రామదాసు వెంకట్రామయ్య నూ, వాళ్ళనూ చూసి ముఖం చిట్లించుకున్నాడు. అరుగు మీద ఇటు కూచున్న వాడు ముఖం అటు తిప్పాడు. వెంకట్రామయ్య ఆయన్ని సమీపించి నెమ్మదిగా "బావగారూ" అన్నాడు.
"ఎవరది? ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎందుకొచ్చారు?" అన్నాడు రామదాసు ఉత్తాలతాలంగా వస్తున్న కోపాన్ని ఎంతో కష్టం మీద అణుచుకుంటూ.
"మాటలతో మమ్మల్ని చిత్రహింస చెయ్యకండి. ఇప్పటికే జరిగిన దానికి చాలా విచారిస్తున్నాము." అన్నాడు వెంకట్రామయ్య.
"మీరెందుకు విచారించడం? ఆ వంతు మాది, ఆడపిల్లని కన్నందుకు."
"ఇకముందు ఎవరిది కాదు ఆవంతు."
"ఏం? ఇంతటిలో ఏం మార్పు వచ్చింది?'
"జరిగినదంతా మరిచిపోయి మనం సహృద్వాతావరణం సృష్టించుకోవాలి."
"ఆహా!ఎన్నాళ్ళ కి అనిపించిందండి!"
"మీరెన్నయినా అనండి. తప్పు మాది. మీరనడం తప్పులేదు.
"ఏమేవ్! ఎవరో వచ్చారు చూడు" అని లోపలికి కేకవేశాడు రామదాసు. అతని భార్య ఇవతలకు వచ్చి, లోపలకు వెళ్ళడమూ, మానడమా అని తటపటాయిస్తున్న విశాలాక్షి ని, జానకీ ని ఒక్కమారు తేరిపార చూసి, వెంటనే స్పురణ కు తెచ్చుకొని "వచ్చారా, మా తల్లీ! ఏం? అన్నపూర్ణ ఇంకా బతికుందో, లేదో చూసి వెళదామని వచ్చారా?" అంది.
విశాలాక్షి తటాలున ఆమె చేతులు పట్టుకుని "అత్తయ్యగారూ! చచ్చిన పామునింకేం చంపుతారు? పిల్ల నిన్నాళ్ళూ తీసుకెళ్ళకపోవడం తప్పయిపోయింది. ఆ సంగతంతా మరిచిపొండి." అంది.
"ఎంత సులభంగా చెప్పారండీ!" అంటూ అన్నపూర్ణ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె రామ్మనకపోయినా, విశాలాక్షి ఆమె వెనకాలే లోపలికి వెళ్ళింది. ఇందంతా చూస్తున్న అన్నపూర్ణ పక్క గదిలో నుంచి జానకికి సైగ చేసింది. అది చూసి జానకి ఆమె దగ్గరకు వెళ్ళింది. అరుగు మీద రామదాసుకు కొంచెం దూరంలో వెంకట్రామయ్య, ఆనంద్ కూర్చుని ఉన్నారు . ముగ్గురినీ మౌనం పరిపాలిస్తున్నది.
కొన్ని క్షణాల తర్వాత రామదాసు అన్నాడు: "ఏమైనా మీరు చేసిందేమీ బాగోలేదు."
వెంకట్రామయ్య ఏమీ మాట్లాడలేదు.
"రెండేళ్ళు దాటిపోయింది పిల్లను చేసుకొని. ఓ ఉత్తరం ముక్క వ్రాయడం లేదు. పోనీ, ఇదీ సంగతి అని కబురు లేదు. లేదయ్యా, ఏమీ వద్దు. నేను వ్రాసిన అన్ని జాబులోనూ ఒక్కదానికయినా , ఒక్కటంటే ఒక్కదానికి జవాబు ఇవ్వచ్చే! పోనీ, అదీ లేదయ్యా, నేను పనిగట్టుకుని ఓమారు వస్తే కర్ర విరగకుండా, పాము చావకుండా పంపిస్తారా? ఇంకోమారు వస్తే తలుపులు తాళాలు వేసుకుని దేశాంతరం వెళ్ళిపోతారా? ఇది మీకేమైనా బాగుందా?బాగుందా అని?"
వెంకట్రామయ్య ఏమీ జవాబు చెప్పలేదు.
"మొన్న కోర్టు దగ్గర నుంచి ఆ సమన్లు ఏమిటి? ఇవాళ ఆకాశం మీద నుంచి ఊడి పడ్డట్టు మీరీ రావడం ఏమిటి? నాకేమీ అర్ధం కావటం లేదు" అన్నాడు రామదాసు.
వెంకట్రామయ్య జాగ్రత్తగా ఒక్కటొక్కటే జరిగినవన్నీ చెప్పి వర్తమాన ప్రయత్నమూ, అలా చేస్తే అన్నీ సానుకూలమై అన్నపూర్ణా, ఆనంద్ హాయిగా కాపురం చేసుకోవచ్చుననీ తేల్చాడు.
"ఏమిటేమిటి ? ఇతగాడు ఇంకో పెళ్ళి చేసుకుంటే, అది ఇతని మీద వ్యాజ్యం వేస్తె, మా అన్నపూర్ణ వచ్చి 'ఈ ఆనంద్ నా భర్త కా'దని చెప్పాలా , కోర్టులో? ఆహాహా! ఏం సలహా చెబుతున్నారండీ?' అంటూ గట్టిగా కేకలు వెయ్యడం మొదలు పెట్టాడు. ఆనంద్ కు తన గుండెను ఇనప దుంగ మీద వేసి సుత్తితో కొడుతున్నట్లు అనిపించింది. అతని అభిమానం సహనం అనే చెలియలి కట్టను దాటుతున్నది. కాని ఏం చేస్తాడు? అన్నీ పడి ఊరుకోవలసిందే!
"ఇది విన్నారా? వీరెండు కొచ్చారో తెలుసా?' అంది రామదాసు భార్య ఇవతలకు వస్తూ.
"ఆ! తెలుసు."
"ఇంకా ఎందుకండీ , వాళ్లతో కబుర్లు?
ఆ అబ్బాయి ఇంకో పిల్లని ఎప్పుడయితే చేసుకున్నాడో అప్పుడే తెగిపోయింది మనతో సంబంధం. వెళ్ళమనండి ఇంక."
"ఇప్పుడా అమ్మాయిని వదిలేస్తాడుట! మన అమ్మాయిని ఏలు కుంటాడుట!"
"ఇదేమైనా బూట్లు విప్పేసి జోళ్ళు తోడుక్కోవడం అనుకున్నాడేమిటి? చాలు, చాలు. చాలా గౌరవమైన సంబంధం చేసుకున్నాము."
అదే పనిగా ఇటు వెంకత్రామయ్యా, అటు విశాలాక్షి బతిమాలడంతో రామదాసూ, భార్యా చివరికి ఇలా అన్నారు. "అయితే మాకేం తెలియదు. ప్రజ్ఞత వచ్చిన పిల్ల , అన్నపూర్ణ నడగండి. సీతమ్మవారిలాగ పడి ఉంది. అది సాక్ష్యం చేబుతానంటే చెప్పించుకోండి. అనక మంచి వచ్చినా, చెడ్డ వచ్చినా అనుభవించేది అదే!"
"అంతా విన్నావు కదా? ఇప్పుడు ఆనంద్ ఆపదలో ఉన్నాడు. వాడి ఉద్యోగం , మర్యాద మంట గలిసిపోకుండా నిలబెట్టాలంటే నువ్వీ కొంచెం అబద్దం ఆడాలి. కోర్టులో అతను నా భర్త కాడని చెప్పడం నీకు చాలా బాధ కలిగిస్తుందనుకో. అయినా వాడి కోసం, నీ భర్త కోసం ఈ కాస్త బాధా భరించలేవా?' అన్నాడు వెంకట్రామయ్య ప్రాధేయ పూర్వకంగా.
అన్నపూర్ణ తలెత్తి చూసింది. రెండేళ్ళ క్రితం తన మీద అవాజ్య కరుణామృతం చిలికించి జ్యోతిని కాదని తనను ఆనంద్ కు నిర్దేశించిన దయామయుడు, ఉదార హృదయుడు -- అప్పటి వెంకట్రామయ్య కళ్ళకు కనిపించాడు.
మారుమాట లేకుండా "అలాగే, మీ ఇష్టం " అంది.
రామదాసూ, భార్యా తెల్లబోయారు.
"ఆదర్శ భారత నారీత్వం నిలబెట్టావు తల్లీ" అన్నాడు వెంకట్రామయ్య.
"నువ్వెంత సుగుణరాశివి!" అని కౌగలించుకొంది విశాలాక్షి.
'అన్నపూర్ణ హృదయం ఎంత సుందరమైనది!" అనుకున్నాడు ఆనంద్.
మర్నాడు కాకినాడ లో కోర్టుకు అందరూ హాజరయ్యారు. ఆనంద్ తనను వివాహం చేసుకోలేదని అన్నపూర్ణ చెప్పడంతో జడ్జి సంతృప్తి చెంది, ఇక ఆ సంగతి మీద వాద ప్రతివాదాలు అనుమతించలేదు. జ్యోతి తో అతనికి జరిగిన వివాహం రుజువయింది. ఆ వివాహం తను చేసుకోలేదని బుకాయించడానికి మొదట్లో ప్రయత్నం చెయ్యడం వల్ల దానికి శిక్షగా అతడిని ఒక ఏడాది ఉద్యోగం లో నుంచి సస్పెండు చేస్తున్నామని తీర్పు ఇచ్చి, జ్యోతి కి ఆనంద్ చేత విడాకులు ఇప్పించాడు జడ్జి.
అంతటితో అది తేలింది కదా అని వెంకట్రామయ్య సంతోషించాడు. "ఇన్ని బాధలూ, మనః క్లేశాలు పడి ఇప్పుడు కొంచెం స్థిమిత పడ్డాము. కనక, ప్రశాంతంగా వారం పది రోజులు గడపాలి మనం. ప్రశాంత జీవనానికి సరిపడిన వాతావరణం సర్పవరం లో నా కుటీరం లో లభిస్తుంది. అంతా అక్కడికి వెళదాం , నడవండి." అన్నాడు వెంకట్రామయ్య.
ఆ మాట విని విశాలాక్షి తెల్లబోయింది.
"అలా తెల్లబోతావెం? పుల్లేటి కుర్రు నుంచి వచ్చాక, ఈ రెండేళ్ళ నుంచీ నన్ను ఆదుకున్నది ఆ కుటీరమే. నడు , చూద్దువు గాని" అన్నాడు నవ్వుతూ. పెద్దాపురం వెళ్ళి కొన్ని పనులు చూసుకుని అయిదారు రోజులలో సర్పవరం వస్తానని రామదాసు చెప్పాడు. వెంకట్రామయ్య, ఆనంద్, విశాలాక్షి, జానకి, అన్నపూర్ణ ఆరోజే సర్పవరం బయలుదేరారు.
ఇది ఇలా ఉండగా ఆరోజే ముకుందాన్ని తీసుకుని ఎవళ్ళకూ తెలియకుండా జ్యోతి ఎక్కడికో వెళ్ళిపోయింది.
