పెద్ద ఎత్తున పెళ్ళి ఏర్పాట్లు, చేస్తున్నాడు గోపాల్రావు జానికమ్మా, రాజశేఖరం, భార్యా పిల్లలు నాలుగు రోజులు ముందుగానే వచ్చారు. అంత హడావుడి లో , ఉదాశీనంగా , నైరశ్యంగా ఉండి పోతుంది మధుమతి. అందరూ ఉపేక్షించిన ప్రసాదరావు ని ఆమె ఉపేక్షించలేకపోయింది.
గబగబా వీధిలోకి వెళ్ళబోతున్న గోపాల్రావు -- "గోపీ!" అన్న మధుమతి గొంతు విని వేను దిరిగి "పిలిచావా , అక్కయ్యా?" అన్నాడు.
"ఓసారి పైకి రా. నీతో మాట్లాడాలి" అంటూనే మేడ మెట్లెక్కింది. అనుసరించాడు గోపాల్రావు "రా, కూర్చో... వాసేమన్నా ఉత్తరం వ్రాశాడా? అంది తానొక కుర్చీలో కూర్చుని అతని ముందు కో కుర్చీ తోస్తూ.
"వ్రాశాడు. బుధవారం రాత్రికి వస్తాడుట. అంటే రేపు లగ్నమనగా ఈ వేళ వస్తాడు. ఇదిగో" అంటూ ఓ కవరు మధుమతి కి ఇవ్వబోయాడు గోపాల్రావు.
"ఉంచులే' అంటూ ఏదో ఆలోచిస్తున్నట్టు మౌనంగా ఉండిపోయిన మధుమతి వైపు చూస్తూ రెండు క్షణాల తరవాత 'అంతేనా, అందుకేనా పిలిచావు?' అన్నాడు నవ్వుతూ.
"కాదు, గోపీ . జాయింటు కలెక్టరు వాడు. వాడి పెళ్ళంటే పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు. అందరికీ.... నాన్న వదిలిన అమ్మని ఎలా చూపిస్తాడు? ఏ మొహం పెట్టుకుని నలుగుర్లో తలెత్తి తిరగాలి నేను!' అంటూ వచ్చే దుఖాన్ని, చిలికే కన్నీటి ని ఆపుకుంటూ, "మీ బావ ఎక్కడ ఉన్నారో! ఒక్కసారి, ఆ ఒక్క రోజు కళ్యాణ మంటపం దగ్గర నిలబడమను. కోడల్నీ, కొడుకునీ ఆశీర్వదించమను. నా మొహం చూడకూడదనుకుంటే నేనెక్కడో ఉంటాను.' అంది. ఆమె గొంతు వణుకుతుంది. "ఆ భార్యా పిల్లల్ని ఒక్క రోజు వదిలి, ఒక్కసారి కొన్ని క్షణాలు నా కొడుకుని తృప్తి పరచమను." అంటూ తలెత్తి గోపాల్రావు వైపు చూసిన మధుమతి -- "నవ్వుతున్నావా?!" అంది తెల్లబోయి అయోమయంగా అతని వైపు చూస్తూ.
"ఇక నవ్వక ఏం చేస్తాను? ... పాపం! అతనికి మరో భార్యా పిల్లలూ లేరు. అతని అడ్రసుంది నా దగ్గర. రమ్మని వ్రాస్టాలే. అదే కదూ!" అంటూ లేచి నిలుచున్నాడు గోపాల్రావు.
"ఒక్కసారి నువ్వు వెళ్ళి తీసుకురా, గోపీ. ఉత్తరానికి రారేమో?' తానూ లేచి నిలుచుని అంది మధుమతి.
"అతను పెళ్ళికి రావడం కదా నీకు కావలసింది?" నవ్వేస్తూ వెళ్ళిపోయాడు గోపాల్రావు.
"ఎవరి సంతోషం వారిది. మనస్సు చచ్చి నేను బాధ పడుతుంటే నా బాదే అర్ధం చేసుకోడు!" గోనుకుంది మధుమతి.
* * * *
వీధి గేటు కెదురుగా రోడ్డు మీద టాక్సీ ఆగింది. గోపాలరావు, మరొక వ్యక్తీ మేడ మీద గదిలోకి వెళ్ళారు. "ఎవరో స్నేహితులు కాబోలు' అనుకున్నారు వాళ్ళను చూసిన పిల్లలు. అందర్నీ కలయజూస్తూ మేడమేట్లు ఎక్కడా అతిధి.
నాలుగు క్షణాల తరవాత "పద్మజా! కాఫీ, టిఫిను తెసుకురా" అన్నాడు గోపాల్రావు మేడ పిట్టగోడ దగ్గర నిలుచుని దిగువకి చూస్తూ. "ఓ! హోల్దాలూ, రెండు పెట్టెలూ, . హబ్బో! మకాం వేసేట్టున్నాడే. పెళ్లికే వచ్చినట్టుంది." అంటూ అల్లరిగా పద్మజ వీపు మీద చరుస్తున్న జయ, గోపాల్రావు గొంతు విని తలెత్తి పైకి చూసి నాలిక కరుచుకుంది.
మొహం, కాళ్ళూ, చేతులూ కడుక్కు వచ్చిన ప్రసాదరావుకి తువ్వాలు అందిస్తూ , అప్పుడే గదిలో ప్రవేశించిన పద్మజ ని చూసి, "అలా టేబిలు మీదుంచు. ఇదిగో, మా అమ్మాయి -- బి.ఎ. పెళ్ళి కూతురు" అని, "అయన కాళ్ళకి నమస్కరించమ్మా." అన్నాడు గోపాల్రావు.
వంగి వినయంగా అతని పాదాలు స్పృశిస్తున్న పద్మజ ని వారిస్తూ "వద్దులే అమ్మా!" అన్నాడు ప్రసాదరావు.
కాఫీ మాత్రమె తీసుకుని, టిఫిను వద్దన్నాడు ప్రసాదరావు. టిఫిను ప్లేటు పట్టుకు వెళ్ళిపోతున్న పద్మజ చెవిలో ఏదో మెల్లిగా చెప్పాడు గోపాల్రావు. ఆమె సమ్మతించినట్లు తల ఊపింది.
"వాసు ఈ రాత్రికి వస్తాడా?" అడిగాడు ప్రసాదరావు.
"ఆ ఎనిమిది గంటల ట్రెయిను లో వస్తాడట-- నేనూ, వాసూ అక్కయ్య ఎదుట దోషుల్లా నిలుచోవలసి రాకుండా -- ఏం చెబుతారో మరి! అక్కయ్య వస్తుంది" అంటూ లేచి నిలుచున్నాడు గోపాల్రావు.
ఒక్కసారి ప్రసాదరావు హృదయం తీవ్రంగా స్పందించింది. ఇరవై సంవత్సరాల క్రితం బస్ లో చూసిన భార్యను మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాడు. వెళ్ళిపోతున్న గోపాల్రావు వైపు అలా మౌనంగా చూస్తూ ఉండి పోయాడు.
గది గుమ్మం దాటి వరండా లోకి వచ్చిన గోపాల్రావు కేదురైన మధుమతి "ఎందుకు పిలిచావట?' అని అడిగింది.
చెదిరిన కురులూ, అలసటగా చిరు చెమటలు పట్టిన వదనం, ఒక్కసారి ఆమె వైపు జాలిగా చూసి తేలిగ్గా నిట్టూర్చి, అరుగో, బావ వచ్చారు. గదిలో ఉన్నారు. ఓసారి కనుపించు. ఇటు వైపు ఎవరూ రారు" అంటూ వెళ్ళిపోయాడు గబగబా గోపాల్రావు.
