Previous Page
కౌసల్య పేజి 36

 

                                        23
    ఆ రోజు శనివారం. తూరుపు తెలవారు తుంటే ఆ అందమైన కుటీరం ముందు ఒత్తుగా కళ్ళాపు జల్లి, నేర్పుగా ముగ్గులు పెట్టింది అన్నపూర్ణ. అంతక్రితమే నేయబడిన కొత్త తాటాకుల వాసనతో , ఊరికి దూరంగా, భావ నారాయణ స్వామి దేవాలయానికి మాత్రం కొంచెం సమీపంగా హృద్యమై, సకల జన మనోవేధ్యమై , మనోజ్ఞంగా ఉంది వెంకట్రామయ్య కుటీరం.
    పెరట్లో సంస్కారం లేక వాడిపోయి పడి ఉన్న మాలతీ లతకు మడి చేసి, దానికో ఆలంబన ఏర్పరిచి, నీళ్ళు పోస్తున్నది జానకి.
    అప్పుడే స్నానం చేసి , మడి పంచె కట్టుకుని, "ఊర్ధ్వ మూల మదః శాఖమ్ ఆశ్వత్ధం ప్రాహురవ్యయమ్" అంటూ, పురుషోత్తమప్రాప్తి యోగం చదువుతున్నాడు వాకిట్లో వెంకట్రామయ్య.
    రాత్రి వెలిగించుకోవడానికి, పూజలో దేవుడి దగ్గరికీ కూడా ఉంటాయని మరి కాసిని వత్తులు చేస్తున్నది విశాలాక్షి , వెంకట్రామయ్య కనిపించేలాగా కొంచెం దూరంలో కూర్చుని.
    దొడ్లో అన్నపూర్ణ నీళ్ళు తోడి ఇస్తూ ఉంటె, నూతి దగ్గర స్నానం చేస్తూ "అన్నట్లు, కౌసల్య పిన్ని, తిలక్ ల సంగతి బాబయ్య కు చెప్పడమే మరిచాను. తుడుచుకొని చెప్పాలి" అనుకున్నాడు ఆనంద్. మధ్యమధ్య ఆనంద్ చేస్తున్న వేళాకోళాలకు బుగ్గలు గులాబీ మొగ్గలు కాగా, తన్మయానందాన్ని అనుభవిస్తున్నది అన్నపూర్ణ.
    సూర్యుడు ఇంకొంచెం పైకి లేచాడు. అతని నులి వెచ్చని కిరణాలతోనూ, తెల్లవారగట్ల పడిన కొద్ది మంచుతోనూ కలిపి వాతావరణం వెచ్చ వెచ్చగా , చల్లచల్లగా హాయిగా ఉంది.
    చుట్టుపక్కల పూసిన మామిడి గున్నల మీద నుంచీ, వేప రెమ్మల మీద నుంచీ వగరు వాసన తో కూడిన చిరుగాలులు అల్లనల్లన వీస్తున్నాయి. ఎక్కడో దూరాన నుంచి సన్న సన్న గాలితో తేలిపోతూ రేడియోలో నుంచి కాబోలు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వీనవస్తున్నది-- "కౌసల్యా సుప్రజా రామ...." అంటూ.
    ఆ మధుర మంజుల మనోజ్ఞ ప్రశాంత ప్రభావంతో కౌసల్య ను తీసుకుని తిలక్ వెంకట్రామయ్య కుటీరం దగ్గరకు వచ్చాడు.
    ముందు వాకిట్లో ఆగి, "వీరే నన్ను రక్షించినవారు. ఈమె నండి, మా అమ్మ కౌసల్య" అని ఒకరి కొకరికి పరిచయం చేశాడు తిలక్.నమస్కారం కోసం అని ఎత్తిన కౌసల్య చేతులు అలాగే ఉండిపోయాయి.
    "కర్మాను బన్దీని మనుష్య లోకే" అనే భగవద్గీత వాక్యాలు, గొంతుకలోనే ఉండిపోయాయి వెంకట్రామయ్యకు.
    ఒకరినొకరు చూస్తూ నిలబడి పోయారు. ఇద్దరిలోనూ చైతన్యం లేదు. ఇద్దరి మనోబుద్ది అహంకారాలు, ఎవరి నోటా మాట లేదు. ఎవరి చూపుకీ అర్ధం లేదు.    
    అలా ఎంత సేపో!
    ఒక్క త్రుటి లో ఇరవై వసంతాల కాలం గిర్రున తిరిగింది. వెంకట్రామయ్య మనోనేత్రం ముందు. ఇరవై ఏళ్ళ ఎడబాటు ఒక్క విరహ రాత్రిలా భాసించింది ఆమెకు అతని ముందు.
    వెంకట్రామయ్య కున్న పట్టుదల అదృశ్యం అయిపొయింది. అప్పటిదాకా లేని ఒక నూత్న కాంక్షకు ఆమె ఇప్పుడు వశ్య అయింది.
    వారిద్దరి మధ్యా ఇప్పుడు కార్పణ్యపు హద్దులు చెరిగి కారుణ్యపు వెన్నెల విరిసింది. అహంకారాల ప్రాకారాలన్నీ దాటి, మమకారం మకుటం ధరించింది.
    ఆ నిమిషం ఒక నవ యుగానికి నాంది పలికింది. కన్నీరు స్థానం లో పన్నీరు చిలికింది. మధూదయం అయిన ఆ మంచి ముహూర్తం లో వాళ్ళ జ్ఞాన శ్రవణాలకో సూక్త వసంతం వినిపించింది:
    "ఆమె తన కౌసల్య --
    అయన తన దైవం."
    వెంకట్రామయ్య కరుణార్ద్ర నేత్రాలు కౌసల్య కళ్ళను తడిపాయి. వెంకట్రామయ్య తిలక్ ను దగ్గరకు తీసుకున్నాడు. ఆ పుత్ర గాత్ర పరిష్వంగ సుఖం లో కన్నులరామోడ్పులయ్యాయి. అరమూసిన అతని కళ్ళే కౌసల్య కోసం అతని హృదయ కవాటాలు తెరిచాయి.
    ఆనందాశ్రువులు పైటతో ఒత్తుకుంటూ ఆహ్లాదాన్ని తెలిపే మాటలు దొరకకపోవడం వల్ల మౌనంగా కుటీరం లోపలికి బయలుదేరింది కౌసల్య.
    ఆ వెళ్ళడం లో ఎన్ని యుగాల నుంచో ఆ కుటీరంలో కాపురం చేస్తున్న యజమానురాలు లాగ స్వేచ్చగా, సహజంగా, హుందాగా వెళ్ళింది.
    కౌసల్య పిన్నిని చూసి విశాలాక్షి చిన్నపిల్లలా కౌగలించుకొని బావురుమంది.
    "ఊరుకో తల్లీ. కష్టాలు వస్తాయి, మరి. ఏం చేస్తాం? నిన్న మొన్నటి పిల్లవు , నీకీ యోగం ఏమిటి చెప్పు" అంటూ విశాలాక్షి ని దగ్గరగా తీసుకుని తల నిమిరింది కౌసల్య.
    "ఇదుగో , మా కోడలు పిల్ల ఇక్కడే ఉంది" అంటూ కౌసల్య జానకి బుగ్గలు పుణికింది.
    "అది నీ మనమరాలు. పుట్టాక దాన్ని నువ్వు చూడలేదు." అంది కళ్ళు తుడుచుకుంటూ విశాలాక్షి.
    "చూడక పోవడమేమిటి? అదే వెతుక్కుంటూ వచ్చింది నన్ను చూడడాని కీ మధ్య."
    "వెతుక్కుంటూ వచ్చిందా?"
    "ఆ! ముందు మొగుణ్ణి వెతుక్కుందిలే. తర్వాతే నన్ను. తెలుసా నీకు? తిలక్ మీ బాబయ్య గారి అబ్బాయి."
    "అలాగా? ఎంత చిత్రం! దగ్గర తిరుగుతూ ఉంటేనే కనుక్కో లేకపోయాను. ఏడీ వాడు? వచ్చాడా?"
    "ఆ. బయట వాళ్ళ నాన్నగారి దగ్గర ఉన్నాడు. పాపం, ఆ తండ్రీ కొడుకులు ఇరవై ఏళ్ళకి ఇప్పుడు కదా కలుసుకోవడం ? ఇరవై ఏళ్ళ నేరాలూ, నా మీద ఎన్ని చెప్పుకోవాలో!"
    జానకి రహస్యంగా తిలక్ ను చూడడానికి వీధి లోకి వెళ్ళింది.
    "ఏం ఇన్ స్పెక్టర్ బాబూ! జ్ఞాపకం ఉన్నానా?"
    "పిన్నీ! నన్నా పేరుతొ ఇంక పిలవకు. నేను ఇన్ స్పెక్టర్ ని కాదు ఇప్పుడు. ఆనంద్ ని మాత్రం."
    "మంచిదే. ముకుందం కనిపించడెం?"
    "వాడు ఇంట్లో నుంచి బయటకు ఏడాదికి రెండు సార్లు మాత్రం వెళ్ళుతాడు. వెళ్ళినప్పుడల్లా ఆరు నెలలకి తిరిగి వస్తూ ఉంటాడు."
    "పాపం ముకుందం భార్య కూడా ఆ పడవ ప్రమాదం లో మునిగి పోయిందటగా?"
