ఈ దేశమేగతి బాగుపడునోయ్!
"అరే, అమ్మగారీయాళ సినిమా చూపిస్తారన్నారు. బేగి బువ్వ తిని రమ్మన్నారు" పదేళ్ల యాదగిరి తూనీగలా పరిగెత్తి 'సంజయ్ నగర్' వాడవాడంతా అందరికీ ఆ వార్త చెప్పేశాడు.
ఆ 'అమ్మగారు' అంటే రాణీ విమలాదేవి. ఆ వాడలో అంటే నూరు నూటపాతిక ఇళ్లకి మకుటంలేని మహారాణి! జమీందారీలు పోయి ఏనాడో అయినా ఆవిడలో అందం, ఠీవి, దర్పం, రాజరికం అన్నీ కలిసి ఇంకా రాణిగానే కన్పిస్తుంది ఎవరికైనా. జమీనులు, జమీందారీలు పోయాక పల్లెలో భూములు, తోటలు అన్నీ అమ్ముకుని సిటీలో పెద్ద బంగళా కొనుక్కుని స్థిరపడిపోయారు జమీందారు గారుండగానే. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఇంజనీరు. కూతురు, భర్త ఇద్దరూ లండన్ లో డాక్టర్లుగా వున్నారు. నాలుగేళ్ల క్రితం హార్టు అటాక్ తో జమీందారుగారు పోయాక విమలాదేవి ఆవిడ దృష్టిని 'సోషల్ వర్క్' మీదకు మళ్లించింది. ఆధ్యాత్మికచింతన అలవర్చుకుంది. కొడుకు అమెరికా వచ్చేయమన్నా తోచదని చెప్పి, వున్న డబ్బుని కాస్తా సద్వినియోగపరిచి మరుజన్మకి కాస్త పుణ్యం కట్టుకోవాలన్నట్లుగా చేతనయినంతలో బీదాబిక్కీకి సహాయపడడం మొదలు పెట్టింది. ఆగస్టు పదిహేనుకి, రిపబ్లిక్ డేకి ఆ వాడలో జండా ఎగరేసి మిఠాయిలు పంచుతుంది. పండుగ దినాల్లో అనాధాశ్రమాల్లో అన్నదానాలు చేస్తుంది. గాంధీజయంతికి ఆస్పత్రులలో పళ్లుఫలాలు పంచుతుంది. పాతబట్టలు పోగుచేసి అనాధాశ్రమానికి యిస్తుంది. ఏ శరణాలయాలవారు వచ్చినా లేదనకుండా తోచిన సహాయం చేస్తుంది. కుష్టురోగుల ఆశ్రమాలు, ఓల్ ఏజ్ హోమ్ లని దర్శించి తోచిన సహాయాలు అందిస్తుంది.
ఆ వాడలో చిన్నాపెద్దా అందరికీ ఆవిడ తలలో నాలిక అయిపోయింది. కొద్దిరోజులలోనే మొగుడు పెళ్లాల తగువుల దగ్గర్నుంచి, కరెంటు పోయినా, పంపుల్లో నీళ్లు రాకపోయినా, మున్సిపాలిటీ చెత్తడబ్బాలు తీయకపోయినా, రోగాలు వస్తే ఏ డాక్టరు దగ్గిరకు వెళ్లాలో చెప్పడం మొదలు అన్నీ ఆవిడే చూస్తుంది. కావల్సినప్పుడు అప్పులు ఇచ్చి ఆదుకుంటుంది. ఉద్యోగం సిఫార్సులు చేస్తుంది. పదో పరకో చిన్న అప్పులు మళ్లీ అడగదు. పెళ్లాలని చితకబాదే మొగుళ్లని పిలిచి చివాట్లు పెడ్తుంది. రిక్షాలవాళ్లకి హామీ వుండి బ్యాంకు లోన్లు ఇప్పిస్తుంది. ఆ వాడలో ఇద్దరు తెలివైన పిల్లలకి జీతాలు కట్టి చదివిస్తోంది. ఆ వాడలో ఆడపిల్లల పెళ్ళిళ్ళకి పుస్తె, పట్టుచీర ఆవిడే ఇస్తుంది. ఈ కారణాలన్నింటితో ఆ వాడలో ఆమె మాటకి తిరుగులేదు. ఎదురుచెప్పే సాహసం ఎవరికీ లేదు.
బంగళా కట్టుకున్నాక దాని ఎదుట వెలిసిన ఖాళీస్థలంలో సంజయ్ నగర్ బస్తీని మొదట "ఏమిటీ గోల, పాడుసంత" అని జమీందారుగారుండగా విసుక్కుని కంప్లెయింట్ చేస్తే ఆవిడ ఈనాడు చిత్రంగా ఆ బస్తీలో భాగం అయిపోయింది. ఆ వాడలోని పనిమనిషి, ఇంకొకామె వంట చేస్తుంది, ఇంకోడు తోటపనీ చేస్తారు. వాళ్ల తిండి, బట్ట అంతా ఆవిడదే. విదేశాల్లో వున్న పిల్లలకి తన డబ్బు అక్కరలేదు. భర్తగారు మిగిల్చిపోయిన ఈ డబ్బు సద్వినియోగం చేస్తున్నందుకు ఆవిడకి సంతోషంగానే వుంది.
ఆవిడ దగ్గిర ఓ మూవీ కెమేరా, 16 ఎమ్. ఎమ్ ప్రొజెక్టరు వుంది. నెలకో, పదిహేను రోజులకో ఓసారి ఆవిడ సినిమా చూపిస్తూంటుంది. బంగళా ముందరి ఖాళీస్థలంలో అందరినీ కూర్చోపెట్టి, పిల్లలకి పనికొచ్చే డాక్యుమెంటరీలు, పెద్దలకి పనికొచ్చే భక్తి సినిమాలు చూపిస్తూంటుంది.
ఆవిడ నాలుగు నెలల క్రితం యూరప్, అమెరికా అంతా తిరిగి వచ్చింది. కొడుకు దగ్గరో నెల, కూతురు దగ్గరో నెల వుండి పదిహేను రోజుల క్రిందటే వచ్చింది. విదేశాల్లో తను షూట్ చేసిన చిత్రం ఆ రోజు ఆ వాడలో చూపడానికి అందర్నీ పిలిచింది.
ఏడుగంటలయింది. అంతా బంగళా ముందు గుమిగూడారు. సినిమా మొదలైంది. "అదే, ఇంగ్లీషు సినిమారా!" ఎవరో అన్నారు. హిందీ, తెలుగు కానందుకు కాస్త నిరాశపడ్డారు. ఈలోగా విమలాదేవి లోపల్నుంచి వచ్చింది. ఆపరేటర్ వంక ఆపమన్నట్టు చూసింది. సినిమా ఆగి, లైటు వెలిగింది. చూడండి, ఇవాళ నేను చూపిస్తున్నది మామూలు సినిమా కాదు. మీ కోసం అని ప్రత్యేకంగా తెచ్చాను. ఇది ముందు మీరు చూడండి. దీని గురించి సినిమా అయ్యాక నేను చెప్తాను. ఓ గంట కంటే వుండదు. చూసిం తర్వాత అంతా మీకు విశదపరుస్తాను."
తెల్లటి బారెడు జరీ అంచు వెంకటగిరి చీరతో హుందాగా వచ్చి కూర్చున్న ఆవిడ ఎదుట అంతా నిశ్శబ్దం అయిపోయారు.
సినిమా మొదలైంది. కెమెరా యూరప్ లో అన్ని కంట్రీలలో రోడ్లు చూపిస్తూంది. ప్రతి రోడ్డు విశాలంగా, శుభ్రంగా, ఎక్కడా ఓ కాగితం ముక్క కూడా కనబడకుండా పరిశుభ్రంగా వుంది. కార్లు చీమల్లా బారులు తీరి ఇటు నాలుగు వరుసల్లో అటు నాలుగు వరుసల్లో వెడుతున్నాయి. రోడ్ల మధ్య ఫ్లయ్ ఓవర్లు... ఇటు అటు దారులు చెప్పే బోర్డులు... అంతా ఎంతో సిస్టమేటిక్ గా వుంది. ప్రతివారు ఎక్కడపడితే అక్కడ ఉచ్చలు, ఉమ్ములు పోయకుండా యూరినల్స్ ఉపయోగిస్తున్నారు. ఆ బాత్ రూములన్నీ కొత్తవాటిల్లా నీట్ గా కళకళలాడుతున్నాయి. రైలు స్టేషన్లు అయినా, ఏరోడ్రోమ్ ల్లో అయినా, బజార్లలో అయినా ప్రతిచోటా యూరినల్స్, బాత్ రూములున్నాయి. ఆఖరికి ఉమ్ములకీ డస్ట్ బిన్స్ ఉపయోగిస్తున్నారు. జనం - చక్కని రోడ్లు, లైనుగా చూడముచ్చటయిన ఇళ్లు కన్నుల పండువుగా కనిపిస్తూంది. ఎక్కడ చూసినా శుభ్రంగా, దుమ్ము ధూళి, చెత్త అన్నదే లేకుండా పరిశుభ్రంగా వుంది. ప్రతిచోట చెత్తడబ్బాలున్నాయి. సిగరెట్టు కాల్చినా, ఐస్ క్రీమ్ తిన్నా, కూల్ డ్రింక్ తాగినా అవి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అందరూ జాగ్రత్తగా చెత్తడబ్బాలో వేస్తున్నారు. ఓ రెండేళ్ల పాప చాక్ లెట్ కాగితం విప్పి నోట్లో పెట్టుకుని కాగితం చిట్టిచేతులతో డబ్బాలో వేసింది. ఇంకోరు అరటిపండు తిని చుట్టూ చూసి పది పదిహేను గజాలు నడిచి డబ్బా దగ్గరికి వెళ్లి పడేశారు. ఆ తరువాత కెమేరా ఓ ఇంట్లో వంటిల్లు చూపింది. అందులో గృహిణి వంట చేస్తూ తరిగిన కూరల తుక్కు అంతా వంటింట్లో ఓ మూల డబ్బాలో వున్న ప్లాస్టిక్ సంచిలో వేసి మూతపెట్టింది. మరో సీనులో ఇంకో గృహిణి ప్లాస్టిక్ డబ్బాలో కవర్ నిండడముతో ఓ మూట కట్టి కారు గ్యారేజీలో పెట్టిన ఓ పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ లో పెట్టింది. తరువాత సీను ఇంటి యజమాని ఉదయం ఆ ప్లాస్టిక్ డ్రమ్ తీసికెళ్లి ఇంటి ముందు రోడ్డుమీద పెట్టాడు. అందరిళ్ల ముందు అలాంటి డబ్బాలు ప్లాస్టిక్ సంచుల మూటలు అందరూ పెడ్తున్నారు. దూరంనుంచి గార్బేజ్ వ్యాను వస్తూ అందరింటి ముందు సంచుల మూటలు వేన్ లో తీసికెళ్లారు. గార్బేజ్ వ్యాన్ ఊరి చివర చేర్చిన సంచులన్నీ పెద్ద పెద్ద మిషన్లు క్రష్ చేసి పడేస్తున్నాయి పెద్ద గోతిలో. తరువాత మళ్లీ కెమేరా ఓసారి రోడ్లు, ఇళ్లు శుభ్రంగా, నీట్ గా వున్నట్లు చూపించింది. సినిమా అయిపోయింది. లైటు వెలిగింది.
