Next Page 
అపశ్రుతులు పేజి 1


                                  అపశ్రుతులు

                                              ---కావిలిపాటి విజయలక్ష్మి

                      


    "యూ, మేనర్ లెస్ మేన్" కోపంగా నిరసనగా, అసహనంగా అంది రమాదేవి.
    "మన సంప్రదాయం, సంస్కృతీ, మన వాణి ధిక్కరించి తిరగడమే అయితే. అలా. పరాయి మగవాడన్న జంకూ, బిడియం లేకుండా తిరిగే నీ ప్రవర్తనే సంస్కారమైన దనుకుంటే మరి నేను చెప్పవలసిన్దీ మాట్లాడగలిగిందీ ఏమీలేదు.....మేనర్ లెస్ మేన్ అని చాలాసార్లు అన్నావు. అంటున్నావు. భర్త చూస్తుండగా....అతనికి తువ్వాలందివ్వడం. ఛలోక్తులు విసిరిపగలబడి నవ్వడం అది సంస్కారమా?"
    "శ్రీధర్ నాక్లోజ్ ఫ్రెండ్." అతని మాట కడ్డువస్తూ నిర్లక్ష్యంగా తల విసిరి అంది రమ.        
    "ఊహు.... కావచ్చు కాని నీ ప్రవర్తనే నాకు నచ్చనిది." తల అడ్డంగా విసురుగా తిప్పి అన్నాడు శ్రీనివాసరావు.
    "అయితే" చిత్రంగా కళ్ళుతిప్పి అతనివైపు చూసింది రమ.
    నాకు నచ్చేవిధంగా నన్ను నొప్పించని తీరులో. నా హృదయం గాయపర్చకుండా నువ్వు జాగ్రత్తపడాలి. అలా మెసులుకోవడం నేర్చుకోవాలి"
    నన్ను నేను మభ్యపరచుకుని. నా స్వేచ్చ అరికట్టుకుని.....ఒకరి తృప్తికోసం నటించేది కాదు ఈ రమ."
    అంత స్వతంత్రం కోరేదానవు. నీ ఇష్టప్రకారమే ఉండాలనుకునే టప్పుడు పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది."
    పెళ్ళంటే స్వతంత్రం చచ్చిపోతుందనీ ఒకరి ఇష్టాలకు బానిస కావాలనీ ఎవ్వరూ. ఏ శాస్త్రమూ చెప్పలేదు స్త్రీకి".
    "ఓ సరే ఎవ్వరు చెప్పకపోయినా నిన్ను భరించేవాణ్ణి కాబట్టి ...."
    "మీరేం నన్ను భరించడంలేదు" అతని మాటలు కడ్డువస్తూ వెటకారంగా అంది రమ.
    "ఎంత అహం నిన్ను నువ్వు పోషించుకోవడానికి డబ్బు సంపాదించుకున్నంత మాత్రాన ఇంతరెచ్చిపోయి మాట్లాడతావా? వద్దు ఉద్యోగం మానెయ్. నిన్ను నేను పోషిస్తాను. లేకుంటే!
    "ఆ లేకుంటే?"
    "విడిపోవాల్సి వుంటుంది".
    "ఓ బెదిరిస్తారా ఏం? అలాగే కానివ్వండి"
    "ఛ ఛ నీకు తెలిసి జవాబులు చెప్తున్నావో తెలియక మాట్లాడుతున్నావో నా ప్రాణానికో గుదిబండయ్యావ్, అతగాడు వెళ్ళాడుగా ఓ అరగంటలో వంటవుతుందా?" అడిగాడు శ్రీనివాసరావు వాచ్ చూసుకుంటూ.
    "అవదు. హోటల్లో తినివెళ్ళండి"
    అతను డ్రస్ మార్చి వెళ్ళిపోయాడు.
    ఆమె దభాలున తలుపులు వేసుకుంది.
    ఆ రాత్రి తొలి ఆట సినిమా చూసి ఇంటి కొచ్చాడు శ్రీనివాసరావు.
    రమ అప్పటికే డ్యూటీ కెళ్ళిపోయింది. అతనికి అన్నం తినాలనిపించలేదు బట్టలన్నా మార్చ కుండా మంచంమీద వెల్లకిలా పడుకున్నాడు. తానూ. తన భార్యా తన జీవితం అతనిపై అతనికే అసహ్యం వేసింది.
    ఒక ఆడదాన్ని లొంగదియ్యలేని చాతకాని వాడు తను. భార్యను అదుపులో పెట్టలేని బలహీనుడు తాను. జుట్టుపీక్కున్నాడు కణతలు రుద్దుకున్నాడు. తన నెంత విసిగిస్తూంది రమ?
    రాత్రి రెండుగంటలవేళ రమ డ్యూటీనుంచి వచ్చింది చీకటిరాత్రి వర్షం కురుస్తూంది తలుపు దబదబా బాదింది రమ.
    పావుగంట తర్వాత తలుపు తెరిచాడు శ్రీనివాసరావు. నిండా తడిసిన ఆమెవైపు చురచుర చూస్తూ ఈ అందం అందరూ చూశారా, చూపించావా? అన్నాడు చురుగ్గా.
    "ఆ" అంతకన్నా చురుగ్గా అని పక్కగదిలో కెళ్ళింది రమ.
    
                                    *    *    *

               

    అతను కప్పుకున్న దుప్పటి లాగేస్తూ. "ఊ లేవండి అలక చాలుగాని లేవండి. ప్రతిరోజూ ఉన్నదేగా భోజనం మానేసి బట్టలన్నా మార్చకుండా ఏమిటండీ ఆ నడక! కాలేజీకి టైమవుతూంది. రాత్రి డ్యూటీనుంచి ఆడది ఒక్కర్తీ రావాలనేమన్నా వచ్చారా నిద్రలేకపోవడానికి "అందిరమ.
    "ఆడదాని లక్షణాలు నీ కెక్కడున్నాయ్, ఖర్మతాలికట్టుకున్నా. నన్ను వాగించకు. నాకు జ్వరం వచ్సినట్టుంది. కాలేజీలేదు. కాష్ఠంలేదు. ఇవ్వాళ లీవ్ పెడతాను లేకపోతే రిజైన్ చేస్తాను. నువ్వెలాగూ ఉద్యోగం చేస్తున్నావుగా."
    "బెదిరిస్తారా ఏం, అలానే చెయ్యండి. మీరు లేవంటూన్న ఆడ లక్షణాలు నాకు వస్తాయని మాత్రం ఆశ పెట్టుకోకండి."    
    "రమా? హబ్బ కాస్సేపు నోరు మూసుకుందూ!"
    "సరే..." ఆమె చరచరా వెళ్ళిపోయింది.
    అతన లేచి బాత్ రూమ్ వైపు నడిచాడు.
    మొహం కడిగి టేబిలుముందు కుర్చీలో కూర్చున్నాడతను కాఫీగ్లాసు టక్కున పెట్టిందామె.
    "ఇవ్వాళ డే డ్యూటీ కాబోలు" కాఫీ సిప్ చేస్తూ స్వగతంలా అన్నాడతను.
    "అవును..... ఆమె జవాబు.
    "నువ్వు వెళ్ళడానికి వీల్లేదు."
    "ఎందుకని?"
    "నా వంట్లో బాగుండలేదు."
    "మీరు చంటి పాపాయికాదు?"
    "కాకపోయినా నీ అవసరం నాకుంటుంది."
    "నేనే మీ కాళ్ళు పిసకను."
    "ఛీఛీ ఎటువంటి భార్యవు దొరికావు?"
    "అదే నేనూ అనుకుంటూంటాను."
    "అంటే?" అతని కనుబొమలు ముడి పడ్డాయ్.
    "మీ లాంటి భర్త దొరికారని."
    "వదిలెయ్."
    "పదేపదిసార్లు అనకపోతే ఆ ననేదో మీరే ఎందుకు చెయ్యలేకపోతున్నరూ!"
    "అదే ఆలోచిస్తున్నాను? ఇలా పోట్లాడుకుంటూ నీ చేత అలుసుగా మాటలు తింటూ నీదగ్గరే ఎందుకు పడి ఉంటున్నానా? అని"    
    "నే తెచ్చే జీతం కోసం"
    "రమా నోర్ముయ్ వెధవ డబ్బు తెస్తున్నావ్. నాకు అక్కర్లేదు. ఉద్యోగం మానేయ్ సవాలక్ష సార్లు చెప్పాను. డబ్బెందుకు తీసుకుంటున్నానో నీ దగ్గరనుంచి తెల్సా? ఇష్టమొచ్చిన వేషాలు వేస్తానని డబ్బుంటే."
    "ఏమండీ. మగవాణ్ణి మొగుణ్ణి అని ఇష్టమోచ్చినట్టూ మాట్లాడితే పడేదాన్ని కాను. ఏం ఖర్మ చేసుకున్నానో ఒక్కనాడైనా ఆప్యాయతగా మాట్లాడిన పాపాన పోరు. సూటిగా వ్యంగ్యంగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టడం మీరు రెచ్చిపోవడం.
    ఆమె ఏమేమో సణుగుతూంది. అతను మౌనంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు.
    ఆమె రేడియో ఆన్ చేసింది.
    "వద్దు తలనొప్పిగా ఉంది" అన్నాడతను.
    "వాచ్ ఆగిపోయింది కీ ఇవ్వాలి అందామె.
    "ఎవ్వరినన్నా టైమడుగు" అంటూ విసురుగా లేచి రేడియో కట్టేశాడతను.
    "ఎవ్వరి నడుగుతానూ! మీరు అడిగి రండి!
    టైము తెలియకపోయినంత మాత్రాన ఫర్వాలే. ఇవ్వాళ నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు. ఇంటి దగ్గర ఉండాలి"
    "డ్యూటీ మానిరా ఇంటిదగ్గర ఉండను"
    "ఎక్కడికెళ్తావ్?"
    "ఏమిటండీ మరీను. ఇంటిదగ్గర ఉండాలి డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడి కెళతావ్, అంటూ పల్లెటూరి మొద్దుని శాసించినట్టు"
    "పల్లెటూరి మొద్దుని కట్టుకుంటే నా జీవితం హాయిగా ఉండేది. ఈ పొగరుబోతువి కాక."
    అబ్బబ్బ. ఎంత పొగరు నాకు.... అలా కనిపిస్తున్నాను మీకు. సరి. మీతో వాదన పెటుకుంటే ఇవ్వాళ తెమిలినట్లే. ఆమె జడ అల్లుకుంటోంది."
    "ప్లీజ్. దయచేసి నా మాట విను రమా. ఎటో ప్రయాణ మౌతున్నట్లున్నావే. ఈరోజు ఉండకూడదూ ఇంట్లో. తలనొప్పిగా వంట్లో ఏం బాగుండలేదు రమా - అస్సలు నీకెలా చెప్పాలో ఎలా నిన్ను మార్చాలో నాకు తెలియడంలేదు. ఎటన్నా వెళ్ళిపోతావా..." అన్నాడు.
    "ఆ... ఆమె గొంతులో విసుగు.
    అతను మాట్లాడలేదు. వత్తగిలి కళ్ళుమూసుకున్నాడు.
    గిన్నెలు సర్దిన చప్పుడూ, పెట్టె తెరచిన చప్పుడూ తలుపులు దభాలున వేసి గడియపెడ్తూన్న శబ్దం విన్నాడు శ్రీనివాసరావు.
    "ఏవిటాలోచిస్తున్నారూ...." అతని భుజం నట్టికుదిపింది రమాదేవి.
    అతను తల కొంచెం తిప్పి ఒక్కసారి ఆమె వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.
    "నేను వెళ్ళాలి ప్లాస్కులో కాఫీ వుంది...మీకు భోజనం అవసరంలేదుగా... శాంతకి కొడుకు పుట్టాడు. మీకు తెల్సుకదూ! ఇవ్వాళ పేరు పెడతారు. డిన్నరుంది నన్ను ముందుగా రమ్మంది. ప్చ్ - నా ఇల్లూ సంసారం గురించి తనకేం తెల్సు?.... ఊ... వెళ్తున్నాను......!" ఆ వాక్ ప్రవాహానికి పరధ్యానంలోంచి ఉలిక్కిపడి ఆమెవైపు అసహ్యంగా. అసహనంగా చూశాడు. తాను ఎన్నిసార్లు చెప్పినా టెరిలిన్ నైలాన్. జార్జెట్ ఇల్లాంటి పల్చని, వంటిమీచ్న్హి జారిపోయే చీరలే కడుతూంది రమ. అందరూ ఆమెవైపు ఆమె అందాన్ని తాగేస్తూన్నట్టు చూస్తూంటే తనవంటిమీద తేళ్ళూ జెర్రులు పాకుతూన్నట్టనిపిస్తుంది. తనసమాధానం వినకుండానే ఆమె వెళ్ళిపోయింది. తన అంగీకారం. అనుమతి ఆమె కక్కరలేదు. చివాలున లేచి వీధివరండాలోకొచ్చాడు. వెళ్తూన్న ఆమెవైపు చూసిన అతనికి పట్టరాని కోపం వచ్చింది. రమా! గట్టిగా అరవబోయి పెదవి కరచుకున్నాడు. గొంతు విడలేదు.
    రమాదేవి రోడ్డు మళ్ళిపోయింది. అతను కుడిచేతి గుప్పిటితో జుట్టు పీక్కున్నాడు.
    దబాలున తలుపులు వేసి ఈజీ చైర్లో కూర్చుని కిటికీ ఊచలమధ్య నుంచి ఎటో శూన్యం లోకి చూపులు పరుస్తున్న అతని కనులముందు గతం కవ్వించి నవ్వుతూంది.

                                       *    *    *

    శ్రీనివాసరావు ఎమ్.ఎ, ప్యాసై నట్టు రిజల్ట్సు వచ్చినరోజు. "అబ్బాయ్.....సాయంత్రం అమ్మాయిని చూస్తావుకదూ! అన్నారు శ్రీనివాసరావు తండ్రి రంగనాధం.


Next Page 

WRITERS
PUBLICATIONS