Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 37


    మాధవయ్య నీరుగారిపోయాడు. కామాక్షి తీయలేదు. వాసు స్కూలుకి వెళ్లాడు. పళ్లెం ఎలా మాయమయింది? ఆ భగవంతుడు తనమీద ఆగ్రహించి తను చేసిన వెధవ పనికి బుద్ధి చెప్పడానికి మాయం చేశాడా? అనుమానం తోచి గబగబా దేవాలయం వైపు వెళ్లాడు. గర్భగుడి తలుపు తీసి వుంది. ఆయన గుండె గుభేల్మంది. ఎదురుగానే వుంది హారతి పళ్లెం. తను పడ్డ కష్టం అంతా ఆ విధంగా వృధా అయిపోగానే ఏదో ఆవేశం, నిస్సహాయత, కసి, దుఃఖం, అవమానం ఆయన్ని ఊపేసింది. వ్రతం చెడ్డా ఫలం దక్కనందుకు ప్రాణం ఉసూరుమనిపించింది.
    మాయదారి దేముడు! ఎంత పని చేశాడు? దేముడు లేడని ఎవరన్నారు? ఉన్నాడు. ఎంచక్కా తన పళ్లెం తను వెనక్కి తెచ్చుకున్నాడు. ఉక్రోషం వచ్చింది మాధవయ్యకి. కసిగా దేముడ్ని చూశాడు. 'ఏమయ్యా వేణుగోపాలా! నలభై ఏళ్లుగా నీ సేవ చేసుకుంటూ నిన్నే నమ్ముకుని బతుకుతున్నానే. ఒక్కనాడన్నా నా కష్టాలకి జాలిపడి నన్నాదుకున్నావూ? ఒక్కరోజు నేనున్నానని ముందుకు వచ్చి సహాయపడ్డావూ? ఈనాడు కష్టాలలో ఉండి, తిండికి గతిలేక, కట్టుకున్న పెళ్లాం గడ్డిపోచలా తీసి పారేస్తూంటే, కన్నకూతురు కాపురం నిలబెట్టడానికి గత్యంతరం లేక నీ హారతిపళ్లెం అమ్ముకుందామనుకున్నాను. హు... భగవంతుడివి గాబోలు, భక్తుల కష్టాలలో ఆదుకోవాల్సినవాడివి, ఆదుకోకపోగా... నీ యింతోటి హారతిపళ్లెం కోసం కక్కుర్తిపడి లాక్కుపోయావా? వెండి హారతిపళ్లెంగాని తమ హారతికి పనికిరాదా? నా కడగండ్ల కంటే నీ హారతిపళ్లెం నీకెక్కువయిందా? ఎంత నిర్దయుడివయ్యా దేముడూ! నా కన్నకూతురు కాపురం కంటే నీ వెండిపళ్లెం నీకెక్కువా? హు... నీ కూతురు గాదుగా! నీకెందుకు బాధ? నీవసలుంటే, నీకు ఓ హృదయం వుంటే యిలా చేస్తావా? నీవు నల్లరాయివయ్యా! అంతే ఉత్త రాతిబొమ్మవి. నిన్ను నమ్మి పూజించే వెర్రివెధవలం మేము. నీవు పాషాణానివి. ఇన్నేళ్లుగా కొల్చినందుకు నీ మహిమ చూపు, లేదంటే... చూడు ఏం చేస్తానో?' పిచ్చివాడిలా ఆవేశంగా అరిచాడు. ఆయన వళ్లంతా చెమటలు పట్టాయి. మనిషి పూనకం వచ్చినవాడిలాగ ఊగిపోయాడు. నీ కోపానికి బెదరనులే... పో... పో పిచ్చివాడా! అన్నట్టు వేణుగోపాలస్వామి కదలక మెదలక అలాగే చిరునవ్వులు చిందిస్తూ నిల్చున్నాడు.
    అది చూసేసరికి మాధవయ్య ఆగ్రహం అవధులు దాటింది. 'హ... నవ్వుతున్నావు గదూ! హ... నవ్వు. అంతకంటే నీకేం చేతనవును? ఇదిగో... నీ హారతిపళ్లెం తీసికెడుతున్నాను. నీ దిక్కున్నచోట చెప్పుకో... రా... ఏం చేస్తావో చెయ్యి...' ఆవేశంగా హారతిపళ్లెం తీయబోయాడు మాధవయ్య.
    "నాన్నా!" చటుక్కున తలుపు చాటునించి కామాక్షి వచ్చింది. మాధవయ్య ఉలిక్కిపడ్డాడు కూతురిని చూసి.
    "నాన్నా! దేముడి హారతిపళ్లెం దేముడికే వుండనీ నాన్నా! మనకింక అవసరం లేదు. నాన్నా! నాకీ వూర్లో స్కూల్లో ఉద్యోగం యిచ్చారు. రెండొందలు జీతం నాన్నా! చూశావా నాన్నా! దేముడు మనకి అపకారం చెయ్యలేదు. దేముడు మంచివాడు గనకే ఆ పళ్లెం అమ్మి డబ్బిచ్చి నన్ను అత్తవారింటికి వెళ్లి ఆ బాధలు పడకుండా చేశాడు. అంతా మన మంచికే చేశాడు చూశావా? నాన్నా! నన్నింక ఆ నరకానికి వెళ్లమనకు. నా కాళ్లమీద నేను నిలబడ్డాను. నన్ను నేను కడతేర్చుకోడమే గాదు, మిమ్మల్నీ కడతేర్చగలను. నన్నింక కొడుకనుకో" కామాక్షి గబగబా అంది.
    కూతురి మాటలు విస్తుపోతూ విన్నాడు మాధవయ్య. "అయితే హారతిపళ్లెం తెచ్చి నీవా పెట్టేశావు యిక్కడ?" అయోమయంగా అడిగాడు.
    "అవును నాన్నా! నీ వరస యివాళ నాకెందుకో అనుమానం అన్పించింది. ఇందాక అమ్మ దగ్గర అలా అన్నావు. వస్తున్నప్పుడు సంచిలో ఏదో తెచ్చి అలమరలో పెట్టావు. నాకనుమానం వచ్చి చూశాను. సరిగా అప్పుడే పోస్టులో నా ఉద్యోగం ఆర్డరు వచ్చింది. 'హారతిపళ్లెం' పవిత్ర కార్యానికి పనికొచ్చేది నాన్నా! దానితో నన్ను ఆ నీచుడింటికి కాపురానికి పంపడం ఆ దేవుడికీ ఇష్టం లేదు నాన్నా!" కామాక్షి శాంతంగా అంది.
    మాధవయ్య ఇంకా అయోమయంగానే వేణుగోపాలస్వామి వంక చూశాడు. ఎప్పటిలాగే చిరునవ్వులు చిందించాడు వేణుగోపాలస్వామి.
    'నన్ను తిట్టావు చూశావా అనవసరంగా' అన్నట్టనిపించింది ఆయనకి.
    "నీ లీలలు చిత్రమైనవి తండ్రీ! నన్ను క్షమించు వేణుగోపాలా! నే ముందు మీమెంతవారం? నా అజ్ఞానాన్ని మన్నించు" చేతులెత్తి నమస్కారం చేశాడు మాధవయ్య. ఆయన కన్నీటి పొరల మధ్య మసకమసకగా కన్పించాడు వేణుగోపాలస్వామి నవ్వుతూ.

                                                   (మొదటి ప్రచురణ 1980 ప్రాంతం. స్వామి, జ్యోతి - ఏదో గుర్తులేదు)

                                             *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS