Previous Page Next Page 
విధి విన్యాసాలు పేజి 34

 

    "ఆ వచ్చారండీ. పేపరు చూస్తున్నారు."
    జవాబు విని తేలిగ్గా నిట్టూర్చాడు ప్రసాదరావు.
    రాత్రి తన గదికి వెళుతూ, "ఆర్డర్స్ వచ్చేదాకా అమ్మ దగ్గరే ఉంటాను. మీ ఉద్దేశ్యం లెటరు వ్రాయండి. ఎప్పుడైనా మీ ఇద్దరు కలియడమంటూ ఉంటె.... ఆరోజే ఇంకో ఆలోచన" అన్నాడు వాసు. ఆ గొంతు స్థిరంగా , గంభీరంగా ధ్వనించింది.
    అలా చెబుతున్న వాసు వైపు నవ్వాలో, ఏడవాలో బోధపడదన్నట్టు చూశాడు ప్రసాదరావు.

                           *    *    *    *
    పత్రిక చదువుతున్న పద్మజ , బూటు, చప్పుడు వినరావడం తో వెనుదిరిగి చూసి, సంభ్రమంగా లేచి నిలుచుని, "వాసూ!" అంది.
    "బాగున్నావా? చిక్కినట్టు  కనుపిస్తున్నావ్? ఏం, ఒంట్లో బాగుండలేదా?" అని అడిగాడు చిన్నగా నవ్వి, కుర్చీలో కూర్చుని బూట్లు తాళ్ళు విప్పుకుంటూ.
    "నేనేం చిక్కలే. నువ్వే చిక్కావ్! అత్తయ్యకు తెలుసా, నువ్వోచ్చినట్టు? కాఫీ తెస్తాను, ఉండు." గబగబా వెళ్ళింది.
    అతను బట్టలు మార్చు కున్నంత లో కాఫీ కప్పుతో ప్రవేశించింది పద్మజ.
    ఆమె చేతిలో కాఫీ అందుకుంటూ, ఆమె వైపు చూసిన వాసు --- "నీది మంచి మనస్సు, పద్మజా! నన్ను చూస్తూనే కాస్త చిక్కానని కళ్ళ నిండా నీళ్ళు నింపుకున్నావు. నిజంగా.....ఆహా మ కాదు. నన్ను చూసి జాలిపడవలసిన అవసరం లేదు... ఇక్కడైతే నా పొట్ట వాడకుండా నువ్వూ, అమ్మా చూసేవారు. అక్కడేవరు దిక్కు! టిఫినేమన్నా ఉందా?" అన్నాడు ఆర్ద్ర హృదయంతో, ప్రసన్న దృక్కులతో ఆమె వైపు చూస్తూ!
    మధుమతీ, లక్ష్మీ, శ్రీనూ అందరూ వాసు గదికి వచ్చి ఒక్కో ప్రశ్నా వేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
    "చూడు, అత్తయ్యా, మీ కూతురు టిఫిను తెస్తానని వెళ్ళింది. గంట అవుతోంది!' అని నవ్వుతూ, "పెళ్ళి చేసేస్తారు కాబోలు. అతనేం బాధపడతాడో మరి!' అని పద్మజ రావడంతో చప్పున ఊరుకున్నాడు వాసు.
    "వట్టి ఉప్మా చెయ్యడానికి గంట టైమా!" హాస్యంగా నవ్వి ఆమె చేతిలో ప్లేటు తీసుకున్నాడు వాసు.
    నాలుగు రోజులు సినిమా, షికారూ హుషారుగా వాసుతోనే గడిపింది పద్మజ. ఆర్డర్స్ వచ్చాయి. అందరి ముఖాలూ కలువల్లా వికసించాయి. వాసూ, పద్మజా ఏదో తీవ్రాలోచనలో పడిపోయారు.
    ఆరోజే ప్రసాదరావు దగ్గరి నుంచి వచ్చిన ఉత్తరం సారాంశం-- "మీ అమ్మకి అభ్యంతరం లేకపోతె నాకు అంగీకారమే. నేరుగా నేను పిలిచేస్తున్నట్టు కాక "అమ్మా, ఒకవేళ నాన్న తనతో వచ్చెయ్యమని నిన్ను పిలిస్తే ఏమంటావ్?' అని అడుగి చూడు. ఆమె ఇచ్చిన జవాబు నాకు వ్రాయి" అని . "ఎలా అడగాలి? ఏమని అడగాలి? ఎప్పుడు అడగాలి!' తోచని వాడిలా ఇల్లంతా తిరిగేస్తున్నాడు వాసు.
    "అతను వెళ్ళిపోక పూర్వమే అతను తనను ప్రేమిస్తున్నాడో, లేదో తేల్చుకోవాలి! ఎలా? తానె మడుగుతుంది? అదే మగవాడైతే? అడిగేస్తాడు -- నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అని. ఛ, ఛ! అమ్మా, నాన్నా వాసుని వదిలి దేశమంతా పెళ్ళి కొడుకుల కోసం వెతుకుతున్నారు? తల్లి దండ్రుల మీద పట్టలేని కోపం వచ్చింది పద్మజ కి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గది వదలకుండా ఆ గదిలోనే కాస్సేపు కూర్చుని, పడుకుని , కిటికీ ఊచలు పట్టుకుని శూన్యంలోకి చూచి ఏం చెయ్యాలో తోచని పద్మజ వంట ఇంట్లో ఉన్న మధుమతి దగ్గరికి వచ్చి, 'అత్తయ్యా, వాసుకి పెళ్ళి చెయ్యవా!" అని అడిగింది.
    చిన్నగా నవ్వి, "ఏమమ్మా , పెళ్ళి కావాలని నీతో చెప్పాడా!" అంది మధుమతి.
    "ఛ, ఫో! నాతొ ఎందుకు చెపుతాడు?"
    "నిన్నల్లా ఇల్లు పట్టకుండా తిరిగారు. ఏమన్నా చెప్పాడేమో అని. ఆ ప్రశ్న వాసుని వెయ్యి, పద్మజా! ఏం చెబుతాడోనూ.... వాడితో మాట్లాడ్డమంటేనే నాకు భయం. రాజు ఉత్తరం వ్రాశాడు - జయని వాసుకి చేసుకోమని."
    "జగపతి కిస్తారేమో?' ఆమె మాట కడ్డు వస్తూ అంది పద్మజ.
    "ఆ అనుకోవడమేమిటి! అల్లుడంటూ పండగలకు బట్టలు కూడా పెట్టాడు. అదీ, అతనూ చాలా చనువుగా తిరిగేవారు."
    "మరి ఇప్పుడెందుకని ఇవ్వరు?' మళ్ళీ పద్మజ ప్రశ్న. ఆమెలో ఏదో కలవరపాటు.
    "నాకూ అట్టే వివరాలు తెలియవు."
    "ఆ వివరాల కేముంది? ఫారిన్ వెళ్ళి దొరసాన్ని పెళ్ళాడి వచ్చాడు." మధుమతి మాట పూర్తీ చేస్తూ టక్కున చెప్పేసింది అప్పుడే వంట ఇంట్లో అడుగుపెట్టిన లక్ష్మీ.
    రెండు క్షణాల నిశ్శబ్దం తరవాత -- "వదినా ! బావగారు వ్రాసిన ఉత్తరం వాసు చూశాడా?' అని అడిగింది లక్ష్మీ.
    "లేదు" ముభావంగా ఉండిపోయింది మధుమతి.
    పద్మజ గుండెలు గుబగుబ లాడుతున్నాయి. 'జయ అంటే వాసుకి ఇష్టం. జయ పాట చాలాసార్లు మెచ్చుకున్నాడు. అత్తయ్య అడుగుతుంది. అతను ఒప్పెసుకుంటాడు. ఆమె గుండెను గట్టిగా పిండినట్టయింది. తాను వట్టి నిర్భాగ్యురాలుగా తలపోసిన పద్మజ కాళ్ళు తెలిపోతుంటే తన గదికి వెళ్ళిపోయింది.

                           *     *    *    *
    ఆరోజులో ఎన్నోసార్లు మధుమతి దగ్గర చేరి ఏమేమో మాట్లాడి మళ్ళీ తానేమని అడగాలో అనే సంకోచంతో వెళ్ళిపోయే వాసు. భోజనం ముగించి తన గదికి వెళుతూ, "ఓసారి నా గదికి రా అమ్మా. కాస్సేపు మాట్లాడుకుందాం.' అని వెళ్ళిపోయాడు.
    చిన్నగా నవ్వి, "నేనూ అనుకుంటున్నానులే" అంది మధుమతి.
    అన్నంలో చెయ్యి కడిగి చప్పున అవతలికి వెళ్ళి పోయింది పద్మజ.
    "చూశారా వదినా? దీన్నెలా దారికి తెస్తారో! నాకేం అర్ధం కాకుండా పోతుంది. వాళ్ళు రేపు వస్తామని ఫోను చేశారట. మీ తమ్ముడు చెప్పారు. భోజనం చెయ్యనంటే, బలవంతాన తీసుకువచ్చాను. అన్నంలో చెయ్యి కడిగి లేచింది, వేషం వేస్తుంది. పసిపిల్లా! ఎలానూ ఈసారి తప్పిపోదు.' విసుగ్గా సన్నని బాధ ద్వనిస్తున్న గొంతుతో అంది లక్ష్మీ.
    "ఎన్ని గంటల కొస్తారు? ఉదయాన వెళ్ళిపోతాడు వాసు."
    "మధ్యాహ్నం రెండుకి మంచిదట. ఎల్లుండి వెళ్ళవచ్చు -- ఉండమనండి, వదినా!'
    'చెపుతాలే...."
    
                         *    *    *    *
    వాసు గదిలో మధుమతి అడుగు పెట్టేసరికి జయ ఘంటలా గోడ గడియారం ఒక్కసారి మ్రోగింది. "తొమ్మిదిన్నర...." అంటూ కుర్చీలో కూర్చుని , "అన్నీ సర్దేసుకున్నావా? ప్రయాణం ఎప్పుడు?" అంది మధుమతి.
    "ఉదయాన్నే....వెళ్ళి వారం రోజులలో వస్తాను. మనతో అమ్మమ్మ ని కూడా తీసుకు వెళదాం."
    "చూద్దాం లే!" అంటూ ఏదో ఆలోచనలో పడిపోయింది మధుమతి.
    ఇద్దరి మధ్యా కొన్ని క్షణాలు బరువుగా దొర్లిపోయాయి.
    "రేపు పద్మజ ని చూడ్డానికి పెళ్ళి వారోస్తారట. దాన్ని కనిపెట్టుకుని ఉండమన్నాడు నన్ను గోపీ" అంటూ నవ్వింది మధుమతి.
    "ఎందుకని?" ఆశ్చర్యంగా అన్నాడు వాసు.
    "ఏమో? ఎవ్వరి ఉద్దేశాలు అర్ధం కావు. నాకేమిటో జరుగుతున్నదంతా కలో, వాస్తవమో ! నువ్వూ, మామయ్యా, పద్మజా ఎవ్వరూ నాకు అర్ధం కారు."
    ఉదాసీనంగా ఉండిపోయిన మధుమతి వైపు చిరునవ్వుతో చూస్తూ, "అందరూ అర్ధమై పోతారమ్మా! కాని, కనిపెట్టి ఉండడం అంటే బలవంతం చేస్తారా పెళ్ళికి?' అన్నాడు వాసు.
    "నా మొహం! దాని ఉద్దేశ్యమేమిటో మరి. చూపుల కొస్తున్నారంటే చిరచిరలాడి ఒక్కోసారి ఎడ్చేస్తుంది కూడా!"
    "అయితే వీళ్ళ కెందుకా తొందర?"
    "ఇరవై ఏళ్ళ ఆడపిల్ల. తొందర కాదూ!"
    "పెళ్ళి వారోస్తే కనిపెట్టి ఉండడ మెందుకమ్మా!' నవ్వుతూ అడిగాడు వాసు.
    "అదే, వాసూ! క్రితం సారి ఏం చేసిందో తెలుసా? పెళ్ళి వారోస్తున్నారంటే దాని ఫ్రెండ్ తో కలిసి కోనసీమ వెళ్ళిపోయింది."
    'అసలు తన ఉద్దేశ్యమేమిటో కనుక్కున్నారా?' అంటూ నవ్వుకున్నాడు వాసు.
    "అడిగాం వాళ్ళమ్మా నేనూ కూడా. వచ్చిన ప్రతి సంబంధం నచ్చలేదని కొన్నాళ్ళూ,సంబంధాలు చూడవద్దని ఇప్పుడూ. పోనీ నీ మనస్సులో ఎవరినన్నా చేసుకునే ఉద్దేశ్యముందా అని అడిగితే అదీ చెప్పదు. మామయ్య విసిగిపోతున్నా డనుకో. క్రితం సారి ఏం చేసిందో తెలుసా? రిటైర్డ్ జడ్జి గారి అబ్బాయిట. ఆ అబ్బాయి తల్లి ఎప్పుడో పద్మజ ని చూసిందట. పాతికవేలు కట్నం, అబ్బాయి చూడ్డం మినహా అన్నీ సెటిలైనట్టే. వైశాఖ మాసం లో పెళ్లనుకున్నాం. రాత్రి భోజనాల దగ్గర మామయ్య చెప్పాడు. పెళ్ళి కొడుకు మర్నాటి మధ్యాహ్నం మూడు గంటలకి వస్తున్నాడని. లక్ష్మీ కాస్త ఘాటుగానే మందలించింది పద్మజ ని-- ఆ సంబంధం నచ్చుకోమని. అప్పటికి మౌనంగా ఉండిపోయింది. ఉదయం లేస్తూనే టాయిలెట్ అయి, నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన పద్మజ , పెళ్ళికొడుకు వచ్చాక కొదొఆ రాలేదనుకో. తిళ్ళూ, తిప్పలూ లేవు. కంగారు పడి చచ్చామనుకో. దాని ఫ్రెండ్సవరున్నారో అందరి ఇళ్ళకీ తిరిగాం. ఆ అబ్బాయి వచ్చి కూర్చున్న తరవాత నెమ్మదిగా మాకు చెప్పాడు శ్రీను -- కోనసీమ కొబ్బరి తోటలు చూడడానికి వెళ్ళిందనీ, మర్నాటి సాయంకాలం కాని రాదనీను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS