని మాట నిజమే. కాని మనం ఏదీ ఒక రోజులో సాధించలేం. క్షణాలలో ఏ మార్పూ రాదు. ముందు మనం ఏం చెయ్యగలమో చేసి చూపించితే, ప్రభుత్వాన్ని మీరూ మీ పన్లు సక్రమంగా చెయ్యటం లేదని వేలెత్తి చూపించగలిగే అర్హత, అధికారం మనకొస్తుంది అని నా నమ్మకం. చెత్త లారీ వచ్చేవరకూ ఈ మూటలు మీ వీధిలో ఇంటి ముందు నాలుగయిదు ఇళ్లకి ఓ పాత ఆయిల్ డ్రమ్ము కొని పనికిరాని ఏ సిమెంటు నీళ్ల కుండీల్లాంటి వాటిల్లోనో పెట్టి మూతపెట్టి వుంచండి. మీ వీధిలో పిల్లల్ని మలమూత్రాలకి రోడ్డుమీద కూర్చోపెట్టడం మానండి. అదెంత అసహ్యకరమైన విషయమో ఆలోచించండి. ఆ విదేశీచిత్రం చూశాక మనం ఎంత అసహ్యకరమైన వాతావరణంలో వున్నామో అర్థం చేసుకోండి" తీవ్రంగా అంది ఆవిడ.
    "అమ్మగోరూ... ఈ వాడంతటికీ రెండే మరుగుదొడ్లున్నాయి. పెద్దలకే అవి చాలడం లేదు. పిల్లలని అందుకే రోడ్లమీదకి పంపుతున్నాం."
    విమలాదేవి అందరివంకా చూసింది. "నే చెప్పినట్లు మీరంతా చేస్తానంటే మీకోసం ఈ వున్న బోరింగు పైపుతో పాటు మరోటి తవ్వించి, బాత్ రూమ్ ఒకటి కట్టించి అందులో నీళ్లపంపు పెట్టిస్తాను. కాని ఆ తరువాత ఈ వాడలో కాగితం ముక్క కూడా కనపడదని మీరంతా హామీ ఇవ్వాలి. నాకు మీ పిల్లలు రోడ్లు పాయిఖానా చెయ్యరని మాటివ్వాలి."
    "అమ్మగోరూ... మీ మాటకి ఎప్పుడన్నా ఎదురు చెప్పామా?" అంతా ముక్తకంఠంతో అన్నారు.
    "సరే బోరింగు తవ్వించి, పాయిఖానా కట్టించి... మీ అందరికీ ఒక నెల ప్లాస్టిక్ సంచులు తెప్పించి ఇస్తాను. ఈ నెల ఒకటో తారీఖునుండి అంటే ఇంకో పదమూడు రోజులనుంచి మనం మన పథకం ఆరంభించాలి. మనల్ని చూసి మిగతా వీధులు అన్నీ మిగతా వూరంతా మనల్ని ఆదర్శవంతంగా చేసుకునేటట్లు మనం నడుచుకోవాలి. వారానికి ఓసారయినా వచ్చి మన చెత్తసంచులు తీయించడానికి మున్సిపాలిటీవారితో మాట్లాడతాను. మీరంతా నా వెనుక నిలబడి చేయూతనిస్తే చాలు..." అందరూ అంగీకారంగా తలలూపి సంతోషంగా చప్పట్లు కొట్టారు. అందరిలో ఏదో కొత్త ఉత్సాహం... ఏదో సాధించబోతున్నట్లు ఉత్తేజం!

                                                 *  *  *

    విమలాదేవి అన్నట్టుగానే సరిగ్గా ఫస్టు తారీఖు లోపల బోర్ వెల్ తవ్వించి, ఓ బాత్ రూము కట్టించి మూడింటికి పైపు కనెక్షన్ లు పెట్టి, అందరికీ ఓ నెలకి సరిపడ ఇంటికి 8 వంతున ప్లాస్టిక్ కవర్లు పంచిపెట్టింది. ఇచ్చేముందు తను ప్రతిరోజూ వచ్చి చూస్తానని చెప్పి మరీ ఇచ్చింది. మొత్తం ఓ ఇరవై వేలు ఖర్చుపెట్టింది ఆవిడ. కార్పొరేషన్ ఆఫీసుకి వెళ్లి కమీషనర్ తో మాట్లాడింది. ఆయన ఆవిడ అభ్యర్థనని ఆశ్చర్యంగా విన్నాడు. ఆవిడ చెప్పినదంతా విని మెచ్చుకోలుగా చూశాడు.
    "మీలా నూటికొకరయినా వుంటే ఈ దేశం బాగుపడుతుందేమోనన్న ఆశ కలుగుతోంది. డబ్బున్నవాళ్లు చాలామంది వుండొచ్చు. ఆ డబ్బుని సద్వినియోగపర్చి నలుగురికీ ఉపయోగించే విధంగా ఖర్చుపెట్టాలనుకున్న మిమ్మల్ని అభినందించకుండా వుండలేకపోతున్నాను. మీరు చేపట్టిన ఈ పథకం విజయవంతం అయితే ప్రతి వాడలో మీలాంటి డబ్బుగలవారు ముందుకు వచ్చి తమ పరిసరాలు శుభ్రంగా వుంచుకోవడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఆశిస్తాను. ఈ అప్తకం ఆరంభించిన మీరే ఈ పథకం నాలుగు మూలలా విస్తరించడానికి పాటుపడ్తారని ఆశిస్తాను. మీ ప్రయత్నానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ లభిస్తాయి. తప్పకుండా మీరు కోరినట్టు చెత్త తీయించే ఏర్పాటు చేస్తాను. కాని మీకు తెలియంది ఏముంది ఈ మున్సిపాలిటీ పనితీరు. పనివారు, లారీలు తగినన్ని లేని లోటు, వున్నవారయినా సరిగా డ్యూటీ చేయకపోవడం, ఏదన్నా అంటే స్ట్రయికులు... ఏదన్నా యాక్షన్ తీసుకుందామన్నా పొలిటీషియన్స్ జోక్యం, గవర్నమెంటులో పని తీరుతెన్నులు మీకు తెల్సుగదా! ఈ దేశం ఏమాత్రం బాగుపడాలన్నా మీలాంటి ప్రజలే జోక్యం కల్పించుకోవాలి. దేశం మనకేమిచ్చింది అనుకోకుండా మనం దేశానికి ఏమిస్తున్నాం అన్న మంచిమాట గుర్తుంచుకోవాలి అందరూ మీలాగా..." అంటూ చిన్న లెక్చరిచ్చి ఆవిడకి సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS