Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 38


                                                                          దోషులెవరు?

    స్నానం చేసి స్కూలు యూనిఫాం వేసుకొని గోడకి తగిలించిన మసకబారిన అద్దం ముందు తల దువ్వుకుంటూ "అమ్మా, డబ్బులీయే, టైమవుతుంది స్కూల్ కి" అన్నాడు సత్తిబాబు.
    అన్నం వారుస్తున్న వరమ్మ "వస్తున్నా ఈ గంజి వార్చి వస్తా" అంది.
    సత్తిబాబు బ్యాగులో పుస్తకాలు సర్దుతూ, టిఫిను బాక్స్ బ్యాగులో పెట్టమన్నాడు. వరమ్మ కొంగుతో చేయి తుడుచుకొని అద్దం వెనక దాచిన పెట్టె తాళం తీసి ట్రంకుపెట్టె తెరచి చీర మడతల మధ్య దాచిన చిన్న పర్సు తెరిచింది. అంతే గుండె గుభీల్మంది. మొహంలో రక్తం యింకిపోయింది. "సత్తిగా, డబ్బులేవిరా, ఇందులో లేవు" అంది వణుకుతున్న గొంతుతో.
    సత్తిపండు ఒక్క గెంతుతో పెట్టె ముందు కూలబడి తల్లి చేతిలో పర్సు లాక్కుని తిరగమరగ చూసి బిక్కమొహం పెట్టి... "ఏటే అమ్మా, ఏమయ్యాయి డబ్బులు? ఈడనే పెట్టావుగా! నిన్న సాయంకాలం దేనికన్నా కర్చు సేసావా?"
    వరమ్మ మొహంలో రక్తం పొంగింది. ఒక్కదుటన లేచి "ఇంకేటవుతుందిరా. ఆ దొంగసచ్చినోడు పట్టుకుపోయాడురా, నా మతిమండా ఆ తాళం అక్కడ పెట్టింది సూసినట్టున్నాడు. ఓరి నాయనో! నేనెట్టా సావాలిరా?" తల మొత్తుకుంటూ గుమ్మం బయట అరుగుమీద నులకమంచంలో వళ్లెరగకుండా తాగి పడుకున్న నర్సింలు తలమీద మొత్తి "సచ్చినోడా! లేరా, పిల్లగాని పరిచ్చ ఫీజు కట్టాలని పెట్టిన డబ్బులట్టుకుపోయావురా, నీ జిమ్మడ, పిల్లాడు సదుకుని బాగుపడాలని రెక్కలు ముక్కలు చేసుకొని ఆరిల్లు పనిసేసి ఆడిని సదివిస్తన్నారా. ఆ డబ్బు కూడా పట్టకపోయి తాగొచ్చావా? రాత్రికాడే అనుమానం వచ్చింది, డబ్బులెక్కడ తెచ్చి తాగావని? నా కొంప కూల్చి ఈ డబ్బులట్టుకుపోయావని కనుక్కోలేకపోయా. లేవరా, లే" ముగుడ్ని గుంజి గుంజి లాగి కింద పడేసింది. కళ్లు తెరిచి అయోమయంగా చూస్తున్న నర్సింలు జుత్తు పట్టుకుంది. "నా డబ్బులు... డబ్బులీయరా" ఉగ్రరూపంతో అంది.
    "ఏహే వదులు, వదలవే. ఏటే మొగుడ్నే కొడతావా? నీ పొగరు దించుతా..." తూలిపోతూ పౌరుషంగా లేవబోయి మళ్లీ కూలబడ్డాడు.
    "అరేయ్, ఆడి బాబువేనా? ఆడి మొహం సూడరా. పిల్లాడు కస్టపడి పరీచ్చ రాయడానికి తయారవుతున్నాడురా, యీయాల పరీచ్చ ఫీజు కట్టాలిరా..." పెద్ద గొంతుతో శోకాలు పెట్టసాగింది.
    "ఏడు... దొంగముండా! డబ్బులడిగితే కసిరేసి పొమ్మంటావా? నీ గోరోజనం నాకాడ కాదు. నీ బాబుతో సెప్పుకో పో..." పెళ్లాన్ని ఒక్క తోపు తోసి మళ్లీ మంచం మీద కూలబడ్డాడు.
    ఇదంతా ప్రతిరోజూ ఇంట్లో జరిగే భాగోతమే, కొత్త కాదు సత్తిబాబుకి. "అమ్మా! ఇప్పుడెలాగే యీయాల ఆఖరిరోజు ఫీజు కట్టడానికి. ఇయాల కట్టకపోతే పరీచ్చకి కూర్చోనీయరే..." కళ్ల నీరు తిరిగాయి సత్తిబాబుకి.
    వరమ్మ తల బాదుకుంది. "ఏటి సెయ్యనురా, నా కర్మ... యీడింత పని సేస్తాడనుకోలేదు. కొంగునన్న కట్టుకున్నాను కాదు!"
    "నే స్కూల్ కి పోను. ఇంకెందుకు ఎల్లడం? పరీక్ష రాయనీరు..." పుస్తకాల సంచి విసిరేశాడు. చెప్పులు మూలకు విసిరేశాడు.
    "అరే నాయనా! నీవు కూడా నన్నేడిపించకురా. నా బాబు కదూ, స్కూల్ కి పో. ఎట్టాగో అట్టాగా ఎవరినన్నా అడిగి, కాళ్లు పట్టుకు తెచ్చి స్కూల్ కాడకొచ్చి యిస్తాగా. ఎల్లరా బాబు, నా మాటినుకో. ఏడాది సదువంత పోతది, ఎల్లరా నా నాయన గాదూ..." పదో క్లాసు చదువుతున్న పదిహేనేళ్ల కొడుకుని చంటివాడిలా దగ్గరికి తీసుకుని బతిమాలి లేపి స్కూలు బ్యాగు అందించింది.
    "ఈయాల మధ్యాన్నం లోపల రావాలె, ఆనక పుచ్చుకోరు" సత్తిబాబు పుస్తకాల సంచి తగిలించుకొని చెప్పులేసుకొని బయటికెళ్ళిపోయాడు.

                                                   *  *  *

    "సత్తీ... ఒరేయ్ సత్తీ... వెనకనుంచి అరుచుకుంటూ పరిగెత్తి వచ్చాడు వెంకటేశు.
    "ఏట్రా, పిలుస్తుంటే ఆగవు, వినిపించుకోవు..." అని భుజం పట్టుకున్నాడు.
    సత్తిబాబు చొక్కా చేతితో కళ్లు తుడుచుకొని "ఇనపడలేదురా?" అన్నాడు.
    "ఏట్రా, ఏటయింది? ఏడుస్తున్నావెందుకురా? మీ అయ్య తిట్టాడా?"
    "అయ్య తిట్టేది కొత్తా, దానికి ఏడుపొకటా?"
    "మరి ఏటయింది?" ఆరాటంగా చూశాడు.
    "ఏటోరా, ఈ సంవత్సరం పరీక్ష రాయగలనో లేదో తెలీదురా..."
    "అదేటి?"
    "ఫీజు కట్టేందుకు యీయాల ఆఖరి రోజురా, మా అయ్య, అమ్మ దాచిన డబ్బులట్టుకుపోయి తాగేశాడు పీకలదాకా... నేనింక స్కూల్ కెందుకురా రావడం? పరీక్ష ఎలాగా రాయనీయరు. నీవు పోరా... నేను రాను. అమ్మ ఎక్కడన్నా అడిగి తెస్తానంది. డబ్బు తెస్తే అప్పుడొస్తా. అందాకా యీడే కూకుంటా..." కళ్లు తుడుచుకుంటూ అన్నాడు.
    "నాకాడ డబ్బులున్నాయి. నే యిస్తా ఫీజు కట్టేయ్... తరువాత నాకిద్దువుగాని..."
    "నీకాడ అంతుందా? ఎక్కడివిరా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఉన్నాయిలే, ముందు నడు, సెపుతా పద, స్కూల్ కి లేటవుతుంది. నడు మరి..."
    సత్తిబాబు మొహం వికసించింది. సంతోషంగా ముందుకు నడిచాడు. "వెంకటేసు, ఏట్రా యీ మధ్య నీ దగ్గర బలేగా డబ్బులగపడతన్నయి. ఎక్కడివిరా అన్ని డబ్బులు? మీ అమ్మా, మా అమ్మలాగే నలుగిళ్లు పనిసేస్తది. మీ అయ్యా యింటికి కర్సుకి డబ్బులీయకుండా తాగుతాడని మీ అమ్మా మా అమ్మ సెప్పుకుంటరు. మరి నీకెక్కడివిరా డబ్బులు?" వెంకటేసు గర్వంగా కళ్లెగరేశాడు.
    "అరేయ్, తెలివుండాలిరా... డబ్బులు సంపాదించాలంటే... నేను సదూకుంటూనే ఓ పని వప్పుకుని సేస్తన్న. ఆళ్లు పనిచేసినందుకు డబ్బులిస్తన్నరు."
    సత్తిపండు ఆశగా చూశాడు. "అరేయ్, నాకూ ఆ పని యిప్పించరా, సేస్తాను, అమ్మ తెచ్చేది తిండికే సరిపోవడం లేదు. కాస్త నేనూ నీలా సంపాదిస్తే అమ్మకి కష్టం తగ్గుతుందిరా."
    "అయ్ పో... నీవు సేయలేవు ఆ పని. పిరికిగొడ్డువి నీవు. ధైర్యం వుండాలి. తెలివుండాలి. అందరూ సేయలేరురా ఆ పని...!"
    "ప్లీజ్ వరేయ్... ఎంత కట్టమైనదన్నా సేస్తా, స్కూల్ కాడినించి వచ్చి ఎంతసేపన్నా సేస్తాను."
    "వద్దురా బాబు... ఇది రగస్యం... ఎవరికి తెలిసి చేసే పని కాదు. ఆళ్లు నన్ను సంపుతారు సెపితే. వదిలెయ్... ఇదిగో ముందు పరీక్ష ఫీజు కట్టేసిరా. జేబులోంచి డబ్బు తీసిచ్చాడు. వాడి చేతికి కొత్తగా రిస్ట్ వాచి మెరిసింది.
    "ఇదెక్కడిదిరా? కొత్తదా, కొన్నవా?" మురిపెంగా చూస్తూ అన్నాడు సత్తిపండు. "నీకేటిరా! కొత్తబట్ట, కొత్తవాచి, వరేయ్, అ పని నాకు యిప్పించరా" మరోసారి ఆశగా అడిగాడు సత్తిబాబు.
    "వరేయ్, చూడు ముందు ఆళ్లతో మాట్లాడి సూస్తా... ఆళ్లు సరే అంటే అపుడు తీసుకెడతా. సూడు, ఇది ఎవరితో, మీ అమ్మతో కూడా సెప్పకూడదు. సెప్పావో అంతే సంగతులు. నోరిప్పావో సంపుతా, నేను ఆళ్లని అడిగి సెపుతా తెల్సిందా?" ఆరాటంగా తల ఊపాడు సత్తిపండు.

                                                   *  *  *

    "సత్తిగా, ఇప్పుడు నేను ఒక చోటకి తీసుకెళతా... ఆళ్లు అడిగినదానికి సమాధానం చెప్పు. అంతే ఒక్క మాట వద్దు."
    మర్నాడు యిద్దరూ కల్సి స్కూల్ కి ఓ ఫర్లాంగు దూరంలో ఉండే పాన్ షాపుకి వెళ్లారు. వెంకటేశు తనకి, సత్తిబాబుకి రెండు కూల్ డ్రింకులు తీసుకున్నాడు. తాగుతూ పాన్ షాపు అతనితో "అంకుల్, నే చెప్పిన సత్తిబాబు ఇతడే..."
    అతను సత్తిబాబు వంక చూసీ చూడనట్టు కిళ్లీలు కడ్తూనే "చెప్పింది సరిగా చేస్తాడా... అంతా వివరంగా చెప్పావా? నోరిప్పకూడదని పనిచేసేటప్పుడు జాగ్రత్తలు చెప్పావా మరి!
    "అన్నీ చెప్పా, మళ్లీ చెపుతా" వెంకటేశు అభయం ఇచ్చాడు.
    కొట్టువాడు తలాడించి "సరే, కూల్ డ్రింకుల డబ్బులీయి."
    వెంకటేశు డబ్బులు యిచ్చి "పద పోదాం" అని సత్తిబాబు భుజం చుట్టూ చెయ్యి వేశాడు. స్కూల్ ప్లేగ్రౌండ్ లో కూర్చున్నాక "ఏట్రా... నేనేం పనిసెయ్యాల, జీతం ఎంతో ఏటి మాట్లాడలేదు" ఆరాటంగా అడిగాడు.
    "ఇది నెలజీతం పని కాదు. ఏ రోజు పని చెప్తారో పని అవగానే డబ్బులిస్తారు. అంతే లెక్క!"
    "ఏ పని సెప్పనే లేదు?"
    "నే చెపుత సరిగా యినుకో - నీవు స్కూలుకెళ్లేటపుడో, వచ్చేటపుడో... తోవలో ఎవడో వచ్చి నీకో ప్యాకెట్టిస్తాడు."
    "ప్యాకెట్టా... ఏం ప్యాకెట్టు?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS