"నిజం డాక్టరుగారూ! ఆ మాటలకి పడిపోయాను. అసలు ఏమిటీ సంగతి, ఎలా వుంటాడో, ఏం అంటాడో చూద్దాం అనిపించింది. నచ్చకపోతే వచ్చేయచ్చు గదా... అనుకున్నా."
"వెళ్లాక నచ్చేట్టు చేసుకోడం ఆ వయసు అబ్బాయిలకి వెన్నతో పెట్టిన విద్య. అమ్మాయిలని ఎలా ఆకర్షించాలో, ఏం తీయని కబుర్లు చెప్పాలో... కవిత్వాలొలకపోసి ఎలా ఆకర్షించాలో... అమ్మాయిలని పడగొట్టే విధానాలన్నీ తెలిసినవాడే యింత ధైర్యం చేస్తాడు. ఊ... తరువాత చెప్పు..."
"డాక్టరుగారూ! మీరు అన్నీ తెల్సినవారు. మీరన్నట్టే జరిగింది. మొదటిరోజే నన్నంతగా ఇష్టపడే మగవాడి, ఒక మామూలు అమ్మాయిని అందలం ఎక్కించి ఆరాధనాభావం చూపిస్తే ఏ ఆడపిల్ల లొంగిపోదు. మొదటి పరిచయంతోనే నచ్చిపోయాడు. బోలెడు కబుర్లు చెప్పాడు. తనూ మా తరగతి మనిషి, పెద్ద డబ్బు, అందం లేకపోయినా మనసున్న మనిషి, భార్యని చక్కగా చూసుకుంటానన్న అభిప్రాయం ఇచ్చాడు. నిండా పదహారు లేని అమ్మాయి అంతకంటే లోతుగా ఎలా ఆలోచించగలదు?"
"నిజమే... అమ్మాయిలు బోల్తాపడేది ఆ తెలిసీతెలియని టీనేజ్ లోనే గదా! ఇరవై దాటాక కాస్త మెచ్యూరిటీ వస్తుంది. కాస్త విచక్షణజ్ఞానం అబ్బుతుంది. టీనేజ్ అన్నది పిల్లలని ఎన్ని ఆకర్షణలకి గురిచేస్తుందో... సరే, యిద్దరూ చాలాసార్లు వాట్సప్ లో ఛాటింగులు చేస్తూ మరింత దగ్గరయి..."
"అవును మేడమ్, రాత్రిళ్లు నిద్ర పోనీకుండా మెసేజ్ ల మెసేజ్ లు పంపేవాడు. అవి చూసి మురిసిపోయేదాన్ని. ఒక రెండేళ్లు చదువయి ఏదన్నా పని చూసుకునేవరకూ ఎవరికీ చెప్పద్దు... అప్పుడు నేనూ మా యింట్లో వప్పిస్తాను. నీవూ అప్పుడు చెప్పచ్చు. అలాగా మన మనసులు మరింత దగ్గిర కావాలి. కల్సుకుందాం. కబుర్లాడుకుందాం. అప్పుడప్పుడు సినిమాలు, షికార్లు తిరుగుదాం అని చెప్పేవాడు. అన్నింటికీ తల ఊపేంత మత్తులో పడిపోయా... ఆ మత్తులోనే... మూడు నాలుగు నెలలు తిరిగాం... ఆ తర్వాత ఒక రోజు..."
"ఎక్కడికో తీసికెళ్లి వుంటాడు. తలపులు కలిశాయి, తనువులు కలిస్తే ఫరవాలేదు. నీవు నాదానివి. నీవు లేకుండా బతకలేనన్నాడు. నీకింక దూరం వుండలేనన్నాడు... బతిమిలాడాడు. తమకంతో చేరువయినవాడిని తప్పించుకోలేకపోయావు. అంతేనా? ఇది నీ కథే కాదమ్మా! నీ వయసులో ఆడపిల్లల కథలు యివి... నిన్ను చూస్తే జాలేస్తూంది."
"డాక్టరుగారూ... మీరు తప్ప నన్ను రక్షించేవారు లేరు. ఇది మా యింట్లో తెలిస్తే నన్ను గెంటేస్తారు యింట్లోంచి. చావడం తప్ప మరో మార్గం లేదు నాకు. ప్లీజ్... నాకు సాయం చెయ్యండి. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, కాలేజీనించి వచ్చే దారిలో మీ క్లినిక్ చాలాసార్లు చూసి వచ్చా. మీరే నన్ను ఈ ఆపదనించి గట్టెక్కించాలి..."
"చూడమ్మా... యిపుడు ఎంత ఏడ్చినా జరగాల్సింది జరిగింది. నీ పరిస్థితి అర్థమైంది. ఏ తల్లీ తండ్రి ఇలాంటి కూతురిని క్షమించలేరు. కాని కన్నవారు కనక నిన్నింక కాలేజీ మాన్పించి యింట్లో కూర్చోపెట్టి, గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించి, ఎవడితో ఒకడిచే మూడుముళ్లు వేయించి బాధ్యత తీర్చుకుంటారు. కాని, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ వున్నాయి. ఇలాంటి పనులు నేను చెయ్యలేను, చేయను. ఎంతోమంది అమ్మాయిలు తప్పటడుగులు వేసి తప్పు కడుక్కోడానికి వస్తుంటారు. కాని నేను చెయ్యనని తెలిసి యింకెవరినో వెతుక్కుంటారు..."
"అలా అనకండి డాక్టర్! నాకింక ఎవరూ తెలియదు. ఇంట్లో తెలీకుండా, ఎవరూ చూడకుండా వచ్చాను. ప్లీజ్... నన్ను కాపాడండి... ఆ దొంగ రాస్కెల్ నేను ప్రెగ్నెంట్ అని విన్న తరువాత మాయం అయిపోయాడు. ఫోన్ బ్లాక్ చేశాడు. ఇల్లెక్కడో కూడా తెలియదు. కనీసం నన్నీ ఆపదనించి గట్టెక్కిస్తాడేమోనన్న ఆశ కూడా పోయింది. ఇంత దగా చేస్తాడనుకోలేదు..."
"ఇలాంటి పరిచయాలు, యీ ప్రేమ కబుర్లు దగా చేసేవారే వల్లిస్తారు. ఈ సంగతి మీ ఆడపిల్లలు ఎన్నాళ్లయినా గ్రహించలేకుండా మోసపోతూనే వుంటారు. కథలు చదువుతారు, టీవీలు, సినిమాలు చూస్తారు. అయినా, అంత సులువుగా బుట్టలో పడిపోతూనే వుంటారు. 'దీప భ్రమర న్యాయం' అంటే ఇదేనేమో! దీపం వేడికి మాడి భస్మం అవుతున్నా ఆలోచన లేకుండా ఆ వెలుగుకి ఆకర్షితమై భస్మం అవడం సృష్టిలో సహజంలాగే, మీలాంటి ఆడపిల్లలు అంతే! కాస్త చదువు వున్న మీలాంటి పిల్లలే యింత సులువుగా మోసపోతున్నారు. ఒక్కక్షణం కాస్త లోతుగా ఆలోచిస్తే, నాలో ఏముంది? పెద్ద అందగత్తెని కాను, మామూలు చదువు, అతిమామూలు కుటుంబం. నాలో ఏం చూసి ప్రేమిస్తాడు అని ఏ అమ్మాయన్నా ఆలోచిస్తే... ఇలాంటి మాటలన్నీ, ప్రేమలన్నీ కాలక్షేపం కబుర్లు, వయసు వేడిలో ఆకర్షణ. సులువుగా దొరికే అమ్మాయిలకి వల అన్నది గుర్తించరు. తానేదో రంభ ఊర్వశీ అని వలచి వచ్చాడని మురిసి ఆ ప్రేమపాశంలో చిక్కుకుపోతారు."
"డాక్టరుగారూ! మీరు చెప్పిందక్షరాలా నిజం. ఎంత సులువుగా నమ్మాను. ఎన్ని కబుర్లు చెప్పి మురిపించాడు. ప్రేమంటే యిదే, యింతకు మించింది యింకేం కావాలి అన్న భ్రమలో పడేశాడు. అవసరం తీరగానే పక్కకి తోసి పోయాడు నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడింక యీ దారి తప్ప నాకే దారి లేక మీ దగ్గిరకి వచ్చాను. ఇదిగో కాస్త కాస్త పాకెట్ మనీ దాచుకొన్న ఐదొందలుంది. ప్లీజ్... డాక్టరుగారూ! మీ కాళ్లు పట్టుకుంటాను."
"ఛా... ముందు లే అమ్మా! చూడు నిన్ను చూసి జాలేసినా నా నియమాన్ని వదలలేను నేను. ఇదిగో యింకో డాక్టరు పేరు, అడ్రసు యిస్తాను. ఆవిడకి నోట్ పెట్టాను. ఆమె నీ పని చేస్తారు. అంతకంటే నేనేం చెయ్యలేను. ఇదిగో యీ రెండువేల రూపాయలుంచుకో. డాక్టరుగారికి, మందులకి కావల్సి వుంటుంది. జాగ్రత్తగా వెళ్లు. ఆలస్యం చెయ్యకు. వెళ్లమ్మా! ఆ చదువు పూర్తిచేసి, నీ బాగుకోరే అమ్మా నాన్న తెచ్చిన సంబంధం చేసుకో. అత్యాశలకి పోకు. ఇది నా సలహా. వెళ్లు. ఆ డాక్టరుగారికి నిన్ను పంపిస్తున్నట్టు ఫోను చేస్తాను. సరేనా? వెళ్లమ్మా!"
(ఆకాశవాణి సౌజన్యంతో)
* * * *
