"అయితే నువ్వు మగాడివి కావేమో?" నాలిక కరుచుకుని నవ్వింది పద్మజ.
ఆమె మాటకు తానూ నవ్వుతూ, "నిజం, పద్మజా. నా తలనిండా బరువులూ, మనస్సు నిండా బెంగా. ఆ ప్రేమ దాకా పోలేదు నా జీవితం." అన్నాడు వాసు.
'అయితే మీ అమ్మకు ఏం చెప్పావ్?'
"మరొక సంబంధం చూచి జయకు పెళ్ళి చెయ్యమని మామయ్యకు వ్రాయమన్నాను."
పట్టలేని సంతోషంతో లోకాన్ని జయించిన వీరుడులా కళ్ళు మెరుస్తుంటే అతని వైపు చూస్తూ , "తెలివి గల మగవాడివి, దొరికి పోయావ్! వివాహ బంధం విధించుకునేటప్పుడు పరస్పరాకర్షణ ఉన్న దాంపత్యమే స్వర్గ తుల్య మౌతుంది. ఒప్పుకుంటావా?' అంది పద్మజ.
"ఎస్!.... అవును!"
"నే నెప్పుడో ఎవరినై పో ఆకర్షితురాలనై పోయాననుకో! ఇప్పుడెవరేవర్నో చూపించి పెళ్ళి చేసుకో మంటే ఎలా?"
"ఛ, ఛ! వట్టి తెలివితక్కువ! అతనెవరో చెపితే పోలే. ఇలా వాళ్ళను చంపక?"
"నాయందు అతను ఆకర్షితుడు కాకుంటే! అతని కా ఉద్దేశ్యమే లేకుంటే?'
"అఘోరించు...." చిరాగ్గా అన్నాడు వాసు.
"అదే చేస్తున్నాను." గొణిగింది పద్మజ.
రెండు క్షణాల తరవాత "రేపు నే వెళ్ళిపోతాను, పద్మజా! ఎప్పుడన్నా వస్తుంటావా? మా ఇంటికి!" అని మాటలు మార్చేస్తూ నవ్వుతూ అడిగాడు వాసు.
"చిన్న ఉపకారం చేసిపో.... నేను...నేను..." టక్కున ఆమె గొంతు దుఃఖంతో పూడిపోయింది.
"ఆ ఏం చెయ్యాలి?చెప్పు! అంత అల్లరిగా ధైర్యంగా మాట్లాడిన దానవు మళ్ళీ మామూలు ఆడపిల్లలా ఏడుపు మొహం పెట్టావు!"
"నాన్నగారిని నాకు సంబంధాలు చూడవద్దని చెప్పు...."
"నే వద్దంటే మానేస్తాడా?" నవ్వేశాడు , ఆమె ఉద్దేశ్యమేమిటో గ్రహించలేని వాసు అయోమయంగా ఆమె వైపు చూస్తూ.
మళ్ళీ కొన్ని క్షణాలు నిశ్శబ్దం తరవాత -- "పోనీ, ఎన్నాళ్ళు చూడవద్దని చెప్పమన్నావ్?' అని అడిగాడు వాసు.
"నేను ప్రేమిస్తున్న జడపదార్ధం చైతన్యవంత మయ్యేదాకా." తల వాల్చింది.
"అంటే?!" అంతులేని ఆశ్చర్యం, తెలుసుకోవాలనే కుతూహలం. అతని కనుబొమలు ముడి పడ్డాయ్.
'అతని తలమీద బరువులు తొలిగి, మనస్సు నిండిన బెంగలు పోయి మామూలు మనిషి అయ్యే దాకా."
దిగ్ బ్రాంతుడైపోయాడు కొన్ని క్షణాలు వాసు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పద్మజా? నా వైపు ఆకర్షితురాలవైయ్యావా? అహహ కాకూడదు. నేనెప్పుడూ అలా అనుకోలేదు." కంగారుగా తడబడే గొంతుతో అన్నాడు వాసు.
"పోనీ, కాకూడనిదే జరిగింది. ఆ జరిగిపోయింది మరోలా మారదు...." ఆమె గొంతు ఓ రకమైన సిగ్గుతో, బాధతో పూడిపోయింది.
అటూ ఇటూ గబగబా పచార్లు చేసి ఒకసారి ఆమె వైపు చూసి మళ్ళీ కిటికీ ఊచల మధ్య నుంచి శూన్యం లోకి చూస్తూ, "నాకేమిటో చాలా కంగారుగా, భయంగా ఉంది. నీకేమీ జవాబు చెప్పే స్థితిలో లేను. నువ్వు.....నువ్వు కూడా నాన్న ఉద్దేశ్యంతో అభిమానించి ఉండవు. ఒక్కసారి....ఒక్కసారి బాగా అలోచించి నిర్ణయించుకో. నన్నెలా ప్రేమిస్తున్నావో..." అన్నాడు వాసు.
"ఎప్పుడో నిర్ణయించుకున్నాను.... ఇక ఆలోచనా, మరో నిర్ణయం నా జీవితంలో జరగదు.... పోనీ, జవాబు చెప్పు -- నాకు ఇష్టం లేదని, దాని కోసం భయం కంగారూ ఎందుకు ?"
తలవంచి అలా.... మౌనంగా నిల్చున్న .. వాసు వైపు చూస్తూ, 'చెప్పలేక పోతున్నావు కదూ!.... ఆడపిల్ల బరితెగించి నన్ను పెళ్ళి చేసుకుంటావా లేదా? అని ఒక్కసారిగా అడిగేస్తే జవాబెలా చెప్పాలి?" అని నవ్వింది పేలవంగా.
ఒక్కసారి ఆమె వైపు చూసి మళ్ళీ తల వంచాడు వాసు. సుడిగాలి మధ్య చిక్కుకున్న ఆకులా అతని మనస్సు విలవిలలాడుతుంది. 'ఛ అసలిక్కడికి రాకుండా ఉండవలసింది. పోనీ, వచ్చాను. ఈమెతో అధిక ప్రసంగానికి దిగకుండా ఉంటె తెల్లరి తేలిగ్గా పోయేవాడిని." ఒక్కటీ నిలకడ లేని ఆలోచనలు. ఒక్కసారిగా అలిసినట్టు మొహం పీక్కుపోయింది వాసుకి.
టేబిల్ క్లాత్ సవరిస్తూ, దాని పై ఉన్న డిజైన్ వైపు చూస్తూ, వాసు నుంచి వచ్చే జవాబు కోసం చెవులు రిక్కించి, తీవ్రంగా హృదయం స్పందిస్తుంటే నిలుచుంది పద్మజ.
సంధ్య చీకట్లు అలుముకున్నాయి. ఆ గదిలో ఊపిరి పీల్చి వదులుతున్న శబ్దం మినహా మరేమీ వినిపించడం లేదు. ఆ నిశ్శబ్దాన్ని భేదిస్తూ, "వాసూ , మీ ఆఫీసులో బి.ఎ. పాసైన వాళ్ళకి గుమస్తా పోస్టు ఇవ్వవచ్చు కదూ?" అంది పద్మజ. ఆమె గొంతు తడిగా ఉంది.
ఆమె వైపు తలెత్తి చూడలేక పోతున్న వాసు "సారీ, పద్మజా. మీ ఇంట్లో ఉన్న కాలంలో ఏమన్నా నీపట్ల తప్పుగా ప్రవర్తించి ఉంటె క్షమించు. నేను...నేను.... నీకలాంటి భావం కలిగేలా నేను ప్రవర్తించలేదే! ప్చ్.... మీ అమ్మా, నాన్నా నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పెద్ద పెద్ద సంబంధాలు తీసుకు వస్తున్నారు... నా మూలంగా వారి ఆశా భంగం నేను "సహించ లేను....మనస్సు మార్చుకో. ఇక ఎవ్వరికీ చెప్పకు' అని గబగబా గదిలోంచి వెళ్ళిపోయాడు వాసు.
దోసిట్లో మొహం దాచుకుంది పద్మజ. అయిపొయింది. తాను కట్టుకున్న బంగారు మేడ కూలిపోయింది 'మనస్సు మార్చుకో , ఇక ఎవ్వరికీ చెప్పకు' బాగా చెప్పాడు.... ఛ, ఛ! మళ్ళీ అతని మొహం ఎలా చూడాలి!' ఆమె హృదయం మండిపోతుంది. 'ఆదుకున్నాడు ఆడపిల్ల మనస్సుతో , స్కూటరు మీద తిప్పాడు. నోటి కందిస్తే టిఫిన్లు తిన్నాడు. నా ఎంగిలి పాలు తాగాడు. నన్నో మతిలేని దాని క్రింద జమ కట్టాడు' కోపం దుఃఖం తీవ్రమైన ఓటమిని సహించలేని పద్మజ నిస్సహాయంగా కళ్ళు వాచేలా ఏడ్చింది.
గదిలో స్వీచ్ వేసి "పద భోజనానికి నడు. ఇది మాములేగా! వద్దంటే మేడ కేసి కట్టలేంగా." అంటూ గాలి దుమారం లా వచ్చిన లక్ష్మీ పద్మజ మొహం చూసి కరిగిపోయింది.
"ఛ! ఛ ఏదమ్మా ఏడుస్తున్నావా? నాన్న అలా అంటారు కాని నీ కిష్టం లేకుంటే ముడి పెడతారా! నే చెబుతాగా ....రా, అన్నం తిను. బ్రతిమలాడి లాలింపు గా తల నిమిరి, ఆమె కళ్ళు చీర కొంగుతో తుడుస్తూ అంది లక్ష్మీ.
"నాకు అక్కర్లేదమ్మా" అంటున్న పద్మజ కి బలవంతంగా మజ్జిగన్నం తినిపించింది లక్ష్మీ.
"అక్కర్లేదు, అన్నం వద్దు" అని మొండి కేసిన వాసు గదికి పాల గ్లాసు తీసుకు వెళ్ళింది మధుమతి. సగం పాలు 'మరో గ్లాసులో వంచి, "ఇన్ని పాలు నేను తాగలేను. పద్మజ కిచ్చెయ్ ' అన్నాడు వాసు.
మధుమతి తెచ్చిన పాలు ఆప్యాయంగా తాగింది పద్మజ.
* * * *
వాసుతో స్టేషను కి శ్రీను వెళ్ళాడు. తనతో రమ్మని శ్రీనుని పిలిచాడు వాసు. సెలవుల్లో తప్పకుండా వస్తానన్నాడు శ్రీను.
తాను ఉద్యోగంలో జాయినయిన రోజు రాత్రి -- మధుమతి కి, తాను క్షేమంగా ఉన్నట్టూ, గోపాల్రావు కి సంబంధాలు చూసి పెళ్ళి చేసుకోమని, పద్మజ ని కొన్నాళ్ళు ఒత్తిడి చెయ్యద్దని, ప్రసాదరావు కి తాను మధుమతి తో మాట్లాడిన ప్రతి మాటా వ్రాస్తూ , "అమ్మ సమ్మతించింది. మరి మీ రెప్పుడు అక్కడికి వేళుతున్నారో వ్రాస్తే నేను కూడా రావడానికి ప్రయత్నిస్తా" ననీ ఉత్తరాలు వ్రాసాడు వాసు.
ప్రసాదరావు దగ్గిరి నుంచి నాలుగు రోజుల తరవాత ఉత్తరం వచ్చింది. "నీ పెళ్ళి కెలాగూ అందరూ కలుస్తారుగా? అప్పుడే ఓసారి అందరినీ చూసి, మీ అమ్మకి మన కధ చెప్పి, అప్పుడామే నన్నెలా అపార్ధం చేసుకుంటుందో చూద్దాం. నేను అందరినీ ఒక్కసారి చూసి మీ అందరితో కలిసిపోవాలనుకుంటే నువ్వు ఓ నిర్ణయానికి రా! ఎవ్వరికైనా మనసిచ్చావా? ....;లేక గోపాలానికి ఉత్తరం వ్రాసేదా!" అంటూ.
చాలాసేపు అలోచించి విసిగిపోయి వాసు "ఇష్టమొచ్చినప్పుడే పెళ్ళి చేసుకోవడానికి కూడా నాకు స్వతంత్ర్యం లేదు. ఇప్పుడే నిర్ణయానికి వచ్చేయ్యాలట!" అనుకోని, తన పెళ్ళి కన్నా అమ్మా, నాన్నా కలియాలనే అత్రతతో ఉన్న వాసు "అయితే చిన్న మామ్మయ్య కి ఉత్తరం వ్రాయండి." అని జవాబు వ్రాశాడు.
* * * *
ప్రసాదరావు ఉత్తరం చదివిన గోపాలరావు , గబగబా భార్యని పిలిచి, "చూశావా! వాసూ , పద్మజా ఎప్పుడో మనసిచ్చి పుచ్చుకుని ఉంటారు. తండ్రికి వ్రాశాడు." అన్నాడు. సంతోషాతిశయం లో కళ్ళు మెరుస్తుంటే, "నా తల్లి అదృష్ట వంతురాలు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట పడనిచ్చారా! వదినతో చెపుతారా?' అంది లక్ష్మీ.
"దాని ఉద్దేశ్యం నాకెప్పుడో తెలుసు.... చెబుదాం లే, సాయంత్రం" అన్నాడు గోపాల్రావు.
ఏకాంతంలో నెమ్మదిగా పద్మజ నడిగింది లక్ష్మీ. "వాసుని చేసుకుంటావా? ...అత్తయ్య ని అడుగుదాం" అంటూ. "సిగ్గుగా మౌనంగా రెండు క్షణాలు ఉండిపోయి, తరవాత -- 'అత్తయ్య ఇష్టం తో సరా? వాసు..." అంటూ లక్ష్మీ వైపు చూసింది, పద్మజ.
'అతను ఇష్టపడ్డ తర్వాతే నిన్ను అడుగుతూంట."
"నిజం?...' చప్పున సర్వం మరిచిన సంతోషంతో అంది పద్మజ.
తృప్తిగా నవ్వుతూ 'అవునమ్మా!' అంది లక్ష్మీ.
సావకాశంగా రాత్రి భోజనాలయ్యాక మధుమతి తో కొంతసేపు అవీ ఇవీ పిచ్చాపాటీ మాట్లాడి, "మరి వాసుకీ కూడా పెళ్ళి చేసేస్తే బాగుంటుందేమో?' అన్నాడు గోపాల్రావు.
"అదే అనుకుంటున్నాను, నేను కూడా" అంది మధుమతి.
"అన్నయ్యకేం జవాబు వ్రాశావు? వాసు అభిప్రాయం కనుక్కున్నావా?' ఆత్రత అతని గొంతులో.
"జయను చేసుకోడెమో? మరొక సంబంధం చూసుకోమని వ్రాయమన్నాడు."
"ఓ..... మరేం అనుకోకు.... మన పద్మజ.... నీ అభిప్రాయం.... వాసుకి పద్మజ నివ్వాలను కుంటున్నాను.
"ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడెందు కా ఉద్దేశ్యం వచ్చింది?' నిష్టూరంగా అని నవ్వబోయింది మధుమతి.
"నాకెప్పుడూ ఉందా ఉద్దేశ్యం.... పోనీ, నువ్వెందుకనలేక పోయావ్ వాసు కివ్వమని?... ఎప్పటికైనా తెలతావేమో అని సంబంధాలు చూస్తున్నాను....కాని..."
'అది నాకు కోడలు కాబోతుందంటే అంతకన్నా నాకు అదృష్టమేముంది! వాసుకి వ్రాయి."
"వాడి అభిప్రాయం తెలుసుకున్నాను, అక్కయ్యా. సమ్మతించాడు."
"అయితే నీ ఇష్టం. నాకేముంది? నేనేం చెయ్యగలను!" దుఃఖంతో గొంతు పూడి పోయింది మధుమతి కి.
"ఛ, ఛ! నువ్వేం చెయ్యాలి! కంట తడి పెట్టకు. మేం అందరం ఉండగా నీకేం లోటు చేస్తాం!" అన్నాడు గోపాల్రావు మందలింపు గా.
* * * *
కాంపు లో ఉన్న వాసు, ట్రావెలర్స్ బంగళా లో, 'ఇష్ట పెట్రోమాక్సు లైటు వెలుతురూ లో చాలాసేపు కాగితాలు చూసి, బద్దకంగా ఒళ్ళు విరిచి నిలుచుని వాచ్ చూసుకున్నాడు. రాత్రి పదకొండు. గొంతు ఎండినట్టయి కూజాలో నీళ్ళు గ్లాసులో వంచుతుంటే, పద్మజా, పాల గ్లాసూ గుర్తు వచ్చాయి. తరవాత బెడ్ మీద పడుకున్నాక కూడా గతం లోని ఎన్నో సంఘటనలు గుర్తు వచ్చాయి. అతని ఊహల చుట్టూ, అతని మనస్సు నిండుగా పద్మజ రూపం ద్త్యోతకమౌతుంది. 'ప్చ్! పాపం! నేనలా చెప్పగానే ఎంత బాధపడిందో! ఎవరో ముక్కూ, మొహం తెలియని కొత్త అమ్మాయిని చేసుకొనే బదులు తనను కోరి వరించిన పద్మజ నే చేసుకుంటే?' ఎందుకు చేసుకోకూడదు?' అనుకున్న వాసు ఆమె అందం, అణకువ, అభిమానం అన్నీ గుర్తు చేసుకున్నాడు. చాలా రాత్రి వరకూ నిద్రపోని వాసు -- 'రేపు నాన్నగారికి ఉత్తరం వ్రాసేస్తాను. అందరినీ తృప్తి పరచడం లోనే నిజమైన తృప్తి ఉందేమో నాకు' అనుకున్నాడు.
* * * *
రిజిస్టరు పార్శేలు విప్పి చూసిన వాసు తెల్లబోయాడు తన పెళ్ళి శుభలేఖలు . ఒక్కటి తీసి చదువుకున్నాడు. నవ్వూ, కోపం రెండూ వచ్చాయి. దానితో పాటు వచ్చిన కవరు విప్పి చదివాడు. "మీ నాన్న వ్రాశారు నీ అభిప్రాయం." అంత నాన్న చేత నాకు వ్రాయించక పొతే నేరుగా నాకు చెప్పరాదూ? నేను పై వాడ్నా! సరిలే. ఈ ముహూర్తం తప్పిస్తే రెండు నెలల దాకా ముహూర్తాలు లేవట. అన్ని ఏర్పాట్లు నేను నీ హోదాకు తగినట్టుగానే చేస్తాను. మీ నాన్నని ముందుగా రమ్మని వ్రాస్తాను. నువ్వు కూడా వ్రాయి" అని వ్రాశాడు ఇంకేమీ రాయడానికి తీరిక లేనట్టు గోపాల్రావు.
'నాన్న కేమని వ్రాశాను? చిన్న మామయ్య నేదన్నా సంబంధం చూడమని వ్రాయండని స్పష్టంగా వ్రాయక ' అయితే చిన్న మామ్మయ్య కి వ్రాయండి." అన్న ఉత్తరం చదివి నాన్న మరోలా అనుకుని సంబరంగా వ్రాసేశారు. ! పద్మజ పట్టలేని ఆనందంతో ఉండి ఉంటుంది. ప్చ్! లాభం లేదు. ఇక తప్పించుకోలేను. పద్మజా, నీ గుండ్రని అందమైన మెరిసే కళ్ళలో ఎంత అదృష్ట ముంది! నువ్వు కోరుకున్న భర్తని నీ కాళ్ళ ముందు కట్టి పడేస్తున్నాడు దేవుడు' అనుకున్న వాసు పెదవుల పై హాస రేఖలు విరిశాయి.
