"చూస్తాను, తిలక్ ని ఎలా ఒప్పించలేనో. అదీ చూస్తాను" అని విసురుగా వెళ్ళిపోయింది జానకి.
ఆ వెళ్ళడం వెళ్ళడం తిన్నగా తిలక్ గదికి వెళ్ళింది. గది తాళం వేసి ఉంది. కొంచెం సేపు వేచి ఉంది. ఎంతకూ తిలక్ వచ్చే జాడ కనిపించలేదు. సరే, పొద్దుట కలుసుకోవచ్చు కదా అని వెళ్ళిపోయింది. పొద్దుట వచ్చి చూస్తె అప్పుడే బయటకు వెళ్ళాడని తెలిసింది. అతను తరుచు వెళ్ళే రెండు మూడు చోట్లకు వెళ్ళి చూసింది. కోర్టు టైము కావస్తున్నది. అప్పుడే కోర్టు కు వెళ్ళిపోయాడో ఏమో అనుకుని తిన్నగా కోర్టుకు వెళ్ళింది. అక్కడ జ్యోతి ఒక్కతే నవ్వుతూ కనిపించింది. ఇంకా ఎవ్వరూ రాలేదు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పటికి అప్పుడే తిలక్ సాక్ష్యం అయిపొయింది. అప్పటికే జ్యోతి పెట్టిన అర్జీ కి సమాధానంగా ఆనంద్ తానామేను వివాహం చేసుకోలేదని చెప్పడమూ, అది ముందే ఊహించి సిద్దంగా పెట్టుకున్న రిజిస్టర్ మారేజీ కి సంబంధించిన కాగితాలను జ్యోతి కోర్టులో దాఖలు చెయ్యడమూ, అవి నిజమైనవే అని రిజిస్ట్రారు , తిలక్ దృవపరచడమూ జరిగింది. 'అయ్యో, అంతా చెయ్యి దాటి పోయిందే!' అనుకుంది జానకి.
కేసు మరునాటికి వాయిదా వెయ్యబోతుండగా , జ్యోతి తరుపు న్యాయవాది జ్యోతి తో ఏదో రహస్యంగా మాట్లాడి "యువర్ అనర్! ఈ ఆనంద్ -- ఇంతేకాదు, ఇంకో పెళ్ళి కూడా చేసుకున్నాడు." అన్నాడు . జడ్జి కళ్ళజోడు తీసి పట్టుకుంటూ, ఆశ్చర్యంగా "ఇంకో పెళ్ళా!" అన్నాడు.
"అవును, యువర్ అనర్ ! పెద్దాపురం లో రామదాసు అనే ఆయన కూతురు-- అన్నపూర్ణ" అంటూ తిరిగి జ్యోతి తన చెవిలో చెప్పినదంతా జడ్జి కి చెప్పాడు లాయర్.
"సరే, వాళ్ళ అడ్రస్ ఇవ్వండి. సమన్లు చేద్దాము " అన్నాడు జడ్జి.
"జ్యోతి ఎంత కక్ష కట్టింది!' అనుకుంటూ బోనులో నుంచి దిగాడు ఆనంద్. దూరం నుంచి ఆనంద్ కేసి చూసి గర్వంగా నవ్వి జ్యోతి తో కలిసి వెళ్ళిపోయాడు తిలక్. ఆ పరిస్థితిలో తిలక్ ను పలకరించడం ఇష్టం లేక ఊరుకుంది జానకి.
* * * *
ఇది జరిగాక ఒక రోజు సాయంత్రం జ్యోతి ఏమీ తోచక అరుగు మీదికి వచ్చి నిలబడింది దారిన పోయేవాళ్ళను చూస్తూ. ఆ మసక వెలుతురులో రిక్షా లో పోతున్న ముకుందాన్ని చూసి కేకవేసింది. ముకుందం చెప్పేది వినిపించుకోకుండా అతణ్ణి లోపలికి తీసుకు వెళ్ళింది.
కుర్చీ చూపిస్తూ "ఏమిటి, ఈ మల్లె పువ్వుల దండలూ మీరునూ? ఎక్కడేనా సన్మానం అయి వస్తున్నారా?' అంది.
"అవును. అవతల వీధిలో ఎవరో కొందరు కుర్రాళ్ళు చేరి చెడుగుడు పోటీలు ప్రారంభించారు. ఆ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించి ఇలా వస్తున్నాను."
జ్యోతి కడుపు చెక్కలయెలాగ నవ్వింది. "చెడుగుడు పోటీలకి ప్రారంభోత్సవమా?" అంటూ నవ్వడం ప్రారంభించింది తిరిగి. ముకుందం కూడా ఆమె నవ్వులో శ్రుతి కలిపాడు.
"ఇలాంటి సభల్లో మాట్లాడడం మీకు అవమానంగా లేదూ?"
"ఎందుకూ? సరదాగా తీసుకుంటే సరి."
"అంటే?" అంది జ్యోతి నవ్వు ఆపి.
"అంటే ఏమీ లేదు. అసలీ రోజుల్లో ఉపన్యాసాలే ప్రహసనాలుగా తయారయాయి. వాళ్ళేందుకో పిలుస్తారు ; వీళ్ళేదో మాట్లాడుతారు. అంతే. ఉపన్యాసాలు బ్రహ్మాండంగా జరిగాయి అని పత్రికలలో వార్తలు."
"అయితే మీరిదేదీ సీరియస్ గా తీసుకోవటం లేదన్నమాట!"
"అబ్బే. కాలక్షేపం కోసం నేను వెళ్ళుతూ ఉంటాను. అవాకులో, చవాకు లో అరగంట మాట్లాడతాను. కనక వాళ్ళు పిలుస్తారు. అంతే వాళ్ళకీ, నాకూ అంతకన్నా ఉన్నతశాయాలూ ,ఆదర్శాలూ లేవు."
"విషయం తెలియకుండా ఏం మాట్లాడతారు?"
"ఎందుకు, తెలియడం? కొరివికారం దగ్గర నుంచి కొరియా యుద్ధం దాకా ఏదైనా మాట్లాడవచ్చు. ప్రేక్షకులు అంటే, మనకి తెలిసిన పాటి కూడా తెలియని వాళ్ళు అన్నమాట. అటువంటప్పుడు ఇంక భయమేమిటి?"
"మీ చొరవకి మెచ్చుకోవాలి."
"పైగా మహా పండితుడుకూడా మనలాగా మాట్లాడలేడు, తెలుసా?"
"ఎందుకని?"
"అజ్ఞానం ఇచ్చిన దైర్యాన్ని విజ్ఞానం ఇవ్వదు కనుక."
జ్యోతి ముకుందం మాట్లాడినంత సేపూ అతడిని పరిశీలించి చూస్తున్నది. కావాలని జీవితాన్ని నిర్లక్ష్యంగా చూడటం అలవాటు చేసుకున్నట్లు కనిపిస్తున్నది అతని పద్దతి చూస్తె. కాలక్షేపం కోసం కవిత్వం లో పడ్డాడట. అంటే, కాలక్షేపం ఉంటె కవిత్వం వదిలేస్తాడన్న మాటే కదూ?
"మీ వ్యక్తిగతమైన విషయం అడుగుతున్నా ననుకోండి. మీ భార్య బతికి ఉండగా మీరు కవిత్వం వ్రాసేవారా?"
"ఛ, ఛ! నా భార్యే ఉంటె నాకేం కర్మం ఇది? హాయిగా తను ఆనందించడం పోయి, ఇతరుల ఆనందం కోసం పాకులాడతాడా ఏ అమాయకుడేనా? నాకు ఆనందం ఎలాగా లేదు కదా? పోనీ లోకానికయినా ఆనందం ఇద్దామని కవిత్వం ప్రారంభించాను."
"అయితే, మీలో ఉన్న తీరని కోరికలే కవిత్వ రూపంలో వస్తున్నా యన్నమాట?"
"అక్షరాలా. కోరికలే తీరితే, నోరు మూసుకొనే ఉందును. తేనే రుచి చూసేదాకానే అల్లరి కాని, మధుపాత్ర నోటికి అందాక మరి మాట్లాడు తుందా తుమ్మెద?"
జ్యోతికి ఇన్నాళ్ళ కు తనకు కావలసిన వ్యక్తీ కనిపించినట్లు అనిపించింది. 'ముకుందం ఆనంద్ లాగ ఆహంకారీ కాదు; తిలక్ లాగ దుర్భల చిత్తుడూ కాదు. వట్టి మైనం లాంటి వాడు. తనకు అవసరమైన విధంగా దిద్దుకోవచ్చు. అన్నింటి నీ మించి, అన్నీ పోగొట్టుకొని తుదకు కవిత్వాన్ని కౌగలించుకొన్న అమాయకుడు. ఇతన్నీ చేరదీస్తే తనకు మగదిక్కూ ఉంటుంది; అతనికి ఆడదిక్కు ఉంటుంది."
ఇలా ఊహించి చివరికి, "ఏమండీ, మీరు మళ్ళీ పెళ్ళి చేసుకో కూడదూ?" అంది.
"పెళ్ళా? హు! నా భార్య పోయిన కొత్తలో నాకు చేసుకోవడానికి ఇష్టం లేకపోయింది. ఇప్పుడు నన్ను చేసుకోవడానికి ఎవరికీ ఇష్టం లేని పరిస్థితి ఏర్పడింది."
"ఒకవేళ ఎవరేనా వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటానంటే?"
"అమ్మా, వద్దు. కావలిస్తే నీకో శుభ్రమైన వరుడిని చూసి పెళ్ళి చేస్తాను" అంటాను.'
"పోనీ, ఏ నాలాంటి స్త్రీయో వచ్చి నాకు గార్డియన్ గా ఉండండని కోరితెనో?"
"ఓ! దానికేం అభ్యంతరం లేదు...."
"నిజంగా?"
"ఆ!"
"అయితే రేపు నాతొ వచ్చేస్తారా?"
"వచ్చేయడం అంటున్నావు? రేపు ఎక్కడికేనా వెళ్ళిపోతున్నావేమిటి నువ్వు?"
"అవును."
"అన్నట్టు మా ఆనంద్ తోటి చెడిందిటగా నీకు?"
"ఎవరు చెప్పారు మీకు?"
"అబ్బే . ఎవరో చెప్పారులే!"
"అయితే మీరు ఇంక నాతొ రారన్న మాట."
"ఎందుకు రానూ? దానికీ, దీనికీ సంబంధం ఏమిటి? వాడికీ, నీకూ ఇష్టం లేదు. విడిపోయారు. నాకూ , నీకూ ఇష్టం అయింది. కలిసి ఉందామనుకుంటున్నాము. మళ్ళీ నీకూ, నాకూ ఇష్టం ఉండదూ? విడిపోతాము. అంతే."
ఆ మాటలు అంటుంటే అతని నోరు మూసి, "అలా అనకండి. మనం ఎప్పుడూ విడిపోము" అంది.
"సరే" అన్నాడు నిర్లిప్తంగా.
"మీరు వెళ్ళి ఎవరితో నైనా చెప్పి రావడం, ప్రయాణానికి సిద్దం కావడం?"
"ఏమీ అక్కరలేదు. ఇప్పుడు బయలుదేరు అంటే, తయారు." జ్యోతి సంతోషంతో అతని దగ్గరకు వచ్చి "రెండు మూడు వారాలకి కాని సంవత్సరాది ఇంకా రాదు. అప్పుడే మల్లె పువ్వులు రావడం, మాలకట్టి మీ మేడలో వెయ్యడం! నాకు మల్లె పువ్వులంటే ఎంత ఇష్టం అనుకున్నారు!" అని వంగి అతని చేతి మీద ఉన్న దండను గట్టిగా వాసన చూసింది.
మర్నాడు ఆనంద్ కేసు వాయిదా. ఆ సాయంత్రం మద్రాసు నుండి ఎకాయేకి కాకినాడ వచ్చాడు వెంకట్రామయ్య. తిన్నగా తిలక్ గదికి వెళ్ళాడు. గదిలో తిలక్ ఒక్కడే ఉన్నాడు.
"రండి రండి. మీరు మద్రాసు నుంచి వచ్చేశారన్నమాట. వారం పది రోజుల్లో మా అమ్మ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి సర్పవరం వస్తాము." అన్నాడు. వెంకట్రామయ్య "తప్పకుండా రండి" అన్నాడు. తర్వాత జ్యోతి ఆనంద్ తో విడాకుల కోసం పెట్టుకున్న అర్జీ, అందులో జ్యోతి తరపున తను ఇచ్చిన సాక్ష్యం , మర్నాడు అన్నపూర్ణ , రామదాసుల సాక్ష్యం విచారణ -- సంగతులన్నీ చెప్పి, "మా బాగా కక్ష తీర్చుకున్నాను కదూ , ఆనంద్ మీద? ఈ దెబ్బతో అతని ఉద్యోగం పోతుంది. ప్రభుత్వం అనుమతి లేకుండా రెండు వివాహాలు చేసుకునందుకు శిక్ష కూడా పడచ్చు." అన్నాడు తిలక్.
వెంకట్రామయ్య కు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఆనంద్ అన్నపూర్ణ ను అసలు తీసుకు రాకపోవడం, జ్యోతి తో రిజిస్టర్ మారేజీ చేసుకోవడం -- ఇవేమీ ఇంతవరకూ తెలియవేమో, అయోమయ పరిస్థితి ఏర్పడింది వెంకట్రామయ్య కు. కంగారు కంగారుగా అడగసాగాడు కేసుకు సంబంధించిన విషయాలన్నీ.
వెంకట్రామయ్య ఎందుకలా కంగారు పడుతున్నాడో అర్ధం కాలేదు తిలక్ కు. కొంచెం సేపు ఆగి అన్నాడు : "జ్యోతితో అయిన పెళ్ళి రుజువయింది. ఇంక అన్నపూర్ణ కు అతడు భర్త అనేది రేపు రుజువు కావాలి."
"రేపేనా? అయితే ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. ఆనంద్ ను రక్షించాలి. లేకపోతె వాడి ఉద్యోగం పోతుంది."
"అదేమిటండీ? అతను మనకు శత్రువండీ!"
"నోర్ముయ్. నీకంటే నాకు వాడే ముఖ్యం. రేపు విచారణ సమయానికి కోర్టుకు రా." అని వెంటనే వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య.
"నాకేం? నేను కోర్టుకు రానక్కరలేదు. నాకేమీ వాడు ముఖ్యం కాదు." అంటూ గోనుక్కొన్న తిలక్ మాటలు హోరున వీచిన గాలిలో తేలిపోయాయి.
వెంకట్రామయ్య పోలీసు స్టేషన్ కు పోనిచ్చాడు రిక్షాను. అక్కడ వాళ్ళు ఇచ్చిన అనమాలు ఆధారంగా ఆనంద్ ఉన్న ఇల్లు పట్టుకున్నాడు. అప్పుడు ఆనంద్ ఓ గదిలో టేబిల్ మీద తల పెట్టుకని ఆలోచిస్తున్నాడు. విశాలాక్షి ఇంకో గదిలో చాప పరుచుకుని చూస్తూ పడుకుని ఉంది. జానకి నేలమీద సున్నాలు చుడుతూ ఉంది.
హటాత్తుగా లోపలికి ప్రవేశించిన వెంకట్రామయ్యను చూసి అంతా తెల్లబోయారు. "తాతయ్యా" అంటూ వచ్చి కౌగలించుకొని బావురుమంది జానకి" విశాలాక్షి "వచ్చావా బాబయ్యా" అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఆనంద్ మాత్రం కుర్చీలోంచి లేచి దోషి లాగ తల వంచుకుని నిలబడ్డాడు.
"మామీద కోపం లేకుండా మళ్ళీ వచ్చావా బాబయ్యా?" అంటూ విశాలాక్షి నోట్లో పైట చెంగు పెట్టుకొని ఏడ్చింది. ఆనంద్ కన్నీళ్లు కార్చసాగాడు.
"నీ మనస్సు క్షోభ పెట్టినందుకు మేము ఈ రెండేళ్ళ నుంచీ బాగా అనుభావించాము" అంది విశాలాక్షి.
"ఇప్పుడవన్నీ ఎందుకు తల్లీ?" అన్నాడు వెంకట్రామయ్య.
"ప్రస్తుతం ఓ కొత్త చిక్కులో పడ్డాము"
'అంతా తెలుసు. గతజల సేతుబంధనం వల్ల ఏమీ లాభం లేదు. అవన్నీ సావకాశంగా ఆలోచిద్దాము. ముందు లేవండి. మనం అంతా ఇప్పుడు పెద్దాపురం బయలుదేరాలి." అన్నాడు వెంకట్రామయ్య.
"పెద్దాపురమా? ఎందుకు?' అన్నాడు ఆనంద్.
"వాళ్ళిప్పుడు నీ తరపున సాక్ష్యం చెబితేనే కాని, ప్రమాదం."
"వాళ్ళు చెబుతారా?"
"బతిమాలాలి."
"ఏ మొహం పెట్టుకొని? వాళ్ళకి చేసిన అన్యాయానికి వాళ్ళు మనని క్షమిస్తారా?"
"పౌరుషానికి పట్టుదలలు ఇది సమయం కాదు. ఏదో రకంగా వాళ్ళని బతిమాలి మన తరపున సాక్ష్యం చెప్పించవలసిందే . ఊ! లేవండి" అన్నాడు వెంకట్రామయ్య.
* * * *