    "అవును పిన్నీ. బావా, వదినా ఇద్దరూ ఆ ప్రమాదం లోనే పోయారు."
    "అయితే , అన్నట్టు .....నీ పెళ్ళయిందా?"
    "ఆ. అదిగో నీ కోడలు . అన్నపూర్ణా! ఇటురా."
    మామిడి కాయలు తరుగుతూ తరుగుతూ ఉన్న అన్నపూర్ణ వచ్చి నమస్కారం చేసి కాసేపు నించుని వెళ్ళిపోయింది.
    "ఈ పిల్లని నువ్వు నచ్చే చేసుకున్నావా?"
    "చేసుకున్నప్పుడు నచ్చలేదు కాని, ఇప్పుడు పూర్తిగా నచ్చింది."
    "ఎందుకని?"
    "అప్పుడు పిల్లని నేను చూసుకోలేదు. బాబయ్యే చూసి చేశాడు."
    "సరే, బాబయ్య సెలక్షను అయితే బాగానే ఉంటుంది లే."
    "అది కాదు పిన్నీ. అసలు బాబయ్య దృష్టే సరయినది. ఆయనది దూర దృష్టి."
    "నంది మాగధులు లాగ , పొగడుతూన్నావు మీ బాబయ్యని. అవునులే. ఎంతైనా రక్తసంబంధం!"
    ఆనంద్ చిరునవ్వు నవ్వి "తమ్ముడోచ్చాడా పిన్నీ" అన్నాడు.
    "అవతల వాళ్ళ నాన్నగారి తోటి ఏదో మాట్లాడుతున్నాడు."
    వెంటనే ఆనంద్ వీధిలోకి వెళ్ళి, తిలక్ తో "జరిగిందంతా మరిచిపో , తమ్ముడూ!" అన్నాడు.
    తిలక్ నవ్వుతూ, "నువ్వు చేసినదానికీ, నేను చేసినదానికీ చెల్లు" అన్నాడు.
    "నేను వండుతానండి " అంటున్న అన్నపూర్ణ తో "పెద్దదాన్ని నేనుండగా మీరందరూ ఎందుకమ్మా? నేను వండి మీకు అందరికీ పెట్టుకుంటే నాకు తృప్తి " అంది కౌసల్య.
    "రావుసాహేబు గారి కూతురికి వంట వచ్చా?' అన్నాడు సన్నగా వెంకట్రామయ్య.
    "నిక్షేపం గా! రావుసాహేబు గారి కూతురే గాదు, రాజకీయ బాధితుడి భార్య కూడా. ఆసంగతి మరిచి పోకండి." అంది కౌసల్య నవ్వుతూ.
    "బాబయ్య కి మామిడికాయ పప్పు ఇష్టం అది చెయ్యి" అంది విశాలాక్షి. 'అవును రెండేళ్ళ నుంచి తినాలని అనుకుంటున్నా. అప్పటి నుంచి మామిడికాయ పప్పు తినలేదు. మాడేకాళ్ళకి చెప్పులు తొడగలేదు."
    "నీ చెప్పులు నా పెట్టెలో కాగితం చుట్టి దాచాను, తాతయ్యా. ఇవిగో" అని ఇచ్చింది జానకి.
    భోజనాలయి అంతా సావకాశంగా కూర్చున్నాక పెద్దా పురం నుంచి రామదాసు వచ్చాడు. వస్తూనే వెంకట్రామయ్య ను సమీపించి "అన్నపూర్ణ పేర, ఇదిగో ఈ రిజిస్టర్ పాకెట్ వచ్చింది. పోస్టు మాస్టరు నాకు తెలిసిన వారే కనక, అమ్మాయి ఊళ్ళో లేదని చెబితే , "ఫరవాలేదు లెండి . ఈ రసీదు పట్టుకెళ్ళి సంతకం చేయించి తెచ్చినా ఫరవాలేదు" అన్నాడు" అని చెప్పి పాకెట్ వెంకట్రామయ్య కు ఇచ్చాడు. అది తీసుకుని వెంకట్రామయ్య విప్పితే, అందులో ఆస్తి దస్తావేజులూ, ఆస్తికి సంబంధించిన కాగితాలూ ఉన్నాయి. అవి అన్నీ అన్నపూర్ణ పేర జ్యోతి వ్రాసినవి. అందులో చిన్న ఉత్తరం ఉంది.
    "అన్నపూర్ణా, '    
    మనం ఇద్దరం చిన్ననాటి స్నేహితులం. నేను నీ కెంత అన్యాయం చేశానో ఇప్పుడు తలుచుకుంటే ఎంతో బాధ కలుగుతున్నది. అది కొంత ఉపశమనం అవుతుందనే నా యావదాస్తీ నీ పేర వ్రాసి కాగితాలు పంపిస్తున్నాను. దయచేసి స్వేకరించు. నేనొక అనాధ శరణాలయం పిల్లను. మాధవరావు గారు నన్ను మద్రాసు నుంచి తీసుకు వచ్చారు. నేనిప్పుడా శరణాలయానికి వెళ్ళి నా తల్లిదండ్రు లేవరని అడిగితె తల్లి ఎవరో తెలియదు కాని, ఇరవై ఏళ్ళ క్రితం రామచంద్రా పురంలో లాయరుగా ఉండే రావు బహద్దర్ పెరుమాళ్ళయ్యగారు నన్ను శరణాలయం లో చేర్పిస్తూ తానే తండ్రి అని చెప్పారని తెలిసింది. సరే, అదృష్టం ఉంటె నా తండ్రి గారిని నేనెప్పుడేనా కలుసుకుంటాను. లేకపోతె ఈ అనాధ అనాధ గానే మిగిలిపోతుంది. ఇంకొక సంగతి ముకుందం కోసం వాళ్ళను వెతుక్కోవద్దను. హాయిగా నావద్ద ఉన్నాడు. మేము ఎక్కడుంటామో చెప్పలేము. కవరు మీద ఉన్న అడ్రస్ కూడా సరయినది కాదు.

                                                                                                     నీ
                                                                                                  జ్యోతి."
    ఆ ఉత్తరం తీసి గబగబా జేబులో పెట్టేశాడు వెంకట్రామయ్య. జ్యోతి తన ఆస్తినంతా అన్నపూర్ణ పేర వ్రాసిందని మాత్రం చెప్పాడు అందరికీ. ఆ సాయంత్రానికి పుల్లేటి కుర్రు నుంచి సుందరమ్మ వచ్చింది లక్ష్మిని ఎత్తుకుని.
    "ఆనంద్ బాబు గారు కౌలు ఇసయం లో మాటాడ్డానికి సర్పావరం రమ్మని రాస్తే బాబు మంచాన పడ్డాడు కనక, నేను వచ్చాను. అందుకే పెద్ద బాబుగారిని, అరి భార్య గారినీ కూడా సూడ్డం పడింది."అంటూ సంతోషించింది.
    అది వీరి గాడి కూతురనీ, సత్తెయ్య భార్య అనీ తెలుసుకుని "సత్తెయ్య రాలేదా?" అంటూ పలకరించింది కౌసల్య.
    "సత్తెయ్య ఎక్కడున్నాడండీ! సెయినా యుద్దానికి పంపించేశానుగా?' అంది.
    "నువ్వు పంపించావా? అదేం?"
    "అదేటండీ ! దేసం అంతా ఒక్కమారుగా గగ్గోలు అయిపోతే! 'సయిన్నెం లో చెరండోయ్ , దేసం పెమాదం లో ఉందండోయ్ ' అంటూ అంతా అరిశారు గాదండీ!"
    "మరి నీ మొగుణ్ణి యుద్దానికి పంపిస్తే నీకు బాధగా లేదూ?"
    "బాదేటండీ, దేసం కోసం పంపిస్తే?"
    తనకంటే సుందరమ్మ ఎన్నో రెట్లు ఉన్నతంగా కనిపించింది కౌసల్య కు.
    వీధి వరండా లో పడుకున్న వెంకట్రామయ్య నుదుటి మీద, ఓ రాత్రి వేళ చల్లని హస్తం తగిలింది. అది ఇరవై ఏళ్ళ క్రిందటి మధురాను భూతులను మరల తవ్వి తీసుకు వచ్చింది.
    తెల్లవారింది.
    ఆదివారం.
    ఉగాది.
    ఆ ప్రత్యూష నవనాంకురాల్లో తేలి తేలి వస్తున్న మామిడి పూత వగరు వాసన, నలబై వసంతాలు నిండిన కౌసల్య హృదిలో కొత్త పూతలు పూయిస్తుంది.
    "ఏమర్రోయ్! ఈ ఏడు ఉగాది పచ్చట్లో వేపపువ్వు . మామిడి ముక్కలు వగైరా వగైరా అర్ధం లేని సరుకులెం వెయ్యకూడదు. మనం ఇప్పటికే బోలెడంత చేదూ, వగరూ రుచి చూశాము. జీవితంలో. అందుకని చెరుకు ముక్కలూ, బెల్లమూ , అరటి పళ్ళూ తప్ప ఇంకేం వెయ్యకండి.' అని అరిచాడు వెంకట్రామయ్య. ఇంట్లో అందరూ కలకలా నవ్వారు.
    భావనారాయణస్వామి గుడిలో గంటలు మ్రోగాయి నవశకానికి నాందిగా.

                                   (సమాప్తం )


 Previous Page

WRITERS
PUBLICATIONS