దీర్ఘ వియోగానంతరం కలయిక. దడదడ కొట్టుకునే గుండె, కంపించే తనువు. కలవరపడే మనసు. ముందూ వెనకా ఎటూ కదలక వణికే కాళ్ళూ. కొన్ని క్షణాలలో తనను తాను నిగ్రహించుకున్న మధుమతి 'పోనీ, ఎలా ఉన్నారో ఒక్కసారి చూస్తాను. మాట్లాడనీ, మౌనంగా ఉండి పోనీ, నా వైపు చూడనీ, తల తిప్పుకోనీ. తాళి కట్టించుకున్నందుకు, ఆయనకు ప్రయోజకుడైన కొడుకును కన్నందుకు, అయన భార్యనై ఇలా బ్రతుకుతున్నందుకు ఒక్కసారి ఆయన్ని చూచే హక్కు నాకుంది.' అనుకొంది. బరువుగా తడబాటుగా ఆమె ఆడుగులు గది వైపు పడ్డాయి.
ద్వారం దగ్గర నిలుచుని నెమ్మదిగా తలెత్తి చూసింది. 'తాను ఊహిస్తున్న తన భర్త. ధూళి దూపరితమైన కాకీ బట్టలూ, నెరిసి , ధూళిపడి ఎర్రగా పీచులా, చెరిగిన జుట్టూ, లోతుకు పోయిన యెర్రని కళ్ళూ, ఎండిన చెంపలూ గల ఏభై ఐదేళ్ళ వ్యక్తీ స్థానే ఖరీదైన సూటులో పచ్చని దృడమైన దేహంతో హుందాగా రిటైర్డ్ ఆఫీసరు లా, అనుభవాలు పండిన నిండు ధనంతో , కాంతి వంతమైన కళ్ళతో తనవైపు జాలిగా చూస్తున్న తన భర్త. చప్పున ఆమె కనురెప్పలు వాలిపోయాయి.
ఎన్నాళ్ళ క్రితమో మరుగు పడిపోయిన మమతల లోని సిగ్గు, మనస్సులో ఏదో తియ్యని సంచలనం -- అన్నిటిని తొక్కిపెట్టి పెల్లుబికే దుఖం. మౌనంగా స్థాణువు లా నిలుచున్న ఆమె వైపు పశ్చాత్తాప హృదయంతో జాలిగా చూస్తూ, "ఈమేనా తాను అహంభావిగా, గర్వపోతుగా, వివేక శూన్యగా ఊహిస్తూ వచ్చింది!" అనుకుంటూ ఆమెను చూస్తున్న అతని హృదయం ద్రవించింది. మమతని కప్పిన పొగమంచు విడిపోయింది, మనస్సున ఉన్న అనుమానాల్ని ఏవగించుకుని, జాలిగా, బాధగా, ఆమె వైపు చూస్తూ, పాతిక సంవత్సరాల తరవాత పొంగే హృదయంతో, ప్రవహించే మమతలతో, "మధూ!" అని పిలిచాడు ప్రసాదరావు.
నీళ్ళు నిండిన కళ్ళతో అతని కళ్ళలోకి చూసింది మధుమతి.
అతని కాళ్ళు ఆమె వైపు నడిచాయి. "మధూ!" ఆ గొంతు తడిగా ఉంది. అప్రయత్నంగా చేతులు చాచాడు.
అపూర్వమైన అభయాన్ని పొందుతున్నట్టు అతని చేతుల్లో వాలిపోయింది మధుమతి. ఆ స్పర్శ కోసం తపించిపోయిన ఆమె అతని చేతుల్లో ఇమిడి అతని హృదయం లో తల దాచుకుంది.
ఆమెను చుట్టుకున్న అతని చేతులు మృదువుగా లాలింపుగా, ఓదార్పుగా ఆమె తల నిమిరాయి. ఆమె హృదయంలో లావాలా దాగి ఉన్న ఆవేదన అశ్రురూపంలో ప్రవహించసాగింది.
ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు భరించలేని నిశ్శబ్ద మావరించింది. "నన్ను క్షమించండి.... మరి నన్ను వదిలి వెళ్ళిపోకండి.... ప్రొద్దు వాలిపోయింది. ఇంకేన్నాల్లో జీవించను. నా ఆరోగ్యం బాగాలేదు. బాబు బెంగ మరి నాకు లేదు. చివరి రోజులన్నా మీతో కలిసి బ్రతికే భాగ్యం నాకు ప్రసాదించండి...."
