వేణుగోపాలస్వామి గుడిలో గంటలు మోగాయి. భక్తులు కొందరు హారతి కోసం నిల్చున్నారు.
జమీందారు కాలంలో వేణుగోపాలస్వామి ఆలయం కళకళ్లాడేది. చీని చీనాంబరాలతో, నిలువెత్తు మాలలతో, ధూపదీపాలతో రోజూ అర్చన జరిగేది. దద్దోజనం, చక్రపొంగలి, పులిహోర, రోజుకొకటి చొప్పున భోగం జరిగేది. పర్వదినాలలో ప్రత్యేక అలంకారాలు, పురాణ పఠనం జరిగేది.
జమీందారుగారితోపాటు వేణుగోపాలస్వామి వైభవం అంతరించింది. ఆలయం గోడలు బీటలు వేశాయి. బీటలలో పిచ్చిమొక్కలు మొలిచాయి. సున్నానికి నోచుకోక గోడలు నాచుపట్టాయి. నేల పెచ్చులు వూడింది. వేణుగోపాలస్వామి విగ్రహం వన్నె తగ్గింది. ఏనాటి చీని చీనాంబరాలో వెలిసి వాలికలు పీలికలు అయ్యాయి. దీపస్తంభాలలో నూనె ఇకూడా కరవయి ఒకే ఒక వత్తి వేసి దీపం వెలిగిస్తాడు మాధవయ్య. ఆనాటి ఆ భాగ్యం, భోగం అంతరించి బీదవాడిలా నిలిచాడు వేణుగోపాలస్వామి.
ఆనాటి వైభవానికి గుర్తుగా ఆలయంలో వెండి హారతిపళ్లెం, వెండి శఠగోపం మాత్రం నిలిచాయి. చుట్టూ నగిషీలు చెక్కిన హారతిపళ్లెం, వెండి శఠగోపం రెండొందల తులాల హారతిపళ్లెం... ఆ హారతిపళ్లెం పట్టుకున్న మాధవయ్య చెయ్యి వణుకుతూంది. ఈ రౌ అసలు గుడి తలుపులు తెరిచి లోపలికి అడుగుపెట్టిం దగ్గరనించి మాధవయ్య కాళ్లల్లో వణుకు పుట్టింది. పూజ చేస్తూ, మంత్రాలు చదువుతూ ఎన్నడూ లేంది తడబడి తప్పులు చదివాడు. చేతుల్లో బలం హరించిపోయినట్టు హారతి యిస్తూ గంట కొడుతూంటే చెయ్యి వణికింది. ప్రతి పనిలో ఆలస్యం, హారతి కోసం బయట నిల్చున్న జనాన్ని చూసి ఆయన కంగారు మరింత ఎక్కువయి వంటినిండా చెమటలు పట్టాయి. గుండె దడదడలాడింది.
"పంతులుగారూ, ఏమిటింత ఆలస్యం?" ఎవరో కేకపెట్టారు.
"వస్తున్నా" అంటూ వణుకుతున్న చేతుల్తో హారతి పళ్లెం, శఠగోపం, తీర్థం తెచ్చి అందరికీ హారతి యిచ్చి శఠగోపం పెట్టి తీర్థం యిచ్చాడు మాధవయ్య.
కళ తప్పిన ఆయన మొహం చూసి "ఏం బాబూ, ఆరోగ్యం సరిలేదా?" ఎవరో కుశల ప్రశ్న వేశారు.
మాధవయ్య తడబడ్డాడు. "తమకు తెలియందేం వుంది బాబూ, సంసార బాధలు" పేలవంగా నవ్వాడు ఆయన. అందరూ వెళ్లాక హారతిపళ్లెంలో పోగయిన అరవయి పైసలు రొంటిని దోపుకున్నాడు. గుడి తలుపులు మూయబోయేముందు చటుక్కున పైమీద గావంచా తీసి హారతిపళ్లెం అందులో చుట్టబెట్టాడు. వేణుగోపాలస్వామి వైపు తిరిగి లెంపలు వేసుకుని 'నాకింతకంటే దారి ఏదీ లేదన్నది నీకు తెలియనిది కాదు వేణుగోపాలా! మన్నించు తండ్రీ!' అంటూ గద్గద స్వరంతో ప్రణమిల్లి, చకచక తలుపు తాళం పెట్టి యింటివైపు వెళ్లాడు.
పెళ్లాం, కూతురు చూడకుండా అలమారులో పాత పంచాంగాల కింద హారతి పళ్లెం దాచాడు. ఉన్న ఊర్లో అమ్మితే గుళ్లో హారతిపళ్లెం అందరికీ గుర్తే. సాయంత్రం ప్రక్క వూరికి తీసికెళ్లి అమ్మాలి. తెల్లారి చీకట్నే గుడి తలుపులు తీసి వుంచి ఏ దొంగో జొరపడి హారతి పళ్లెం దొంగిలించాడని గొడవ చెయ్యాలి. ఆయనకంతకంటే గత్యంతరం లేదు. దేముడ్ని క్షమించమంటూ మనసులో లెంపలు వేసుకుని వెయ్యి దండాలు పెట్టుకున్నాడు. అయినా మనసులో పాపభీతి తగ్గలేదు. తిండి సయించలేదు.
"ఏం నాన్నా! అలా వున్నారు? వంట్లో బాగోలేదా?" కూతురు సానుభూతిగా చూస్తూ అడిగింది.
"ఏం లేదమ్మా!" తడబడ్డాడు మాధవయ్య.
"అందరికీ రోగమే, అడ్డెడు గిన్నెకేం రోగం లేదు" యీసడించింది తాయారమ్మ.
"అమ్మా! ఆ తినే రెండు ముద్దలన్నా తిననియ్యి ఆయన్ని కాస్త ప్రశాంతంగా" కూతురు తిరస్కారంగా తల్లిని చూస్తూ అంది.
"అవునే తల్లీ! నేనే గయ్యాళిని, రాక్షసిని, నా నోరే కనిపిస్తుంది. తండ్రీ కూతుర్లొక్కటే. నేనే పైదాన్ని, అమ్మశక్తిని."
"అనవే అను - అను. నీ నోటికి అడ్డూ అదుపూ వుందా? నీ నోటికి తాళం లేకా... యీనాడు... యీ పనికి తలపడ్డా..." ఆయనేం మాట్లాడుతున్నదీ అర్థం కాగానే ఆవేశం చప్పున చల్లార్చుకుని చటుక్కున నోరు మూసుకుని అన్నం తినసాగాడు.
* * *
చిన్న కునుకు తీసి, లేచి కాస్త పొద్దు వాలాక వున్న ఒక చిరుగుల లాల్చీ తొడుక్కుని చేతిసంచిలో హారతిపళ్లెం పెట్టడానికి అలమారు తీసి పాత పంచాంగాల కింద చెయ్యి పెట్టాడు మాధవయ్య. అంతే! గుండె గుభీల్మంది. పళ్లెం లేదు. ఆరాటంగా చకచకా పుస్తకాలన్నీ వెతికి చూశాడు. లేదు. పెట్టిన పళ్లెం యింతకీ ఎలా మాయమయింది? ఈలోగా ఏ దొంగ వచ్చాడు? ఎవర్ని అడగడం? చేసిన దొంగతనం బయటపడదూ? అడగకుండా ఎలా వూరుకోటం? ఆయన గుండెల్లో దడ బయలుదేరింది.
"కామాక్షీ!" ఆయనకి తెలియకుండానే అరిచాడు.
కామాక్షి రాలేదు - కాని తాయారమ్మ కంయ్ మంది. "పాడుకొంప! కాసేపు నడుం వాలుద్దామన్నా లేదు. ఎందుకలా రంకెలు పెడతారు? ఏం కావాలి?" నిద్ర మధ్యలో విసుక్కుంది.
"కామాక్షేది?" నెమ్మదిగా అడిగాడు.
"ఏదో పత్రికలు తెచ్చుకొస్తానని జానకి దగ్గిరకెళ్లింది."
