దీప శిఖ
పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి

ఉదృతం తగ్గి సన్నని తుపరగా పడుతోంది వాన. ఉండుండి వేస్తూన్న ఈదురు గాలి, దట్టంగా పెన వేసుకున్న నల్లని మేఘాన్ని చెల్లా చెదురు చేస్తోంది. నల్లగా అట్టలు కట్టిన పాత దూదిని ఏకుతుంటే ఎగురుతున్న తెల్లని దూది పింజల్లా ఆకాశంలో పరుగెడుతున్నాయి. తెల్లగా విదిపోతూన్న పల్చని మేఘ శకలాలు, అప్పుడే ఉదయిస్తూన్న సూర్యుని ఎర్రని కాంతిని పల్చ పల్చగా పరచు కుంటోన్న ఆ తెల్లని మేఘాలు చిక్కగా వడగట్టి ఈ మధ్యనే ఊడ్చిన ఆకుపచ్చని వరి చేల మీద పరుస్తూ ఉంటె, ఆ చేలన్నీ వసంతం జల్లుక్లున్న నవ వదువుల్లా కనిపిస్తూ ఉన్నాయి.


పల్లెని ఎదురుగుండా కనిపించే కంకర రోడ్డుతో కలిసే ఆరు ఫర్లాంగుల మట్టి రోడ్డు . భూదేవి తీసుకున్న చేతకాని పాపిడిలా. ఆ చేల మధ్య నుంచి వంకర టింకర గా వెళుతోంది. దురహంకారి బ్రతుకు బాటలా ఎగుడు దిగుళ్ళ తో ఉన్న ఆ మట్టిరోడ్డు. అప్పటి దాకా కురిసిన వానకి చితచిత లాడుతోంది. జారుడుగా ఉన్న ఆ రోడ్డు మీంచి. జాగ్రత్తగా కాలిబాట వెళ్ళని మెత్తని మట్టిలో గుచ్చుతూ గాలికి ఇటూ అటూ ఊగుతున్న చేతిలోని తాటాకు గోడుగుని గట్టిగా పట్టుకుని స్టేతస్కోపు ఉన్న ఇంకో చేత్తో బురదలో పడబోయే పేంటు పైకి పట్టుకుంటూ. నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేస్తూ కంకర రోడ్డు వేపు వెళుతున్నాడు శంకరం.
నెత్తి మీద కాప్. మేడ దగ్గర్నుంచీ కింద దాకా వరసగా బొత్తాలున్న నల్లని పొడుగాటి కోటు, కోటు రంగుతో కలిసే ముదురు రంగు పేంటూ. కోటు బొత్తానికి వెండి గొలుసు తో తగిలించిన జేబు గడియారం.
మెల్లగా తల వంచుకుని నడుస్తూన్న శంకరం మెదడు నిండా ఆలోచనలు. 'హమ్మయ్య ఏం డబ్బు ఇబ్బంది పడితే ఏం. ఎల్. ఎం, పి. అయిందని పించు కున్నాడు మొత్తానికి. ఇంక ఫరవాలేదు. ఎక్కడో అక్కడ ప్రాక్టీసు పెడితే నాలుగు రాళ్ళు వస్తాయి . తమ్ముడినీ, సావిత్రీ ని , మణిని ఇంక పోషించుకో గలడు. పాపం వాళ్ళ ముగ్గురూ కూడా ఇన్నాళ్ళ నుంచీ తనతో పాటు అవస్థలు పడ్డారు. పల్లెలో వాళ్ళు, మద్రాసు లో తను-- ఇంక ఫరవాలేదు అంతా ఒకచోటే ఉండొచ్చు. ఏ రాజమండ్రి లాంటి చోటో, ప్రాక్టీసు పెడితే , అటు డబ్బూ పుష్కలంగా సంపాదించవచ్చు. ఇటు తమ్ముడు గోపాలం చదువూ చక్కగా సాగే ఏర్పాటు చెయ్యొచ్చు. కుర్ర ! తన లోటేం లేకుండా నిరుడే మంచి మార్కులతో మెట్రిక్ పేసయి కూర్చున్నాడు. 'వదిన వంట చేసుకుంటుంటే మణి ని అడిస్తున్నాను మరి ప్రస్తుతానికి నే చేసే పనేం లేదుగా?' అని వాడా మధ్య తనకి మద్రాసు రాసిన ఉత్తరం లో ఓ పంక్తి కలిపెసరికి తనకి ఎంత జాలి వేసింది?..... ఇంకా వాడి చదువు నిరాటకంగా సాగించవచ్చు. అమ్మ ఆశించిన ప్రకారం కలెక్టరు నీ చెయ్యవచ్చు. పాపం అమ్మ చనిపోతూ అంది తనతో "గొపాలాన్నీ కలెక్టర్ చదివించారా" అని. ఇంకో నాలుగైదు రోజుల్లో తాను రాకమండ్రి వెళ్లి ప్రాక్టీసు పెట్టి అమ్మ అడిగిన కోరికకు నాందిగా గోపాలాన్ని, కాలేజీ లో చేర్పిస్తాడు అసలు తనా ప్రయత్నంలో ఉండగానే మధ్యలో పెద్ద కాపు గారి దగ్గర్నుంచీ ఈ కబురు వచ్చింది. వాళ్ళ గ్రామం లోనే కాకుండా ఈ చుట్టూ పట్ల పది పదిహేను గ్రామాల్లో కూడా పేరూ ప్రతిష్టా ఉండి పెద్ద మోతుబరి గా చెలామణి అవుతూన్న పెద్ద కాపుగారు తనకి కబురు చెయ్యడమే చాలు వాళ్ళ అబ్బాయి కి పాపం ఎలా ఉంటుందో ఏమో!.... తన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని రప్పిస్తున్నారు. అయన ఆశల్ని చిగురింపజేసి అతను కుర్రాడిని బ్రతికించగలడా?....ఏమో తనకీ పెద్ద అనుభవం లేదు. జీవితంలో తను వైద్యం చేయ్యబోతూన్న మొదటి కేసు ఇదే!..... భగవంతుని నిర్ణయం ఎలా ఉంటుందో!.....
శంకరం వెనకాలే తల మీంచి పిక్కల దాకా వెచ్చని జమ్మి గూడ కప్పుకొని, సిరంజి బాక్సూ, ఇడిన్ . కాటన్ వంటి ఏ మూడు నాలుగు వస్తువులు మాత్రమో ఉన్న మందుల పెట్టె పట్టుకుని, చురుకుగా అడుగు వేస్తున్నాడు పెద్ద కాపు గారు ముసలి పాలేరు వెంకడు. వాడి నెరిసిన గడ్డం వెనక ముడతలు పడిన మొహంలో విషాదం గూడు కట్టుకుని వుంది. "ఇవాళ పదిమంది చేతా ఓహో పెద్ద కాపుగారూ!' అనిపించుకుంటూ, శేషయ్య ని చిన్నప్పటి నుంచీ తన చేతుల మీద పెంచారు . శేషయ్య కు పాతికేళ్ళ వచ్చే దాకా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఇల్లు పట్టకుండా ఉంటూ ఉంటె, వాళ్ళ అయ్యతో పాటు తను కూడా బెంగ పెట్టుక్కూచున్నాడు. ఎప్పటికైనా శేషయ్య కుదుటపడతాడా అని, 'వీడు ఎలాగా వృద్దిలోకి రాడు నా పిల్లని ఇయ్యను అని మేనమామ అన్నందుకు, తమ కందరికి అవమానం అయింది కాని శేషయ్య కు మాత్రం చీమ కుట్టినట్టు లేదు. అటువంటిది ఆ పిల్లే తండ్రితో తగువు లాడి "ఏవైనా సరే శేషయ్య బావనే చేసుకుంటా నంటూ ' అయినవాళ్ళ నందరినీ కాదని వచ్చి శేషయ్య ని మనిషిని జేసింది కాని, లేకపోతె శేషయ్య ఇలా కుదుట పడేవాడా , ఇంత పెద్ద మనిషిగా మారేవాడా!....ఏమిటో ఆ అదృష్టం కూడా శేషయ్య కు పది కాలాల పాటు ఉండకుండా ''వాసు' ని కని ఆ మహాతల్లి వెళ్ళిపోయింది. మళ్లా శేషయ్య కి శేషయ్యను చూడలేక తనకీ చెడ్డ రోజులొచ్చాయి ఏదో అలుసు మీద నెమ్మదిగా రోజులు గెంటు కోస్తున్నాడు శేషయ్య అనుకుంటుంటే , మళ్లా ఆ మాయదారి దేవుడికి కళ్ళు కుట్టాయి. లేకపోతె పట్టుమని పదేళ్ళయినా లేని ఆ నలుసు కి ఇంతోటి జబ్బెమిటి?....'వాసు" కి ఎలా ఉంటుందో.....శేషయ్య మొగాన దేముడు ఏం రాసి పెట్టాడో ....అయన కష్టం చూడాల్సిన కర్మ తనకేం ఉందొ మళ్ళీ......అమ్మా పోలేరమ్మా తల్లీ! వాసుకి రోగం మళ్ళించి శేషయ్య మొగాన నవ్వులు కురిపించావంటే నీకు కోడి నిచ్చుకుంటా-- సల్లగా చూడు తల్లీ!"
ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండి శంకరం , వెంకడు ఒకళ్ళ నొకళ్ళు పలుకరించుకోకుండా మౌనంగా ముందుకు వెనకలు గా నడుస్తున్నారు. అలవాటు లేకనో, ఆలోచన తెగకనో శంకరం అడుగు బురదలో మందంగా పడుతోంది. అవతల ఎలా వుంటుందో అని ఆందోళన వల్ల వెంకడు చురుగ్గా అడుగేస్తున్నాడు. ఇంకా సన్నగా పడుతూన్న తుంపర. అప్పుడే పైకి వస్తూ మేఘాల పరదాలు తప్పించు కుంటూన్న సూర్య కిరణాల వెలుగు పడి ఆకాశం నుంచి పడుతూన్న బంగారు నాణాల గుంపులా వుంది. గాలికి ఊగి ఆకుల్లో వున్న నీళ్ళ చినుకులు మీద పడుతూ ఉంటె . వానకి జడిసి చెట్ల గుబురుల్లో కూచుని రెక్క కింద ముక్కు మూసుకుని జపం చేస్తూన్న పక్షులు చిరాకు పడి చిర్రుబస్సు మంటున్నాయి.
శంకరం, వెంకడూ మౌనంగా ఆ ఆరు ఫర్లాంగు లు మట్టి రోడ్డు నడిచి, కంకర రోడ్డు ఎక్కారు. అక్కడ చింత చెట్టు నీడని పెద్ద కాపు గారి రెండెడ్ల సవారీ బండి సిద్దంగా వుంది. గిత్తల ముందు కూచుని వాటి మేడ దగ్గరున్న మునేళ్ళ ను పేనుతూ ఉన్న రంగయ్య. శంకరాన్ని చూసి లేచి నిలబడి దణ్ణం పెట్టాడు. పెడుతూనే బండి వెనకాల కి వెళ్లి బండిలో జంబుకానా కింద ఉన్న వెచ్చని ఎండు గడ్డిని నాలుగు గుప్పిళ్ళయితే తీసి కింద వేశాడు.
ఇదేనా పెద్ద కాపు గారి బండి?" అంటూన్న శంకరం తో "ఇదేనండి కాళ్ళు ఆ గడ్డితో తుడుచుకుని ఎక్కండి." అంటూ వెంకడు తన చేతిలో మందుల పెట్టెను బండి లో పెట్టి శంకరం దగ్గర గొడుగు అందుకున్నాడు.
అరికాళ్ళ నిండా అట్టల కింద అంటుకొన్న బురద మట్టిని రంగయ్య నేల మీద వేసిన గడ్డితో బాగా తుడుచుకుని, చేతిలో ఉన్న స్టేత స్కోపునీ బండిలో వున్న మందుల పెట్టె మీద పెడుతూ శంకరం బండి లోకి ఎక్కి కూచున్నాడు. వెనకాలే నడిచి రావడాని కై నిలాబడి వున్నాడు వెంకడు. నల్లగా పొట్టిగా కండలు తిరిగిన రంగయ్య ఎగిరి బండి తొట్టిలో కూర్చుని గిత్తలని అదిల్చాడు. ఝల్లు మంటూ గిత్తల మెళ్ళో మువ్వల చప్పుడుతో బండి కదిలింది. అక్కడికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న పెద్ద కాపు గ్రామం వైపు . పాలం వైపు.....
ఆఘమేఘాల మీద ఉరుక్కుంటూ వచ్చి గుమ్మం లో ఆగిన బండి దగ్గరికి గబగబా మెట్లు దిగి వచ్చాడు శేషయ్య. వస్తూనే శంకరానికి దణ్ణం పెట్టి "ఎలాగేనా మా వాసుని బతికించి మా ఇల్లు నిలబెట్టండి" అన్నాడు కళ్ళల్లో నీళ్ళు నింపుకుంటూ ఆ స్థితిలో శేషయ్య ని చూసి, అరుగుల మీద ఉన్న ఊరి పెద్దలు నలుగురూ కండువాలతో కళ్ళు ఒత్తుకున్నారు. వీధికి అటూ ఇటూ గుంపులు గుంపు లుగా ఆడవాళ్ళూ, పిల్లలూ విషాద వదనాలతో నిశ్శబ్దంగా నిలబడి వున్నారు. చుట్టూ ఉన్న జనాన్నీ, వాళ్ళ ముఖాల్లో కనిపిస్తూన్న ఆతురతనీ, అక్కడ వున్న గంబీర వాతావరణాన్నీ చూసి శంకరం ఒక్క క్షణం బిత్తర పోయి, వెంటనే బండి దగ్గర కొచ్చి జాలిగా నిలబడి వున్న శేషయ్య ని చూసి, మనస్సంతా కరిగి, "మీరేం కంగారు పడకండి" అన్నాడు. రంగయ్య ముందు బండి మీంచి ఉరికి నురగలు కక్కుతూన్న గిత్తల ముక్కు తాళ్ళు పట్టు కుని బండిని అపు చేస్తుంటే, శంకరం గబగబా బండి దిగి శేషయ్య తో కలిసి హాలు దాటి మిద్దె గదిలో మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని వున్న వాసు దగ్గరికి రెండు అంగల్లో వెళ్ళాడు. చేత్తో స్టేతో స్కోప్ పట్టుకుని వెనకాలే వెంకడు మందుల పెట్టె పట్టుకువచ్చి పక్కని పెట్టాడు.
శంకరం, వాసు ఒంటి మీద చెయ్యి వేసి చూశాడు. కాలిపోతూ ఉంది. జేబులోంచి ధర్మామీటరు తీసి టెంపరేచర్ చూడబోయాడు. పళ్ళు గిట్ట కరుచు కొని ఉన్నాయి. చంకలో ధర్మా మీటరు పెట్టి చూస్తె నూట అయిదు ఉంది. మూసుకొని ఉన్న కను రెప్పలు లాగి చూశాడు. స్టేతో స్కోప్ తో గుండెలు పరీక్షించాడు. అనుమానం వచ్చి నాడీ చూశాడు.
వాసుని డాక్టరు పరీక్షిస్తున్నంత సేపూ , గుండెలు దడదడా కొట్టుకుంటుంటే, భయం భయంగా నిలబడి చూస్తూ ఉన్నాడు శేషయ్య. అటు ఆ చేతనంగా పడి వున్న వాసునీ, ఇటు శోకంతో నిండిపోయి మానులా నిలబడి పోయిన శేషయ్య నీ చూడలేక, వస్తూన్న దుఃఖాన్ని రెండు గుప్పిళ్ళతోటి నోటికి అడ్డంగా ఆపుకుంటూ నుంచుని ఉన్నాడు వెంకడు.
శంకరం అలాచాలాసేపు వాసుని పరీక్ష చేసి మిద్దె గది వదిలి హాల్లోకి వచ్చాడు ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, కట్టలు తెంచుకు వస్తున్న దుఃఖాన్ని పెదిమల బిగింపుతో నొక్కి పెడుతూ శేషయ్య , శంకరం వెనకాలే హాల్లోకి వచ్చాడు. "డాక్టర్ గారూ ఏం చెబుతారో దేవుడా!" అని బితుకు బితుకు మంటూ----
"జ్వరం చాలా తీవ్రంగా ఉంది. కుర్రాడు మగత లో ఉన్నాడు. ముందు ఆ జ్వర తీవ్రతని తగ్గించాలి. అది తగ్గాక కాని తక్కినవి ఆలోచించడానికి వీలులేదు." ఇంతకీ ఎన్నాళ్ళ నుంచి ఉంది ఇలాగ?' అన్నాడు శంకరం.
"జ్వరం వచ్చి ఇవాళ్టి కి అయిదో రోజు . నిన్నటిదాకా చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. "బొంగురు పోయిన కంఠం తో శేషయ్య జవాబు చెప్పాడు.
"మరి ఇన్నాళ్ళు మందెం వెయ్యలేదూ?"
"వేశాం అండి. వీరాచారి అని ఒక నాటు వైద్యుడున్నాడీ ఊళ్ళో. అతనే ఇచ్చాడు నిన్నటి దాకా ఏవో మాత్రలు."
"ఎవిచ్చాడో?"
వెంకడు వెళ్లి అరుగు మీద ఊళ్ళో వాళ్ళ నలుగురు తోటీ కలిసి నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న వీరాచారిని తీసుకు వచ్చాడు. నమస్కారం చేసి వీరాచారి తాను చేసిన వైద్యం అంతా వివరంగా చెప్పాక శంకరం తల పంకించి " ఊ....సరే....మన కిక్కడికి దగ్గర్లో ఇంగ్లీషు మందులు ఎక్కడ దొరుకుతాయి?' అన్నాడు.
"నగరం వెళ్ళ వలసిందే. ఈ లోపుగా లేవు" అన్నాడు వెంకడు. "ఎనిమిది మైళ్లే?.... అంటే రానూ పోనూ నాలుగు గంటలు పడుతుంది" అన్నాడు శంకరం నిరాశగా.
"ఎందుకండీ -- మన రంగయ్య కి సైకిలు వచ్చు. వాడికి కనక సైకిలిచ్చి పంపిస్తే గంటలో హనుమంతుడిలాగా పట్టుకోస్తాడు మందుని" అన్నాడు వీరాచారి.
'అయితే -- వెంటనే ఈ ఇంజక్ష నూ, ఈ మాత్రలూ, ఈ అరకూ తెప్పించండి. ఇక్కడున్నట్టు రావాలి" అంటూ శంకరం ఓ చీటీ మీద మందులు రాసి శేషయ్య చేతికిచ్చాడు. శేషయ్య ఆ చీటినీ బొడ్డు నున్న తాళం చెవుల గుత్తి ని వెంకడి కి ఇస్తూ "సందువా పెట్టెలో డబ్బు తీసి రంగయ్య కిచ్చి పంపించు అన్నాడు.
ఇంతలో వీరాచారి "మన ఊళ్ళో సుబ్బయ్య శెట్టి తన సైకిలు ని అద్దెకి తిప్పుతున్నాడు. పొతే, దత్తుడు గాడు మొన్ననే కొనుక్కొన్న కొత్త సైకిలు ఉంది. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళమను రంగయ్య ని" అంటూ వెంకడికి చెప్పబోగా.
