Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 35

 

    "మరేం చేశారు?' నవ్వుతూ ఆత్రుతగా అడిగాడు వాసు.
    "వాసంతి లేదూ? మన ఎదురింటివారమ్మాయి...."
    "వాళ్ళు ఒప్పుకున్నారా?'
    "మామయ్య స్నేహితుదేగా ఆ అమ్మాయి తండ్రి. ప్చ్! ఫరవాలేదు. ఓసారి వాసంతి ని చూపిద్దాం . గప్ చిప్ గా ఉండన్నాట్ట."
    పకపకా నవ్వాడు వాసు. తానూ నవ్వేస్తూ , "తరవాత మా అమ్మాయి నచ్చుకోలేదని కబురు చేశాడు. సిగ్గుచేటు. ఏమిటో పిల్ల పేరు పడిపోయింది. గోపాల్రావు గారమ్మాయి పెళ్ళి కొడుకుల్ని ఎంచుతుందని. ఈ సంబంధం అది నచ్చినా, నచ్చకపోయినా చేసేస్తాడట మామయ్య" అంది మధుమతి.
    "నచ్చకపోయినా చేసేస్తాడా? అదేమిటమ్మా!" తెల్లబోయి చూశాడు వాసు.
    "దాని వాలకం చూస్తె అదేవరికో మనసిచ్చినట్టుంది."
    "అయితే కనుక్కో, అమ్మా, నువ్వన్నా, అంతేకాని బలవంతం చేస్తే మరేమైనా ప్రమాదానికి దారి తియ్యచ్చు." కంపన స్వరంతో అన్నాడు వాసు.
    "సరిలే. దాని తల్లితండ్రులు చూసుకుంటారు. పెద్ద మామయ్య ఉత్తరం వ్రాశాడు." అంటూ అతని చేతి కో కవరిచ్చింది మధుమతి.
    ఉత్తరం చదివిన వాసు చిన్నగా నవ్వుకుంటూ, "ఏం, ఆ సంబంధం ఫెయిలయిందా?' అన్నాడు.
    "అనుకుంటాం. ఎవరి కెవరికి ఘటనో!" ఆశగా కొడుకు మొహంలోకి చూసింది మధుమతి.
    "స్కూలు ఫైనలు పాసై పై చదువు కి ఆస్కారం అవకాశం కనుపించక అల్లాడిపోయే తనని హాస్యం చేసిన రాజశేఖరం ఈవేళ తాను ఐ.ఎ.ఎస్ అఫీసరవగానే కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాడా? వాళ్ళ పంచన అమ్మ అన్నానికి వాచి పోయిందే! తన కూతురు రాజభోగాలనుభావించాలా! ఎంత స్వార్ధం! ఛీ, ఛీ! ఏం మనుషులు?' అమ్మాయికీ ఇష్టమేనట." అడుగడుగునా స్మరిస్తూ, నాటకాలూ, పాటలూ , అన్నీ మరిచి, 'జయ నన్ను చేసుకుంటానందా! వీళ్ళు కోరేది నన్నా! నా హోదానా!....' నిరసనగా నవ్వేస్తూ మధుమతికి ఇచ్చేశాడా ఉత్తరం.
    "జవాబెం వ్రాయమన్నావు?' ఆత్రత ఆ గొంతులో .
    "ఇప్పట్లో వాసుకి పెళ్ళి చెయ్యను. మరొక సంబంధం చూసుకోమని వ్రాయి."
    "వాసూ!"
    "అంతేనమ్మా!" అతని గొంతు కఠినంగా ఉంది. మొహం కందింది ఎర్రగా.
    మళ్ళీ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి.
    "మాట్లాడాలి, రమ్మన్నావు. సరేనా?' లేవబోతూ అంది మధుమతి.
    ఆమెకు కోపం వచ్చిందని గ్రహించిన వాసు పెదవుల పైకి చిరునవ్వు తెచ్చుకుంటూ , "కూర్చో, అమ్మా" అన్నాడు.
    "నిద్రపో, ఉదయాన్నే వెళతానంటున్నావు.... అత్తయ్య ఉండమంటుంది." అంది మళ్ళీ కూర్చుంటూ మధుమతి.
    "నేను ఉంటాలే. మామయ్య చెప్పాడు. కాని, అమ్మా!" అంటూ ఆగాడు వాసు.
    ప్రశ్నార్ధకంగా చూసింది మధుమతి.
    "నేనొక మాట అడుగుతాను. నువ్వు మనస్సు విప్పి నాతొ నీ నిశ్చయం చెపుతావా, అమ్మా!" చిన్నగా గొంతు కంపిస్తుంటే అడిగాడు వాసు.
    "ఏమిటో అడుగు, బాబూ!" ఆమె వదనం సంతోషంగా ఉంది. "ఏమడుగుతాడు? ఎవర్నో ప్రేమించాను, పెళ్ళి చెయ్యమంటాడు. అంతకన్నా ఏముంది?" అనుకున్న మధుమతి. "అడుగు బాబూ! నిర్భాగ్యురాలు మీ అమ్మ. మనస్సు విప్పి నీతో మాట్లాడలేదా! ఏమి ఇవ్వకపోయినా పోయే!" అని రెట్టించింది.
    "ఆహా కాదు. నాకు కావలసిన సమాధానం వస్తుందో, రాదో! రేపు మామయ్యని కూడా సంప్రతించి...."
    "నీకు కావలసిన సమాధానమే చెపుతాను. నిన్ను సంతోషపెట్టడం కన్నా నాకేం కావాలి? అడుగు, బాబూ!' ఆమె గొంతు బొంగురు పోయింది.
    "నాకు ఇష్టమైన జవాబు వస్తుంది కదూ?"
    "అబ్బ! అడుగు, బాబూ!"
    "అమ్మా!.... నాన్నగారు నిన్ను అయన దగ్గరకు రమ్మని పిలిస్తే వెళ్ళడానికి నీకేమీ అభ్యంతరం లేదు కదూ?"
    తాను ఊహించని ప్రశ్న. తానే నాడూ అనుకోని ప్రశ్న. ఖంగరాయి పోయింది. ఆమె గుండె వేగం హెచ్చింది. తనువూ కంపిస్తుంది. మనస్సు మూగ బోయింది. ఆలోచనలు స్తంభించి పోయాయి. నీర్జీవ ప్రతిమలా కన్నార్పకుండా తన వైపే చూస్తున్న మధుమతి భుజాలు పట్టి కుదుపుతూ, "నాకు తెలుసమ్మా! నువ్వు సమ్మతించవు. అమ్మా, నాన్నా కలిసి బ్రతకడం నేను చూడను. నేను దరిద్రుడమ్మా! దరిద్రుడ్నీ!" అని పిడికిలితో నుదుటి పై కొట్టుకున్నాడు వాసు.
    కన్నీళ్ళు స్రవిస్తుంటే , అతన్ని లాలింపుగా దగ్గరకు తీసుకుంటూ, "బాబూ! నాన్న ఎలా ఉంటారో తెలియని నువ్వు ఇలా ప్రశ్నిస్తే నన్ను వెంటనే సమాధానం ఏం చెప్పమన్నావ్?' అంది మధుమతి.
    "ఒహవేళ.....అలా జరిగితే? నాన్న పిలిస్తే?...."
    తల అడ్డంగా ఊపి, కళ్ళు తుడుచుకుని, "మీ నాన్న పౌరుషమున్న మగవారు. నేను అహంభావినైనా ఆడదాన్ని. ముక్కలై పోయాయి మా బ్రతుకులు" అంది మధుమతి.
    "లేదమ్మా!' సహించలేనట్టు అన్నాడు వాసు.
    "ఏమిటి లేదు! చాలా నొప్పించాను, బాబూ! నేనంటే మీ నాన్న అసహ్యించుకున్నారు..... నిజంగా అలా జరిగితే అంతకన్నా అదృష్ట మేముంది? బిచ్చగాడవనీ, బికారవనీ, ఆయన్ననుసరిస్తాను. అందరం కలిసి బ్రతుకుదాం. సరా!"
    "బిచ్చగాడూ, బికారీ కాదమ్మా నాన్న'!" అతని గొంతు సంతోషంగా రుద్దమయింది.
    "పిచ్చి బాబు! ఏనాటి నాన్న! ఎక్కడి నాన్న! ఈనాడు ఆయనకి ఎందరికి తండ్రో?"
    "కాదమ్మా!"
    "ఏమిటి నీ మొహం! పాతిక సంవత్సరాలై నిన్నూ నన్నూ వదిలిన నాన్న ఇప్పుడు వచ్చి నన్ను పిలుస్తారా ? ప్చ్!"  అంటూ అతని తల నిమిరి , "పడుకో. పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. మనకన్నా దురదృష్ట వంతులు లోకంలో కొల్లలుగా ఉన్నారు.' అంటూ చెమర్చిన కళ్ళూ, చెమట పట్టిన ముఖమూ తుడుచుకుంది మధుమతి.
    "నాకు చాలా సంతోషంగా ఉందమ్మా! నిన్నెలా అభినందించాలో , ఎలా నీకు మ్రొక్కాలో!"
    "నీ మొహం లే!' వేదాంతి లా నవ్వి వెళ్ళిపోయింది మధుమతి.
    ఆమెను వెనక్కి పిలిచి, అన్నీ చెప్పెయ్యాలని ఉరకలు వేస్తున్న మనస్సు నిగ్రహించుకుని , తృప్తిగా హాయిగా నిద్ర పోయాడు వాసు. అతని పెదవులపై సన్నని హాస రేఖ విరిసింది.

                        
    "ఏమండోయ్, కలెక్టర్ గారూ! ఎనిమిదయింది. ఇంకా కలలు కంటూ నవ్వుకుంటున్నారు, ఏమిటబ్బా! అంత కమ్మని కలలూ!" చర్రున వాసు కప్పుకున్న దుప్పటి లాగేసింది పద్మజ.
    బద్దకంగా ఒళ్ళు విరిచి లేచి కూర్చుంటూ, "ఈ వేళ పెళ్ళి వారిస్తున్నారు కదా! తెల్లవార్లూ కమ్మని కలలే మరి. నా పెళ్ళి చూపులుగా ఈ వేళ!' అని హాస్యంగా నవ్వుతూ అన్నాడు వాసు.
    'అయ్యాయిగా చూపులు! మీరు నాకు నచ్చారు. మీ అభిప్రాయం మధ్యవర్తి ద్వారా కబురు చెయ్యండి" బ్రష్ మీద పేస్టూ వేసి ఇస్తూ అల్లరిగా నవ్వింది పద్మజ.
    "నాకు నచ్చలేదని ఎలా చెప్పడం , పద్మజా! మనలో మన మాట. అనుభవమున్నదానివి, నాకు ఇష్టం లేదని ఎలా చెప్పాలి?" కొంటెగా ఆమె వైపు చూస్తూ అడిగాడు వాసు.
    "నేనైతే నాకాబ్బాయి నచ్చలేదు. అ సంబంధం నేను చేసుకోను అని ఖచ్చితంగా చెబుతాను. మరి కలెక్టర్లేలా చేపుతారబ్బా!' చెక్కిట చెయ్యి చేర్చి, నడుం పైకి ఒక చేయ్యాన్చి గొల్లభామలా ఒయ్యారంగా నిలుచుని కనురెప్ప లల్లారుస్తూ అంది పద్మజ.
    "కోనసీమ కొబ్బరి చెట్లు చూడడానికి పోతారు" నవ్వేస్తూ లేచి నిలుచున్నాడు వాసు.
    "అత్తయ్య చెప్పిందా!" బుంగమూతి పెట్టింది పద్మజ.
    'అబ్బే!' ఆ వేళ వచ్చిన అబ్బాయి నా ఫ్రెండే!"
    "ఛ! అన్నీ అబద్దాలు!" గలగలా నవ్వి, "నన్ను ఒకటే వేపుకు తింటుంటే మరేం చెయ్యాలి!" అంది పద్మజ.
    "వాళ్ళనలా వేపుకు తినకపోతే అసలు నీ ఉద్దేశం చెప్పరాదూ?' అన్నాడు నవ్వుతూ వాసు.
    "ఎలా చెప్పాలి? ఏమని చెప్పాలి?" గొణిగినట్టు అంది పద్మజ.
    చూపులకి పెళ్ళివారు వస్తున్నారంటే మామ్మూలుగా ఒకటే హడావుడి. మధుమతీ, లక్ష్మీ తీరిక లేదన్నట్లు తిరుగుతున్నారు.
    "నువ్వింకా ఇలానే ఉన్నావెం? వాళ్ళు వచ్చేశారు.' ఆశ్చర్యంగా పద్మజ వైపు చూస్తూ అన్నాడు వాసు.
    రేగిన తల, వెలిసిన చీర, కిటికీ ఊచల్లోంచి శూన్యంలోకి చూస్తూ నిలుచున్నా పద్మజ వెనుదిరిగి నిరసనగా నవ్వుతూ , "రానీ, వచ్చిన వాళ్ళు... వాళ్ళ కెదురుగా నన్ను నిలుచో మంటారు. వారి కోసం అలంకరించుకో మంటారు. కాని పెంచినందుకు వారి అధికారం ఇలా వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్పిన మాట వినిపించుకోరు." అంది. ఆమె గొంతు రుద్దమయింది.
    "ఏమిటి చెప్పావ్?"
    "సంబంధాలు చూడవద్దని."
    "హాయిగా చదువుకో!"
    "మరి చదవాలని లేదు."
    "అయితే ఏదన్నా ఉద్యోగం చెయ్యి."
    తల అడ్డంగా ఊపింది.
    "సరే, బుద్దిగా ఏదో సంబంధం ఒప్పేసుకో. అలా వయసొచ్చిన పిల్ల ఇరవై నాలుగు గంటలూ కళ్ళెదుర తిరుగుతూ ఉంటె వాళ్ళు సంబంధాలు చూడక మానరు."
    "నేను వద్దనక మానను."
    "బాగుంది...." నవ్వాడు వాసు ఆమె మొండి జవాబులకు.
    ఇంతలో మధుమతి వచ్చి మృదువుగా మందలించి జడ అల్లి చీర మార్పించింది.
    అందరితో పాటు తానూ హాల్లోకి వచ్చి కూర్చున్నాడు వాసు.
    "మేనల్లుడు , ఐ.ఎ.ఎస్ . ఫలానా చోట పోస్టు ఇచ్చినట్టు ఆర్డర్స్ వచ్చాయి వెళ్ళిపోతాడు." అంటూ వాసుని పరిచయం చేశాడు ఆ వచ్చిన పెళ్ళి వారికి గోపాల్రావు.
    "ఇతని కెందు కివ్వరాదూ?" అనే ప్రశ్న తోచిన ఓ పెద్దమనిషి , "మీ అన్నయ్య గారికి కూడా ఓ అమ్మాయి ఉందాండి?" అంటూ ప్రశ్నించాడు. నవ్వుతూ ఉందన్నట్టు తల ఊపాడు గోపాల్రావు.
    ఎవ్వరి వైపూ కన్నెత్తి చూడని పద్మజ వైపు ఒకటి రెండు సార్లు చూశాడు వాసు. "వాళ్ళు వెళ్ళిన వెంటనే తనకి తానే "నచ్చలేదు నాకా అబ్బాయి" అని తల్లితో చెప్పి తన గదికి వెళ్ళిపోతున్న పద్మజ వెనకే వెళ్ళిన వాసు " నే నొకటి అడుగుతాను, నిజం చెబుతావా. పద్మజా?' అని అడిగాడు నెమ్మదిగా.
    "ఏమిటది?" చిరునవ్వుతో అతని వైపు చూసింది.
    "అసలు నువ్వతన్ని చూశావా?'
    "లేదు."
    "మరలా ఎందుకు చెప్పావ్?"
    "అంతే!"
    "అంటే?' అర్ధం కానట్టు నవ్వుతూ అన్నాడు వాసు.
    "అత్తయ్య కు నువ్వేం సమాధానం చెప్పావు?"
    "ఏమిటి? ఏమిటడిగింది అత్తయ్య నన్ను? అంటే మా అమ్మ!" కంగారు పడిపోయాడు వాసు.
    "ఏమీ తెలియనట్లు మాట్లాడకు. నువ్వు బలే గడుసు వాడివి. నీ...."
    "ఏమిటి పద్మజా? చిరాగ్గా అన్నాడు వాసు.
    "నీ పెళ్ళెప్పుడు?'
    "నాకేం తెలుసు?"
    "తెలుసు.... కానిచేప్పవు. అత్తయ్య నిన్న రాత్రి నీ గదికి వచ్చింది. పెద్దనాన్నగారు వ్రాసిన ఉత్తరం నీకు చూపించింది. జయను నువ్వు ప్రేమిస్తున్నావు కదూ?"
    "ప్రేమించడమంటే? మన కుటుంబ సభ్యులనందర్నీ ప్రేమిస్తున్నాను."
    "తప్పించుకో చూడకు. జయ అంటే ప్రత్యెకమైన ఇష్టం . అది చాలా బాగా పాడుతుంది. ఆమె పాట చాలాసార్లు నా దగ్గిర మెచ్చుకున్నావ్.... అందుకు ఒప్పుకునే ఉంటావ్!"
    "బాగా పాడినంత మాత్రాన మనస్సు పారేసుకుంటానా? పాట మెచ్చుకున్నంత మాత్రాన ఆమెను పెళ్ళి చేసేసు కుంటాననుకున్నావ్?' నవ్వాడు పసిపిల్ల మాటలకు నవ్వినట్టు.
    "ఆమె అందంగా ఉంటుందని కూడా అన్నావ్?"
    "అందమయినదయినంత మాత్రాన పెళ్ళి చేసేసుకుంటారా?"
    చిత్రంగా అతని వైపు చూస్తూ, "అందం, పాటా ఇవేవీ అక్కర్లేకుండా మరేమిటి కనిపిస్తాయ్? మనస్సు లోని భావాలా! అవి చదువుతారా? పెళ్ళి చూపులు జరిగే పది నిమిషాల్లో."
    "కాదు, పద్మజా, కాదు. నాకెలా చెప్పాలో-- ఆ భాష తెలియడం లేదు. భార్యాభర్తలు కావాలంటే "అందం, చదువూ సంప్రదాయం ఇవాన్నీ మన పెద్దలూ మనమూ బాహాటంగా అనుకునేవి. కాని పరస్పరాకర్షణ కావాలి. ఇప్పటివరకూ ఏ స్త్రీ కూడా నా దృష్టి నాకర్షించలేదు. జయపాట మెచ్చుకుంటాను. ఆ మధ్య మా ఫ్రెండు తో కలిసి విందు కి వెళ్ళాను. ఒకసారి చూస్తె పదిసార్లు చూడాలనిపించే అందమయిన అమ్మాయిని చూశాను. కాని నా మనస్సేమీ చలించలేదు. అసలా చలించడమంటే ఏమిటో నాకు తెలియదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS