Previous Page Next Page 
గీతోపదేశం కథలు పేజి 35


                                              హారతి పళ్లెం

    రెండు రోజుల ముసురు తరువాత ఊర్లో సూర్యుడుదయించాడు. తెల్లారి సూర్యుడ్ని చూడగానే జనం సంతోషించారు. సంతోషించనిదెవరన్నా వుంటే పూజారి మాధవయ్య ఒక్కడే. తెల్లారకుండా వుంటే! సూర్యుడుదయించకుండా వుంటే! ఆ ముసురు ప్రళయంగా మారి యీ వూరు వాడా, యీ జగత్తుని ముంచెత్తేస్తే... ఏ బాధా వుండదు. డబ్బు సంపాదించాలి, దినుసులు కొనాలి, వండాలి, కడుపు నింపుకోవాలి, మానం కప్పుకోవాలి, పెళ్లాడాలి, పిల్లల్ని కనాలి, వాళ్లకి చదువు సంధ్యలు చెప్పించాలి, పెళ్లిళ్లు చెయ్యాలి, కట్నాలు పొయ్యాలి, అల్లుళ్లని గౌరవించాలి, పురుళ్లు పోయాలి, బారసాలలు చెయ్యాలి, ఏదీ వదలకుండా సంప్రదాయం ప్రకారం ముద్దుముచ్చట్లు జరిపించాలి. వీటన్నింటికీ డబ్బుండాలి. ఆ డబ్బు లేకపోతే ఆ పాట్లు, యీ బాధలు ఏవీ లేకుండా తెల్లారకపోతే, యీ ముసురు తగ్గకపోతే, వరదలు వచ్చి యీ వూరు వాడ ముంచెత్తితే తనకే సమస్యలు మిగలవు. మంచం మీద ముసుగులోంచి బయట పడకుండా ఆ ముసుగులోనే ఊపిరి ఆగిపోతే ఎంత బాగుండుననిపించిందాయనకి.
    "ఈ దిక్కుమాలిన సంసారం చెయ్యడం నా వల్ల కాదు మహాప్రభో! పొయ్యిలోకి కర్రలు లేవు. పొయ్యిమీదకి గింజలు లేవు. కర్రలు లేవు, బొగ్గులయిపోయాయని మొన్నననగా చెప్పాను. తెల్లారేసరికి గొంతులో కాఫీలు దిగాలి. పంచదార నిండుకుంది. ఆ పాలదాని ధర్మమా అని మానకుండా ఏ నీళ్లో పోస్తూంది. ఈ పూటకి రెండు చెంచాలు కాఫీపొడి పిన్నిగారింటినించి తెచ్చాను. బెల్లం ముక్క మరో యింట్లో ముష్టి. దిక్కుమాలిన ముష్టిబతుకు అయిపోయింది. ఈ సంసారం ఎప్పటికి తెల్లారుతుందో, దిక్కుమాలిన తడి కర్రలు ఊదలేక ప్రాణం కొడిగడ్తూంది. వాగివాగి చస్తుంది, అదే వూరుకుంటుంది అని నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. అయ్యో! ఇల్లాలే... ఎంతని కష్టపడ్తుంది? ఎంతకని అప్పులు తెస్తుంది? ఈ సంసారం దానిదొక్కరిదేనా అన్న జ్ఞానం వున్న మనిషయితే అలా దిమ్మ చెక్కలా కూర్చుంటారా? పెళ్లాం బిడ్డల్ని పోషించలేని వాజమ్మలకి పెళ్ళెందుకు? పిల్లలెందుకు? ఛీ... మనిషి జన్మ ఎత్తినందుకు పౌరుషం వుండాలి... ఇంతకీ నా ఖర్మ! ఎవరిననీ ఏం లాభం?"
    తాయారమ్మ యీ స్తోత్రం మాధవయ్యకి సుప్రభాతంలా రోజూ వినిపించేదే కనక ఆయన చలించలేదు. కాఫీ వాసన తగలగానే కుక్కిమంచంలోంచి లేచి చూరులోంచి పందుంపుల్ల లాగి నమలడం ఆరంభించాడు. అన్ని మాటలంటున్నా చీమ కుట్టినట్లయినా లేకుండా సావకాశంగా పళ్లు తోముకుంటున్న మొగుడ్ని చూసేసరికి తాయారమ్మకి తిక్క రేగింది.
    "తిండికి తిమ్మరాజు - పనికి పోతరాజు. నాలుగు రాళ్లు సంపాదించడం చేతకాదు కాని వేళ వేళలకి కాఫీలకి, భోజనాలకి తయారు. పెళ్లాం అప్పడాలు వత్తి, వడియాలు పెట్టి, నీళ్లబిందెలు మోసి, పిళ్లు విసిరి మేపుతూంటే తినడానికి సిగ్గెలా లేదో... వరేయ్ వాసు! వెధవా! లేరా. వసే కామాక్షీ! లేవవే. బారెడు పొద్దెక్కినా మంచం దిగవు. ఆడదానివి కావుటే, నీ బుద్ధి తగలడ్డట్టే, ఆ కాపురం అలా తగలడింది. అయ్యకి తగ్గ కూతురివి.కన్నకూతురు కాపురం చక్కదిద్దాలన్న యావ తండ్రికి లేదు. అయ్యని నిలబెట్టి ఆ డబ్బు తెప్పించి కాపురానికి పోవాలన్న ఆరాటం కూతురికి లేదు. అంతా ఒక్కలాంటి సంతే! ఈ పాడు సంసారం యీదడం నా వల్ల కాదింక. నల్గురిలో తలెత్తుకోలేక చచ్చిపోతున్నాను. అమ్మాయెందుకు కాపురానికి వెళ్లదు అని అందరూ ఆరా తీసేవారే! నా కూతురెందుకు కాపురానికి వెళ్లలేదో వూర్లోవాళ్లకే కావాలి. ఈ అడిగే వెధవలందరూ తలో పది యిచ్చి సాయం చెయ్యరాదూ? హుఁ నా నోరు నొప్పిగాని యీ యింట్లో ఎవరికీ చీమ కుట్టినట్లుందా? రావే తల్లీ! రా. మొహం కడుక్కుని కాఫీ సేవించు. పోయిన మొగుడు పోతే పోయాడన్నట్టు... పీడా వదిలిందని యీవిడగారు ఉద్యోగం వెలగబెడ్తుందిట! కూతురుని కాపురానికి పంపే సత్తా లేని యీ తండ్రిగారి వత్తాసు దానికి. వరేయ్ వాసు గాడిదా! లేవరా, దున్నపోతులా పడుకోడం కాదు, రెండు రోజులు ముసురు అంటూ స్కూలు ఎగగొట్టావు. పుస్తకాల దుమ్ము దులుపు... ఆ తండ్రికి తగ్గ తనయుడివి - పొట్ట కోసినా అక్షరం ముక్కలేదు. అటు వేదం లేదు, యిటు చదువు లేదు. రామ రామ ఏనాడు ఏ పాపం చేసుకున్నానో యీ మొగుడు, పిల్లలు, యింకెన్నాళ్లో యీ పాడుబతుకు. ఆ దేముడు నన్నెందుకు తీసుకుపోడో?"
    తండ్రీ, పిల్లలు ఎవరూ ఆ మాటలు విననట్టే ఎవరి పనులు వాళ్లు చేసుకున్నారు. మాధవయ్యలో ఏనాడో చీము నెత్తురు హరించిపోయాయి. అన్ని తిట్టినా కోపం రాదాయనకి. పాపం తనని కట్టుకుని ఏం సుఖపడింది నిజానికీ! నల్గురు ఆడపిల్లల్ని, యిద్దరు మగపిల్లల్ని ఈ లోకంలోకి తేవడం తప్ప తను ఏం చెయ్యగలిగాడు, ఏం సుఖపెట్టాడు? పేద పురోహితుడింట్లో పుట్టి, పేద పూజారిని కట్టుకుని పిల్లలు, రోగాలు, చాకిరీ తప్ప ఏం సుఖపడింది. ఏదో జమీందారుగారు బతికున్నన్ని రోజులు తిండికి యిబ్బంది పడకుండా రోజులు గడిచిపోయాయి. ఆయనే వేణుగోపాలస్వామి మందిరం కట్టించి పూజారిని చేశాడు. దివాణం నించి ఏడాది గ్రాసం వచ్చేది. పండుగలు, పబ్బాలకి కొత్తబట్టలు పంపేవారు. పర్వదినాలకు పురాణంశ్రవణం చెప్పించి, ఘనంగా సత్కరించేవారు. దేవాలయంలో భక్తుల దక్షిణలుండేవి. రెండు గదుల కొంప కట్టించి రెండెకరాల పొలం రాసిచ్చి బీదబ్రాహ్మణుడి బాధ్యత తీర్చుకున్నాడు. ఆ మహారాజున్న రోజుల్లో భుక్తికి లోటు లేకుండా గడిచిపోయేది. అదిగో ఆయన పోయారు. జమీందారీలు పోయాయి. జమీలు మంట గలిశాయి. వాళ్లకే గతి లేదు. తమని ఆదుకొనేదెవరు? ఆయనుండగా యిద్దరు కూతుర్లకి బాగానే పెళ్లి చేశాడు. ఆ తర్వాతే కష్టాలు ప్రారంభం. మూడో కూతురికి ఎకరం పొలం అమ్మి చేశాకే దరిద్రం పట్టుకుంది. తిండి గింజలకే కరువొచ్చింది. కొడుకు రెక్కలు వచ్చి తనదారి తను వెతుక్కున్నాడు. తను, తన సంసారం, వాడి పాట్లు వాడివి. తండ్రి గోల పట్టదు. పట్టించుకునే శక్తీ లేదు.
    నాలుగో కూతురు ఎదిగి వచ్చింది. ఆదాయం లేదు, అప్పులు ఆరంభం అయ్యాయి. ఆఖరిది అందరిలోకీ చురుకైంది. ఆడపిల్లలకీ నాలుగక్షరం ముక్కలు రావాలి అనుకునే రోజులు వచ్చాయి. ఉచిత వేతనం, ఊర్లో స్కూలుంది. కనక మెట్రిక్ వరకూ చదివించాడు. చూపులకి బాగుంటుంది. అంత మాత్రాన మొగుడు దొరుకుతాడా? ఇరవై మూడేళ్లు దాటిపోతుంటే పెళ్లాం పోరు భరించలేక ఆ కాసిని తిండిగింజలొచ్చే ఎకరం అమ్మి ఇంటిమీద తాకట్టు తెచ్చి పెళ్లి చెయ్యక తప్పలేదు. అప్పటినించే బొత్తిగా తిండికీ మొహం వాచే గతికి దిగజారారు. పోనీ పిల్లయినా సుఖపడిందా అంటే అదీ లేదు. ఇస్తానన్న కట్నానికి ఐదొందలు పెళ్లి వేళకి జతపడక యివ్వలేదని, లాంఛనాలు జరపలేదని, సారె తీసుకురాలేదని - మొగుడో త్రాష్టుడు, అత్త గయ్యాళి, మామ చవట అయి దానికి తిండన్నా పెట్టకుండా రాపాడించారు. డబ్బుతే అని వాతలు పెట్టి హింసిస్తే పారిపోయి పుట్టింటికి వచ్చింది కూతురు. వియ్యంకుడి కాళ్లు పట్టుకున్నాడు. డబ్బు నెమ్మదిగా సర్దుతానన్నాడు. ససేమిరా డబ్బు లేకుండా గుమ్మం తొక్కొద్దని తిట్టిపోశారు. ఆ రోజునించి యీ ఏడాది - ఎంత ప్రయత్నించినా పట్టుమని పది రూపాయలు కూడబెట్టలేకపోయారు. తిండికి గతి లేకపోతే ఐదొందలు కూడబెట్టడం ఎలాగ? ఇల్లు తాకట్టు విడిపించుకోలేదు. మళ్లీ అప్పు ఇమ్మంటే ఇల్లు జప్తు చేసుకు డబ్బిస్తానన్నాడు షావుకారు. తల దాచుకోడానికి ఆ నీడన్నా లేకపోతే తమ గతి ఏమవుతుంది? తను అసమర్థుడు, పెళ్లాం తిట్టిందంటే తప్పులేదు. చావలేని వెధవలకు, పెళ్లాం పిల్లలకు తిండి పెట్టలేని బతుకు - అన్యధా శరణం నాస్తి... కాని... కూతురు కాపురం చక్కపెట్టి, కొడుకు మెట్రిక్ అయ్యాక ఎవడి కాళ్లో పట్టుకుని వాడికేదో తోవ చూపించాక తను తోవ చూసుకోవాలి. కన్నందుకు తన కనీస కర్తవ్యం అది. కూతురు కాపురం చక్కబడాలంటే డబ్బు కావాలి. ఐదొందలు కావాలి. ఎక్కడనించి తేవాలి? ఎవరిస్తారు? ఆయన ప్రశ్న అది. ఆయన ఆరాటం అది. గత కొద్దిరోజులుగా ఆయన తీవ్రంగా ఆలోచించి అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకే యీ రోజు భార్య తిట్లు అంత బాధించలేదు.

                                                *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS