Previous Page Next Page 
ఆత్మబలి పేజి 39


    "ఏం కావాలమ్మా!" అన్నారాయన ఆదరంగా. ఉమ గొంతు పొడారిపోయింది. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి?
    "క్రొత్తగా పి.యు.సి.లో చేరిన చలపతి అనే ఒక స్టూడెంట్ గురించి మాట్లాడటానికొచ్చాను."
    "ఏ చలపతి? ఓహ్! అతనా! చాల పూలిష్ గా ఉంటాడు. బాగా పెద్దవాడు కదూ! చురుకైనవాడు కూడా కాదు. అతనికి చదువెందుకమ్మా! వ్యవసాయం లాంటి దేదైనా చూసుకుంటే మంచిది. అతను నీకు తెలుసా?"
    "ఆయన నా భర్త."
    అదిరిపడ్డాడు ప్రిన్సిపాల్. కొన్ని క్షణాలు ఉమ ముఖంవంక నిదానించి చూశాడు.
    "ఏమన్నావమ్మా!"
    ఉమ నవ్వింది.
    "మీరు కూడా ఇంత ఆశ్చర్యపడటం న్యాయంకాదు."
    "సరే! సరే! ఏం చెప్పాలనొచ్చావు?"
    "మీరన్నట్లు పెద్దవయసులో కాలేజి కొచ్చారు. కారణాంతరాలవల్ల అలా జరిగింది. అతి కష్టంమీద చదువుమీదకు దృష్టి మళ్ళింది. ఇప్పుడు విద్యార్థులు చేసే గొడవతో బెదిరిపోతున్నారు. ఈ విషయంలో కొంచెం సహకరించమని ప్రార్థించటానికి వచ్చాను."
    "నీకు కాలేజీల సంగతి తెలియదమ్మా! ప్రయత్నిస్తాను."
    ఉమ తనలో తను నవ్వుకొంది.
    "నాకు టైమవుతూంది. వస్తానండీ!" అని లేచింది.
    "నువ్వెక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా?"
    "అవునండీ! కంపెనీలో కెమిస్టుగా ఉన్నాను."
    "అంటే నువ్వు..."
    "బి.యస్.సి. పాసయ్యానండి."
    కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయిన ప్రిన్సిపాల్ తరువాత నెమ్మదిగా "ఐసీ!" అన్నాడు.
    ఉమ నమస్కారం చేసి వచ్చేసింది.
    ఆ సాయంత్రం చలపతి ఇంటికొచ్చి ప్రిన్సిపాల్ విద్యార్థులనందరనూ సమావేశపరచి విద్యయొక్క ఆవశ్యకతను గురించి చెప్పి ఎవరైనా పెద్దవాళ్ళు చదువుకోటానికొస్తే వాళ్ళకు చదువులో ఉన్న శ్రద్ధకు మెచ్చుకోవాలే కాని, అవహేళన చెయ్యకూడదని అన్నారనీ, చలపతిని ఉదాహరణగా చెప్పి అట్లాంటి వ్యక్తులను సాధ్యమైనంత సహకారమిచ్చి ముందుకు తీసుకురావటం విద్యార్థుల విధికాని అవహేళన చెయ్యటం నీచమని మందలించారనీ, ఇకముందు అలా ఎవరైనా అవమానిస్తే కఠినంగా శిక్షింపబడతారని హెచ్చరించారనీ, ఆ తరువాత విద్యార్థుల గోల కొంతవరకూ తగ్గిందనీ చలపతి చెప్పినప్పుడు ఉమ ఎంతో సంతోషించింది.
    "నువ్వేమైనా చెయ్యగలవు ఉమా!" అన్నాడు చలపతి ఉమ వంక ఆరాధనా పూర్వకంగా చూస్తూ...
    "నేను చేసిందేమీలేదు. ప్రిన్సిపాల్ చాలా మంచివారు" అంది అతి మామూలుగా. ఇంట్లో వంటపని చూసుకుంటూ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, రాత్రిళ్లు చలపతికి చదువులో సహాయం చేస్తూ కర్తవ్యదీక్షలో మునిగిపోయింది.
    సాయంత్రం వంట చేస్తున్న ఉమ దగ్గిరకు హడావిడిగా వచ్చాడు చలపతి.
    "ఉమా! రెండుకప్పుల టీ తయారుచెయ్యి. ఇవాళ మనింటికొక కొత్త వ్యక్తిని తీసుకొచ్చాను. రా! పరిచయం చేస్తాను."
    ఉమ ఎంతో ఆశ్చర్యపోయింది. చలపతికి స్నేహితులా! చలపతి సమాజంలో కలిసిపోతున్నందుకు చాలా సంతోషించింది. టీ తయారుచేసి రెండు కప్పులలో పోసి ట్రేలో ఉంచి తీసుకొచ్చిన ఉమ ఆ వ్యక్తిని చూసి అలా కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. అతడు కేశవ.
    కేశవ ఉమను చూస్తూనే కుర్చీలోంచి లేచి నిలబడిపోయాడు. అప్రయత్నంగా అతని చెయ్యి నుదుటిగాయాన్ని తడుముకొంది. ఉమ చూపులూ అక్కడే నిలిచాయి. ఇద్దరికీ గతం కళ్ళముందు తిరుగుతూంటే సమస్తమూ మరిచి నిలిచిపోయారు. ఎదుటి మనుష్యులలో భావపరివర్తనను గమనించలేని చలపతి తన ధోరణిలో మాట్లాడేస్తున్నాడు.
    "నువ్వు నాకిచ్చిన పర్స్ లో టర్మ్ ఫీజు కట్టడానికి డబ్బంతా పెట్టుకుని వెళుతూంటే అదెక్కడో జారిపోయింది. కాలేజీలో చూసుకున్నాను. పర్స్ పోయిందనేసరికి డబ్బుకోసమూ నువ్విచ్చిన పర్స్ కోసమూ ఎంతో ఏడుపొచ్చింది. నా అదృష్టం బాగుండి పర్స్ ఈయనకు దొరికింది. అందులో నీ ఫోటో, నా పేరూ, మన ఎడ్రసూ ఉంది కదూ! పాపం, వెతుక్కుంటూ వచ్చారు. ఎంత అదృష్టమో చూడు!"
    చలపతి మాటలు పూర్తయ్యేసరికి ఉమ ఈ లోకంలోకొచ్చింది. మౌనంగా ట్రే చలపతికందించి భారమైన హృదయంతో, కలత చెందిన మనసుతో లోపలికెళ్ళిపోయింది.


                                        24


    ఎట్లాంటి చికాకులమధ్యనైనా చిరునవ్వుతో ఉత్సాహంగా ఉండే శోభ ముఖంలో చిరునవ్వు పూర్తిగా మాయమయింది. నవ్వుతూ త్రుళ్ళుతూ వందమంది స్నేహితులను పోగుచేసి వాళ్ళమధ్య గడిపే వ్యక్తి ఇప్పుడసలు ఇల్లు కదలటంలేదు. ఎవరూ లెక్కపెట్టకుండానే రోజులు గడిచిపోతున్నాయి.
    ఏవిఁటీ జీవితం? ఏ దుష్టముహూర్తాన తన జీవితం ఈ వక్రమార్గానికి తిరిగింది?
    ఎడారిలాంటి తన జీవితంలో చిన్నారి ఆశ క్రొత్త క్రొత్త ఆశలను చిగురింపజేసింది. వివాహేచ్చనే సంపూర్ణంగా అణచివేసిన తన స్త్రీ హృదయాన్ని తట్టి మేల్కొలిపారు రావుగారు. ఎవరి పాదాలను మనసులో నిత్యమూ ఆరాధిస్తుందో, ఎవరి సౌఖ్యం కోసం చిరునవ్వుతో ప్రాణాలను సైతం వదులుకోగలదో ఆ తన ప్రేమమూర్తినే చెంపదెబ్బ కొట్టవలసొచ్చింది. ఏం చెయ్యగలదు? ఆ సందర్భము, ఆ వాతావరణము తప్పనిసరిగా ఆ పని చేయించింది. ఆ చెంపదెబ్బ రావుకెంత బాధ కలిగించిందో తెలియదు తనకు, కాని అది ఎదురుతిరిగి అనుక్షణమూ తన మనసును ఛెళ్లుఛెళ్లుమనిపిస్తూంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS