"మధూ! ఏమిటా పిచ్చి! ఏదీ నా వైపు చూడు. మరి ఏడవకు." ఆమె కళ్ళు రుమాలుతో వత్తి ఆమె వదనం పైకెత్తి ఆమె వైపు చూస్తూ అన్నాడు ప్రసాదరావు చెక్కుల మీంచి ముత్యాల్లా నీటి బొట్లు జారిపోతుంటే.
"నన్ను క్షమించగలరా?" అన్న మధుమతి మాట కడ్డు వస్తూ "నువ్వు నన్ను క్షమించాలి మధూ!' అన్నాడు ప్రసాదరావు.
"నేను క్షమించాలా!" అంటూ పేలవంగా నవ్వి, "చచ్చిన పామును మరి కట్టకండి." అందిమదుమతి.
"నీకు తెలియని ఓ రహస్యముంది, మధూ! రా, ఇలా కూర్చో. స్థిమిత పడు. ఆందోళన పడకు.... నే చెప్పేదంతా నెమ్మదిగా విను."
"రహస్యమా? ఏమిటది?" అత్రతగా అంది.
అవును. ఎప్పుడైనా నువ్వూ, నేను కలిస్తే ఒకరి నోకరం చూడాలనే తహతహతో , ఒక్కసారి కలిసి మాట్లాడాలనే తపనతో పశ్చాత్తాప హృదయంతో, సహజంగా మన మధ్య ఉండే మమతలు మళ్ళీ చిగురించి ఒకరి కొకరం కావాలనుకుని, నిర్మలమైన మనస్సుతో, చివరి క్షణాల్లో నైనా, అలా కలిస్తే, అది జీవితానికి చాలు. ఇప్పటి ఈ అనుభూతి. మన జీవితానికి చాలు, మధూ! ఇలాటి క్షణం కోసమే, ఈ అపురూపమైన తరుణం కోసం వేచి నిరీక్షిస్తూ నీకూ నాకూ మధ్య అడ్డు తెరలు వాల్చాను." అని, ఒకసారి ఆమె వైపు చూసి, "వాసు తన దగ్గరకు రావడం మొదలు ఇప్పటి వరకూ జరిగిన దంతా ఒకసారి ఆమె వైపూ , మరొక సారి శూన్యం లోకి చూస్తూ పాఠం అప్పగించినట్టు చెప్పేసి, "నీకు తెలియనివ్వనందుకు మరోలా ఆపార్ధం చేసుకోకు. నేను కనిపించిన క్షణం లో నువ్వెప్పుడైనా నువ్విలాగా ప్రవర్తిస్తావు. కాని, నా మనస్సు మరొక కోణం లో ఊహించవచ్చు. నేను ధనవంతుడ్ని అయ్యానని, బాబుకి చదువు చెప్పించాననే నువ్వు నాకు దగ్గరయ్యావని అనుకోవచ్చుగా? అలాటప్పుడు నా చేతులు నిన్ను ఆప్యాయంగా తాకలేవు. స్వచ్చమైన హృదయంతో నీతో కలిసి బ్రతకలేను... అందుకని గోపాలాన్ని, వాసునీ చెప్పవద్దని కఠినంగా శాసించాను. పాపం! వాడు ఎన్ని సార్లు ఏడ్చాడు! నాపై తిరగబడ్డాడు. ఓ రకంగా యుద్ధం చేశాడు నీ తరపున.' అన్నాడు గతం జ్ఞప్తికి వచ్చి నవ్వుకుంటూ ప్రసాదరావు.
ఉదాసీనంగా ఉండిపోయిన మధుమతి వదనం లో గర్వరేఖలు ఉదయించాయి. పెదవులా పై హాసరేఖలు విరిశాయి. కోడల్ని చూశారా? రండి, అమ్మ మీరు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా నన్ను తిడుతుంది.... ఆమెనూ తమ్ముళ్ళ పిల్లలనూ , మీ చెల్లెళ్ళూ అందర్నీ చూద్దురు గాని. కాఫీ టిఫినూ తీసుకున్నారు కదూ?" లేచి నిలుచుంది మధుమతి.
తోక చుక్కాని చూసినట్టు వింతగా చూశారు ప్రసాదరావు ని పిల్లలు.... "బాబూ, ప్రసాదం , ఇలా దగ్గరగా రా అమ్మా!' చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుని కళ్ళజోడు సవరించుకుంటూ పిలిచింది జానికమ్మ. వినయంగా ఆమెకు నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు ప్రసాదరావు. అందర్నీ ఫలానా అంటూ పరిచయం చేశాడు గోపాల్రావు. కొన్ని నిమిషాల క్రితం అతనిద్వారా ప్రసాదరావు కధ అంతా విని ఉన్నారు కనక "నమస్తే" అనేశారు , ఎవరూ? అని ప్రశ్నించకుండా.
* * * *
వెలితే కనుపించని ఆ వివాహ మహోత్సవం లో మాటలూ, చర్చలూ, కవ్వింపు లూ, నవ్వులూ , ఒక సందడి. విందారగీస్తూ బావమరదుల పంక్తి ని కూర్చున్నాడు ప్రసాదరావు. "ఒరే కలెక్టర్" అంటూ ఏవేవో ఛలోక్తులు విసురుతున్న రాజశేఖరం -- "కండక్టరు కొడుకూ ఓ కలెక్టరేనా మామయ్యా!" అన్న వాసు మాట చెళ్ళున చరిచినట్టయి , చప్పున వాసు వైపు చూశాడు. ఇంకేమో అనబోతున్న వాసుని , "వాసూ! ...." అని మందలింపు గా పిలిచాడు ప్రసాదరావు.
అందంగా అలంకరించిన ఆ గదిలో అగరవత్తులు మత్తు వాసన నింపుతూ వెలుగుతున్నాయి పొగలు కక్కుతూ. సిగ్గుల మొగ్గై-- గదిలో అడుగు పెట్టిన పద్మజ వైపు పరవశంగా చూశాడు వాసు.
పాలగ్లాసందిస్తూన్న ఆమె చేతిని మృదువుగా పట్టి నొక్కుతూ, "పాలల్లో వంతిస్తున్నా ననుకున్నాను, కాని, జీవితంలో భాగం ఇస్తున్నాననుకోలేదు." అన్నాడు వాసు.
"నువ్వు భలే ఫోజులు కోడతావు లే.... ఈమాత్రం దానికి.... ఆరోజు నన్నేడిపించి, మీ నాన్నగారి చేత ఉత్తరం వ్రాయించేవ్! ఆరోజు నీ మనస్సులో ఉద్దేశ్యం చెప్పి వెళితే వరసగా వారం రోజులు ఏడ్చే దానను కానుగా!"
"పోనీలే.... నీ అంత ధైర్యం నాకెక్కడిది చెప్పు -- ఒక్కసారిగా నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకోవడానికి? కాని, పద్మజా , మా అమ్మా, నాన్నా మాట్లాడుకోవడం నిన్నా, ఈవేళా ఎప్పుడన్నా నవ్వు చూశావా?' అన్నాడు వాసు. ఆశగా వెలిగే కళ్ళతో ఆమె వైపు చూస్తూ.
"బాగుంది. కొత్త దంపతులా? ఎందుకు మాట్లాడుకోరూ!" అంది చిన్నగా నవ్వుతూ కాని అతని తపన ఆమెకేం తెలుసు?
మరునాడు ఉదయం గోపాల్రావు గదిలో అడుగు పెడుతూ చప్పున వెనక్కి తగ్గి పోయిన వాసుని "రా బాబూ..." అని పిలిచాడు ప్రసాదరావు. ఒక్క మంచం మీద కూర్చుని ఏవేవో మాట్లాడుకుంటున్న తల్లీ తండ్రీ. అతన్ని చూసి వారు లేచి పోలేదు. "రా, కూర్చో, తన పక్క చోటు చూపించాడు ప్రసాదరావు.
బిడియంగా ఇద్దరి వైపు చూస్తూ, కూర్చుని, "మధూ! బాబునీ, కోడల్నీ , ఎవరైనా కోడలుతో వచ్చే మన వారినీ తీసుకురా. అందర్నీ ఒకసారి రమ్మని పిలు" అని ఇంకా ఏమేమో వారిద్దరి మధ్యా ఎడబాటూ, కొత్తా లేనట్లు మాట్లాడుతున్న ప్రసాదరావు మాటలకు ఆశ్చర్య పోయాడు వాసు.
ఆడబిడ్డకీ, కూతురి కీ కూడా కాళ్ళకు పసుపురాసి, చీరా, రవిక గుడ్డా పసుపూ పళ్ళూ ఇచ్చింది లక్ష్మీ.
కోడలితో పాటు తానూ గృహప్రవేశం చేస్తుంది' నవ్వుకుంది మధుమతి.
గృహప్రవేశం మిగతా అక్కడి వేడుక లయ్యాక, "అందరం వెళ్ళిపోదాం." రమ్మని పిలిచిన వాసుతో "మేమేమి వస్తాం? మీ ఇద్దరూ వెళ్ళి హాయిగా ఉండండి." అన్నాడు ప్రసాదరావు. "నువ్వన్నా ఓసారి మాతో రా అమ్మా" అని పిలిచాడు వాసు. "ఉన్నన్నాళ్ళూ ఉన్నారు. ఇక ఆయన్ని ఒంటరిగా ఉండనివ్వను సుమా! ఇద్దరం కలిసి ఓసారి వస్తాం లే!" అనేసింది మధుమతి.
అప్రతిభుడై పోయాడు వాసు.
(సమాప్తం)
